Kickboxing
-
కిక్ బాక్సింగ్ లీగ్ ప్రారంభం
విశాఖ స్పోర్ట్స్: విశాఖ నగరంలోని స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో శుక్రవారం కిక్ బాక్సింగ్ ఇండియా లీగ్‌ను రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ప్రారంభించారు. మూడు రోజుల పాటు 12 వెయిట్ కేటగిరీల్లో రెండు కాంటాక్ట్స్ విభాగాల్లో ఈ పోటీలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడు తూ కేంద్రం అన్ని విధాలు క్రీడాకారులను ప్రోత్సహిస్తోందన్నారు. ఎంఎల్సీ పి.వి.ఎన్ మాధవ్, మేడపాటి రవీంద్ర, నిర్వాహక కమిటీ ప్రతినిధులు కె.నరసింహారావు, సునీల్‌కుమార్, సతీష్ పాల్గొన్నారు. -
బంగారంలాంటి బాక్సర్.. తజముల్
అది బుధవారం..టీవీలో కిక్‌బాక్సింగ్ వస్తోంది. ‘ఏంటబ్బా! ఇది!’ అని ఆశ్చర్యంగా చూసింది ఎల్కేజీ చదువుతోన్న చిన్నారి. కాసేపు చూశాక ‘‘అక్కా! ఏంటిది?’’ అని అడిగింది. ‘‘ఇదా.. కిక్‌బాక్సింగ్’’ అంది అక్క. ‘‘అవునా ఇది చాలా బావుంది. నేనుకూడా ఇలా కిక్ బాక్సింగ్ చేస్తాను’’ అంది. అది విన్న తోబుట్టువులంతా ఏదో చిన్న పిల్ల అంటోందిలే అనుకున్నారు. కానీ ఆ చిన్నారి మాత్రం ఆ మాట చాలా సీరియస్‌గానే అంది. కిక్‌బాక్సింగ్ మీద ఆసక్తి ఏర్పడడంతో ప్రతి బుధ, శని, ఆదివారాలలో ప్రసారమయ్యే కిక్‌బాక్సింగ్‌ను క్రమం తప్పకుండా చూసేది. అవి చూస్తూ తను కూడా ఎలాగైనా అలా టీవీలో కనిపించేంతగా కిక్‌బాక్సింగ్‌లో రాణించాలనుకుంది. కొన్ని రోజుల గడిచాక ఉండబట్టలేక ‘‘అమ్మా! నేను కిక్‌బాక్సింగ్ నేర్చుకుంటాను’’ అని అమ్మను అడిగింది. ఆ చిన్నారి ఆతృత గమనించిన తల్లి ‘‘అసలు నీకు కిక్‌బాక్సింగ్ గురించి ఏం తెలుసు? అందులో దెబ్బలు తగులుతాయి’’ అని చెప్పింది. ‘‘లేదు, నేను నొప్పిని ఓర్చుకుని ఎలాగైనా బాక్సింగ్ నేర్చుకుంటాను’’ అంది. అమ్మలానే నాన్న కూడా ‘‘వద్దు’’ అన్నారు కానీ, పట్టువదలని విక్రమార్కుడిలా కిక్‌బాక్సింగ్ నేర్చుకునేందుకు అమ్మానాన్నలని ఒప్పించింది తజముల్ ఇస్లాం. కశ్మీర్‌కు చెందిన ఈ చిన్నారి అలా పట్టుదలతో కిక్‌బాక్సింగ్ నేర్చుకోవడమేగాక, ప్రపంచ కిక్‌బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్ సాధించింది. నిరుపేద కుటుంబంలో పుట్టిన తజముల్ తాజాగా రెండోసారి ప్రపంచ కిక్ బాక్సింగ్ చాంపియన్‌షిప్–21 అండర్ –14 కేటగిరిలో గోల్డ్ మెడల్ సాధించి భారతీయులు గర్వపడేలా చేయడమేగాక, ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తోంది. బందిపొర జిల్లాలోని తారకపొర అనే కుగ్రామంలోన ఓ నిరుపేద కుటుంబంలో తజముల్ ఇస్లాం జన్మించింది. గులాం మహ్మద్ ఐదుగురు సంతానంలో తజముల్ నంబర్ మూడు. డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు తండ్రి. ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ.. తన చిన్నారి ఆసక్తిని కాదనలేదు మహ్మద్. తజముల్ కోరికను నెరవేర్చేందుకు కిక్‌బాక్సింగ్‌లో కోచ్ వద్ద శిక్షణ ఇప్పించారు. మొదట్లో సాధన కష్టంగా ఉన్నప్పటికీ, రోజురోజుకీ దృఢంగా తయారై ఉదయం, సాయంత్రం మొత్తం మీద ఐదుగంటలపాటు శ్రమించి, కిక్‌బాక్సింగ్‌ను అవపోసన పట్టింది తజముల్. జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయిలో పోటీ పడి చాంపియన్‌గా నిలుస్తూ జాతీయ, అంతర్జాతీయ స్థాయి కిక్‌బాక్సర్‌గా ఎదిగింది. తొలి గోల్డ్‌మెడల్.. 2016లో తజముల్ ప్రపంచస్థాయి కిక్‌బాక్సింగ్ చాంపియన్‌షిప్‌కు ఎంపికైంది. ఇటలీలో జరిగే ఈ పోటీలకు వెళ్లడానికి తన దగ్గర డబ్బులు లేవు. ఆ సమయంలో కశ్మీర్లో స్పాన్సర్ చేసేవారు ఎవరూ లేకపోవడంతో ఏం చేయాలో పాలుపోలేదు. అదే సమయంలో ఆర్మీస్కూల్లో చదువుతోన్న తజముల్ మాష్టారు ఒకరు..విషయం తెలిసి తను ఇటలీ వెళ్లి పాల్గొనడానికి కావాల్సిన ఖర్చును పెట్టుకుంటానని ముందుకొచ్చారు. అంతేగాక ఆర్మీఫెడరేషన్ మరికొంత సాయం చేయడంతో అండర్–9 చాంపియన్‌షిప్‌లో పాల్గొని స్వర్ణపతకం సాధించింది. అప్పటిదాక సబ్‌జూనియర్ స్థాయిలో అంతర్జాతీయ గోల్డ్ మెడల్ భారత్‌కు ఒక్కటీ లేదు. తొలిగోల్డ్ మెడల్ సాధించిన భారతీయురాలుగా తజముల్ నిలిచింది. స్పోర్ట్స్ అకాడమీ.. ‘‘నువ్వు చిన్నాచితకా మెడల్స్ సాధించడం కాదు. ఇటువంటి మెడల్స్‌ను నేను షాపులో కూడా కొనుక్కొస్తాను. నువ్వు గోల్డ్ మెడల్ తీసురావాలి’’ అంటూ ఆమెలో పట్టుదలను రేకెత్తించాడు తండ్రి. నాన్న మాట నిలబెట్టడంతో తజముల్ ఇటలీ నుంచి ఇండియా వచ్చేటప్పటికీ తజముల్ పేరుమీద స్పోర్ట్స్ అకాడమీకి రిజిస్ట్రేషన్ చేసిన పేపర్లను తజముల్కు ఇచ్చారు. ప్రస్తుతం ఈ అకాడమీలో ఐదు నుంచి ఆరు ఏళ్ల వయసు పిల్లలు దాదాపు వందమంది దాక శిక్షణ తీసుకుంటున్నారు. బందిపొరాలో అమ్మాయిలకు క్రీడలపై శిక్షణ ఇచ్చే సంస్థలు పెద్దగా లేవు. తజముల్కు గోల్డ్ మెడల్ వచ్చాక, అమ్మాయిలకు ప్రత్యేక స్పోర్ట్స్ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. డాక్టర్ అవుతా.. ప్రస్తుతం ఆర్మీ గుడ్‌విల్ స్కూల్లో ఏడోతరగతి చదువుతోన్న 13 ఏళ్ల తజముల్ భవిష్యత్‌లో ఒలింపిక్స్‌లో పాల్గొని మెడల్ సాధించడమే లక్ష్యమంటోంది. ‘‘వార్మప్స్, కిక్స్, పంచ్‌ల సాధన ద్వారా రోజురోజుకి మెరుగవడమే కాదు.. గోల్డ్‌మెడల్స్ కూడా సాధించగలిగాను. భవిష్యత్‌లో మంచి ఎముకల సర్జన్‌ని అవుతాను. ఎందుకంటే కిక్ బాక్సింగ్‌లో చాలా మంది ఎముకలు విరగ్గొడుతుంటాను కాబట్టి వాళ్లందరికీ శస్త్రచికిత్స చేసి సరిచేస్తాను’’ అని చెబుతోంది తజముల్ నవ్వుతూ. తండ్రితో తజముల్ -
ఛాందసంపై కిక్‌బాక్సింగ్
ఈశాన్య రాష్ట్రంలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఓ మామూలు యువకుడు గొప్ప మార్పు కోసం కృషి చేస్తున్నాడు. అతని పేరు పిన్నెహోబర్ మైలీమ్‌గాప్. మేఘాలయలోని స్మిత్ గ్రామంలో వివక్షపూరితమైన ధోరణులను ఓడించేందుకు అమ్మాయిలకూ కిక్‌బాక్సింగ్ తరగతులు నిర్వహిస్తున్నాడు. పల్లెవాసులు తమ ఛాందసానికి స్వస్తి పలికి ముందడుగు వేసేలా ప్రోత్సహిస్తున్నాడు. మొదటి అడుగు ఇరవై ఒక్క ఏళ్ల పిన్నెహోబర్ మైలీమ్‌గాప్ పొట్టిగా ముఖంలో అమాయకత్వం ఉట్టిపడుతున్నట్టుగా కనిపిస్తాడు. పదో తరగతి పాసయ్యాడు. మేఘాలయ కిక్‌బాక్సింగ్ అసోసియేషన్ ద్వారా స్మిత్ గ్రామంలో పిల్లలకు కిక్‌బాక్సింగ్‌లో శిక్షణ ఇస్తున్నాడు. అయితే ఇదంత సులువుగా జరగలేదంటాడు మైలీమ్‌గాప్. ఈ గ్రామంలో సనాతన నిబంధనలను ఉల్లంఘించడానికి ఎవరూ సాహసించరు. ఇక్కడేదైనా కార్యక్రమం తలపెట్టాలంటే తప్పనిసరిగా గ్రామ కౌన్సిల్‌తో పాటు హెడ్‌గా ఉండే సోర్దార్ అనుమతి పొందాలి. వచ్చిన ప్రతి అభ్యర్థనను నిశితంగా పరిశీలించి గాని అనుమతి ఇవ్వరు. ‘ఆ విధంగా నేను అదృష్టవంతుడినే. నేను చెప్పిన విషయాలు నచ్చడంతో కిక్‌బాక్సింగ్ తరగతులకు గ్రామ కమ్యూనిటీ హాల్‌ను ఉపయోగించుకోవడానికీ అనుమతించారు’ అని ఆనందంగా చెబుతాడు మైలీన్గాప్. మొదట్లో తన క్లాసులకు అంతగా స్పందన లేదు. సోర్దార్ జోక్యం చేసుకుని పల్లెవాసులతో సమావేశాలను నిర్వహించి, పిల్లలను పంపమని ప్రోత్సహించాడు. ఇప్పుడు మైలీమ్‌గాప్ శిక్షణ తరగతిలో 60 మంది పిల్లలున్నారు. బాలికలకూ బాక్సింగ్ ‘తరగతుల నిర్వహణకు డబ్బు పెద్ద అడ్డంకిగా ఉండేది. పిల్లలకు సరైన దుస్తులూ ఉండేవి కావు. దీంతో వాళ్లంతా రోజూ ఇళ్లలో వేసుకునే దుస్తులతోనే ప్రాక్టీస్ చేస్తుంటారు. మరో సమస్య ఏంటంటే అమ్మాయిలు కేంద్రంలో శిక్షణ పొందడానికి రప్పించడం’ అంటాడు మైలీమ్‌గాప్. స్మిత్ గ్రామంలో బాలికలు ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదనే దానిపై గట్టి నియంత్రణ ఉంటుంది. మైలీమ్‌గాప్ ఆశను కోల్పోలేదు. ఇంటింటికి వెళ్లి బాలికలు ఆత్మరక్షణ కోసం ఈ విద్య నేర్చుకోవడం ఎంత ముఖ్యమో తల్లిదండ్రులకు వివరిస్తుంటాడు. ఇప్పుడు తన క్లాస్‌లో 15 మంది బాలికలు ఉన్నారు. ముందెవరూ ఆసక్తి చూపని సమయంలో పదహారేళ్ల ఎబాన్ కైంటివ్యూ తల్లి... తన కుమార్తెను చేర్చడానికి ముందుకొచ్చింది. ఎబాన్ తండ్రి ఆర్మీ జవాన్. కుటుంబానికి దూరంగా ఉండేవాడు. దీంతో ఎబాన్ తల్లి కూతురు రక్షణ కోసం కిక్‌బాక్సింగ్ క్లాస్‌లో చేర్చింది. ఎబాన్ కిక్‌బాక్సింగ్‌లో ఛాంపియన్ కావడమే లక్ష్యంగా చేసుకుంది. రోజూ ఆమె ధైర్యంగా ప్రాక్టీస్ చేస్తుంటుంది. ఎబాన్ను చూసి 18 ఏళ్ల ఫిబారిహున్ మావ్లాంగ్ కూడా కిక్‌బాక్సింగ్ క్లాస్‌లో చేరింది. అలా క్రమంగా మరో పదమూడు మంది అమ్మాయిలు ఈ శిక్షణాకేంద్రంలో చేరారు. మైలీమ్‌గాప్ శిక్షణా కేంద్రం చిన్నదే కావచ్చు. కానీ ఓ మారు గ్రామంలో అతను రాబట్టాలని చూసే ఫలితాలు మాత్రం మెచ్చుకోదగినవి. కొన్ని నెలల క్రితం పూణే బాక్సింగ్ పోటీలలో మైలీమ్‌గాప్ విద్యార్థులు ఐదు స్వర్ణాలు, ఎనిమిది రజత పతకాలు సాధించారు. – ఆరెన్నార్ -
బాస్... ఇక్కడ నేనే బాడీ గార్డ్
ఇదేమిటీ కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌లా పోజిచ్చిందనేగా మీ సందేహం. బాడీగార్డ్ సినిమాలో సల్మాన్‌ఖాన్ కండలతో కనిపిస్తాడు. తన లేడీ బాస్‌కు అంగరక్షకుడిగా పనిచేస్తాడు. సరిగ్గా ఈ మేల్ కంగారూ పనికూడా అదే. మీరు కూడా ఔత్సాహిక బాడీ బిల్డర్ అయితే ఇది తన కాళ్లతో లోహపు బకెట్లను తొక్కేటపుడు గమనించండి. ఆ సమయంలో వచ్చే శబ్దాలు ఎలా ఉంటాయో తెలుసా. తుపాకీలోనుంచి తూటాలు వెళుతున్నట్టు ఉంటుంది. ఇక విషయానికొద్దాం. ఆస్ట్రేలియాలోని కంగారూ వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికెళితే అక్కడ కూడా మీకొక బాడీగార్డు కనిపిస్తుంది. దాని పేరు రోజర్. ఇంతకీ ఇది బాడీగార్డు ఎలా అయిందంటే....ఆలిస్స్ప్రింగ్స్ ప్రాంతంలోని వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలోగల ఆడ కంగారూలను కాపాడుకునే బాధ్యతను నెత్తికెత్తుకోవడం ద్వారా. ఇందుకోసం కిక్‌బాక్సింగ్ కూడా నేర్చుకుంది. ఇది ఒక్క కిక్ ఇచ్చిందంటే ప్రత్యర్థి గింగిరాలు తిరిగి కిందపడిపోవాల్సిందే. ఇందుకోసం ఇది ఖాళీ సమయంలో కిక్ బాక్సింగ్ ప్రాకీ ్టస్ చేస్తూ ఉంటుంది. తొమ్మిదేళ్ల రోజర్ పొట్టిగా ఉన్నా శారీరకంగా ఎంతో బలిష్టమైనది. దాని పోజు చూస్తే మీకే అవలీలగా అవగతమవుతుంది మరి. ఇందుకోసం దానికో శిక్షకుడు కూడా ఉన్నాడు మరి.