అంతా అశ్విన్‌మయం... | India in West Indies 2016: Ravichandran Ashwin says he expected a handsome return from test series | Sakshi
Sakshi News home page

అంతా అశ్విన్‌మయం...

Published Wed, Aug 24 2016 12:38 AM | Last Updated on Mon, Sep 4 2017 10:33 AM

అంతా అశ్విన్‌మయం...

అంతా అశ్విన్‌మయం...

రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన తర్వాత గత ఐదేళ్లలో భారత్ 7 టెస్టు సిరీస్‌లు నెగ్గింది. అందులో 6 సార్లు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు అతనికే దక్కిందంటే మన విజయాల్లో అశ్విన్ పాత్ర ఏమిటో అర్థమవుతుంది. గతంలో తన స్పిన్‌తోనే ప్రత్యర్థిని ముప్పుతిప్పులు పెట్టిన ఈ చెన్నై స్టార్ ఈసారి బ్యాటింగ్‌లో కూడా చెలరేగి వెస్టిండీస్‌ను ఒక ఆటాడుకున్నాడు. అశ్విన్‌కు అండగా ఇతర ఆటగాళ్లు కూడా ఆకట్టుకోవడంతో తాజా సిరీస్‌లో టీమిండియా ప్రత్యర్థిపై పూర్తి ఆధిక్యం ప్రదర్శించింది.
 
* ఆల్‌రౌండర్‌గా అద్భుత ప్రదర్శన   
* ఏకపక్షంగా సాగిన భారత్, విండీస్ సిరీస్

సాక్షి క్రీడా విభాగం: భారత జట్టు వెస్టిండీస్‌లో అడుగుపెట్టిన సమయంలో మన జట్టు సిరీస్ విజయంపై ఎవరికీ అనుమానాల్లేవు. వరుసగా రెండు సిరీస్‌లు నెగ్గడంతో పాటు పటిష్టమైన బృందంతో కోహ్లి సేన అక్కడికి చేరింది. మరోవైపు విండీస్ టెస్టు జట్టు ఆటపై కూడా పెద్దగా అంచనాలు లేవు కాబట్టి పోటీ ఏకపక్షమే కావచ్చని అనిపించింది.

ఈ నాలుగు టెస్టుల సిరీస్ దాదాపు అలాగే సాగింది. ఫలి తంగా విండీస్ గడ్డపై భారత్ వరుసగా మూడో టెస్టు సిరీస్‌ను గెలుచుకుంది. మొత్తంగా ఆ జట్టుపై ఇది వరుసగా టీమిండియాకు ఆరో సిరీస్ విజయం. విండీస్ చేతిలో 2002 తర్వాత భారత్ వరుసగా 19 టెస్టులలో ఓడిపోలేదు. గతంలో 17 మ్యాచ్‌ల పాటు శ్రీలంక చేతిలో ఓడని రికార్డును కోహ్లి సేన ఈ సిరీస్‌లో సవరించడం విశేషం.
 
రికార్డుతో ఆరంభం...
ఉపఖండం బయట అతి పెద్ద విజయంతో భారత్ సిరీస్‌లో బోణీ చేసింది. విరాట్ కోహ్లి తొలి డబుల్ సెంచరీతో జట్టును ముందుండి నడిపించాడు. ఇన్నింగ్స్, 92 పరుగుల ఈ గెలుపు సిరీస్‌పై మన పట్టును ప్రదర్శించింది. ఈ సిరీస్ మొత్తం వెస్టిండీస్ పోరాటం గురించి చెప్పుకోవాల్సింది ఏదైనా ఉంటే అది రెండో టెస్టులోనే. వాస్తవానికి ఒక రోజు మొత్తం వర్షం బారిన పడటం కూడా ఆ జట్టుకు కలిసొచ్చింది. అయితే రోస్టన్ ఛేజ్ సెంచరీతో పోరాడకపోయి ఉంటే ఈ మ్యాచ్ కూడా భారత్ గెలిచేది.

ఆఖరి రోజు 88 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే తీయగలగడం మాత్రం భారత్ వైఫల్యంగా చెప్పవచ్చు. కానీ మూడో టెస్టులో అద్భుత ప్రదర్శనతో టీమిండియా తగిన రీతిలో జవాబిచ్చి సిరీస్‌ను గెలుచుకుంది. మళ్లీ ఒక రోజు ఆట కోల్పోయినా... భువనేశ్వర్ స్వింగ్ దెబ్బకు విండీస్ 237 పరుగుల తేడాతో చిత్తయింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 126 పరుగులకే 5 వికెట్లు కోల్పోయినా భారత్ కోలుకున్న తీరు అసమానం. ఈ ఫామ్‌తో కోహ్లి సేన చివరి టెస్టు కూడా గెలిచి నంబర్‌వన్‌ను నిలబెట్టుకోగలిగేదేమో.
 
అశ్విన్ అదరహో...
గెలిచిన రెండు టెస్టుల్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అశ్విన్‌కే దక్కింది. తొలి టెస్టులో సెంచరీతో కోహ్లికి అండగా నిలిచిన అతను, రెండో ఇన్నింగ్స్‌లో 7 వికెట్లతో ప్రత్యర్థిని కుప్పకూల్చాడు. మూడో టెస్టులో కీలక సమయంలో బ్యాటింగ్‌లో పోరాటపటిమ కనబర్చి మరో శతకం బాదాడు. 58.75 సగటుతో 4 ఇన్నింగ్స్‌లలో 235 పరుగులు చేసిన అశ్విన్, 23.17 సగటుతో 17 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. ఆరో స్థానంలో అశ్విన్ అద్భుత బ్యాటింగ్‌తో కోహ్లికి బెంగ తీరిపోయింది. తన ఐదుగురు బౌలర్ల వ్యూహాన్ని ఇక ముందు కూడా అమలు చేసే అవకాశం దక్కింది. ‘వ్యక్తిగతంగా నాకు ఇదో మంచి సిరీస్ అవుతుందని ముందే ఊహించాను.

రెండు సెంచరీలు సాధిస్తానని అనుకోకపోయినా, కీలక సమయంలో బ్యాటింగ్‌తో కూడా జట్టుకు ఉపయోగపడటం గర్వంగా ఉంది’ అని అశ్విన్ చెప్పాడు. రాహుల్, రహానే కూడా ఒక్కో సెంచరీతో మెరిసినా... మూడో టెస్టులో సాహా చేసిన శతకం జట్టులో అతడి స్థానాన్ని సుస్థిరం చేసింది. ఇక గాయాల తర్వాత పునరాగమనం చేసిన షమీ (11 వికెట్లు) చెలరేగడంతో జట్టు పేస్ బౌలింగ్ మరింత పటిష్టంగా కనిపించింది.
 
అశ్విన్ అరుదైన ఘనత
సచిన్ తన కెరీర్‌లో 78 సిరీస్‌లలో, సెహ్వాగ్ 38 సిరీస్‌లో ఐదేసి ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు గెలుచుకున్నారు. అయితే కేవలం 13 సిరీస్‌లే ఆడిన అశ్విన్ వారిద్దరినీ దాటి 6 సిరీస్ అవార్డులు సాధించడం విశేషం.
 
భారత్ ర్యాంకుల కోసమే ఆడదు: కెప్టెన్ కోహ్లి
భారీ వర్షం కారణంగా నాలుగో టెస్టు డ్రా కావడంతో భారత జట్టు ఐసీసీ నంబర్‌వన్ ర్యాంక్‌ను పాకిస్తాన్‌కు కోల్పోయింది. అయితే ఇదేమీ పెద్ద విషయం కాదని జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి కొట్టి పారేశాడు. మన జట్టు ఎంత బాగా ఆడుతోందనేదే ముఖ్యమని అతను అన్నాడు. ‘ర్యాంకులు తరచూ మారుతూ ఉంటాయి. అది తాత్కాలికం. ఇతర జట్లతో పోలిస్తే మేం తక్కువ మ్యాచ్‌లు ఆడాం. ఏదో ఒక టెస్టు తర్వాత అని కాకుండా సీజన్ మొత్తం ముగిసిన తర్వాత మేం ఏ స్థానంలో నిలిచామో చూసుకుంటాం. భారత జట్టు ర్యాంకుల కోసం ఆడదు.

మంచి ఆటతీరు కనబర్చి ప్రపంచంలో అత్యుత్తమ జట్టుగా ఎదగాలనేదే మా లక్ష్యం’ అని కోహ్లి వ్యాఖ్యానించాడు. ఈ సిరీస్ ద్వారా జట్టుకు ఎంతో మేలు జరిగిందన్న కోహ్లి... అశ్విన్, సాహా బ్యాటింగ్‌పై ప్రశంసలు కురిపించాడు. చివరి టెస్టులో అనూహ్యంగా నలుగురే బౌలర్లతో ఆడటంపై వివరణ ఇస్తూ, రాబోయే సిరీస్‌ల కోసం కావాలనే ప్రయోగం చేసినట్లు వెల్లడించాడు. మరో వైపు సరైన డ్రైనేజీ వసతులు లేక పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో నాలుగో టెస్టులో కేవలం 22 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యం కావడంపై ట్రినిడాడ్ అండ్ టొబాగో క్రికెట్ బోర్డు విచారణకు ఆదేశించింది.
 
పారాలింపిక్స్‌లోనూ రష్యాకు నో చాన్స్
జెనీవా: డోపింగ్ నేపథ్యంలో తమపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాల్సిందిగా రష్యా పారాలింపిక్ కమిటీ చేసుకున్న అప్పీల్‌ను క్రీడా మధ్యవర్తిత్వ కోర్టు (సీఏఎస్) తోసిపుచ్చింది. దీంతో రియో పారాలింపిక్స్‌లోనూ రష్యా పాల్గొనే అవకాశం లేకుండా పోయింది. ప్రభుత్వ మద్దతుతోనే రష్యా అథ్లెట్లు డోపింగ్‌కు పాల్పడుతున్నట్టు తేలిన నేపథ్యంలో అంతర్జాతీయ పారాలింపిక్ కమిటీ (ఐపీసీ) ఈనెల 7న నిషేధం విధించింది. రష్యా వికలాంగ అథ్లెట్లు కూడా డోపింగ్ నిబంధనలను ఉల్లంఘించినట్టు ఐపీసీ వాదించింది.
 
దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ తొలి టెస్టు డ్రా
డర్బన్: దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగిసింది. వర్షం కారణంగా కేవలం రెండున్నర రోజుల పాటే జరిగిన ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 87.4 ఓవర్లలో 263 పరుగులకు ఆలౌటయ్యింది. అనంతరం తమ తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన కివీస్ గత శనివారం 12 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 15 పరుగులు చేసింది. లంచ్ విరామానికి ముందు వర్షం కురవడంతో ఆగిన మ్యాచ్ మరో మూడు రోజుల పాటు ఇదే స్థితి కొనసాగింది.  
 
ఆరో స్థానానికి భారత హాకీ జట్టు
న్యూఢిల్లీ:
రియో ఒలింపిక్స్‌లో క్వార్టర్ ఫైనల్లోనే ఇంటిదారి పట్టిన భారత పురుషుల హాకీ జట్టు ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఆరో స్థానానికి పడిపోయింది. ఒలింపిక్స్‌కంటే ముందు ఐదో స్థానంలో ఉన్న భారత్ ఈ మెగా ఈవెంట్ ప్రదర్శనతో ఒక స్థానం కిందకు పడిపోయింది. ఆస్ట్రేలియా జట్టు అగ్రస్థానంలో కొనసాగుతుండగా... ఒలింపిక్ చాంపియన్స్ అర్జెంటీనా ఏడో స్థానం నుంచి రెండో స్థానానికి ఎగబాకింది. మరోవైపు భారత మహిళల హాకీ జట్టు 12వ స్థానంలో నిలిచింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement