IND vs ENG 2nd Test: India Bundle Out England For 134, Take 195-Run First-Innings Lead - Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్‌‌కు‌ దారులన్నీ మూసుకుపోయినట్లే!

Published Mon, Feb 15 2021 2:27 AM | Last Updated on Mon, Feb 15 2021 11:35 AM

India take a 195-run lead after bowling out England for 134 in the 2nd Test - Sakshi

వేదిక అదే... పిచ్‌లు మాత్రం మారాయి... ఇప్పుడు సరిగ్గా వారం రోజుల వ్యవధిలో మైదానంలో సీన్‌ కూడా మారిపోయింది. తొలి టెస్టులో రెండు రోజులు ముగిసినా ఇంకా బ్యాటింగ్‌ చేస్తూ మనల్ని ఆడుకున్న ఇంగ్లండ్‌ ఇప్పుడు రెండో టెస్టులో రెండు రోజులు ముగిసేసరికి ఓటమి గురించి ఆలోచించాల్సిన పరిస్థితి! భారత్‌లో అసలైన స్పిన్‌ పిచ్‌ ఎలా ఉంటుందో చూపిస్తూ మన బౌలర్లు చెలరేగిపోవడంతో రూట్‌ సేన కుప్పకూలింది.

గింగిరాలు తిరుగుతూ వస్తున్న బంతుల్లో వేటిని ఆడాలో, వేటిని వదిలేయాలో అర్థం కాని సందిగ్ధ స్థితిలో వరుసగా వికెట్లు సమర్పించుకుంది. సొంత మైదానంలో అశ్విన్‌ ఐదు వికెట్లతో సత్తా చాటగా... అక్షర్‌ పటేల్, ఇషాంత్‌ శర్మ చెరో రెండు వికెట్లతో తమ వంతు పాత్ర పోషించారు. ఇప్పటికే భారత్‌ ఆధిక్యం 249 పరుగులకు చేరగా... చేతిలో తొమ్మిది వికెట్లతో సోమవారం టీమిండియా మరిన్ని పరుగులు సాధిస్తే ఇంగ్లండ్‌కు ఓటమి నుంచి తప్పించుకునే దారులన్నీ మూసుకుపోయినట్లే!

చెన్నై: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ను 1–1తో సమం చేసే దిశగా భారత్‌ మరింత పట్టు బిగించింది. మ్యాచ్‌ రెండో రోజు ఆదివారం కోహ్లి సేన బౌలింగ్‌కు తలవంచిన ఇంగ్లండ్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 59.5 ఓవర్లలో 134 పరుగులకే ఆలౌటైంది. వికెట్‌ కీపర్‌ బెన్‌ ఫోక్స్‌ (107 బంతుల్లో 42 నాటౌట్‌; 4 ఫోర్లు) ఒక్కడే కొంత పోరాడాడు. అశ్విన్‌ (5/43) ప్రత్యర్థిని దెబ్బ కొట్టాడు. ఫలితంగా భారత్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 195 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. అనంతరం టీమిండియా తమ రెండో ఇన్నింగ్స్‌లో ఆట ముగిసే సమయానికి వికెట్‌ నష్టానికి 54 పరుగులు చేసింది. శుబ్‌మన్‌ గిల్‌ (14) పెవిలియన్‌ చేరాడు. ప్రస్తుతం రోహిత్‌ శర్మ (25 బ్యాటింగ్‌), పుజారా (7 బ్యాటింగ్‌) క్రీజ్‌లో ఉన్నారు. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 300/6తో ఆట కొనసాగించిన భారత్‌ 329 పరుగులకు ఆలౌటైంది. రిషభ్‌ పంత్‌ (77 బంతుల్లో 58 నాటౌట్‌; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధసెంచరీతో సత్తా చాటాడు. మొత్తంగా రెండో రోజు ఆటలో 15 వికెట్లు నేలకూలాయి.  

7.5 ఓవర్లు...29 పరుగులు...
రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన భారత జట్టు మరో 7.5 ఓవర్లు ఆడి చివరి నాలుగు వికెట్లు కోల్పోయింది. మొత్తం 29 పరుగులు రాగా, పంత్‌ ఒక్కడే 25 పరుగులు సాధించాడు. ఒకదశలో ఆరు బంతుల వ్యవధిలో ఒక భారీ సిక్స్, రెండు ఫోర్లు బాదిన పంత్‌ 65 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే మరో ఎండ్‌లో బ్యాట్స్‌మెన్‌ విఫలం కావడంతో జట్టు ఇన్నింగ్స్‌ తొందరగానే ముగిసింది. అలీ వేసిన ఒకే ఓవర్లో అక్షర్‌ (5), ఇషాంత్‌ (0) అవుట్‌ కాగా... స్టోన్‌ వేసిన మరో ఓవర్లో కుల్దీప్‌ (0), సిరాజ్‌ (4) పెవిలియన్‌ చేరారు. 2008 (అహ్మదాబాద్‌లో దక్షిణాఫ్రికాపై) తర్వాత భారత జట్టులో నలుగురు బ్యాట్స్‌మెన్‌ డకౌట్‌ కావడం ఇదే తొలిసారి.

రూట్‌ విఫలం...
పిచ్‌ కొంత వరకు ఇబ్బందిగా ఉన్న మాట వాస్తవమే అయినా... ఇంగ్లండ్‌ వికెట్లు కోల్పోయిన బంతులు మాత్రం అంత ప్రమాదకరంగా కనిపించలేదు. పిచ్‌ పరిస్థితిని చూసి తొలి బంతి నుంచి ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్‌ ఒత్తిడిలో, ఒక రకమైన సందేహంలో ఆడటంతో జట్టు ఇన్నింగ్స్‌ కుప్పకూలింది. ఇన్నింగ్స్‌ మూడో బంతికే రోరీ బర్న్స్‌ (0)ను అవుట్‌ చేసి ఇషాంత్‌ భారత్‌కు శుభారంభం అందించాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే సిబ్లీ (16)ని అవుట్‌ చేసి అశ్విన్‌ తన వేట మొదలు పెట్టాడు. ఆ వెంటనే ఇంగ్లండ్‌కు అసలు దెబ్బ పడింది. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న, జట్టు రాతను మార్చగలిగే అవకాశం ఉన్న కెప్టెన్‌ జో రూట్‌ (6) పెవిలియన్‌ చేరాడు.

అక్షర్‌ రెండో ఓవర్లోనే తన ఫేవరెట్‌ స్వీప్‌ షాట్‌కు ప్రయత్నించిన రూట్‌ సరిగ్గా ఆడలేకపోవడంతో బంతి ఎడ్జ్‌ తీసుకొని షార్ట్‌ ఫైన్‌ లెగ్‌లో ఉన్న అశ్విన్‌ చేతుల్లోకి వెళ్లింది. లారెన్స్‌ (9) కూడా విఫలం కావడంతో లంచ్‌ సమయానికి ఇంగ్లండ్‌ 4 వికెట్లు కోల్పోయింది. విరామం తర్వాత అశ్విన్‌ చక్కటి బంతికి స్టోక్స్‌ (18) బౌల్డ్‌ కాగా, మ్యాచ్‌లో తాను వేసిన తొలి బంతికే ఒలీ పోప్‌ (22)ను సిరాజ్‌ అవుట్‌ చేశాడు. మరో వైపు వికెట్‌ కీపర్‌ ఫోక్స్‌ మాత్రమే కొంత పట్టుదల కనబర్చాడు. భారత బౌలర్లను అతను సమర్థంగా ఎదుర్కొంటూ కొన్ని పరుగులు రాబట్టగలిగాడు. అయితే మరో ఎండ్‌లో మొయిన్‌ అలీ (6), స్టోన్‌ (1), లీచ్‌ (5) ఎక్కువ సేపు నిలబడలేకపోయారు. బ్రాడ్‌ (0)ను బౌల్డ్‌ చేసిన అశ్విన్‌ తన ఖాతాలో ఐదో వికెట్‌ వేసుకోవడంతో పాటు ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ను ముగించాడు.  

రోహిత్‌ అదృష్టం...
రెండో ఇన్నింగ్స్‌లో రోహిత్, గిల్‌ కలిసి చకచకా పరుగులు జోడించారు. స్టోన్‌ ఓవర్లో రోహిత్‌ సిక్స్‌ బాదగా, అలీ బౌలింగ్‌లో గిల్‌ మరో సిక్స్‌ కొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఒక్క పొరపాటు కూడా చేయని ఇంగ్లండ్‌ కీపర్‌ ఫోక్స్‌ చేసిన చిన్న తప్పుతో రోహిత్‌కు కాస్త అదృష్టం కలిసొచ్చింది. రోహిత్‌ 20 పరుగుల వద్ద ఉన్నప్పుడు అలీ బౌలింగ్‌లో ముందుకొచ్చి షాట్‌ ఆడేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. అయితే బంతిని సరైన సమయంలో ఫోక్స్‌ అందుకోలేకపోవడంతో స్టంపింగ్‌ అవకాశం చేజారింది. అనంతరం లీచ్‌ బౌలింగ్‌లో గిల్‌ వికెట్ల ముందు దొరికిపోయాడు. అతను రివ్యూ చేసినా లాభం లేకపోయింది. అనంతరం రోహిత్, పుజారా కలిసి జాగ్రత్తగా ఆడుతూ రెండో రోజు ఆటను ముగించారు. ఈ క్రమంలో రోహిత్‌ 22 పరుగుల వద్ద ఉన్నప్పుడు కూడా లీచ్‌ బౌలింగ్‌లో రివర్స్‌ స్వీప్‌ చేయడానికి ప్రయత్నించినప్పుడు అంపైర్‌ ఎల్బీడబ్ల్యూగా ప్రకటించాడు. దీనిపై రోహిత్‌ రివ్యూ కోరాడు. రీప్లేలో బంతి బ్యాట్‌ను తాకినట్లుగా తేలడంతో అంపైర్‌ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది.

‘మళ్లీ అంపైరింగ్‌ వివాదం’
మ్యాచ్‌ రెండో రోజు కూడా అంపైర్లు తీసుకున్న నిర్ణయం తీవ్ర చర్చకు దారి తీసింది. రోహిత్‌ 21 పరుగుల వద్ద ఉన్నప్పుడు అలీ వేసిన బంతి అతని ముందు ప్యాడ్‌ను తాకి కవర్స్‌ దిశగా వెళ్లింది. ఆ సమయంలో రోహిత్‌ షాట్‌ ఆడేందుకు ప్రయత్నించలేదు (నాట్‌ ఆఫర్డ్‌ షాట్‌). అతని బ్యాట్‌ కూడా ప్యాడ్‌ల వెనకే ఉంది. ఇంగ్లండ్‌ ఎల్బీ కోసం అప్పీల్‌ చేయగా అంపైర్‌ వీరేందర్‌ శర్మ స్పందించలేదు. రోహిత్‌ షాట్‌ ఆడేందుకు ప్రయత్నించాడు కాబట్టి నాటౌట్‌ అంటూ అతను చెప్పాడు. దాంతో రూట్‌ రివ్యూ కోరాడు. వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నా కూడా... ఆశ్చర్యకరంగా రీప్లేలో కూడా మూడో అంపైర్‌ అనిల్‌ శర్మ ‘రోహిత్‌ షాట్‌ ఆడేందుకు ప్రయత్నించాడు’ అంటూ ఫీల్డ్‌ అంపైర్‌తో ఏకీభవిస్తూ అతని నిర్ణయమే సరైందిగా తేల్చాడు. రీప్లేలో బంతి ప్రభావం ఆఫ్‌ స్టంప్‌ బయట ఉన్నట్లుగా చూపినా... బాల్‌ ట్రాకర్‌ మాత్రం బంతి స్టంప్స్‌ను తాకేదని చూపించింది. షాట్‌ ఆడనప్పుడు ప్రభావం ఎక్కడ ఉన్నా అవుటయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని భావించడం సహజం. దీని ప్రకారం రోహిత్‌ అవుట్‌ అని బలంగా నమ్మిన ఇంగ్లండ్‌ చివరకు నిరాశ చెందాల్సి వచ్చింది.

నువు విజిలేస్తే..
చాలా రోజుల తర్వాత ప్రేక్షకులను మైదానంలో చూసిన భారత కెప్టెన్‌ కోహ్లికి కూడా జోష్‌ వచ్చినట్లుంది. పైగా అప్పటికే ఇంగ్లండ్‌ టీమ్‌ సగం వికెట్లు కోల్పోయి టీమిండియా ఉత్సాహాన్ని మరింత పెంచింది. దాంతో విరాట్‌ ప్రేక్షకులను మరింత ఉత్సాహపరిచాడు. తాను ఈల కొడుతూ వారిని కూడా అలాగే విజిల్‌ వేయమంటూ సైగలు చేయడం విశేషం.

► భారత గడ్డపై అశ్విన్‌ వికెట్ల సంఖ్య 268 . హర్భజన్‌ సింగ్‌ (265)ను అతను అధిగమించగా, అనిల్‌ కుంబ్లే (350) అగ్రస్థానంలో ఉన్నాడు.  

► ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టడం అశ్విన్‌కు ఇది 29వసారి. ఇందులో 23 ప్రదర్శనలు భారత్‌లోనే వచ్చాయి.  

► అశ్విన్‌ అవుట్‌ చేసిన ఎడంచేతి వాటం బ్యాట్స్‌మెన్‌ సంఖ్య. అతను తీసిన వికెట్లలో 51.2 శాతం లెఫ్ట్‌ హ్యాండర్లు ఉండటం విశేషం.  

► భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ ఒక్క అదనపు పరుగు కూడా ఇవ్వలేదు. ఎక్స్‌ట్రాలు లేకుండా ఒక జట్టు చేసిన అత్యధిక స్కోరు (329) ఇదే కావడం విశేషం.  

► ఆలౌట్‌ అయిన సందర్భంలో భారత్‌లో ఇంగ్లండ్‌ జట్టుకు ఇది రెండో అత్యల్ప స్కోరు. 1981లో ఆ జట్టు 102 పరుగులు చేసింది.

స్కోరు వివరాలు
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: రోహిత్‌ (సి) అలీ (బి) లీచ్‌ 161; గిల్‌ (ఎల్బీ) (బి) స్టోన్‌ 0; పుజారా (సి) స్టోక్స్‌ (బి) లీచ్‌ 21; కోహ్లి (బి) అలీ 0; రహానే (బి) అలీ 67; పంత్‌ (నాటౌట్‌) 58; అశ్విన్‌ (సి) పోప్‌ (బి) రూట్‌ 13; అక్షర్‌ (స్టంప్డ్‌) ఫోక్స్‌ (బి) అలీ 5; ఇషాంత్‌ (సి) బర్న్స్‌ (బి) అలీ 0; కుల్దీప్‌ (సి) ఫోక్స్‌ (బి) స్టోన్‌ 0; సిరాజ్‌ (సి) ఫోక్స్‌ (బి) స్టోన్‌ 4; ఎక్స్‌ట్రాలు 0, మొత్తం (95.5 ఓవర్లలో ఆలౌట్‌) 329.  
వికెట్ల పతనం: 1–0, 2–85, 3–86, 4–248, 5–249, 6–284, 7–301, 8–301, 9–325, 10–329.
బౌలింగ్‌: బ్రాడ్‌ 11–2–37–0, స్టోన్‌ 15.5–5–47–3, లీచ్‌ 27–3–78–2, స్టోక్స్‌ 2–0–16–0, మొయిన్‌ అలీ 29–3–128–4, రూట్‌ 11–3–23–1.  

ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌: బర్న్స్‌ (ఎల్బీ) (బి) ఇషాంత్‌ 0; సిబ్లీ (సి) కోహ్లి (బి) అశ్విన్‌ 16; లారెన్స్‌ (సి) గిల్‌ (బి) అశ్విన్‌ 9; రూట్‌ (సి) అశ్విన్‌ (బి) అక్షర్‌ పటేల్‌ 6; బెన్‌ స్టోక్స్‌ (బి) అశ్విన్‌ 18; పోప్‌ (సి) పంత్‌ (బి) సిరాజ్‌ 22; ఫోక్స్‌ (నాటౌట్‌) 42; మొయిన్‌ అలీ (సి) రహానే (బి) అక్షర్‌ పటేల్‌ 6; స్టోన్‌ (సి) రోహిత్‌ శర్మ (బి) అశ్విన్‌ 1; లీచ్‌ (సి)  రిషభ్‌ పంత్‌ (బి) ఇషాంత్‌ 5; స్టువర్ట్‌ బ్రాడ్‌ (బి) అశ్విన్‌ 0; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (59.5 ఓవర్లలో ఆలౌట్‌) 134.  
వికెట్ల పతనం: 1–0, 2–16, 3–23, 4–39, 5–52, 6–87, 7–105, 8–106, 9–131, 10–134.
బౌలింగ్‌: ఇషాంత్‌ శర్మ 5–1–22–2, అశ్విన్‌ 23.5–4–43–5, అక్షర్‌ పటేల్‌ 20–3–40–2, కుల్దీప్‌  యాదవ్‌ 6–1–16–0, సిరాజ్‌ 5–4–5–1.  

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: రోహిత్‌ శర్మ (బ్యాటింగ్‌) 25; శుబ్‌మన్‌ గిల్‌ (ఎల్బీ) (బి) లీచ్‌ 14; చతేశ్వర్‌  పుజారా (బ్యాటింగ్‌) 7; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (18 ఓవర్లలో వికెట్‌ నష్టానికి) 54.  
వికెట్ల పతనం: 1– 42.
బౌలింగ్‌: స్టోన్‌ 2–0–8–0, లీచ్‌ 9–2–19–1, మొయిన్‌ అలీ 7–2–19–0.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement