Kohli Team
-
ఇంగ్లండ్‌కు దారులన్నీ మూసుకుపోయినట్లే!
వేదిక అదే... పిచ్‌లు మాత్రం మారాయి... ఇప్పుడు సరిగ్గా వారం రోజుల వ్యవధిలో మైదానంలో సీన్ కూడా మారిపోయింది. తొలి టెస్టులో రెండు రోజులు ముగిసినా ఇంకా బ్యాటింగ్ చేస్తూ మనల్ని ఆడుకున్న ఇంగ్లండ్ ఇప్పుడు రెండో టెస్టులో రెండు రోజులు ముగిసేసరికి ఓటమి గురించి ఆలోచించాల్సిన పరిస్థితి! భారత్‌లో అసలైన స్పిన్ పిచ్ ఎలా ఉంటుందో చూపిస్తూ మన బౌలర్లు చెలరేగిపోవడంతో రూట్ సేన కుప్పకూలింది. గింగిరాలు తిరుగుతూ వస్తున్న బంతుల్లో వేటిని ఆడాలో, వేటిని వదిలేయాలో అర్థం కాని సందిగ్ధ స్థితిలో వరుసగా వికెట్లు సమర్పించుకుంది. సొంత మైదానంలో అశ్విన్ ఐదు వికెట్లతో సత్తా చాటగా... అక్షర్ పటేల్, ఇషాంత్ శర్మ చెరో రెండు వికెట్లతో తమ వంతు పాత్ర పోషించారు. ఇప్పటికే భారత్ ఆధిక్యం 249 పరుగులకు చేరగా... చేతిలో తొమ్మిది వికెట్లతో సోమవారం టీమిండియా మరిన్ని పరుగులు సాధిస్తే ఇంగ్లండ్‌కు ఓటమి నుంచి తప్పించుకునే దారులన్నీ మూసుకుపోయినట్లే! చెన్నై: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ను 1–1తో సమం చేసే దిశగా భారత్ మరింత పట్టు బిగించింది. మ్యాచ్ రెండో రోజు ఆదివారం కోహ్లి సేన బౌలింగ్‌కు తలవంచిన ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 59.5 ఓవర్లలో 134 పరుగులకే ఆలౌటైంది. వికెట్ కీపర్ బెన్ ఫోక్స్ (107 బంతుల్లో 42 నాటౌట్; 4 ఫోర్లు) ఒక్కడే కొంత పోరాడాడు. అశ్విన్ (5/43) ప్రత్యర్థిని దెబ్బ కొట్టాడు. ఫలితంగా భారత్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 195 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. అనంతరం టీమిండియా తమ రెండో ఇన్నింగ్స్‌లో ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 54 పరుగులు చేసింది. శుబ్‌మన్ గిల్ (14) పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ (25 బ్యాటింగ్), పుజారా (7 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 300/6తో ఆట కొనసాగించిన భారత్ 329 పరుగులకు ఆలౌటైంది. రిషభ్ పంత్ (77 బంతుల్లో 58 నాటౌట్; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధసెంచరీతో సత్తా చాటాడు. మొత్తంగా రెండో రోజు ఆటలో 15 వికెట్లు నేలకూలాయి. 7.5 ఓవర్లు...29 పరుగులు... రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన భారత జట్టు మరో 7.5 ఓవర్లు ఆడి చివరి నాలుగు వికెట్లు కోల్పోయింది. మొత్తం 29 పరుగులు రాగా, పంత్ ఒక్కడే 25 పరుగులు సాధించాడు. ఒకదశలో ఆరు బంతుల వ్యవధిలో ఒక భారీ సిక్స్, రెండు ఫోర్లు బాదిన పంత్ 65 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే మరో ఎండ్‌లో బ్యాట్స్‌మెన్ విఫలం కావడంతో జట్టు ఇన్నింగ్స్ తొందరగానే ముగిసింది. అలీ వేసిన ఒకే ఓవర్లో అక్షర్ (5), ఇషాంత్ (0) అవుట్ కాగా... స్టోన్ వేసిన మరో ఓవర్లో కుల్దీప్ (0), సిరాజ్ (4) పెవిలియన్ చేరారు. 2008 (అహ్మదాబాద్‌లో దక్షిణాఫ్రికాపై) తర్వాత భారత జట్టులో నలుగురు బ్యాట్స్‌మెన్ డకౌట్ కావడం ఇదే తొలిసారి. రూట్ విఫలం... పిచ్ కొంత వరకు ఇబ్బందిగా ఉన్న మాట వాస్తవమే అయినా... ఇంగ్లండ్ వికెట్లు కోల్పోయిన బంతులు మాత్రం అంత ప్రమాదకరంగా కనిపించలేదు. పిచ్ పరిస్థితిని చూసి తొలి బంతి నుంచి ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ ఒత్తిడిలో, ఒక రకమైన సందేహంలో ఆడటంతో జట్టు ఇన్నింగ్స్ కుప్పకూలింది. ఇన్నింగ్స్ మూడో బంతికే రోరీ బర్న్స్ (0)ను అవుట్ చేసి ఇషాంత్ భారత్‌కు శుభారంభం అందించాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే సిబ్లీ (16)ని అవుట్ చేసి అశ్విన్ తన వేట మొదలు పెట్టాడు. ఆ వెంటనే ఇంగ్లండ్‌కు అసలు దెబ్బ పడింది. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న, జట్టు రాతను మార్చగలిగే అవకాశం ఉన్న కెప్టెన్ జో రూట్ (6) పెవిలియన్ చేరాడు. అక్షర్ రెండో ఓవర్లోనే తన ఫేవరెట్ స్వీప్ షాట్‌కు ప్రయత్నించిన రూట్ సరిగ్గా ఆడలేకపోవడంతో బంతి ఎడ్జ్ తీసుకొని షార్ట్ ఫైన్ లెగ్‌లో ఉన్న అశ్విన్ చేతుల్లోకి వెళ్లింది. లారెన్స్ (9) కూడా విఫలం కావడంతో లంచ్ సమయానికి ఇంగ్లండ్ 4 వికెట్లు కోల్పోయింది. విరామం తర్వాత అశ్విన్ చక్కటి బంతికి స్టోక్స్ (18) బౌల్డ్ కాగా, మ్యాచ్‌లో తాను వేసిన తొలి బంతికే ఒలీ పోప్ (22)ను సిరాజ్ అవుట్ చేశాడు. మరో వైపు వికెట్ కీపర్ ఫోక్స్ మాత్రమే కొంత పట్టుదల కనబర్చాడు. భారత బౌలర్లను అతను సమర్థంగా ఎదుర్కొంటూ కొన్ని పరుగులు రాబట్టగలిగాడు. అయితే మరో ఎండ్‌లో మొయిన్ అలీ (6), స్టోన్ (1), లీచ్ (5) ఎక్కువ సేపు నిలబడలేకపోయారు. బ్రాడ్ (0)ను బౌల్డ్ చేసిన అశ్విన్ తన ఖాతాలో ఐదో వికెట్ వేసుకోవడంతో పాటు ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను ముగించాడు. రోహిత్ అదృష్టం... రెండో ఇన్నింగ్స్‌లో రోహిత్, గిల్ కలిసి చకచకా పరుగులు జోడించారు. స్టోన్ ఓవర్లో రోహిత్ సిక్స్ బాదగా, అలీ బౌలింగ్‌లో గిల్ మరో సిక్స్ కొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఒక్క పొరపాటు కూడా చేయని ఇంగ్లండ్ కీపర్ ఫోక్స్ చేసిన చిన్న తప్పుతో రోహిత్‌కు కాస్త అదృష్టం కలిసొచ్చింది. రోహిత్ 20 పరుగుల వద్ద ఉన్నప్పుడు అలీ బౌలింగ్‌లో ముందుకొచ్చి షాట్ ఆడేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. అయితే బంతిని సరైన సమయంలో ఫోక్స్ అందుకోలేకపోవడంతో స్టంపింగ్ అవకాశం చేజారింది. అనంతరం లీచ్ బౌలింగ్‌లో గిల్ వికెట్ల ముందు దొరికిపోయాడు. అతను రివ్యూ చేసినా లాభం లేకపోయింది. అనంతరం రోహిత్, పుజారా కలిసి జాగ్రత్తగా ఆడుతూ రెండో రోజు ఆటను ముగించారు. ఈ క్రమంలో రోహిత్ 22 పరుగుల వద్ద ఉన్నప్పుడు కూడా లీచ్ బౌలింగ్‌లో రివర్స్ స్వీప్ చేయడానికి ప్రయత్నించినప్పుడు అంపైర్ ఎల్బీడబ్ల్యూగా ప్రకటించాడు. దీనిపై రోహిత్ రివ్యూ కోరాడు. రీప్లేలో బంతి బ్యాట్‌ను తాకినట్లుగా తేలడంతో అంపైర్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. ‘మళ్లీ అంపైరింగ్ వివాదం’ మ్యాచ్ రెండో రోజు కూడా అంపైర్లు తీసుకున్న నిర్ణయం తీవ్ర చర్చకు దారి తీసింది. రోహిత్ 21 పరుగుల వద్ద ఉన్నప్పుడు అలీ వేసిన బంతి అతని ముందు ప్యాడ్‌ను తాకి కవర్స్ దిశగా వెళ్లింది. ఆ సమయంలో రోహిత్ షాట్ ఆడేందుకు ప్రయత్నించలేదు (నాట్ ఆఫర్డ్ షాట్). అతని బ్యాట్ కూడా ప్యాడ్ల వెనకే ఉంది. ఇంగ్లండ్ ఎల్బీ కోసం అప్పీల్ చేయగా అంపైర్ వీరేందర్ శర్మ స్పందించలేదు. రోహిత్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు కాబట్టి నాటౌట్ అంటూ అతను చెప్పాడు. దాంతో రూట్ రివ్యూ కోరాడు. వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నా కూడా... ఆశ్చర్యకరంగా రీప్లేలో కూడా మూడో అంపైర్ అనిల్ శర్మ ‘రోహిత్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు’ అంటూ ఫీల్డ్ అంపైర్‌తో ఏకీభవిస్తూ అతని నిర్ణయమే సరైందిగా తేల్చాడు. రీప్లేలో బంతి ప్రభావం ఆఫ్ స్టంప్ బయట ఉన్నట్లుగా చూపినా... బాల్ ట్రాకర్ మాత్రం బంతి స్టంప్స్‌ను తాకేదని చూపించింది. షాట్ ఆడనప్పుడు ప్రభావం ఎక్కడ ఉన్నా అవుటయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని భావించడం సహజం. దీని ప్రకారం రోహిత్ అవుట్ అని బలంగా నమ్మిన ఇంగ్లండ్ చివరకు నిరాశ చెందాల్సి వచ్చింది. నువు విజిలేస్తే.. చాలా రోజుల తర్వాత ప్రేక్షకులను మైదానంలో చూసిన భారత కెప్టెన్ కోహ్లికి కూడా జోష్ వచ్చినట్లుంది. పైగా అప్పటికే ఇంగ్లండ్ టీమ్ సగం వికెట్లు కోల్పోయి టీమిండియా ఉత్సాహాన్ని మరింత పెంచింది. దాంతో విరాట్ ప్రేక్షకులను మరింత ఉత్సాహపరిచాడు. తాను ఈల కొడుతూ వారిని కూడా అలాగే విజిల్ వేయమంటూ సైగలు చేయడం విశేషం. ► భారత గడ్డపై అశ్విన్ వికెట్ల సంఖ్య 268 . హర్భజన్ సింగ్ (265)ను అతను అధిగమించగా, అనిల్ కుంబ్లే (350) అగ్రస్థానంలో ఉన్నాడు. ► ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టడం అశ్విన్‌కు ఇది 29వసారి. ఇందులో 23 ప్రదర్శనలు భారత్‌లోనే వచ్చాయి. ► అశ్విన్ అవుట్ చేసిన ఎడంచేతి వాటం బ్యాట్స్‌మెన్ సంఖ్య. అతను తీసిన వికెట్లలో 51.2 శాతం లెఫ్ట్ హ్యాండర్లు ఉండటం విశేషం. ► భారత్ తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ ఒక్క అదనపు పరుగు కూడా ఇవ్వలేదు. ఎక్స్‌ట్రాలు లేకుండా ఒక జట్టు చేసిన అత్యధిక స్కోరు (329) ఇదే కావడం విశేషం. ► ఆలౌట్ అయిన సందర్భంలో భారత్‌లో ఇంగ్లండ్ జట్టుకు ఇది రెండో అత్యల్ప స్కోరు. 1981లో ఆ జట్టు 102 పరుగులు చేసింది. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: రోహిత్ (సి) అలీ (బి) లీచ్ 161; గిల్ (ఎల్బీ) (బి) స్టోన్ 0; పుజారా (సి) స్టోక్స్ (బి) లీచ్ 21; కోహ్లి (బి) అలీ 0; రహానే (బి) అలీ 67; పంత్ (నాటౌట్) 58; అశ్విన్ (సి) పోప్ (బి) రూట్ 13; అక్షర్ (స్టంప్డ్) ఫోక్స్ (బి) అలీ 5; ఇషాంత్ (సి) బర్న్స్ (బి) అలీ 0; కుల్దీప్ (సి) ఫోక్స్ (బి) స్టోన్ 0; సిరాజ్ (సి) ఫోక్స్ (బి) స్టోన్ 4; ఎక్స్‌ట్రాలు 0, మొత్తం (95.5 ఓవర్లలో ఆలౌట్) 329. వికెట్ల పతనం: 1–0, 2–85, 3–86, 4–248, 5–249, 6–284, 7–301, 8–301, 9–325, 10–329. బౌలింగ్: బ్రాడ్ 11–2–37–0, స్టోన్ 15.5–5–47–3, లీచ్ 27–3–78–2, స్టోక్స్ 2–0–16–0, మొయిన్ అలీ 29–3–128–4, రూట్ 11–3–23–1. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: బర్న్స్ (ఎల్బీ) (బి) ఇషాంత్ 0; సిబ్లీ (సి) కోహ్లి (బి) అశ్విన్ 16; లారెన్స్ (సి) గిల్ (బి) అశ్విన్ 9; రూట్ (సి) అశ్విన్ (బి) అక్షర్ పటేల్ 6; బెన్ స్టోక్స్ (బి) అశ్విన్ 18; పోప్ (సి) పంత్ (బి) సిరాజ్ 22; ఫోక్స్ (నాటౌట్) 42; మొయిన్ అలీ (సి) రహానే (బి) అక్షర్ పటేల్ 6; స్టోన్ (సి) రోహిత్ శర్మ (బి) అశ్విన్ 1; లీచ్ (సి) రిషభ్ పంత్ (బి) ఇషాంత్ 5; స్టువర్ట్ బ్రాడ్ (బి) అశ్విన్ 0; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (59.5 ఓవర్లలో ఆలౌట్) 134. వికెట్ల పతనం: 1–0, 2–16, 3–23, 4–39, 5–52, 6–87, 7–105, 8–106, 9–131, 10–134. బౌలింగ్: ఇషాంత్ శర్మ 5–1–22–2, అశ్విన్ 23.5–4–43–5, అక్షర్ పటేల్ 20–3–40–2, కుల్దీప్ యాదవ్ 6–1–16–0, సిరాజ్ 5–4–5–1. భారత్ రెండో ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (బ్యాటింగ్) 25; శుబ్‌మన్ గిల్ (ఎల్బీ) (బి) లీచ్ 14; చతేశ్వర్ పుజారా (బ్యాటింగ్) 7; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (18 ఓవర్లలో వికెట్ నష్టానికి) 54. వికెట్ల పతనం: 1– 42. బౌలింగ్: స్టోన్ 2–0–8–0, లీచ్ 9–2–19–1, మొయిన్ అలీ 7–2–19–0. -
ఇది గెలిస్తే చాలు...
కోహ్లి సేన ఆసీస్ గడ్డపై మొదట కంగారు పడింది. తర్వాత సిరీస్ (వన్డే) కోల్పోయింది. భారీ స్కోర్లను సమర్పించుకుంది. క్యాచ్‌ల్ని జారవిడిచింది. కానీ ఆత్మవిశ్వాసాన్ని మాత్రం అట్టిపెట్టుకుంది. అందుకే చివరి వన్డేలో ఆస్ట్రేలియా జోరుకు బ్రేక్ వేసింది. తొలి టి20లో ఆల్‌రౌండ్ పంజా విసిరింది. ఇప్పుడు సిరీస్‌నే పట్టాలనే పట్టుదలతో భారత్ బరిలోకి దిగుతోంది. సిడ్నీ: ఆస్ట్రేలియాలో ఇప్పటివరకు పరిమిత ఓవర్ల మ్యాచ్‌లు నాలుగు జరిగాయి. తొలి రెండు వన్డేలు ఆసీస్ గెలిచింది. సిరీస్‌ను పట్టేసింది. తర్వాత భారత్ కూడా రెండు నెగ్గింది. ఆఖరి వన్డే సహా, తొలి టి20లో భారత్ ప్రతాపం చూపింది. గెలుపోటముల పరంగా సమమైనా... సిరీస్ ఫలితమే భారత్‌కు బాకీ ఉంది. అందుకే ఆతిథ్య జట్టులాగే కోహ్లి సేన కూడా ఆఖరిదాకా లాక్కెళ్లకుండా రెండో మ్యాచ్‌లోనే పొట్టి సిరీస్ నెగ్గాలనే పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో ఇరుజట్ల మధ్య ఆదివారం జరిగే రెండో టి20లో భారత్ గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. భారత్ విజయాల జోరులో ఉంటే... ఆస్ట్రేలియాను గాయాలు కలవరపెడుతున్నాయి. ధావన్, కోహ్లి రాణిస్తే... వన్డే సిరీస్‌లో రాణించిన ధావన్, కెప్టెన్ కోహ్లి టి20 మ్యాచ్‌లో విఫలమయ్యారు. రెండో మ్యాచ్‌లో వీళ్లిద్దరు బ్యాట్ ఝుళిపిస్తే బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్‌పై పరుగుల వరద ఖాయం. ఫామ్‌లో ఉన్న ఓపెనర్ కేఎల్ రాహుల్‌కు ఈ ఇద్దరు జతయితే భారత్ దర్జాగా ఓ మ్యాచ్ ఉండగానే సిరీస్ గెలుచుకుంటుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. మిడిలార్డర్లో మనీశ్ పాండే బ్యాటింగ్ గతి తప్పింది. దీంతో మార్పు చేయాలనుకుంటే శ్రేయస్ అయ్యర్‌కు అవకాశం లభించొచ్చు. కానీ వన్డేల్లో అయ్యర్ ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయాడు. హార్దిక్ పాండ్యా గత మ్యాచ్‌లో తక్కువ పరుగులే చేసినా... అతని ఫామ్ ఆసీస్‌లో బాగుంది. ఇతను కూడా మెరిపిస్తే భారత్ స్కోరును నిలువరించడం ముమ్మాటికి అసాధ్యమే! జడేజా లోటు... తొలి టి20లో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా వేగవంతమైన ఇన్నింగ్సే భారత్‌కు గౌరవప్రద స్కోరు అందించడమే కాకుండా బౌలర్లు పోరాడేందుకు అవకాశం కల్పించింది. కానీ గాయంతో అతను మ్యాచ్‌లో ఇన్నింగ్స్ ముగియగానే పెవిలియన్ చేరాడు. ఇప్పుడైతే సిరీస్‌కే దూరమైన పరిస్థితి. బౌలింగ్‌లో అతని లోటును స్పిన్నర్ చహల్ భర్తీ చేసి ఉండవచ్చు. కానీ బ్యాటింగ్‌లో ఎవరుంటారనేది ప్రశ్నార్థకం. చహల్ పూర్తిగా బౌలర్. ఇతని కోసం ఓ బ్యాట్స్‌మన్ లోటు ఏర్పడుతుంది. దీన్ని టీమ్ మేనేజ్మెంట్ ఏలా అధిగమిస్తుందో చూడాలి. ఇక బౌలింగ్ విషయానికొస్తే ధారాళంగా పరుగులు సమర్పించుకున్న షమీ స్థానంలో బుమ్రాను దించే అవకాశాలున్నాయి. వాషింగ్టన్ సుందర్ స్పిన్‌తో కట్టడి చేశాడు. వీళ్లిద్దరు సిడ్నీలోనూ అదరగొడితే భారత్‌కు విజయం సులువవుతుంది. కంగారూ... కంగారూ... ఆతిథ్య జట్టును గత ఫలితం, సిరీస్ భయమే కాదు... గాయాలు పట్టి పీడిస్తున్నాయి. ఇదివరకే డాషింగ్ ఓపెనర్ వార్నర్ పూర్తిగా దూరమయ్యాడు. తాజాగా రెగ్యులర్ కెప్టెన్ ఫించ్ ఫిట్నెస్ సమస్యలతో ఈ మ్యాచ్ ఆడే అవకాశాల్లేవు. అతను గైర్హాజరైతే తాత్కాలిక సారథ్యాన్ని మాథ్యూ వేడ్‌కు అప్పగించవచ్చు. కానీ దూకుడుగా ఆడుతున్న ఓపెనర్ స్థానాన్ని ఎవరు అందిపుచ్చుకుంటారు. వన్డేల్లో చెలరేగిన స్మిత్, మ్యాక్స్‌వెల్‌లను గత మ్యాచ్‌లో భారత బౌలర్లు తెలివిగా ఔట్ చేశారు. ఇదే ఆసీస్ ఫలితాన్ని మార్చేసింది. 56 పరుగులదాకా అజేయంగా సాగిన ఇన్నింగ్స్ తర్వాత్తర్వాత చతికిలబడింది. అయితే వేదిక మాత్రం ఆసీస్‌ను ఊరడిస్తుంది. ఇక్కడే జరిగిన తొలి రెండో వన్డేల్లో కంగారూ జట్టు జయభేరి మోగించింది. కాన్బెర్రా నిరాశపరిచినా... మళ్లీ సిడ్నీకి రావడంతో తిరిగి పుంజుకుంటామని ఆస్ట్రేలియా జట్టు ఆశిస్తోంది. జట్లు (అంచనా) భారత్: కోహ్లి (కెప్టెన్), ధావన్, రాహుల్, సామ్సన్, మనీశ్ పాండే/అయ్యర్, హార్దిక్ పాండ్యా, సుందర్, దీపక్ చహర్, నటరాజన్, బుమ్రా/షమీ, చహల్. ఆస్ట్రేలియా: ఫించ్ (కెప్టెన్)/డార్సీ షార్ట్, వేడ్, స్మిత్, మ్యాక్స్‌వెల్, హెన్రిక్స్, క్యారీ, అబాట్, స్టార్క్, స్వెప్సన్/లయన్, జంపా, హజల్‌వుడ్. పిచ్, వాతావరణం బ్యాటింగ్ అనుకూలమైన పిచ్. తొలి రెండు వన్డేల్లో ఇరు జట్లు 300పైచిలుకు పరుగుల్ని అవలీలగా చేశాయి. ఇక ధనాధన్‌గా సాగే టి20 ఫార్మాట్లో అంతకుమించే ఉంటుంది. వర్షం బెడద లేదు. -
సిరేసులో ఉండాలంటే...
పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలి. ఇప్పుడు కోహ్లి బృందం కూడా అదే చేయాలి. సిడ్నీలో ఎదురైన ఓటమికి... ఈ సిడ్నీలోనే విజయంతో ఆసీస్‌కు సమాధానం ఇవ్వాలి. అప్పుడే సిరీస్‌లో ఉంటాం. లేదంటే క్లీన్‌స్వీప్ దారిలో పడిపోతాం. సిడ్నీ: తొలి వన్డే ఓటమితో సిరీస్‌లో వెనుకబడిన భారత జట్టు ఇప్పుడు రేసులో నిలిచే పనిలో పడింది. ఇక్కడే జరిగే రెండో వన్డేలో గెలవాలనే పట్టుదలతో ఉంది. ఐపీఎల్ పొట్టి ఫార్మాట్ నుంచి, గత మ్యాచ్‌లో చేసిన పొరపాట్ల నుంచి తొందరగా బయటపడాలని కోహ్లి సేన భావిస్తోంది. మరోవైపు సిరీస్‌లో శుభారంభం చేసిన ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు వరుస విజయంపై కన్నేసింది. బ్యాటింగ్, బౌలింగ్... ఆల్‌రౌండ్ సత్తాతో పర్యాటక జట్టును మళ్లీ కంగారు పట్టించేందుకు సిద్ధమైంది. మూడు వన్డేల సిరీస్‌లో ఆదివారం రెండో వన్డే జరుగుతుంది. కోహ్లి ఫామ్‌పైనే కలవరం... ఆస్ట్రేలియా గడ్డపై కోహ్లి చక్కగా రాణించిన సందర్భాలున్నాయి. కానీ ప్రత్యేకించి ఇక్కడి సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ (ఎస్సీజీ)లో అతని ఆటతీరు పేలవం. ఇక్కడ అతని టాప్ స్కోరు 21 పరుగులే. గత మ్యాచ్‌లో అదేస్కోరును సమం చేశాడంతే! సగటైతే 11.40 పరుగులే. ‘టన్’లకొద్దీ పరుగులు బాదిన ఈ సీనియర్ బ్యాట్స్‌మన్‌కు ఎస్సీజీ అంతుచిక్కడం లేదు. ఆదివారం భారత కెప్టెన్ నిలబడినా, రాణించినా గత విశ్లేషణలన్నీ మారుతాయి. విజయం కూడా దక్కుతుంది. ఓపెనర్ మయాంక్ ఐపీఎల్లో అదరగొట్టాడు. ఇక్కడ అదేపని చేస్తే... మరో ఓపెనర్ ధావన్ ఫామ్‌లో ఉండటంతో చక్కని ఆరంభమే కాదు భారీ భాగస్వామ్యం నమోదు చేయొచ్చు. ఆ తర్వాత కోహ్లితో పాటు మిడిలార్డర్లో శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ బ్యాట్‌కు పనిచెబితే పరుగుల వరద పారుతుంది. హార్దిక్ పాండ్యా చాలా రోజుల తర్వాత వన్డే ఆడినా... తొలి మ్యాచ్‌తోనే ఫామ్ కనబరిచాడు. ఇది జట్టుకు సానుకూలాంశం. ఫిట్‌గానే చహల్... స్పిన్నర్ యజువేంద్ర చహల్ తొలి వన్డే ఆడుతూ స్వల్ప గాయంతో మైదానం వీడినా... తన 10 ఓవర్ల కోటా పూర్తి చేశాడు. దీంతో అతడి ఫిట్‌నెస్‌పై జట్టుకు ఎలాంటి కలవరం లేదు. అయితే గత మ్యాచ్‌లో అతనితో పాటు బుమ్రా, సైనీ ధారాళంగా సమర్పించుకున్న పరుగులతోనే జట్టు మేనేజ్మెంట్ ఆందోళన పడుతోంది. సీమర్లకు అనుకూలమైన పిచ్‌లపై బుమ్రా విఫలమవడమే కాస్త ఇబ్బందికర పరిణామం. అయితే రెండో వన్డేలో అతను కుదుటపడితే ఆ ఇబ్బందులు ప్రత్యర్థి జట్టుకు బదిలీ చెయొచ్చు. కొత్త బౌలర్ నటరాజన్‌కు అవకాశమివ్వాలని భావిస్తే సైనీని పక్కనబెట్టే అవకాశాలున్నాయి. జోరు మీదున్న ఆసీస్... భారత బౌలింగ్‌ను చితగ్గొట్టిన బ్యాట్స్‌మెన్ ఫామ్‌తో, శతక భాగస్వామ్యాలతో ఆస్ట్రేలియా జోరుమీదుంది. ఇది ఇలాగే కొనసాగించి ఇక్కడే సిరీస్ గెలుచుకోవాలనే ఆత్మవిశ్వాసంతో ఫించ్ సేన ఉవ్విళ్లూరుతోంది. ముఖ్యంగా టాపార్డర్ బ్యాట్స్‌మెన్ వార్నర్, ఫించ్, స్మిత్‌ల ప్రదర్శన ఆతిథ్య జట్టు బలాన్ని రెట్టింపు చేసింది. గాయపడిన ఆల్‌రౌండర్ స్టొయినిస్ స్థానంలో మరో ఆల్‌రౌండర్ గ్రీన్ అందుబాటులో ఉన్నాడు. దీంతో అతని అరంగేట్రం దాదాపు ఖాయమైంది. సొంతగడ్డపై పేసర్లు స్టార్క్, కమిన్స్, హాజల్వుడ్లది ఎప్పుడైనా పైచేయే! ఆతిథ్య అనుకూలతలు వారిని ఓ మెట్టుపైనే నిలబెడతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక స్పిన్నర్ జంపా గత మ్యాచ్‌లో భారత వెన్నువిరిచాడు. కీలక బ్యాట్స్‌మెన్‌నే కాదు... క్రీజులో పాతుకుపోయిన బ్యాట్స్‌మన్‌ను కూడా తన స్పిన్ ఉచ్చులో ఉక్కిరిబిక్కిరి చేశాడు. పిచ్, వాతావరణం గత మ్యాచ్‌లాగే పరుగుల వరద పారే పిచ్. బ్యాట్స్‌మెన్ నిలబడితే చాలు... భారీస్కోర్లు రిపీట్ అవుతాయి. మ్యాచ్‌కు వర్షం ముప్పయితే లేదు. -
చరిత్ర సృష్టించిన కోహ్లీసేన
భారత క్రికెట్ శుక్రవారంనాడు ఒక అద్భుతం సాధించింది. ఆస్ట్రేలియా గడ్డపైన మూడు ఫార్మట్ల లోనూ అజేయంగా నిలిచి చరిత్ర సృష్టించింది. టెస్ట్ సిరీస్‌ను 2–1తోనూ, వన్డే పరంపరను 2–1తోనూ గెలుచుకొని టీ–20 సిరీస్‌ను డ్రా చేసుకున్నది. ఆస్ట్రేలియా గడ్డ మీద క్రికెట్ ఆడి ఓడిపోకుండా బయటకు వచ్చిన ఒకే ఒక దేశంగా ఇండియా రికార్డు నెలకొల్పింది. భారత క్రికెట్ జట్టు మూడవ వన్డేలో విజయం సాధించినప్పుడు మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో వేలమంది భారతీయ సంతతి క్రికెట్ అభిమానులు ఆనందోత్సాహాలతో కేరింతలు కొట్టారు. భారత జట్టు నిన్నటి వరకూ ఆస్ట్రేలియాలోనూ, దక్షిణాఫ్రికాలోనూ ఒక్క సిరీస్ కూడా గెలవలేదు. మిగతా అన్ని దేశాలలోనూ భారత జట్టు విజయం సాధించింది. వెస్టిండీస్‌పైన నాలుగు సార్లూ, ఇంగ్లండ్, శ్రీలంకలపైన చెరి మూడు విడతలూ, న్యూజిలాండ్, జింబాబ్వేపైన రెండు దఫాలూ ఇండియా గెలిచింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్లపైన కూడా విజయం సాధించింది. ఇప్పుడు ఆస్ట్రే లియాపైన ఆధిక్యం చాటుకోవడంతో ఇక ఒక్క దక్షిణాఫ్రికాను మాత్రమే జయించవలసి ఉంది. విరాట్ కోహ్లీ నాయకత్వంలో అప్రతిహతంగా జైత్రయాత్ర చేస్తున్న జట్టు భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత శక్తిమంతమైనది. బ్యాటింగ్‌లోనూ, బౌలింగ్‌లోనూ, ఫీల్డింగ్‌లోనూ, వికెట్‌కీపింగ్‌లోనూ ఎవ్వరికీ తీసిపోని క్రికెటర్లు భారత జట్టులో ఉన్నారు. ప్రపంచకప్ పోటీలలో పాల్గొనడానికి తహతహలాడుతున్న యువజట్టు అన్ని విభాగాలలోనూ, అన్ని ఫార్మాట్లలోనూ అద్వితీయమైన ప్రావీణ్యం ప్రదర్శిస్తున్నది. ఆస్ట్రేలియాలో ముగిసిన మూడో వన్డేలో ఎంఎస్ ధోని రాణించాడు. చివరి షాట్‌ను కొట్టి విజయం కైవసం చేసుకున్న కేదార్ జాదవ్ 61 పరుగులు, ధోనీ 87 పరుగులు చేసి అజేయంగా నిలిచారు. ధోనీ వరుసగా మూడు అర్ధ శతకాలు చేసి విమర్శకులకు తగిన సమాధానం చెప్పాడు. లోగడ భారత జట్టు కెప్టెన్ అజహరుద్దీన్ తనపైన ఎవరైనా విమర్శిస్తే వారికి తన బ్యాట్ జవాబు చెబుతుందని అనేవాడు. అదే విధంగా ధోనీ పాటవం తగ్గిపోయిందనీ, ఆట నుంచి విరమించు కోవలసిన సమయం ఆసన్నమైందనీ, ప్రపంచకప్ దాకా ఆడలేడనీ విమర్శకులు సన్నాయినొ క్కులు నొక్కుతున్న తరుణంలో ధాటిగా ఆడి దీటుగా జవాబు చెప్పాడు. రాబోయే ప్రపంచ కప్ పోటీలో పాల్గొనే భారత జట్టులో తన స్థానం ఖరారు చేసుకున్నాడు. 231 పరుగులు చేయ వలసిన భారత జట్టు ఆ పని చివరి ఓవర్ దాకా ఆగకుండా కాస్త ముందుగానే చేయగలిగేది. ఆట అదుపు తప్పి పోలేదు. ధోనీ శతకం పూర్తి చేయాలనుకుంటే ఆట వేగం పెంచగలిగేవాడు. కానీ ధోనీ తన సహజ ధోరణిలో ‘మిస్టర్ కూల్’ అనే పేరు సార్థకం చేసుకుంటూ తొట్రుపడకుండా చివరి ఓవర్ వరకూ ఆడి విజయం సాధించాడు. జట్టులో చివరి వరకూ వికెట్ కోల్పోకుండా ఆడుతూ గెలుపునకు అవసరమైన పరుగులు చేయడంలో (ఆటకు ఫినిషింగ్ టచ్ ఇవ్వడంలో) ప్రపంచంలోనే ధోనీని మించిన క్రికెటర్ లేడు. ధోని వన్డేలలో 73 ఇన్నింగ్స్‌లలో ఆడి 46 ఇన్నింగ్స్‌లలో నాటౌట్ బ్యాట్స్‌మన్‌గా నిలిచి జట్టును గెలిపించాడు. ధోనీ ఏ స్థానంలో బ్యాటింగ్ చేయాలనే వివాదానికి అతడే తెరదింపాడు. 14 సంవత్సరాల నుంచి ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ఆడుతున్న తాను ఏ స్థానంలో రావాలో చెప్పలేననీ, కెప్టెన్ నిర్దేశించిన స్థానంలో బ్యాట్ చేస్తాననీ అన్నాడు. అనుభవం, ప్రావీణ్యం కలిగిన ధోనీ అయిదో స్థానంలో చక్కగా సరిపోతాడని కోహ్లీ వ్యాఖ్యానించాడు. ధోనీ మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌గా నిలవడంలో ఆశ్చర్యం లేదు.‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ చహల్ విచిత్రమైన క్రీడాకారుడు. అతను ఆస్ట్రేలియా పర్యనలో ఉన్నాడు కానీ లేడు. జట్టుతో పాటు పర్యటించాడు కానీ జట్టులో లేడు. చిట్టచివరి మ్యాచ్‌లో చేర్చుకున్నారు. జట్టులోకి తీసుకోలేదని నిరాశానిస్పృహలకు లోను కాకుండా అవకాశం ఇవ్వగానే అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన చేసిన అరుదైన లెగ్‌స్పిన్నర్ యుజువేంద్ర చహల్. రెండు వికెట్లు కోల్పోయి 100 పరుగులు చేసి ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ కుదురుకుంటున్నట్టు కనిపించినప్పుడు 23వ ఓవర్లో చహల్‌కు కోహ్లీ పిలుపు అందింది. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ పీటర్ హాండ్సకాంబ్ 58 పరుగులు చేసి దూకుడు పెంచినప్పుడు చహల్ అత్యంత చాకచక్యంగా బౌల్ చేసి అతని వికెట్టు పడగొట్టాడు. అతనితో పాటు మరి అయిదుగురు ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌ని చహల్ అవుట్ చేసి (6–42) భారత జట్టు విజయానికీ, చరిత్రను తిరగరాయడానికీ దోహదం చేశాడు. ఆస్ట్రేలియా బౌలింగ్ దిగ్గజం షేన్ వార్న్ ‘ఫాక్స్‌స్పోర్ట్స్’ టీవీ చానల్లో వ్యాఖ్యానిస్తూ ఈ హరియాణా కుర్ర వాడిని తెగమెచ్చుకున్నాడు. అంతకు మించిన యోగ్యతాపత్రం ఎవరికి దొరుకుతుంది? గంగూలీ నాయకత్వంలో భారత జట్టు ఆస్ట్రేలియాలో 2003–04లో సిరీస్ డ్రా చేసుకోగలి గింది. అదే విధంగా దక్షిణాఫ్రికాలో ధోనీ కెప్టెన్‌గా 2010–11లో భారత జట్టు ఓడిపోకుండా సిరీస్ డ్రా చేసుకున్నది. 1947–48 నుంచి ఇండియా టెస్ట్ క్రికెట్ ఆడుతున్నప్పటికీ విదేశాలలో మొదటి విజయం 1967–68 పర్యటనలో నవాబ్ ఆఫ్ పటౌడీ నాయకత్వంలోని జట్టుకు న్యూజిలాండ్‌లో లభించింది. అప్పటి న్యూజీలాండ్ జట్టులో కూనలు ఉండేవారు. ఇప్పటి అఫ్ఘానిస్తాన్ జట్టుకంటే బలహీనంగా నాటి న్యూజిలాండ్ జట్టు ఉండేది. అజిత్ వాడేకర్ కెప్టెన్‌గా ఇంగ్లండ్‌లో సిరీస్ గెలిచి నప్పుడు భారత జట్టును క్రికెట్ ప్రపంచం గుర్తించింది. 1983లో కపిల్‌దేవ్ నాయకత్వంలో ప్రపం చకప్ మొట్టమొదటిసారి గెలిచినప్పుడు భారత క్రికెట్ సగర్వంగా తలెత్తుకొని నిలిచింది. ఆ సన్ని వేశం క్రికెట్ అభిమానుల హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోయింది. ««ధోనీ కెప్టెన్‌గా 2013లో చాంపియన్స్ ట్రాఫీ గెలిచాం. ఈ సంవత్సరం మే 30న ఇంగ్లండ్‌లో ప్రారంభం కానున్న ఇంటర్నే షనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రపంచకప్ పోటీలో జయపతాకను ఎగరవేయగలిగితే కోహ్లీసేనకు చరిత్రలో చెరగని స్థానం దక్కుతుంది. -
అయ్యో.. ఐర్లాండ్ : భారత్ ఘన విజయం
అగ్రశ్రేణి జట్టుగా తమ స్థాయిని ప్రదర్శిస్తూ భారత జట్టు అలవోకగా ఐర్లాండ్ ఆట కట్టించింది. తొలి మ్యాచ్‌లో సునాయాసంగా నెగ్గిన కోహ్లి సేన రెండో మ్యాచ్‌లో ఆమాత్రం కూడా కష్టపడాల్సిన అవసరం లేకపోయింది. ఏ విభాగంలోనూ సరితూగలేని ఐర్లాండ్‌కు ఎలాంటి సంచలనానికి అవకాశం ఇవ్వకుండా రికార్డు విజయంతో టీమిండియా టి20 సిరీస్‌ను ఏకపక్షంగా ముగించింది. ముందుగా రాహుల్, రైనా దూకుడుతో బ్యాటింగ్‌లో భారీ స్కోరుతో కదం తొక్కి... ఆ తర్వాత బౌలింగ్‌లో చెలరేగింది. ఐర్లాండ్‌తో ‘సన్నాహకం’ ముగిసిన తర్వాత మంగళవారం నుంచి ఇంగ్లండ్ సవాల్‌ను ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధమైంది. డబ్లిన్: ఐర్లాండ్‌తో జరిగిన రెండు టి20 మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 2–0తో కైవసం చేసుకుంది. శుక్రవారం ఇక్కడ జరిగిన రెండో టి20లో భారత్ 143 పరుగుల భారీ తేడాతో ఐర్లాండ్‌ను చిత్తుగా ఓడించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (36 బంతుల్లో 70; 3 ఫోర్లు, 6 సిక్సర్లు), సురేశ్ రైనా (45 బంతుల్లో 69; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీలతో కదం తొక్కారు. వీరిద్దరు రెండో వికెట్‌కు 57 బంతుల్లోనే 106 పరుగులు జోడించగా, చివర్లో హార్దిక్ పాండ్యా (9 బంతుల్లో 32 నాటౌట్; 1 ఫోర్, 4 సిక్సర్లు) మెరుపు ప్రదర్శన కనబర్చాడు. అనంతరం ఐర్లాండ్ 12.3 ఓవర్లలో 70 పరుగులకే కుప్పకూలింది. విల్సన్ (15) టాప్ స్కోరర్. భారత బౌలర్లలో మరోసారి కుల్దీప్ (3/16), చహల్ (3/21) ప్రత్యర్థిని పడగొట్టారు. సెంచరీ భాగస్వామ్యం... భారత జట్టు అనుకున్నట్లుగానే నాలుగు మార్పులతో బరిలోకి దిగింది. ధావన్, ధోని, భువనేశ్వర్, బుమ్రా స్థానాల్లో రాహు ల్, దినేశ్ కార్తీక్, ఉమేశ్ యాదవ్, సిద్ధార్థ్ కౌల్ జట్టులోకి వచ్చారు. ఈ మ్యాచ్‌తో అరంగేట్రం చేసిన కౌల్ భారత్ తరఫున టి20ల్లో ఆడిన 75వ ఆటగాడిగా నిలిచాడు. రోహిత్‌ను కాదని రాహుల్‌తో పాటు ఓపెనర్‌గా బరిలోకి దిగిన కోహ్లి (9) వరుసగా రెండో మ్యాచ్‌లోనూ విఫలమయ్యాడు. అయితే రాహుల్, రైనా కలిసి ఐర్లాండ్‌ను ఆడుకున్నారు. ఐపీఎల్ ఫామ్‌ను కొనసాగిస్తూ రాహుల్ సిక్సర్లతో చెలరేగగా, రైనా కూడా తనదైన శైలిలో జోరుగా ఆడాడు. సిమీ సింగ్ ఓవర్లో వరుసగా 6, 6, 4 కొట్టిన రాహుల్, ఆ తర్వాత రాన్‌కిన్ ఓవర్లో మరో రెండు భారీ సిక్సర్లతో 28 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే కెవిన్ ఓబ్రైన్ తన తొలి బంతికే రాహుల్‌ను అవుట్ చేయడంతో సెంచరీ భాగస్వామ్యం ముగిసింది. మరో రెండు బంతులకే రోహిత్ (0) కూడా ఔటయ్యాడు. అనంతరం 34 బంతుల్లో రైనా హాఫ్ సెంచరీ మార్క్ ను అందుకున్నాడు. రైనాను కూడా ఓబ్రైన్ వెనక్కి పంపించిన తర్వాత వచ్చిన మనీశ్ పాండే (20 బంతుల్లో 21 నాటౌట్; 1 ఫోర్) దూకుడుగా ఆడలేకపోయాడు. అయి తే హార్దిక్ మెరుపు ఇన్నింగ్స్ భారత్‌కు భారీ స్కోరు అందించింది. ఆఖరి ఓవర్లో పాండ్యా వరుస బంతుల్లో 6, 6, 4 బాదడంతో మొత్తం 21 పరుగులు వచ్చాయి. వరుస కట్టి... భారీ లక్ష్య ఛేదనలో ఐర్లాండ్ కనీస స్థాయి పోరాటాన్ని కూడా ప్రదర్శించలేకపోయింది. రెండో బంతికే స్టిర్లింగ్ (0)ను అవుట్ చేయడంతో మొదలైన పతనం చివరి వరకు కొనసాగింది. తొలి మ్యాచ్‌లోనైనా కాస్త చెప్పుకోదగ్గ ఆటతీరు కనబర్చిన జట్టు ఈ సారి పూర్తిగా చేతులెత్తేసింది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రాహుల్ (సి అండ్ బి) కెవిన్ ఓబ్రైన్ 70; కోహ్లి (సి) డాక్రెల్ (బి) ఛేజ్ 9; రైనా (సి) డాక్రెల్ (బి) కెవిన్ ఓబ్రైన్ 69; రోహిత్ (సి) స్టిర్లింగ్ (బి) కెవిన్ ఓబ్రైన్ 0; మనీశ్ పాండే (నాటౌట్) 21; పాండ్యా (నాటౌట్) 32; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 213. వికెట్ల పతనం: 1–22; 2–128; 3–128; 4–169. బౌలింగ్: సిమీ సింగ్ 2–0 –32–0; రాన్‌కిన్ 3–0–33–0; ఛేజ్ 4–0–42–1; థాంప్సన్ 1–0–17–0; డాక్రెల్ 4–0–30–0; స్టిర్లింగ్ 2–0–19–0; కెవిన్ ఓబ్రైన్ 4–0–40–3. ఐర్లాండ్ ఇన్నింగ్స్: స్టిర్లింగ్ (సి) రైనా (బి) ఉమేశ్ 0; షెనాన్ (సి) రాహుల్ (బి) కౌల్ 2; పోర్టర్‌ఫీల్డ్ (బి) ఉమేశ్ 14; బల్బిర్నీ (బి) చహల్ 9; విల్సన్ (బి) కుల్దీప్ 15; కెవిన్ ఓబ్రైన్ (సి) కుల్దీప్ (బి) పాండ్యా 0; సిమీ సింగ్ (ఎల్బీ) (బి) చహల్ 0; థాంప్సన్ (బి) చహల్ 13; డాక్రెల్ (సి) ఉమేశ్ (బి) కుల్దీప్ 4; రాన్‌కిన్ (స్టంప్డ్) కార్తీక్ (బి) కుల్దీప్ 10; ఛేజ్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (12.3 ఓవర్లలో ఆలౌట్) 70. వికెట్ల పతనం: 1–0; 2–16; 3–22; 4–30; 5–32; 6–36; 7–44; 8–56; 9–68; 10–70. బౌలింగ్: ఉమేశ్ యాదవ్ 2–0–19–2; సిద్ధార్థ్ కౌల్ 2–0–4–1; హార్దిక్ పాండ్యా 2–0–10–1; చహల్ 4–0–21–3; కుల్దీప్ 2.3–0–16–3. ► టి20ల్లో భారత్‌కు ఇదే అతి పెద్ద విజయం. గతంలో శ్రీలంకపై (2017లో) 93 పరుగుల విజయాన్ని భారత్ సవరించింది. డ్రింక్స్ తీసుకెళ్తున్న ధోని అరంగేట్రం చేసిన బౌలర్ సిద్ధార్థ్ కౌల్‌తో బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ -
అంతా అశ్విన్‌మయం...
రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన తర్వాత గత ఐదేళ్లలో భారత్ 7 టెస్టు సిరీస్‌లు నెగ్గింది. అందులో 6 సార్లు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు అతనికే దక్కిందంటే మన విజయాల్లో అశ్విన్ పాత్ర ఏమిటో అర్థమవుతుంది. గతంలో తన స్పిన్‌తోనే ప్రత్యర్థిని ముప్పుతిప్పులు పెట్టిన ఈ చెన్నై స్టార్ ఈసారి బ్యాటింగ్‌లో కూడా చెలరేగి వెస్టిండీస్‌ను ఒక ఆటాడుకున్నాడు. అశ్విన్‌కు అండగా ఇతర ఆటగాళ్లు కూడా ఆకట్టుకోవడంతో తాజా సిరీస్‌లో టీమిండియా ప్రత్యర్థిపై పూర్తి ఆధిక్యం ప్రదర్శించింది. * ఆల్‌రౌండర్‌గా అద్భుత ప్రదర్శన * ఏకపక్షంగా సాగిన భారత్, విండీస్ సిరీస్ సాక్షి క్రీడా విభాగం: భారత జట్టు వెస్టిండీస్‌లో అడుగుపెట్టిన సమయంలో మన జట్టు సిరీస్ విజయంపై ఎవరికీ అనుమానాల్లేవు. వరుసగా రెండు సిరీస్‌లు నెగ్గడంతో పాటు పటిష్టమైన బృందంతో కోహ్లి సేన అక్కడికి చేరింది. మరోవైపు విండీస్ టెస్టు జట్టు ఆటపై కూడా పెద్దగా అంచనాలు లేవు కాబట్టి పోటీ ఏకపక్షమే కావచ్చని అనిపించింది. ఈ నాలుగు టెస్టుల సిరీస్ దాదాపు అలాగే సాగింది. ఫలి తంగా విండీస్ గడ్డపై భారత్ వరుసగా మూడో టెస్టు సిరీస్‌ను గెలుచుకుంది. మొత్తంగా ఆ జట్టుపై ఇది వరుసగా టీమిండియాకు ఆరో సిరీస్ విజయం. విండీస్ చేతిలో 2002 తర్వాత భారత్ వరుసగా 19 టెస్టులలో ఓడిపోలేదు. గతంలో 17 మ్యాచ్‌ల పాటు శ్రీలంక చేతిలో ఓడని రికార్డును కోహ్లి సేన ఈ సిరీస్‌లో సవరించడం విశేషం. రికార్డుతో ఆరంభం... ఉపఖండం బయట అతి పెద్ద విజయంతో భారత్ సిరీస్‌లో బోణీ చేసింది. విరాట్ కోహ్లి తొలి డబుల్ సెంచరీతో జట్టును ముందుండి నడిపించాడు. ఇన్నింగ్స్, 92 పరుగుల ఈ గెలుపు సిరీస్‌పై మన పట్టును ప్రదర్శించింది. ఈ సిరీస్ మొత్తం వెస్టిండీస్ పోరాటం గురించి చెప్పుకోవాల్సింది ఏదైనా ఉంటే అది రెండో టెస్టులోనే. వాస్తవానికి ఒక రోజు మొత్తం వర్షం బారిన పడటం కూడా ఆ జట్టుకు కలిసొచ్చింది. అయితే రోస్టన్ ఛేజ్ సెంచరీతో పోరాడకపోయి ఉంటే ఈ మ్యాచ్ కూడా భారత్ గెలిచేది. ఆఖరి రోజు 88 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే తీయగలగడం మాత్రం భారత్ వైఫల్యంగా చెప్పవచ్చు. కానీ మూడో టెస్టులో అద్భుత ప్రదర్శనతో టీమిండియా తగిన రీతిలో జవాబిచ్చి సిరీస్‌ను గెలుచుకుంది. మళ్లీ ఒక రోజు ఆట కోల్పోయినా... భువనేశ్వర్ స్వింగ్ దెబ్బకు విండీస్ 237 పరుగుల తేడాతో చిత్తయింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 126 పరుగులకే 5 వికెట్లు కోల్పోయినా భారత్ కోలుకున్న తీరు అసమానం. ఈ ఫామ్‌తో కోహ్లి సేన చివరి టెస్టు కూడా గెలిచి నంబర్‌వన్‌ను నిలబెట్టుకోగలిగేదేమో. అశ్విన్ అదరహో... గెలిచిన రెండు టెస్టుల్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అశ్విన్‌కే దక్కింది. తొలి టెస్టులో సెంచరీతో కోహ్లికి అండగా నిలిచిన అతను, రెండో ఇన్నింగ్స్‌లో 7 వికెట్లతో ప్రత్యర్థిని కుప్పకూల్చాడు. మూడో టెస్టులో కీలక సమయంలో బ్యాటింగ్‌లో పోరాటపటిమ కనబర్చి మరో శతకం బాదాడు. 58.75 సగటుతో 4 ఇన్నింగ్స్‌లలో 235 పరుగులు చేసిన అశ్విన్, 23.17 సగటుతో 17 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. ఆరో స్థానంలో అశ్విన్ అద్భుత బ్యాటింగ్‌తో కోహ్లికి బెంగ తీరిపోయింది. తన ఐదుగురు బౌలర్ల వ్యూహాన్ని ఇక ముందు కూడా అమలు చేసే అవకాశం దక్కింది. ‘వ్యక్తిగతంగా నాకు ఇదో మంచి సిరీస్ అవుతుందని ముందే ఊహించాను. రెండు సెంచరీలు సాధిస్తానని అనుకోకపోయినా, కీలక సమయంలో బ్యాటింగ్‌తో కూడా జట్టుకు ఉపయోగపడటం గర్వంగా ఉంది’ అని అశ్విన్ చెప్పాడు. రాహుల్, రహానే కూడా ఒక్కో సెంచరీతో మెరిసినా... మూడో టెస్టులో సాహా చేసిన శతకం జట్టులో అతడి స్థానాన్ని సుస్థిరం చేసింది. ఇక గాయాల తర్వాత పునరాగమనం చేసిన షమీ (11 వికెట్లు) చెలరేగడంతో జట్టు పేస్ బౌలింగ్ మరింత పటిష్టంగా కనిపించింది. అశ్విన్ అరుదైన ఘనత సచిన్ తన కెరీర్లో 78 సిరీస్‌లలో, సెహ్వాగ్ 38 సిరీస్‌లో ఐదేసి ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు గెలుచుకున్నారు. అయితే కేవలం 13 సిరీస్‌లే ఆడిన అశ్విన్ వారిద్దరినీ దాటి 6 సిరీస్ అవార్డులు సాధించడం విశేషం. భారత్ ర్యాంకుల కోసమే ఆడదు: కెప్టెన్ కోహ్లి భారీ వర్షం కారణంగా నాలుగో టెస్టు డ్రా కావడంతో భారత జట్టు ఐసీసీ నంబర్‌వన్ ర్యాంక్‌ను పాకిస్తాన్‌కు కోల్పోయింది. అయితే ఇదేమీ పెద్ద విషయం కాదని జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి కొట్టి పారేశాడు. మన జట్టు ఎంత బాగా ఆడుతోందనేదే ముఖ్యమని అతను అన్నాడు. ‘ర్యాంకులు తరచూ మారుతూ ఉంటాయి. అది తాత్కాలికం. ఇతర జట్లతో పోలిస్తే మేం తక్కువ మ్యాచ్‌లు ఆడాం. ఏదో ఒక టెస్టు తర్వాత అని కాకుండా సీజన్ మొత్తం ముగిసిన తర్వాత మేం ఏ స్థానంలో నిలిచామో చూసుకుంటాం. భారత జట్టు ర్యాంకుల కోసం ఆడదు. మంచి ఆటతీరు కనబర్చి ప్రపంచంలో అత్యుత్తమ జట్టుగా ఎదగాలనేదే మా లక్ష్యం’ అని కోహ్లి వ్యాఖ్యానించాడు. ఈ సిరీస్ ద్వారా జట్టుకు ఎంతో మేలు జరిగిందన్న కోహ్లి... అశ్విన్, సాహా బ్యాటింగ్‌పై ప్రశంసలు కురిపించాడు. చివరి టెస్టులో అనూహ్యంగా నలుగురే బౌలర్లతో ఆడటంపై వివరణ ఇస్తూ, రాబోయే సిరీస్‌ల కోసం కావాలనే ప్రయోగం చేసినట్లు వెల్లడించాడు. మరో వైపు సరైన డ్రైనేజీ వసతులు లేక పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో నాలుగో టెస్టులో కేవలం 22 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యం కావడంపై ట్రినిడాడ్ అండ్ టొబాగో క్రికెట్ బోర్డు విచారణకు ఆదేశించింది. పారాలింపిక్స్‌లోనూ రష్యాకు నో చాన్స్ జెనీవా: డోపింగ్ నేపథ్యంలో తమపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాల్సిందిగా రష్యా పారాలింపిక్ కమిటీ చేసుకున్న అప్పీల్‌ను క్రీడా మధ్యవర్తిత్వ కోర్టు (సీఏఎస్) తోసిపుచ్చింది. దీంతో రియో పారాలింపిక్స్‌లోనూ రష్యా పాల్గొనే అవకాశం లేకుండా పోయింది. ప్రభుత్వ మద్దతుతోనే రష్యా అథ్లెట్లు డోపింగ్‌కు పాల్పడుతున్నట్టు తేలిన నేపథ్యంలో అంతర్జాతీయ పారాలింపిక్ కమిటీ (ఐపీసీ) ఈనెల 7న నిషేధం విధించింది. రష్యా వికలాంగ అథ్లెట్లు కూడా డోపింగ్ నిబంధనలను ఉల్లంఘించినట్టు ఐపీసీ వాదించింది. దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ తొలి టెస్టు డ్రా డర్బన్: దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగిసింది. వర్షం కారణంగా కేవలం రెండున్నర రోజుల పాటే జరిగిన ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 87.4 ఓవర్లలో 263 పరుగులకు ఆలౌటయ్యింది. అనంతరం తమ తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన కివీస్ గత శనివారం 12 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 15 పరుగులు చేసింది. లంచ్ విరామానికి ముందు వర్షం కురవడంతో ఆగిన మ్యాచ్ మరో మూడు రోజుల పాటు ఇదే స్థితి కొనసాగింది. ఆరో స్థానానికి భారత హాకీ జట్టు న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్‌లో క్వార్టర్ ఫైనల్లోనే ఇంటిదారి పట్టిన భారత పురుషుల హాకీ జట్టు ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఆరో స్థానానికి పడిపోయింది. ఒలింపిక్స్‌కంటే ముందు ఐదో స్థానంలో ఉన్న భారత్ ఈ మెగా ఈవెంట్ ప్రదర్శనతో ఒక స్థానం కిందకు పడిపోయింది. ఆస్ట్రేలియా జట్టు అగ్రస్థానంలో కొనసాగుతుండగా... ఒలింపిక్ చాంపియన్స్ అర్జెంటీనా ఏడో స్థానం నుంచి రెండో స్థానానికి ఎగబాకింది. మరోవైపు భారత మహిళల హాకీ జట్టు 12వ స్థానంలో నిలిచింది.