హిందీ జాతీయ భాష కాదు.. అశ్విన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు | Hindi Is Not A National Language, Its An Official Language, Ravi Ashwin Sparks Language Row | Sakshi
Sakshi News home page

హిందీ జాతీయ భాష కాదు.. అశ్విన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు

Published Fri, Jan 10 2025 3:09 PM | Last Updated on Fri, Jan 10 2025 3:14 PM

Hindi Is Not A National Language, Its An Official Language, Ravi Ashwin Sparks Language Row

ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన భారత దిగ్గజ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ తమిళనాడులో జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమంలో హిందీ బాషను ఉద్దేశిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. చెన్నైలోని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీ గ్రాడ్యుయేషన్‌ సెర్మనీలో యాష్‌ మాట్లాడుతూ.. హిందీ జాతీయ భాష కాదు. అది కేవలం అధికారిక భాష మాత్రమే అంటూ వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం దూమారం రేపుతున్నాయి. దేశవ్యాప్తంగా ఈ అంశంపై చర్చ నడుస్తుంది.

అసలు ఏం జరిగిందంటే.. కాంచీపురంలోని రాజలక్ష్మీ ఇంజనీరింగ్‌ కాలేజీ  గ్రాడ్యుయేషన్‌ సెర్మనీకి అశ్విన్‌ ముఖ్య అతిధిగా హాజరయ్యాడు. ఈ కార్యక్రమంలో యాష్‌ విద్యార్థులను ఉద్దేశిస్తూ ప్రసంగం చేశాడు. యాష్‌ తన ప్రసంగం ప్రారంభించడానికి ముందు ఏ భాష అయితే మీకు కంఫర్ట్‌గా ఉంటుందని స్టూడెంట్స్‌ను అడిగాడు. 

ఇంగ్లిష్‌, తమిళ్‌, హిందీ భాషల్లో ఏదో ఒక దాన్ని ఎంచుకోవాలని కోరాడు. తమిళ్‌, ఇంగ్లిష్‌ అని అశ్విన్‌ చెబుతుండగా ప్రేక్షకుల నుంచి విపరీతమైన రెస్పాన్స్‌ వచ్చింది. అదే హిందీ పేరు ఎత్తగానే ఆడిటోరియం మొత్తం మూగబోయింది. ఈ సందర్భంగా అశ్విన్‌ హిందీ జాతీయ భాష కాదు, అధికారిక భాష మాత్రమే అని వ్యాఖ్యానించాడు.  

అశ్విన్‌ మాటల్లో.. "హిందీ మన జాతీయ భాష కాదు. అది అధికారిక భాష మాత్రమే. ఈ విషయాన్ని నేను చెప్పాలని అనుకున్నాను" అశ్విన్‌ ఈ విషయాన్ని ప్రస్తావించిన వెంటనే తమిళ ప్రేక్షకుల నుండి విపరీతమైన రెస్పాన్స్‌ వచ్చింది. యాష్‌ ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశాడో కానీ, ఈ అంశం ప్రస్తుతం సోషల్‌మీడియాలో తీవ్ర చర్చకు దారి తీసింది. అశ్విన్ లాంటి వ్యక్తి ఇలాంటి సున్నితమైన అంశాలపై (భాష) వ్యాఖ్యలు చేయడం సరికాదని కొందరు అభిప్రాయపడుతున్నారు.

కాగా, భాషా వైవిధ్యానికి ప్రసిద్ధి చెందిన భారతదేశం, రాజ్యాంగం ప్రకారం 22 షెడ్యూల్డ్ భాషలను గుర్తిస్తుంది. ఇండియాలో ఇంగ్లిష్‌తో పాటు హిందీ అధికారిక భాష హోదాను కలిగి ఉంది. భారత్‌లో హిందీ సహా ఏ భాషకు జాతీయ భాష హోదా లేదు.  

అధికారిక భాష, జాతీయ భాష మధ్య వ్యత్యాసాన్ని తరచుగా తప్పుగా అర్థం చేసుకుంటుంటారు. ఇది విస్తృత చర్చలకు దారితీస్తుంది. సంవత్సరాలుగా హిందీని ఏకీకృత భాషగా ప్రోత్సహించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. హిందీ మాట్లాడని రాష్ట్రాలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

ఇదిలా ఉంటే, బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో బ్రిస్బేన్ టెస్ట్ అనంతరం అశ్విన్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు అకస్మాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించాడు. 2011 వన్డే ప్రపంచ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన భారత జట్లలో భాగమైన అశ్విన్.. టీమిండియా తరఫున 106 టెస్ట్‌లు, 116 వన్డేలు, 65 టీ20లు ఆడాడు. టెస్ట్‌ల్లో 537 వికెట్లు తీసి భారత్‌ తరఫున రెండో లీడింగ్‌ వికెట్‌ టేకర్‌గా ఉన్న యాష్‌.. వన్డేల్లో 156, టీ20ల్లో 72 వికెట్లు తీశాడు. 38 ఏళ్ల అశ్విన్‌ తదుపరి ఐపీఎల్‌ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడనున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement