కౌబాయ్
హైందవ సంప్రదాయంలో గోవును ప్రత్యక్ష దైవంగా భావిస్తారు.. పూజిస్తారు. ఆధ్యాత్మిక మార్గంలో.. ఎల్లలు దాటి సంచరిస్తున్న జూలియన్ కిర్పాల్ బ్లెస్ కూడా ఆవును అమితంగా ప్రేమిస్తారు. గో సంరక్షణ ప్రాధాన్యం తెలియజేస్తూనే.. సేవాగుణం గొప్పదనాన్ని చాటుతున్నారు. అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన కిర్పాల్.. తను నమ్మిన సిద్ధాంతాలను పాటిస్తూ, వాటికి ప్రచారం కల్పిస్తూ.. 12 ఏళ్లుగా ముందుకు సాగుతున్నారు.ఈ ప్రయాణంలో హైదరాబాద్‌కు వచ్చిన అతన్ని సిటీప్లస్ పలకరించింది. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..
- కోన సుధాకర్ రెడ్డి
ఈ ప్రపంచాన్ని మార్చగలిగేవి రెండే రెండు. ఒకటి- సేవాగుణం, రెండు- ఆధ్యాత్మికత. ఈ రెండూ ఉన్న చోట ధర్మం నిలబడుతుంది. ఇది మెట్ట వేదాంతం కాదు. జీవిత సత్యం. ఈ నిజం నాకు అవగతమై పన్నెండేళ్లు అవుతోంది. అప్పట్నుంచి నేను నమ్మిన సిద్ధాంతాన్ని పది మందికీ పరిచయం చేస్తున్నా. దైవంగా పూజించే గోవును చంపడాన్ని నేను నేరంగా భావిస్తాను. ఒక్క ఆవునే కాదు.. ఏ మూగజీవాన్నీ చంపడం, వాటి మాంసం భుజించడాన్ని నేను సమర్థించను.
నేనే కాదు అమెరికాలోని మా కుటుంబం నాన్‌వెజ్ పూర్తిగా మానేసింది. శాకాహారం ఆరోగ్యానికి మేలు కూడా చేస్తుంది. మానసికంగా కూడా ప్రశాంతంగా ఉండేలా చేయగలుగుతుంది. కొన్నాళ్ల కిందట అమెరికాలోని విస్టన్ వ్యాలీ మీడియం కరెక్షనల్ జైలులోని ఖైదీలకు పూర్తిగా శాకాహారం అందించడం మొదలుపెట్టాం. కొన్నాళ్లకు ఆ ఖైదీల మానసిక ప్రవర్తనలో స్పష్టమైన మార్పు కనిపించింది.
నేనే బండి లాగాను..
కర్మభూమిగా భాసిల్లుతున్న భారతదేశం సంస్కృతి చాలా గొప్పది. ప్రపంచ దేశాలకు భారత్ ఒక దిక్సూచి వంటిది. భారతదేశం గొప్పదనం గురించి పుస్తకాల్లో చదివాక.. ఈ దేశానికి ఎప్పుడెప్పుడు రావాలా అని అనుకున్నాను. ఆ క ల మూడుసార్లు నెరవేరింది. ఇప్పటికే భారత్‌లో రెండుసార్లు పర్యటించాను. ఇది మూడోసారి. ఢిల్లీ, చెన్నై, పాండిచ్చేరి, హైదరాబాద్‌తో పాటు పలు ఆధ్యాత్మిక క్షేత్రాలు కూడా చూశాను. ఈ ప్రయాణంలో ఎన్నో గోశాలలు సందర్శించాను.
అనారోగ్యంతో బాధపడుతున్న ఆవులకు వైద్యం అందించడం చూశాను. ఢిల్లీలో ఉండగా.. ఎద్దుతో నడిపించే బండిని చూశాను. తట్టుకోలేకపోయాను. వెంటనే దాన్ని విడిపించి నేనే బండి లాగాను. పశువులతో పని చేయించుకోవడం తప్పు కాదు. కాని, వాటిపై మోయలేని భారాన్ని మోపడం సరికాదు.
ఇలాగే సాగుతా..
మానవ మనుగడకు పర్యావరణం ప్రధాన వనరు. పర్యావరణాన్ని రక్షిస్తే.. అది మనల్ని కాపాడుతుంది. నేను ఎంచుకున్న సేవా పథంలో పర్యావరణ పరిరక్షణే మొదటి అంశం. దీనిపై కూడా నాకు తోచినంతలో పది మందికీ అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాను. ఇక నా గురించి చెప్పాలంటే.. వయసు 48. పెద్దగా చదువుకోలేదు. అమెరికాలో రియల్ఎస్టేట్ వ్యాపారం ఉంది. ఆరు నెలల కిందట ఇండియాకు వచ్చాను. ప్రస్తుతం కుటుంబ సభ్యులే నాకు కావాల్సిన ఆర్థిక వనరులు సమకూరుస్తున్నారు. ఆరోగ్యం సహకరించినన్ని రోజులూ.. సమాజ హితం కోరుతూ ఇలా ముందుకు సాగుతాను.
రెండు నెలలుగా..
ఆరు నెలల కిందట ఇండియా టూర్‌కు వచ్చిన కిర్పాల్.. రెండు నెలలుగా హైదరాబాద్‌లోనే ఉంటున్నాడు. ఓ వైపు తను నమ్మిన సిద్ధాంతాలను ప్రచారం చేస్తూనే తెలుగు భాషా, సంస్కృతులపై అధ్యయనం చేస్తున్నాడు. రవీంద్ర భారతికి కిర్పాల్ నిత్య అతిథి. సామాజిక దృక్పథం ఉన్న నాటకాలు, ప్రదర్శనలు చూసి ఆహా.. ఓహో.. అని చప్పట్లు చరచడమే కాదు.. వాటి విశేషాలను ప్రచారం చేస్తుంటాడు.