ధీరూభాయ్ కి పద్మ విభూషణ్
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు దివంగత ధీరూభాయ్ అంబానీకి ప్రకటితమైన దేశంలోనే రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ను ఆయన సతీమణి కోకిలాబెన్ రాష్ట్రపతిభవన్లో సోమవారం జరిగిన ఒక కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా అందుకున్నారు. ఈ కార్యక్రమానికి అంబానీ కుటుంబసభ్యులు, ఇతర ప్రముఖులు, రాజకీయ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కోకిలాబెన్ మాట్లాడుతూ.. ఆయన మానవత్వంతో చాలా సాధారణ జీవితం గడిపారని, దేశం కోసం కష్టపడ్డారని చెప్పారు.
తన భర్తకు ఈ అరుదైన గౌరవాన్ని కల్పించిన ప్రణబ్ ముఖర్జీకి, ప్రధాని మోదీకి, కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ‘నా భారతావనిలో చాలా మంది ధీరూభాయ్లు జన్మించాలి. వారు దేశ సామాజికార్థికాభివృద్ధిలో భాగస్వాములు కావాలి. యవత్తు ప్రజానికానికి వారి సేవలు తోడ్పాటునందించాలి’ అని ఆమె ఆకాంక్షించారు. ధీరూభాయ్కి పద్మ విభూషణ్ లభించడం భారతీయ వాణిజ్యతత్వ ఆకాంక్షకి, ఏ పనినైనా అత్యుత్తమంగా చేయాలనే లక్షణానికి గౌరవంగా భావిస్తున్నానని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ తెలిపారు. ‘గొప్ప వ్యాపారవేత్త, సంపద సృష్టి కర్త అయిన మా నాన్నకు లభించిన అరుదైన గుర్తింపు ఈ పురస్కారం’ అని రిలయన్స్ గ్రూప్ అధినేత అనిల్ అంబానీ పేర్కొన్నారు.