తెలుగు తేటగీతి వెలుగు ‘యాది’
ఆయన రచనలు చదువుతుంటే ఆత్మీయులు ముందు కూర్చొని ముచ్చటిస్తున్నట్టు ఉంటుంది. వాటిలో సాహిత్యంతో పాటు సాహితీకారుల వ్యక్తిగత జీవితాల్లోని వివిధ పార్శ్వాలు తొంగి చూస్తుంటాయి. సదాశివ సాహితీ ప్రయాణం కొన్ని శతాబ్దాల జీవితాన్ని బోధపరుస్తుంది.
ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్ సరిహద్దు జిల్లా కావడంతో సహజంగానే అది బహుభాషా ప్రాంతం. సరస్వతీ పుత్రుడు డాక్టర్ సామల సదాశివ ఆ ప్రాంతంలోని తెలుగుపల్లె గ్రామంలో 1928లో కన్ను తెరిచారు. తెలుగుతో పాటు ఉర్దూ, మరాఠీలు కూడా కొన్ని ప్రాంతాల్లో ప్రజల వాడుకలో ఉండేవి. నిజాం పాలనలో అధికారిక వ్యవహారాలన్నీ ఉర్దూలోనే జరిగేవి. ఉద్యోగాల కోసం ఉర్దూ నేర్చుకోక తప్పేది కాదు. నాటి ఉర్దూ ఉపాధ్యాయులు ఎలాంటి శిక్షణ లేకున్నా తాదాత్మ్యంతో, ఆవేశంతో పాఠాలు బోధిస్తుంటే విద్యార్థులు లీనమైపోయేవారు. తెలుగు ఉపాధ్యాయులు అలా ఆకట్టుకోకపోయేవారు. దీంతో విద్యార్థిగా ఉండగానే సదాశివకు తెలుగు కంటే ఉర్దూపైనే అమితాసక్తి కలిగింది. తండ్రి నాగయ్య పంతులుతో సన్నిహితంగా ఉండే రియాదల్ రెహమాన్ దగ్గర పార్సీ భాషను నేర్చుకున్నారు. సహజ సిద్ధంగానే ఆసక్తి ఉండ టం అవసరం. ఆ ఆసక్తికి తోడు తగిన పరిసరాలు, పెద్దలు, గురువుల సాంగత్యం లభించటం వల్ల సదాశివలో రచనాసక్తి పెంపొందింది, ఆయన రచనా వ్యాసంగం ఫలప్రదమైంది. ఆయన వచనంలో సరళత, స్పష్టత, సహజత్వం ఉట్టిపడతాయి. ఆయన రచనలు చదువుతుంటే ఆత్మీయులు ముందు కూర్చొని ముచ్చటిస్తున్నట్టు ఉంటుంది. సదాశివ రచనల్లో సాహిత్యంతో పాటు సాహితీకారుల వ్యక్తిగత జీవితాల్లోని వివిధ పార్శ్వాలు కూడా తొంగి చూస్తుంటాయి. సదాశివ సాహితీ ప్రయాణం కొన్ని శతాబ్దాల జీవితాన్ని బోధపరుస్తుంది.
సదాశివ తన ‘యాది’ రచనలో ఉర్దూ భాషతో తనకున్న అనుబంధాన్ని, ఉర్దూ గజల్స్‌ను, రుబాయీలను, వాటిలోని సూఫీ వేదాంతాన్ని పాఠకులతో పంచుకున్నారు. సందర్భానుసారంగా వాటిని పరిచయం చేశారు. గజల్ పార్సీ కవితా ప్రక్రియే తప్ప అరబ్బీ దానికి మూలం కాదంటారు సదాశివ. పార్సీ గజల్ గమనాన్ని తొలిసారిగా తెలుగులోకి అనువదించిన వారు గురజాడ అప్పారావు, కాళోజీ. ఉర్దూ గజల్ స్వరూపాన్ని, ఉర్దూ కవిత్వపు రుచిని చూపిన వారిలో ఆద్యులు దాశరథి. ఆ తదుపరి డాక్టర్ సి. నారాయణరెడ్డి వంటి వారు ఉర్దూ కవితా లతను తెలుగునాట ప్రవర్ధిల్లజేయడంలో విశేష కృషి చేశారు.
గజల్ తరువాత సదాశివ సందర్భానుసారంగా ‘యాది’లో ప్రస్తావించిన మరో ప్రక్రియ రుబాయీ. అది మన తేటగీతి పద్యం వంటి నాలుగు పంక్తుల కవిత. మూడు పంక్తులకు ఖఫియారదీపుల నియమముంటుంది. మూడవ పంక్తికి ఉండదు. అంటే 1, 2, 4 చరణాలకు అంత్య ప్రాస నియమం పాటించాలి. ఉమర్ ఖయ్యూం రాసిన రుబాయీలు జగత్ప్రసిద్ధమైనవి. మరోకవి హజ్రత్ అమ్జద్. ఈయన హైదరాబాద్ గర్వించదగిన రుబాయీలను రచించారు. అమ్జద్ రుబాయీలను సదాశివ తెలుగులోకి అనువదించడం వల్ల వాటి ప్రస్తావన యాదిలో కనబడుతుంది. సురవరం ప్రతాపరెడ్డి, వేలూరి శివరామశాస్త్రి, బెజవాడ గోపాలరెడ్డి వంటి ప్రముఖులు సదాశివ రుబాయీలను, పద్యానువాదాన్ని ప్రశంసించారు.
తెలుగు సాహిత్యంలో తెలంగాణ ప్రాంతం చాలా కాలంగా తీవ్ర నిరాదరణకు గురైంది. ఒకప్పుడు గ్రాంథిక భాష అని, మరొకప్పుడు శిష్ట వ్యావహారికమని ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా తెలంగాణ భాషాసంస్కృతులను చిన్నచూపు చూశారు. ఈ ప్రతికూల పరిస్థితులను తట్టుకొని, నిలచి తనదైన సొంత శైలిని ఏర్పరచుకున్న గొప్ప సాహిత్యవేత్త సదాశివ. జన వ్యవహారంలోని ఉర్దూ, హిందీ, మరాఠీ తదితర భాషల్లోని పదాలను తన రచనల్లో వాడి ఆదిలాబాద్ భాషకు ప్రత్యేక స్థానాన్ని కల్పించారు. తెలంగాణ సాహిత్యం నిరాదరణకు గురవుతోందని ఆయన ఆవేదన చెందేవారు. నన్నయకన్నా ముందు పాల్కురికి సోమనాథుని వంటి తెలంగాణ కవులున్నా, నన్నయనే ఆదికవిని చేశారు. తెలంగాణ చిన్నది, సీమాంధ్ర ప్రాంతం పెద్దది. చరిత్ర రచన, పత్రికలు వాళ్ల చేతుల్లోనే ఉన్నాయని సదాశివ ఆవేదన చెందేవారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో నేటికైనా తెలుగు సాహిత్య చరిత్రను నిష్పాక్షికంగా, రాగద్వేషాలకు అతీతంగా పునర్నిర్మించి, తెలుగు సాహిత్య సాంస్కృతిక రంగాలను సుసంపన్నవంతం చేయడంలో తెలంగాణ పాత్రను వెలుగులోకి తేవడమే సాదాశివకు అర్పించగల నిజమైన నివాళి.
కిషోర్ రాథోడ్