ఆడపిల్లకు జీవితమే ఒక పోరాటం
స్త్రీకి అయినా.. పురుషుడికి అయినా తన జీవితాన్ని తాను జీవించే స్వేచ్ఛ ఉన్న సమాజం కావాలి. ఒకరి మీద ఆధారపడని తత్వాన్ని ఉగ్గుపాలత తాగుతున్నఅమ్మాయిలు.. అలవోకగా నాలుక జారే అహంకారాన్ని ఇంకా వదిలించుకోలేని అబ్బాయిలు.. ఈ రెండు స్వభావాల మధ్య ఘర్షణ తలెత్తని సమ సమాజం అయి ఉండాలి. అది మాతృస్వామ్యమూ కాదు... పితృస్వామ్యమూ కాదు వ్యక్తిస్వామ్య సమాజం... వ్యక్తివాద సమాజం పురుడుపోసుకోవాలి.అందుకోసం ఒక పోరాటమే చేయాల్సి ఉంటుంది. అలాంటి పోరాటమే చేసిన కిరణ్మయి పరిచయమిది.
‘పితృస్వామ్య సమాజంలో మగవారి చేతుల్లో, చేతల్లో లైంగిక దోపిడీకి గురయ్యాను’ అంటూ బాధిత మహిళలు ‘మీ టూ’తో కలుస్తున్నా.. అతడిలో చలనం రాలేదు. అంతమంది మగవాళ్లు నిస్సిగ్గుగా లైంగిక వేధింపులకు పాల్పడుతుంటే నేను మాత్రం వాళ్లకు తీసిపోవడం ఎందుకనుకున్నాడో ఏమో.. ‘మీ టూ’ వేధించేవాడినే అని నిరూపించుకున్నాడు. ఓ రోజు పెద్ద హోటల్లో ఈవెనింగ్ పార్టీ జరుగుతోంది.చురుగ్గా ఉన్న కిరణ్మయిని ఫాలో అయ్యాడు. పలకరించాడు, ప్రశంసించాడు. ఫోన్ నంబర్ అడిగాడు. ‘ఫోన్ నంబరు ఇవ్వలేను, కావాలంటే ఫేస్బుక్లో ఫాలో అవండి’ అన్నదామె సున్నితంగానే.
తెల్లవారిందో లేదో... మొదలయ్యాయి ఫేస్బుక్లో పోస్ట్‌లు. ప్రతి పది– పదిహేను నిమిషాలకో పోస్ట్. ఆమె అచీవ్మెంట్స్కి ప్రశంసలు, మాట తీరుకు మెచ్చుకోళ్లు, ఆమెకి పొగడ్తలు. ఆమె రెస్పాండ్ కానందుకు నిష్ఠూరాలు, రెస్పాండ్ కాకపోవడం పొగరుకి నిదర్శనం అంటూ అభియోగాలు. కనీస మర్యాదలు తెలియకపోవడం, సంస్కారం లేని చర్యలు అంటూ ఆరోపణలు మొదలయ్యాయి. పనిలో పనిగా తన దేహదారుఢ్యం అంత గొప్ప ఇంత గొప్ప అంటూ కొలతలు, ఫొటోలు కూడా. తనతో జీవితం పంచుకుంటే ఒనగూరే సౌఖ్యాల వివరణ.
అన్‌పార్లమెంటరీ కామెంట్లు. అసభ్యకరమైన దూషణలు. సాయంత్రానికి దాదాపుగా నలభై పోస్టులున్నాయి. ఆ రోజు ఉదయం నుంచి బిజీగా ఉండి, సాయంత్రం వరకు ఫేస్‌బుక్‌లోకి లాగిన్ కాకపోవడంతో కిరణ్మయికి ఎదురైన చేదు అనుభవం ఇది. ఊహించని ట్రోలింగ్కి తల తిరిగిపోయిందామెకి. పట్టించుకోకుండా ఊరుకోవాలా? పట్టించుకుని పోరాడాలా? అనే మీమాంస. ఒక్క క్షణం ఆమెకి రామగుండం, ఫెర్టిలైజర్ సిటీలో తన బాల్యం, సాహసం, వ్యక్తిత్వ పరిరక్షణ వంటివన్నీ గుర్తుకు వచ్చాయి.
డిగ్రీలో ట్యూషన్ చెప్పాను
‘‘మా నాన్న వీరేశ్ బాబు రామగుండంలో ఎరువుల కంపెనీలో ఉద్యోగం చేసేవారు. అమ్మ దేవకి. నాకంటే ముందు ఇద్దరమ్మాయిలున్నారు. నేను చిన్నప్పటి నుంచి చాలా చురుగ్గా ఉండేదాన్ని. స్కూల్‌కి స్కేటింగ్ చేసుకుంటూ వెళ్లడం, పదహారేళ్లకే బైక్ నడపడం అలవాటయ్యాయి. సిక్త్స్ క్లాస్ నుంచి పుస్తకాలు చదవడం అలవాటైంది. స్కూల్‌డేస్‌లోనే అయాన్ రాండ్, మాక్సిమ్ గోర్కీలను చదివాను. రామగుండంలో దాదాపుగా అన్ని రాష్ట్రాల వాళ్లూ ఉండేవాళ్లు. మినీ ఇండియాను తలపించేది.
కేంద్రీయ విద్యాలయం చదువులో ‘అమ్మాయి– అబ్బాయి’ అనే నిబంధనలేవీ ఉండేవి కాదు. ఆ వాతావరణం నుంచి డిగ్రీకి ఏలూరు రావడం కొత్త ప్రపంచంలో అడుగుపెట్టినట్లనిపించింది. మనిషి మనిషిలా బతికితే చాలనే ఫిలాసఫీ నాది. దాంతో ఎక్కడికి వెళ్తే అక్కడికి తగినట్లు అలవాటు పడిపోతాను. అమ్మానాన్నలను ఇంకా డబ్బు అడగడం ఏమిటని డిగ్రీలో ఉన్నప్పటి నుంచి ట్యూషన్లు చెప్పాను.
పీజీ సీట్ వచ్చినా చేరకుండా ఉద్యోగం కోసం హైదరాబాద్కొచ్చేశాను. ప్రతిదీ సాహసోపేతంగానే ఉండాలనుకుంటాను. ప్రతి క్షణాన్నీ ఆస్వాదిస్తాను. పెరుగన్నమైనా సరే ఇష్టంగా తింటాను. ఇష్టం లేకపోతే ఏ పనినీ చేయను. రకరకాల సెక్టార్లలో పని తెలియడం కోసమే మూడు కంపెనీలు మారాను. ప్రతి పుట్టిన రోజు కూడా రిమార్కబుల్గానే ఉండాలనుకుంటాను. బైక్ రైడింగ్ కూడా అలాంటిదే. ఇదీ నా లైఫ్ స్టయిల్.
సెటిల్ కావడం అంటే...
చాలామంది అంటున్నట్లు... చాలా మంది అనే కాదు, మా అమ్మానాన్న కూడా అంటున్నట్లు జీవితంలో సెటిల్ కావడం అంటే ఏమిటో, దానికి నిర్వచనం ఏమిటో నాకు అర్థమే కాదు. సెటిల్ కావడం అనే భావనకు వెనుక చాలా జీవితం ఉంది. ఐబీఎమ్ ఉద్యోగానికి రిజైన్ చేసి హైదరాబాద్ నుంచి గౌహతికి పోనురాను టికెట్లు కొన్నాను. రెండు తేదీల మధ్య నెల రోజులున్నాయి. చేతిలో మ్యాప్ తో గౌహతిలో దిగిపోయాను. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, సిక్కిమ్, మిజోరాం రాష్ట్రాల్లో పర్యటించాను. 2015లో బైక్ రైడర్ ట్రావెలర్‌గా మారాను. 2016లో కన్యాకుమారి నుంచి కశ్మీర్ (కెటుకె) బైక్ రైడ్ చేశాను.
రాయల్ ఎన్ఫీల్డ్ మీద హైదరాబాద్‌లో బయలుదేరి బంగాళాఖాతం తీరం వెంబడి కన్యాకుమారి చేరాను. అక్కడి నుంచి అరేబియా సముద్రం మీదుగా కేరళ, గోవా, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, కశ్మీర్ చేరాను. కెటూకె బైక్ రైడ్ చేసిన తొలి తెలుగమ్మాయిని. ఇండియన్ బైక్ రైడర్స్‌లో కర్దూంగ్ లా కి సోలో రైడ్ చేసిన సెకండ్ ఉమన్‌ని కూడా. మరో రెండు సౌత్ ఇండియన్ బైక్ టూర్లు చేశాను. హిందీ భాషలో కూడా రాష్ట్రానికీ రాష్ట్రానికీ ఉచ్చారణ తేడాలో ఉంటుంది. గ్రామీణులకు నా ఉచ్చారణ అర్థం కాక కొన్ని చోట్ల కొట్టబోయినంత పని చేశారు కూడా.
ఇదంతా చెప్పడం ఎందుకంటే... ప్రతి గడ్డు పరిస్థితినీ సున్నితంగా అధిగమించడం, ఆ తర్వాత తలుచుకుని ఆనందించడం తెలుసు నాకు. ఇప్పుడు సొంత కంపెనీ నిర్వహణ చాకచక్యంగా చేసుకుంటున్నాను. అలాంటిది ఒక వ్యక్తి నా వెనుకే నడుస్తూ నా దృష్టిలో పడడానికి ప్రయత్నించి, తనను తాను పరిచయం చేసుకుని ‘మీ ట్రైనింగ్ సెషన్స్ చూశాను, చాలా స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి’ అని మాటలు కలిపాడు. మరుసటి రోజే ఫేస్బుక్లో అసభ్యకరమైన కాన్వర్జేషన్ మొదలు పెట్టాడు. అతడిని నివారించడానికి చేసిన ప్రయత్నంలో అతడిని ‘బ్లాక్’ చెయ్యడంతో పాటు పోలీస్ కంప్లయింట్ వరకు వెళ్లాల్సి వచ్చింది.
పోరాటం మొదలైంది
నన్ను ట్రోల్ చేసిన వ్యక్తిని నిరోధించడమే నా ఉద్దేశంగా మొదలైన పోరాటం ఆఖరుకి పోలీసు డిపార్టుమెంట్ మీద, ప్రభుత్వ వ్యవస్థల మీద పోరాటంగా మారింది. మొదట షీ టీమ్స్‌కి ట్విటర్లో ట్వీట్, ఈ మెయిల్ కూడా పెట్టాను. ట్వీట్‌కి స్పందిస్తూ స్వయంగా పోలీస్ స్టేషన్‌కి రావాలన్నారు. అలాగే వెళ్లాను. వాళ్ల ట్వీట్‌కి స్పందించినట్లు నన్ను మరో ట్వీట్ చేయమన్నారు. అలాగే చేశాను. భరోసా టీమ్‌కి రిపోర్టు, సైబర్ క్రైమ్ స్టేషన్లో రిపోర్టు.. ఇలా తిరుగుతూనే ఉన్నాను.
ఎవరికీ అడ్రస్ చేయకుండా కంప్లయింట్ రాసిమ్మన్నారు, అలాగే రాశాను. ఈ మెయిల్ కూడా చేశాను. రెండు రోజుల తర్వాత నేను కేసు ప్రోగ్రెస్ ఏమిటని విచారిస్తే... ‘ఏసీపీ సర్ ఎఫ్ఐఆర్ ఆపేశారు, మీకు తెలిసిన వ్యక్తే కాబట్టి పిలిచి మాట్లాడుకోండి అని చెప్పమన్నారు’.. ఇదీ నాకు ఇచ్చిన సమాధానం! నేను, అతడు మాట్లాడుకుని పరిష్కరించుకునే విషయమే అయితే పోలీస్ స్టేషన్‌కి ఎందుకు వెళ్తానసలు? నా కేసు విచారణ కోసం మళ్లీ భరోసా టీమ్‌కి, పోలీస్ స్టేషన్లకి తిరగ్గా తిరగ్గా కంప్లయింట్ ఇచ్చిన పన్నెండు రోజులకు ఫైల్ చేశారు. అది కూడా తప్పులచిట్టా.
నేను చెప్పని విషయాలేవేవో ఉన్నాయందులో. నా ఫేస్‌ని న్యూడ్ ఫొటోలతో మార్ఫింగ్ చేసి ఎఫ్బీలో పెట్టాడని ఉంది ఎఫ్ఐఆర్లో. నేను ఆ ఎఫ్ఐఆర్ని ఆమోదిస్తే కోర్టు విచారణలో ఒక్క ఆధారాన్ని కూడా చూపించలేను కాబట్టి నాది ఫేక్ కేసుగా పరిగణిస్తారు. అతడు నా మీద రివర్స్ కేసు పెట్టడానికి దారి తీసే పరిణామం అది. ఇలా ఎందుకు చేస్తున్నారో ఆలోచించే కొద్దీ ఒక మగవాడిని కాపాడడానికే పోలీసు వ్యవస్థ పని చేస్తోందా, అబ్యూజ్‌కు గురైన మహిళ గోడు పట్టనే పట్టదా... అని కూడా అనిపించింది.
దిద్దుబాటు అవసరం
ఇంత ధైర్యం, మొండితనం ఉన్న నాకే ఇలా జరిగితే... ఒక మామూలమ్మాయి పరిస్థితి ఎలా ఉంటుంది? మనిషికి రక్షణగా ఉండాల్సిన వ్యవస్థ మగవాడికి మాత్రమే రక్షణ కవచంలా మారిపోతే ఎలా? మొదలు పెట్టిన పనిని పూర్తి చేసే వరకు మొండితనం, పట్టుదల నాలో ఉండబట్టి అతడిని అరెస్ట్ చేసే వరకు వ్యవస్థ మీద పోరాటం చేయగలిగాను.
ఏ దశలో అయినా నేను ఇంకా ఏం చేద్దాంలే అన్నట్లు నిరాశ చెంది ఉంటే ఈ రోజు అతడు సమాజంలో ధీరుడిలా తిరుగుతుండేవాడు. ఇది అతడి తప్పు అనడం కంటే మన వ్యవస్థలో ఉన్న లోపం అనే చెప్పాలి. మగవాళ్లు సెన్సిటైజ్ అయితే మీటూ అంటూ ఉద్యమించే పరిస్థితి ఆడవాళ్లకు ఉండదనుకుంటున్నాం. కానీ నిజానికి దిద్దుబాటు అవసరం ఉన్నది పాలన వ్యవస్థలకు, వాటిలో కరడు కట్టి ఉన్న సమన్వయలోపాలకే’’.
ఆత్మగౌరవ పోరాటం
‘నన్ను ఎఫ్బీలో ట్రోలింగ్ చేసిన వ్యక్తి మీద దయచేసి చర్యలు తీసుకోండి’ అని గొంతు చించుకుని పోరాడాల్సి వచ్చింది. ప్రతి దశలోనూ ఒక్కో పోలీస్ అధికారి ‘మీకేం కావాలి’ అని అడిగేవాళ్లు. ‘నాకు న్యాయం కావాలి. నన్ను అవమానించిన, నా గౌరవానికి భంగం కలిగించిన వ్యక్తి మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. ఇదే నాక్కావలసింది’ అని చెప్పేదాన్ని.
అయితే వాళ్లకు అది నచ్చేది కాదు. ఈ ధోరణి వల్ల నా కంప్లయింట్ కాపీతో సరిపోలేటట్లు ఎఫ్ఐఆర్ సరిదిద్దే వరకు ఒక పోరాటం చేయాల్సి వచ్చింది. నల్సార్ యూనివర్సిటీకెళ్లి ఒపీనియన్ తీసుకుని, నా అడ్వొకేట్ మిత్రుల సహాయంతో ప్రతి దశలోనూ ఒక యుద్ధం చేసినంత పనైంది. మొత్తానికి 24 రోజుల తర్వాత అతడిని అరెస్ట్ చేశారు – కిరణ్మయి, బైక్ రైడర్, సైకాలజిస్ట్
– ఇంటర్వ్యూ: వాకా మంజులారెడ్డి