కట్నం వేధింపులతో అబల బలి
రామడుగు : అత్తింటి వారి కట్నం వేధింపులు మారాజు మౌనిక(23)ను బలితీసుకున్నాయి. పోలీసులు, కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. రామడుగు మండలం కొక్కెరకుంట గ్రామానికి చెందిన మౌనికను గంగాధర మండలం గట్టుబూత్కుర్ గ్రామానికి చెందిన మారాజు రాజుకు ఇచ్చి రెండేళ్ల క్రితం వివాహం జరిపించారు. ఏడునెలల క్రితం వీరికి కూతురు జన్మించింది. అప్పట్నుంచి మౌనికకు వేధింపులు ప్రారంభమయ్యాయి. రూ.లక్ష కట్నం తేవాలంటూ భర్త రాజు, మామ రాజయ్య, అత్త పోషవ్వ కలిసి మౌనికను వేధిస్తున్నారు. వేధింపులు తాళలేక మౌనిక శుక్రవారం క్రిమిసంహారక మందు తాగింది. పరిస్థితి విషమించడంతో కుటుంబసభ్యులు కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందించినా పరిస్థితి విషమించి చనిపోయిందని ఎస్సై ఎన్.నరేష్‌రెడ్డి తెలిపారు. మృతురాలు తండ్రి రాజయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆమె భర్త, మామ, అత్తపై కేసు నమోదు చేశామని పేర్కొన్నారు.