నెరవేరబోతున్న మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కల..
సాక్షి, సత్యసాయి జిల్లా: మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కల నెరవేరబోతోంది. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్సార్ జిల్లా ముద్దనూరు నుంచి శ్రీసత్యసాయి జిల్లా కదిరి మీదుగా కొడికొండ చెక్ పోస్టు వరకు నాలుగు లేన్ల రహదారి (ఫోర్‌లేన్)కు శ్రీకారం చుట్టారు. టెండర్ల దశకు రాగానే ఆయన మరణించారు. దీంతో ఇది మరుగున పడింది. తాజాగా ముద్దనూరు నుంచి తొండూరు, పులివెందుల, శ్రీసత్యసాయి జిల్లా కదిరి, ఓడీ చెరువు, గోరంట్ల మీదుగా కొడికొండ చెక్ పోస్టు వరకు ఇప్పుడున్న రహదారిని ఫోర్‌లేన్‌గా విస్తరింపజేసేందుకు వైఎస్సార్ తనయుడు, ప్రస్తుత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టారు.
ఇందుకు రహదారి రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఈ మధ్యే ఆమోదం కూడా తెలిపింది. భూ సేకరణ పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు అందాయి. దాదాపు 160 కి.మీ ఉన్న ఈ ఫోర్‌లేన్ పనులు రూ.2 వేల కోట్లతో మొదటి దశలో రెండు ప్యాకేజీల ద్వారా మొదలెడతారు. దీనికి స్టాండింగ్ ఫైనాన్స్ కమిటీ (ఎస్ఎఫ్సీ) కూడా ఆమోద ముద్ర వేసింది.
రెండో దశలో గోరంట్ల నుంచి హిందూపురం వరకు..
గోరంట్ల నుంచి హిందూపురం వరకు నాలుగు లేన్ల రహదారిగా విస్తరింపజేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ రహదారిని ఇప్పటికే జాతీయ రహదారి(716జీ)గా గుర్తించిన విషయం తెలిసిందే. ఈ ఫోర్‌లేన్ పనులు రెండో దశలో చేపట్టనున్నారు. ఇందుకోసం రూ.700 కోట్లు ఖర్చు కావచ్చని ప్రభుత్వం అంచనాకు వచ్చింది.
చదవండి: అంతర్జాతీయ బ్రాండ్ కానున్న అనంతపురం
ముదిగుబ్బ నుంచి పుట్టపర్తి వరకు సైతం..
ధర్మవరం నియోజకవర్గంలోని ముదిగుబ్బ నుంచి పుట్టపర్తి వరకు డబుల్‌లేన్‌గా విస్తరించనున్నారు. 32 కి.మీ మేర ఉన్న ఈ జాతీయ రహదారి– 342ని రూ.401 కోట్లతో రెండు వరుసలుగా విస్తరించేందుకు రహదారి రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. రాయచోటి నుంచి కదిరి వరకు డబుల్ లేన్.. అన్నమయ్య జిల్లా రాయచోటి నుంచి శ్రీసత్యసాయి జిల్లా కదిరి వరకు 70 కి.మీ మేర ఉన్న రహదారిని డబుల్‌లైన్‌గా మార్పు చేసేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. ఇందుకు టెండర్ల దశ కూడా పూర్తయింది. త్వరలోనే పనులు మొదలెట్టనున్నారు. దీన్ని కూడా జాతీయ రహదారిగా గుర్తించాలని ఇటీవల రాజంపేట ఎంపీ మిధున్‌రెడ్డి కేంద్రప్రభుత్వాన్ని కోరారు.
ప్రయాణం సులభతరం
వైఎస్ రాజశేఖరరెడ్డి ఉండి ఉంటే ఈపాటికి ముద్దనూరు – కొడికొండ రహదారి ఫోర్‌లేన్‌గా ఎప్పుడో మారేది. ఆయన తర్వాత ముగ్గురు ముఖ్యమంత్రులు మారారు. కానీ రోడ్డుకు మోక్షం కలగలేదు. ఇన్నేళ్లకు వైఎస్ తనయుడు జగన్ తన తండ్రి కలను సాకారం చేస్తున్నారు. ఈ పనులు పూర్తయితే బెంగళూరుకు ప్రయాణం మరింత సులభతరం అవుతుంది.
– నాదిండ్ల రవి రాయల్, కదిరి
రూపురేఖలు మారతాయి
2014లో చంద్రబాబు సీఎం అయ్యాక కదిరికి రింగ్ రోడ్ అన్నాడు. తర్వాత ఆ ఊసే లేదు. ఆయన హయాంలో చెప్పుకోవడానికి ఒక్క పథకమూ లేదు. ఒక్క అభివృద్ది పనీ లేదు. ముద్దనూరు – కొడికొండ నాలుగు లేన్ల రహదారి కోసం భూసేకరణ యుద్ధ ప్రాతిపదికన పూర్తవుతుంది. పనులు కూడా వెంటనే మొదలవుతాయి. నూతనంగా ఏర్పడిన శ్రీసత్యసాయి జిల్లాలో అనతి కాలంలోనే రహదారుల రూపురేఖలు మారిపోతాయి.
– డాక్టర్ పీవీ సిద్దారెడ్డి, ఎమ్మెల్యే, కదిరి