కేజేపీని చీల్చేందుకు బీజేపీ కుట్ర
Published Wed, Oct 30 2013 3:39 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో బీజేపీ నాయకులు తమ పార్టీని నిలువునా చీల్చే కుట్రకు పాల్పడుతున్నారని కేజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప ఆరోపించారు. తమ పార్టీ బీజేపీలో విలీనమై పోతుందంటూ ప్రచారం చేయడం ద్వారా కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ఇక్కడి పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీలో కేజేపీ విలీనం కాబోదని స్పష్టం చేశారు. పదే పదే తానిలా కుండబద్ధలు కొట్టినట్లు చెబుతున్నా, బీజేపీ నాయకులు విలీనం గురించి అదే పనిగా మాట్లాడుతూ తమ పార్టీ కార్యకర్తలను గందరగోళంలోకి నెడుతున్నారని విమర్శించారు.
లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ పది స్థానాల్లో పోటీ చేస్తుందని, ఎన్నికల అనంతరం ఎన్‌డీఏకు మద్దతునిస్తుందని తెలిపారు. ఎన్‌డీఏకు మద్దతునిస్తూ తాను ఇదివరకే అగ్రనేత ఎల్‌కే. అద్వానీకి రాసిన లేఖకు ఎలాంటి సమాధానం రాలేదన్నారు. వచ్చే నెల 17న నగరంలో జరిగే గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ బహిరంగ సభకు తనకెలాంటి ఆహ్వానం అందలేదని చెప్పారు. అందితే తదుపరి నిర్ణయం తీసుకుంటామన్నారు.
ప్రభుత్వంపై పోరాటం
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నియంతలా వ్యవహరిస్తున్నారని యడ్యూరప్ప ఆరోపించారు. పాలక, ప్రతిపక్షాలను ఆయన లెక్కలోకి తీసుకోవడం లేదని ధ్వజమెత్తారు. దారిద్య్ర రేఖకు ఎగువనున్న (ఏపీఎల్) వారికి బియ్యం, గోధుమలను పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం బెంగళూరులో సత్యాగ్రహం చేపట్టనున్నట్లు ప్రకటించారు. నిఖా భాగ్య యోజనను కేవలం ముస్లిం యువతులకే అమలు చేస్తే లాభం లేదన్నారు. దారిద్య్ర రేఖకు దిగువనున్న అన్ని వర్గాల యువతులకు అన్వయింపజేయాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం దీనిపై వెంటనే ఆదేశాలను జారీ చేయాలన్నారు. నిఖా భాగ్య యోజన కింద వస్తు సామగ్రి కాకుండా మొత్తం నగదు రూపంలోనే ఇవ్వాలని సూచించారు. కాగా జీ కేటగిరీ సైట్ల కేటాయింపులో అవకతవకలు జరిగాయంటూ కేవలం ముగ్గురు ముఖ్యమంత్రుల హయాంలోనే దర్యాప్తు జరిపించడం సరికాదన్నారు.
Advertisement