కిడ్నీ గ్రామం కూలిపోయింది...
కఠ్మాండు: అది సరిగ్గా కఠ్మాండు నగరానికి 17 కిలోమీటర్ల దూరంలోవున్న హాక్సే అనే గ్రామం. ఆ గ్రామాన్ని అందరు 'కిడ్నీ గ్రామం' అని పిలుస్తారు. పెళ్లి చేసుకున్న ఓ తరానికి తరం ఆడ, మగ తేడాలు లేకుండా కిడ్నీలు అమ్ముకోవడం వల్ల ఆ గ్రామానికి ఆ పేరు వచ్చింది. తాగడానికో, తందానాలాడడానికో వారు కిడ్నీలు అమ్ముకోలేదు. రెక్కాడితేగాని డొక్కాడని ఆ గ్రామ ప్రజలు ఓ చిన్నపాటి స్థలం కునుక్కొని ఇల్లు కట్టుకుందామనే ఆశతోనే కిడ్నీలు అమ్ముకున్నారు.
అలా వచ్చిన డబ్బులో వారు నయాపైసా కూడా వృధా చేయలేదు. ఆశించినట్టుగానే స్థలం కొనుక్కొని ఇళ్లు కట్టుకున్నారు. హమ్మయ్యా జీవిత కల నెరవేరిందంటూ ఊపిరి పీల్చుకుంటున్న సమయంలోనే వారిపై ప్రళయం విరుచుకుపడింది. గత ఏప్రిల్ 25వ తేదీన వచ్చిన భూకంపం వారిళ్లన్నింటిని తుడిచిపెట్టేసింది. కొంతమంది మృత్యువాత పడ్డారు. ఆ రోజు కఠ్మాండు ప్రాంతంలో 7.8 తీవ్రతతో వచ్చిన భూకంపంలో దాదాపు తొమ్మిదివేల మంది ప్రజలు, వేలాది ఇళ్లు కూలిపోయిన విషయం తెల్సిందే.
అలా ఇల్లు కోల్పోయిన వారిలో 37 ఏళ్ల గీత ఒకరు. ఆమె తన పిల్లలతో రేకులు, రైస్ బ్యాగ్‌లు, టార్పాలిన్ కవర్లతో నిర్మించుకున్న తాత్కాలిక షెడ్డులో నివసిస్తోంది. ఆమె తన కిడ్నీని లక్షా పాతికవేల రూపాయలకు అమ్ముకుంది. కూలిపని చేసుకునే ఆమె భర్త కూడా సొంతింటి కోసం కిడ్నీ అమ్ముకున్నాడు. కిడ్నీలు తొలగించాక కూడా బాడీలో అవి మళ్లీ పెరుగుతాయంటూ బ్రోకర్ చెప్పిన మాటలు తాను నమ్మానని ఆమె అమాయకంగా చెప్పింది. ఆమెను బ్రోకర్లు భారత్‌లోని చెన్నై నగరానికి తీసుకొచ్చి మరీ కిడ్నీ ఆపరేషన్ చేయించారు.
ఆశ్చర్యంగా ఆ గ్రామం ప్రజలందరిని దక్షిణ భారత దేశానికి తీసుకొచ్చే కిడ్నీలు తొలగించారు. ఆమె లాంటి ఎంతోమంది యువతీ యువకులు డబ్బుకు ఆశపడి, బ్రోకర్ల మాయమాటలను నమ్మి కిడ్నీలు అమ్ముకున్నారు. పాతిక వేల నుంచి లక్షా పాతిక వేల రూపాయల రేటు వరకు కిడ్నీలు అమ్ముకున్నారు. కవ్రేపాలనచౌక్ జిల్లాలోవున్న ఈ హాక్సే గ్రామం ప్రధానంగా పేదరికం కారణంగానే కిడ్నీ గ్రామంగా మారింది. కిడ్నీలు అమ్మగా వచ్చిన సొమ్ముతో తమ కలల సౌధాలు (సాధారణ ఇళ్లే) కళ్ల ముందే కూలిపోవడంతో ఆడవాళ్లు లోలోనే కుమిలిపోతుండగా, మగవాళ్లు మాత్రం మానసిక ఒత్తిడికి గురై తాగుబోతులుగా మారారు. వాళ్ల దు:ఖానికి ఖరీదుకట్టే షరాబులు లేరక్కడ!
భారత్‌కు అవసరమైన కిడ్నీలు సరఫరా చేయడానికి నేపాల్ గ్రామీణ ప్రాంతాలు ప్రస్తుతం పెద్ద మార్కెట్‌గా మారిపోయిందని నేపాల్ డాక్టర్లే చెబుతున్నారు. బ్రోకర్లు పాతిక వేల నుంచి లక్షా పాతిక వేల వరకు కిడ్నీ బాధితులకు చెల్లిస్తుండగా, వారు మాత్రం కొనుగోలుదారులకు ఆరున్నర లక్షల వరకు విక్రయిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న కిడ్నీల అక్రమ వ్యాపారం ద్వారా ఏటా ఆరున్నరవేల కోట్ల రూపాయల లాభం సంపాదిస్తున్నారని 'గ్లోబల్ ఫైనాన్సియన్ ఇంటెగ్రిటీ' సంస్థ తెలియజేసింది. ఏటా పదివేల వరకు అక్రమంగా కిడ్నీలను తొలగించే ఆపరేషన్లు జరుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.