ఒకే గడ్డ నుంచి ఒకే జట్టుగా..
-ఖోడినార్ నుంచి ‘సాయి’ జట్టుకి ఎంపికైన ఏడుగురు యువతులు
-వాలీబాల్‌లో జాతీయ, అంతర్జాతీయస్థాయిలో రాణింపు
అమలాపురం / ఉప్పలగుప్తం (అమలాపురం) : ఇప్పుడంతా చదువుల యుగం. చదువులు దెబ్బ తింటాయని పాఠశాల, కళాశాల స్థాయిలో బాలురనే ఆడించడం లేదు. కానీ ఆ గ్రామం అందుకు భిన్నం. ఆటలు ఆడితేనే బంగారు భవిష్యత్ ఉంటుందని నమ్మిన గ్రామస్తులు బాలురనే కాదు.. బాలికలను కూడా ఆటల్లో ప్రోత్సహిస్తున్నారు. అందుకే ఆ గ్రామానికి చెందిన ఒకరో ఇద్దరో కాదు.. ఏకంగా ఏడుగురు జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికయ్యారు. ఆ గ్రామమే గుజరాత్ రాష్ట్రంలోని సోమనా«ద్ జిల్లాలోని ఖోడినార్. ఈ గ్రామానికి చెందిన ఏడుగురు క్రీడాకారిణులు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయి)కి ఎంపికై గొల్లవిల్లిలో జరుగుతున్న జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనేందుకు వచ్చారు. ఒకే గ్రామం నుంచి ఏడుగురు ఒక జట్టుకు ఎంపిక కావడం, రాణించడం అరుదైన విషయం. కోచ్ వర్ధన్వాలా శిక్షణలో తామంతా వాలీబాల్‌లో రాణిస్తున్నామంటున్న వీరంతా ఇంటర్నేషనల్, నేషనల్ పోటీల్లో అవార్డులు అందుకుంటూ సత్తా చాటుతున్నారు.
అంతర్జాతీయ పోటీల్లో ఆడా..
విద్యతో పాటు వాలీబాల్‌పై మక్కువ పెంచుకుని తర్ఫీదు పొందాను. రెండు పర్యాయాలు థాయ్‌లాండ్‌లో జరిగన ఇంటర్నేషనల్ పోటీల్లో పాల్గొన్నాను. ఆర్ట్ స్టూడెంట్‌గా ఉన్నతవిద్యభ్యసించి స్థిరపడాలని, అంతర్జాతీయ క్రీడాకారిణిగా గుర్తింపు తెచ్చుకోవాలని ఉంది. నా స్నేహితులు క్రీడాకారులు కావడంఅదృష్టం.
– చేతన్
గుర్తింపుకోసం ప్రయత్నిస్తున్నా..
నేషనల్ సబ్ జూనియర్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించి, ఇంటర్నేషనల్ ప్లేయర్‌గా గుర్తింపుకోసం ప్రయత్నిస్తున్నా. ఖోడినార్ ప్రాంతం నుంచి నాతో పాటు ఏడుగురం వాలీబాల్లోనే రాణిస్తున్నాం. కోచ్ సూచనలు, సలహాలతో నిరంతర సాధన చేస్తున్నాం. అటు చదువు, ఇటు క్రీడ రెండింటిలో గుర్తింపు తెచ్చుకోవాలని టీం వర్క్ చేస్తున్నాం.
– అస్మిత