భర్తే... దూడైతే...!
‘‘నా భర్త మళ్లీ పుట్టాడు.. నా భర్త మళ్లీ పుట్టాడు..’’ అంటూ ఎంతో సంతోషంగా ఊరంతా చెప్పుకుంటోంది కంబోడియా దేశానికి చెందిన ఖిమ్హాంగ్ అనే 74ఏళ్ల మహిళ. అసలు ఆమె అనుకుంటున్నట్టు తన భర్త పుట్టింది మనిషి రూపంలో కాదు.. ఆవుదూడగానట. అదేంటీ అని ఆశ్చర్యపోకండి. ఖిమ్హాంగ్ భర్త టోల్ ఏడాది క్రితమే మరణించాడు. అయితే అయిదు నెలల క్రితం వాళ్లింట్లోని ఆవుకు ఓ దూడ జన్మించింది.
సాక్షాత్తు తన భర్తే ఆ దూడగా పుట్టాడని నమ్ముతోంది ఖిమ్. ఆమె నమ్మకానికి తగ్గట్టే ఆ దూడ కూడా కొన్ని విషయాల్లో మనిషిలాగే ప్రవర్తిస్తోందట. కేవలం ఖిమ్ బంధువులు వచ్చినప్పుడు మాత్రమే.. వారి చేతులను తాకి, నాకుతోందట. దాంతో ఆ దూడను ఖిమ్ కుటుంబ సభ్యులు ఇంట్లోనే పెట్టుకుంటున్నారు. తన భర్త టోల్ గదిలోనే అతని బెడ్, దిండు పైనే దాన్ని పడుకోబెడుతున్నారు. అది టోల్లాగే ఆ గది కిటికీలో నుంచి ఎప్పుడూ బయటికి చూస్తోందట. దాంతో వారి నమ్మకం మరింత బలపడింది.
‘‘నేను బతికి ఉన్నంత కాలం ఆ దూడను... అంటే నా భర్తను జాగ్రత్తగా చూసుకుంటాను. ఒకవేళ నేను త్వరగా చనిపోతే, మీరు కూడా దాన్ని కంటికిరెప్పలా చూసుకోవాలి. అది చనిపోతే.. మనిషికి చేసినట్టే అంత్యక్రియలు నిర్వహించాలి’’ అని ఖిమ్ ఎప్పుడూ తన వాళ్లకి చెబుతూ ఉంటుంది. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... ఆ దూడను చూడటానికి ఖిమ్ ఇంటికి సందర్శకుల రాక మొదలైందట. అయినా.. ఇలాంటివి విన్నప్పుడు మనకూ ఆశ్చర్యంతో కూడిన ఉత్సాహం కలుగుతుంది కదా..!