సాక్షి ప్రతినిధి, బెంగళూరు : బీజేపీ నుంచి వైదొలగి కేజేపీని స్థాపించిన మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప మాతృ సంస్థలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో నిస్సహాయత, అనుయాయులకు తనపై కలుగుతున్న అనుమానాల వల్ల ఇటీవల జరిగిన శాసన సభ ఎన్నికల్లో తాను మినహా, గెలిచిన మిగిలిన ఐదుగురు శాసన సభ్యులను నిలుపుకోవడం కూడా ఆయనకు కష్టంగా మారుతోంది. ఇప్పటికే బీజేపీకి దాదాపుగా చేరువైన యడ్యూరప్ప, ఇక తన పార్టీని బీజేపీలో విలీనం చేయడానికి తగు ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నారు. ఆయనను తిరిగి చేర్చుకోవడానికి బీజేపీ అధిష్టానం, ముఖ్యంగా అగ్రనేత అద్వానీ ఇన్నాళ్లూ విముఖత వ్యక్తం చేసినా.. ఇప్పుడు ఆయన ఆవశ్యకతను అందరూ గుర్తించారు.
ముఖ్యంగా ఆయనకు కాంగ్రెస్ గాలం వేస్తుందేమోనని కమలనాథులు ఆందోళన చెందుతున్నారు. కనుక అంతకంటే ముందే తిరిగి పార్టీలోకి తీసుకు వచ్చే ప్రయత్నాలు దాదాపుగా ఓ కొలిక్కి వచ్చాయి. రెండు లోక్‌సభ స్థానాలకు, మూడు శాసన మండలి స్థానాలకు జరుగుతున్న ఉప ఎన్నికల్లో ఇప్పటికే బీజేపీ, కేజేపీల మధ్య సర్దుబాటు కుదిరింది. ఇరు పార్టీలూ లోక్‌సభ ఉప ఎన్నికల్లో పోటీ చేయనప్పటికీ, జేడీఎస్‌కు మద్దతునిస్తున్నాయి. శాసన మండలి ఉప ఎన్నికలకు సంబంధించి మైసూరు స్థానంలో కేజేపీకి బీజేపీ మద్దతునిస్తుండగా, ధార్వాడ, చిత్రదుర్గ స్థానాల్లో బీజేపీకి కేజేపీ మద్దతునిస్తోంది. ఈ మూడు చోట్లా జేడీఎస్ పోటీ చేయడం లేదు.
కాంగ్రెస్ బూచి
వచ్చే ఏడాది జరగాల్సిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గడ్డు పరిస్థితులు తప్పేట్లు లేవని సర్వేలు చెబుతుండడంతో ఆ పార్టీ కీలక మిత్రుల కోసం అన్వేషిస్తోంది. ఈ క్రమంలో అవినీతి పరుడని తానే ప్రచారం చేసినప్పటికీ, యడ్యూరప్పను తన గూటికి తీసుకు రావడానికి ఏమాత్రం వెనుకంజ వేయబోదని బీజేపీ అంచనా వేస్తోంది. కాంగ్రెస్‌కు అలాంటి అవకాశానికి తావివ్వకూడదనే ఉద్దేశంతో యడ్యూరప్పతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. త్వరలోనే విలీనానికి సంబంధించిన విధి విధానాలపై చర్చించడానికి ఉభయ పార్టీల సమావేశం జరుగనుంది.
జేడీఎస్‌తో కూడా...
కేజేపీని ఓ వైపు లాక్కోవడానికి ప్రయత్నిస్తూనే, జేడీఎస్‌కు కూడా దగ్గరవడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా మొన్నటి వరకు లోక్‌సభ ఉప ఎన్నికల్లో జేడీఎస్‌కు పరోక్షంగా మద్దతునివ్వాలని అనుకున్నప్పటికీ, ఆ పార్టీ తరఫున బహిరంగ ప్రచారం చేయకూడదని నిర్ణయించింది. అయితే హఠాత్తుగా ఇప్పుడు ఆ నిర్ణయాన్ని మార్చుకుంది. సీనియర్ నాయకులు కాకుండా ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు జేడీఎస్ తరఫున ప్రచారం చేయడానికి ఆమోదం తెలిపింది. కాంగ్రెస్‌ను ఓడించడమే కాకుండా రాష్ర్టంలో ఆ పార్టీ మరింతగా ఎదగకుండా చూడాలన్నది కమలనాథుల వ్యూహం.
16న పద్మావతి కళా నికేతన్ నృత్యోత్సవం
సాక్షి, బెంగళూరు : శాస్త్రీయ సంగీత, నృత్యాలతో పాటు వాద్య సంగీతంలో గత 32 ఏళ్లుగా శిక్షణనిస్తున్న ఇక్కడి మత్తికెరె లేఔట్‌లోని శ్రీ పద్మావతి కళానికేతన్ ఈ నెల 16న 33వ నృత్యోత్సవాన్ని నిర్వహించనుంది. జేసీ రోడ్డులోని రవీంద్ర కళా క్షేత్రలో ఆ రోజు సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో ఏడు నుంచి 20 ఏళ్ల లోపు సుమారు 70 మంది కళాకారులు భరత నాట్యాన్ని ప్రదర్శిస్తారని సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి జీవీ. వేణుగోపాల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి దినేశ్ గుండూరావు ముఖ్య అతిథిగా పాల్గొంటారని చెప్పారు.
బీజేపీలో కేజేపీ విలీనం!
Published Wed, Aug 14 2013 3:57 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
Advertisement
Advertisement