ఈశాన్య రాష్ట్రంలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఓ మామూలు యువకుడు గొప్ప మార్పు కోసం కృషి చేస్తున్నాడు. అతని పేరు పిన్నెహోబర్ మైలీమ్‌గాప్. మేఘాలయలోని స్మిత్ గ్రామంలో వివక్షపూరితమైన ధోరణులను ఓడించేందుకు అమ్మాయిలకూ కిక్‌బాక్సింగ్ తరగతులు నిర్వహిస్తున్నాడు. పల్లెవాసులు తమ ఛాందసానికి స్వస్తి పలికి ముందడుగు వేసేలా ప్రోత్సహిస్తున్నాడు.
మొదటి అడుగు
ఇరవై ఒక్క ఏళ్ల పిన్నెహోబర్ మైలీమ్‌గాప్ పొట్టిగా ముఖంలో అమాయకత్వం ఉట్టిపడుతున్నట్టుగా కనిపిస్తాడు. పదో తరగతి పాసయ్యాడు. మేఘాలయ కిక్‌బాక్సింగ్ అసోసియేషన్ ద్వారా స్మిత్ గ్రామంలో పిల్లలకు కిక్‌బాక్సింగ్‌లో శిక్షణ ఇస్తున్నాడు. అయితే ఇదంత సులువుగా జరగలేదంటాడు మైలీమ్‌గాప్. ఈ గ్రామంలో సనాతన నిబంధనలను ఉల్లంఘించడానికి ఎవరూ సాహసించరు. ఇక్కడేదైనా కార్యక్రమం తలపెట్టాలంటే తప్పనిసరిగా గ్రామ కౌన్సిల్‌తో పాటు హెడ్‌గా ఉండే సోర్దార్ అనుమతి పొందాలి. వచ్చిన ప్రతి అభ్యర్థనను నిశితంగా పరిశీలించి గాని అనుమతి ఇవ్వరు. ‘ఆ విధంగా నేను అదృష్టవంతుడినే. నేను చెప్పిన విషయాలు నచ్చడంతో కిక్‌బాక్సింగ్ తరగతులకు గ్రామ కమ్యూనిటీ హాల్‌ను ఉపయోగించుకోవడానికీ అనుమతించారు’ అని ఆనందంగా చెబుతాడు మైలీన్‌గాప్. మొదట్లో తన క్లాసులకు అంతగా స్పందన లేదు. సోర్దార్ జోక్యం చేసుకుని పల్లెవాసులతో సమావేశాలను నిర్వహించి, పిల్లలను పంపమని ప్రోత్సహించాడు. ఇప్పుడు మైలీమ్‌గాప్ శిక్షణ తరగతిలో 60 మంది పిల్లలున్నారు.
బాలికలకూ బాక్సింగ్
‘తరగతుల నిర్వహణకు డబ్బు పెద్ద అడ్డంకిగా ఉండేది. పిల్లలకు సరైన దుస్తులూ ఉండేవి కావు. దీంతో వాళ్లంతా రోజూ ఇళ్లలో వేసుకునే దుస్తులతోనే ప్రాక్టీస్ చేస్తుంటారు. మరో సమస్య ఏంటంటే అమ్మాయిలు కేంద్రంలో శిక్షణ పొందడానికి రప్పించడం’ అంటాడు మైలీమ్‌గాప్. స్మిత్ గ్రామంలో బాలికలు ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదనే దానిపై గట్టి నియంత్రణ ఉంటుంది. మైలీమ్‌గాప్ ఆశను కోల్పోలేదు. ఇంటింటికి వెళ్లి బాలికలు ఆత్మరక్షణ కోసం ఈ విద్య నేర్చుకోవడం ఎంత ముఖ్యమో తల్లిదండ్రులకు వివరిస్తుంటాడు. ఇప్పుడు తన క్లాస్‌లో 15 మంది బాలికలు ఉన్నారు. ముందెవరూ ఆసక్తి చూపని సమయంలో పదహారేళ్ల ఎబాన్ కైంటివ్యూ తల్లి... తన కుమార్తెను చేర్చడానికి ముందుకొచ్చింది. ఎబాన్ తండ్రి ఆర్మీ జవాన్.
కుటుంబానికి దూరంగా ఉండేవాడు. దీంతో ఎబాన్ తల్లి కూతురు రక్షణ కోసం కిక్‌బాక్సింగ్ క్లాస్‌లో చేర్చింది. ఎబాన్ కిక్‌బాక్సింగ్‌లో ఛాంపియన్ కావడమే లక్ష్యంగా చేసుకుంది. రోజూ ఆమె ధైర్యంగా ప్రాక్టీస్ చేస్తుంటుంది. ఎబాన్‌ను చూసి 18 ఏళ్ల ఫిబారిహున్ మావ్లాంగ్ కూడా కిక్‌బాక్సింగ్ క్లాస్‌లో చేరింది. అలా క్రమంగా మరో పదమూడు మంది అమ్మాయిలు ఈ శిక్షణాకేంద్రంలో చేరారు. మైలీమ్‌గాప్ శిక్షణా కేంద్రం చిన్నదే కావచ్చు. కానీ ఓ మారు గ్రామంలో అతను రాబట్టాలని చూసే ఫలితాలు మాత్రం మెచ్చుకోదగినవి. కొన్ని నెలల క్రితం పూణే బాక్సింగ్ పోటీలలో మైలీమ్‌గాప్ విద్యార్థులు ఐదు స్వర్ణాలు, ఎనిమిది రజత పతకాలు సాధించారు.
– ఆరెన్నార్
Comments
Please login to add a commentAdd a comment