బీజేపీలో కేజేపీ విలీనంతో సంకటం..
= బీఎస్‌ఆర్ సీపీ కూడా విలీనమైతే ఇక గడ్డుకాలమే
= బీజేపీలో చీలికల వల్లే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్
= ప్రస్తుతం ‘విలీనం’తో అయోమయం
= రాష్ర్ట ఓటర్లపై మోడీ ప్రభావం గణనీయం
= కాంగ్రెస్‌లో రోజురోజుకీ పెరుగుతున్న అసంతృప్తి
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో బీజేపీ-కేజేపీ విలీన ప్రక్రియ పూర్తి కావస్తుండడంతో అధికార కాంగ్రెస్ కలవరానికి గురువుతోంది. బీజేపీ నుంచి వేరు కుంపటి పెట్టి, కేజేపీని స్థాపించిన యడ్యూరప్ప గత మేలో జరిగిన శాసన సభ ఎన్నికల్లో 30కి పైగా స్థానాల్లో ఓట్ల చీలిక ద్వారా పరోక్షంగా కాంగ్రెస్‌కు సహకరించారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకునే పార్టీ కనీసం 113 స్థానాల్లో గెలవాలి. కాంగ్రెస్ మరో తొమ్మిది స్థానాలను మాత్రమే అధికంగా సాధించగలిగింది.
ఐదేళ్ల బీజేపీ పాలనపై వ్యతిరేకత, ఆ పార్టీ నాయకులపై వచ్చిన వరుస ఆరోపణలు... లాంటి ఎన్నో అనుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ కాంగ్రెస్ భారీ విజయాన్ని సాధించలేక పోయింది. దీనిని బట్టే ఆ పార్టీ పునాదులు పటిష్టంగా లేవనే విషయం స్పష్టమవుతోంది. కేజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో స్వయంగా ఆరు స్థానాలను గెలుచుకోగలిగింది. బీజేపీ నుంచి వేరు పడి బీఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన శ్రీరాములు తనతో పాటు మరో మూడు స్థానాల్లో తమ అభ్యర్థులను గెలిపించుకోలిగారు. మరో నాలుగైదు స్థానాల్లో బీఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్ల చీలిక వల్ల కాంగ్రెస్ అభ్యర్థులు లబ్ధి పొందారు. ఈ లెక్కన ఈ రెండు పార్టీల కారణంగా కాంగ్రెస్‌కు సుమారు 40 స్థానాల్లో ఆయాచిత విజయం లభించినట్లైంది. యడ్యూరప్పను తమ వైపు తిప్పుకోగలిన బీజేపీ ఇప్పుడు శ్రీరాములుపై దృష్టి సారించింది. వచ్చే వారంలో ఆయనను కూడా తమ వైపు తిప్పుకోగలమని బీజేపీ విశ్వాసంతో ఉంది.
అటు సమైక్యత...ఇటు అనైక్యత
ప్రతిపక్ష శిబిరం ఓ వైపు విలీనాల ద్వారా బలపడుతుంటే, కాంగ్రెస్ మాత్రం వివిధ కారణాల వల్ల బలహీనపడుతోంది. మొన్న జరిగిన మంత్రి వర్గ విస్తరణ ఆ పార్టీలో అసంతృప్తి జ్వాలలను రగిల్చింది. అనేక మంది సీనియర్లు పదవుల కోసం ఎదురు చూస్తున్న తరుణంలో కేవలం ఇద్దరికి మాత్రమే అవకాశం కల్పించడంపై పలువురు భగ్గుమన్నారు. పైగా వీరిద్దరిపై అనేక అవినీతి ఆరోపణలున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఏర్పాటు చేసిన మంత్రి వర్గంలో వీరిద్దరికి స్థానం కల్పించక పోవడానికి కారణం ఆ ఆరోపణలే. వాటి నుంచి విముక్తం కాక ముందే మంత్రి వర్గంలో అవకాశం కల్పించడంపై పార్టీలో అసంతృప్తికి దారి తీసింది. దీనికి తోడు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్ర ఓటర్లపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశాలున్నాయి.
కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థిగా భావిస్తున్న రాహుల్ గాంధీ ఆయనకు సమ ఉజ్జీ కాలేక పోతున్నారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించిన పలు సంక్షేమ కార్యక్రమాలు కాంగ్రెస్‌కు అనుకూలాంశాలుగా పరిణమించే అవకాశాలున్నా, క్షేత్ర స్థాయిలో నాయకులు పార్టీ అభ్యర్థుల విజయానికి చిత్తశుద్ధితో కృషి చేస్తారా అనే అనుమానాలు చోటు చేసుకుంటున్నాయి. సిద్ధరామయ్య ఇతర పార్టీ నుంచి వచ్చిన వారు. ఆజన్మాంతం కాంగ్రెస్‌ను అట్టి పెట్టుకుని ఉన్న వారు ఆయన ముఖ్యమంత్రి కావడాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు.
కాంగ్రెస్ కలవరం
Published Sun, Jan 5 2014 2:43 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
Advertisement
Advertisement