kjp
-
యడ్డి... భగవద్గీతలో శ్రీకృష్ణుడు !
మా మార్గ నిర్దేశకుడు : కేఎస్ ఈశ్వరప్ప ఆయన పెద్దరికానికి నిదర్శనం : యడ్యూరప్ప పరస్పరం పొగుడ్తలతో ముంచెత్తుకున్న నేతలు శివమొగ్గ, న్యూస్‌లైన్ : రాజకీయాల్లో శాశ్వత శుత్రువులు ఉండరు.. శాశ్వత మిత్రులు ఉండరనేది నానుడి. మాతృసంస్థ బీజేపీ నుంచి బయటకు వచ్చిన యడ్యూరప్ప కేజేపీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని చావుదెబ్బతీశారు. పార్టీ అనైక్యత వల్ల కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో కంగుతిన్న బీజేపీ నేతలు యడ్యూరప్ప పునరాగమానికి దారులు వెతికారు. మాతృసంస్థలో చేరడానికి ససేమిరా అన్న యడ్యూరప్ప తన రాజకీయ భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని బీజేపీలో చేరడానికి అంగీకరించారు. ఇదిలా ఉంటే ఒకే వేదికపై యడ్యూరప్ప, కేఎస్ ఈశ్వరప్ప తొలిసారిగా కలిసారు. ఒకరినొకరు పొగడ్తలతో ముంచెత్తుకున్నారు. ఆదివారం నగరంలోని శుభమంగళ సముదాయ భవనంలో కర్ణాటక భగవ ద్గీత అభియాన సమితి ఏర్పాటు చేసిన శ్రీమద్భగవద్గీతా సమర్పణ సమారంభం కార్యక్రమంలో కేఎస్.ఈశ్వరప్ప ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కురుక్షేత్రంలో అర్జునుడుకి శ్రీకృష్ణుడు మార్గదర్శనం చేసినట్లు మాజీ ముఖ్యమంత్రి బీఎస్.యడ్యూరప్ప తమకు మార్గదర్శనం చేయాలన్నారు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు మాదిరిగా యడ్యూరప్ప తమను ముందుండి యడ్డి... భగవద్గీతలో శ్రీకృష్ణుడు నడిపించాలన్నారు. యడ్యూరప్ప మళ్లీ బీజేపీలో చేరిన తరువాత మొదటిసారిగా తామిద్దరం కలిసి ఈ పవిత్రమైన కార్యక్రమంలో ఒక్కటిగా కూర్చోవడం సంతోషంగా ఉందన్నారు. యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రాభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని, ఆయన మళ్లీ బీజేపీలోకి రావడం స్వాగతించాల్సిన విషయమన్నారు. సమాజంలో స్త్రీలకు రక్షణ కరువైందని నైతిక విలువలు పతనం అయ్యాయని ఈ సందర్భంగా తామందరం భగవద్గీత సారాంశాన్ని తెలుసుకుని జీవితంలో ముందుకెళ్లాలని అభిప్రాయపడ్డారు. అన ంతరం యడ్యూరప్ప మాట్లాడుతూ... తనను శ్రీకృష్ణుడితో పోలుస్తూ కేఎస్.ఈశ్వరప్ప అనడం ఆయన పెద్దరికానికి నిదర్శనమన్నారు. బీజేపీలో మళ్లీ చేరిన తాను ఎలాంటి షరతులు పెట్టలేదని, సామాన్య కార్యకర్తగానే ఉంటానని స్పష్టం చేశారు. గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 19 స్థానాల్లో విజయం సాధించిందని గుర్తు చేశారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఈ స్థానాలను అధిగమిస్తామని యడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అత్యధిక స్ధానాల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి కృషి చేస్తానని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో శివమొగ్గ స్థానం నుంచి తాను పోటీ చేసే విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ప్రజాభిప్రాయం మేరకు తాను మళ్లీ బీజేపీలో చేరానని చెప్పారు. న రేంద్రమోడీ దేశ ప్రధానమంత్రి కావడం దేశ ప్రజల అభిప్రాయమని అన్నారు. బీజేపీలో తన మద్దతుదారులకు పదవులు కల్పించాలనే విషయంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ భవిష్యత్తులో అన్ని సర్దుకుంటాయని అన్నారు. -
కాంగ్రెస్ కలవరం
బీజేపీలో కేజేపీ విలీనంతో సంకటం.. = బీఎస్ఆర్ సీపీ కూడా విలీనమైతే ఇక గడ్డుకాలమే = బీజేపీలో చీలికల వల్లే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ = ప్రస్తుతం ‘విలీనం’తో అయోమయం = రాష్ర్ట ఓటర్లపై మోడీ ప్రభావం గణనీయం = కాంగ్రెస్‌లో రోజురోజుకీ పెరుగుతున్న అసంతృప్తి సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో బీజేపీ-కేజేపీ విలీన ప్రక్రియ పూర్తి కావస్తుండడంతో అధికార కాంగ్రెస్ కలవరానికి గురువుతోంది. బీజేపీ నుంచి వేరు కుంపటి పెట్టి, కేజేపీని స్థాపించిన యడ్యూరప్ప గత మేలో జరిగిన శాసన సభ ఎన్నికల్లో 30కి పైగా స్థానాల్లో ఓట్ల చీలిక ద్వారా పరోక్షంగా కాంగ్రెస్‌కు సహకరించారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకునే పార్టీ కనీసం 113 స్థానాల్లో గెలవాలి. కాంగ్రెస్ మరో తొమ్మిది స్థానాలను మాత్రమే అధికంగా సాధించగలిగింది. ఐదేళ్ల బీజేపీ పాలనపై వ్యతిరేకత, ఆ పార్టీ నాయకులపై వచ్చిన వరుస ఆరోపణలు... లాంటి ఎన్నో అనుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ కాంగ్రెస్ భారీ విజయాన్ని సాధించలేక పోయింది. దీనిని బట్టే ఆ పార్టీ పునాదులు పటిష్టంగా లేవనే విషయం స్పష్టమవుతోంది. కేజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో స్వయంగా ఆరు స్థానాలను గెలుచుకోగలిగింది. బీజేపీ నుంచి వేరు పడి బీఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన శ్రీరాములు తనతో పాటు మరో మూడు స్థానాల్లో తమ అభ్యర్థులను గెలిపించుకోలిగారు. మరో నాలుగైదు స్థానాల్లో బీఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్ల చీలిక వల్ల కాంగ్రెస్ అభ్యర్థులు లబ్ధి పొందారు. ఈ లెక్కన ఈ రెండు పార్టీల కారణంగా కాంగ్రెస్‌కు సుమారు 40 స్థానాల్లో ఆయాచిత విజయం లభించినట్లైంది. యడ్యూరప్పను తమ వైపు తిప్పుకోగలిన బీజేపీ ఇప్పుడు శ్రీరాములుపై దృష్టి సారించింది. వచ్చే వారంలో ఆయనను కూడా తమ వైపు తిప్పుకోగలమని బీజేపీ విశ్వాసంతో ఉంది. అటు సమైక్యత...ఇటు అనైక్యత ప్రతిపక్ష శిబిరం ఓ వైపు విలీనాల ద్వారా బలపడుతుంటే, కాంగ్రెస్ మాత్రం వివిధ కారణాల వల్ల బలహీనపడుతోంది. మొన్న జరిగిన మంత్రి వర్గ విస్తరణ ఆ పార్టీలో అసంతృప్తి జ్వాలలను రగిల్చింది. అనేక మంది సీనియర్లు పదవుల కోసం ఎదురు చూస్తున్న తరుణంలో కేవలం ఇద్దరికి మాత్రమే అవకాశం కల్పించడంపై పలువురు భగ్గుమన్నారు. పైగా వీరిద్దరిపై అనేక అవినీతి ఆరోపణలున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఏర్పాటు చేసిన మంత్రి వర్గంలో వీరిద్దరికి స్థానం కల్పించక పోవడానికి కారణం ఆ ఆరోపణలే. వాటి నుంచి విముక్తం కాక ముందే మంత్రి వర్గంలో అవకాశం కల్పించడంపై పార్టీలో అసంతృప్తికి దారి తీసింది. దీనికి తోడు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్ర ఓటర్లపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశాలున్నాయి. కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థిగా భావిస్తున్న రాహుల్ గాంధీ ఆయనకు సమ ఉజ్జీ కాలేక పోతున్నారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించిన పలు సంక్షేమ కార్యక్రమాలు కాంగ్రెస్‌కు అనుకూలాంశాలుగా పరిణమించే అవకాశాలున్నా, క్షేత్ర స్థాయిలో నాయకులు పార్టీ అభ్యర్థుల విజయానికి చిత్తశుద్ధితో కృషి చేస్తారా అనే అనుమానాలు చోటు చేసుకుంటున్నాయి. సిద్ధరామయ్య ఇతర పార్టీ నుంచి వచ్చిన వారు. ఆజన్మాంతం కాంగ్రెస్‌ను అట్టి పెట్టుకుని ఉన్న వారు ఆయన ముఖ్యమంత్రి కావడాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. -
కేజేపీని చీల్చేందుకు బీజేపీ కుట్ర
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో బీజేపీ నాయకులు తమ పార్టీని నిలువునా చీల్చే కుట్రకు పాల్పడుతున్నారని కేజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప ఆరోపించారు. తమ పార్టీ బీజేపీలో విలీనమై పోతుందంటూ ప్రచారం చేయడం ద్వారా కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ఇక్కడి పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీలో కేజేపీ విలీనం కాబోదని స్పష్టం చేశారు. పదే పదే తానిలా కుండబద్ధలు కొట్టినట్లు చెబుతున్నా, బీజేపీ నాయకులు విలీనం గురించి అదే పనిగా మాట్లాడుతూ తమ పార్టీ కార్యకర్తలను గందరగోళంలోకి నెడుతున్నారని విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ పది స్థానాల్లో పోటీ చేస్తుందని, ఎన్నికల అనంతరం ఎన్డీఏకు మద్దతునిస్తుందని తెలిపారు. ఎన్డీఏకు మద్దతునిస్తూ తాను ఇదివరకే అగ్రనేత ఎల్కే. అద్వానీకి రాసిన లేఖకు ఎలాంటి సమాధానం రాలేదన్నారు. వచ్చే నెల 17న నగరంలో జరిగే గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ బహిరంగ సభకు తనకెలాంటి ఆహ్వానం అందలేదని చెప్పారు. అందితే తదుపరి నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రభుత్వంపై పోరాటం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నియంతలా వ్యవహరిస్తున్నారని యడ్యూరప్ప ఆరోపించారు. పాలక, ప్రతిపక్షాలను ఆయన లెక్కలోకి తీసుకోవడం లేదని ధ్వజమెత్తారు. దారిద్య్ర రేఖకు ఎగువనున్న (ఏపీఎల్) వారికి బియ్యం, గోధుమలను పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం బెంగళూరులో సత్యాగ్రహం చేపట్టనున్నట్లు ప్రకటించారు. నిఖా భాగ్య యోజనను కేవలం ముస్లిం యువతులకే అమలు చేస్తే లాభం లేదన్నారు. దారిద్య్ర రేఖకు దిగువనున్న అన్ని వర్గాల యువతులకు అన్వయింపజేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం దీనిపై వెంటనే ఆదేశాలను జారీ చేయాలన్నారు. నిఖా భాగ్య యోజన కింద వస్తు సామగ్రి కాకుండా మొత్తం నగదు రూపంలోనే ఇవ్వాలని సూచించారు. కాగా జీ కేటగిరీ సైట్ల కేటాయింపులో అవకతవకలు జరిగాయంటూ కేవలం ముగ్గురు ముఖ్యమంత్రుల హయాంలోనే దర్యాప్తు జరిపించడం సరికాదన్నారు. -
బీజేపీలో కేజేపీ విలీనం!
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : బీజేపీ నుంచి వైదొలగి కేజేపీని స్థాపించిన మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప మాతృ సంస్థలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో నిస్సహాయత, అనుయాయులకు తనపై కలుగుతున్న అనుమానాల వల్ల ఇటీవల జరిగిన శాసన సభ ఎన్నికల్లో తాను మినహా, గెలిచిన మిగిలిన ఐదుగురు శాసన సభ్యులను నిలుపుకోవడం కూడా ఆయనకు కష్టంగా మారుతోంది. ఇప్పటికే బీజేపీకి దాదాపుగా చేరువైన యడ్యూరప్ప, ఇక తన పార్టీని బీజేపీలో విలీనం చేయడానికి తగు ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నారు. ఆయనను తిరిగి చేర్చుకోవడానికి బీజేపీ అధిష్టానం, ముఖ్యంగా అగ్రనేత అద్వానీ ఇన్నాళ్లూ విముఖత వ్యక్తం చేసినా.. ఇప్పుడు ఆయన ఆవశ్యకతను అందరూ గుర్తించారు. ముఖ్యంగా ఆయనకు కాంగ్రెస్ గాలం వేస్తుందేమోనని కమలనాథులు ఆందోళన చెందుతున్నారు. కనుక అంతకంటే ముందే తిరిగి పార్టీలోకి తీసుకు వచ్చే ప్రయత్నాలు దాదాపుగా ఓ కొలిక్కి వచ్చాయి. రెండు లోక్‌సభ స్థానాలకు, మూడు శాసన మండలి స్థానాలకు జరుగుతున్న ఉప ఎన్నికల్లో ఇప్పటికే బీజేపీ, కేజేపీల మధ్య సర్దుబాటు కుదిరింది. ఇరు పార్టీలూ లోక్‌సభ ఉప ఎన్నికల్లో పోటీ చేయనప్పటికీ, జేడీఎస్‌కు మద్దతునిస్తున్నాయి. శాసన మండలి ఉప ఎన్నికలకు సంబంధించి మైసూరు స్థానంలో కేజేపీకి బీజేపీ మద్దతునిస్తుండగా, ధార్వాడ, చిత్రదుర్గ స్థానాల్లో బీజేపీకి కేజేపీ మద్దతునిస్తోంది. ఈ మూడు చోట్లా జేడీఎస్ పోటీ చేయడం లేదు. కాంగ్రెస్ బూచి వచ్చే ఏడాది జరగాల్సిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గడ్డు పరిస్థితులు తప్పేట్లు లేవని సర్వేలు చెబుతుండడంతో ఆ పార్టీ కీలక మిత్రుల కోసం అన్వేషిస్తోంది. ఈ క్రమంలో అవినీతి పరుడని తానే ప్రచారం చేసినప్పటికీ, యడ్యూరప్పను తన గూటికి తీసుకు రావడానికి ఏమాత్రం వెనుకంజ వేయబోదని బీజేపీ అంచనా వేస్తోంది. కాంగ్రెస్‌కు అలాంటి అవకాశానికి తావివ్వకూడదనే ఉద్దేశంతో యడ్యూరప్పతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. త్వరలోనే విలీనానికి సంబంధించిన విధి విధానాలపై చర్చించడానికి ఉభయ పార్టీల సమావేశం జరుగనుంది. జేడీఎస్‌తో కూడా... కేజేపీని ఓ వైపు లాక్కోవడానికి ప్రయత్నిస్తూనే, జేడీఎస్‌కు కూడా దగ్గరవడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా మొన్నటి వరకు లోక్‌సభ ఉప ఎన్నికల్లో జేడీఎస్‌కు పరోక్షంగా మద్దతునివ్వాలని అనుకున్నప్పటికీ, ఆ పార్టీ తరఫున బహిరంగ ప్రచారం చేయకూడదని నిర్ణయించింది. అయితే హఠాత్తుగా ఇప్పుడు ఆ నిర్ణయాన్ని మార్చుకుంది. సీనియర్ నాయకులు కాకుండా ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు జేడీఎస్ తరఫున ప్రచారం చేయడానికి ఆమోదం తెలిపింది. కాంగ్రెస్‌ను ఓడించడమే కాకుండా రాష్ర్టంలో ఆ పార్టీ మరింతగా ఎదగకుండా చూడాలన్నది కమలనాథుల వ్యూహం. 16న పద్మావతి కళా నికేతన్ నృత్యోత్సవం సాక్షి, బెంగళూరు : శాస్త్రీయ సంగీత, నృత్యాలతో పాటు వాద్య సంగీతంలో గత 32 ఏళ్లుగా శిక్షణనిస్తున్న ఇక్కడి మత్తికెరె లేఔట్‌లోని శ్రీ పద్మావతి కళానికేతన్ ఈ నెల 16న 33వ నృత్యోత్సవాన్ని నిర్వహించనుంది. జేసీ రోడ్డులోని రవీంద్ర కళా క్షేత్రలో ఆ రోజు సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో ఏడు నుంచి 20 ఏళ్ల లోపు సుమారు 70 మంది కళాకారులు భరత నాట్యాన్ని ప్రదర్శిస్తారని సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి జీవీ. వేణుగోపాల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి దినేశ్ గుండూరావు ముఖ్య అతిథిగా పాల్గొంటారని చెప్పారు.