kolaru
-
అవినీతికి ప్రతీక అదానీ.. రాహుల్ విమర్శల వర్షం
కోలారు: అదానీపై చూపిస్తున్న ప్రేమను ప్రధాని మోదీ పేద ప్రజలపై ఇసుమంతైనా చూపించడం లేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఆదివారం కర్ణాటకలోని కోలారు పట్టణంలో నిర్వహించిన జై భారత్ సభలో ప్రధాని మోదీపై ఆయన విమర్శల వర్షం కురిపించారు. గతంలో కోలారులోనే మోదీపై ఆరోపణలు చేసిన కేసులో రాహుల్‌కు జైలుశిక్ష పడి లోక్‌సభ సభ్యత్వం రద్దయిన విషయం తెలిసిందే. ఆదివారం ఇక్కడ జరిగిన మొదటి ఎన్నికల సభలో ఆయన ప్రసంగిస్తూ బీజేపీ హయాంలో జరిగిన అభివృద్ధి శూన్యమన్నారు. తన ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేసి, జైలుపాలు చేసినా ప్రభుత్వాన్ని చూసి భయపడేది లేదని స్పష్టం చేశారు. అదానీ అవినీతికి మారుపేరని పేర్కొన్నారు. ‘అదానీ విమానంలో ప్రధాని మోదీ అత్యంత రిలాక్స్ మూడ్‌లో ఎందుకు కూర్చుంటారు? అదానీ కంపెనీలో చైనా డైరెక్టర్ ఎందుకు ఉన్నారు?’అని రాహుల్ ప్రశ్నించారు. మోదీ, అదానీ సంబంధాలపై ప్రశ్నించినప్పుడల్లా బీసీ వర్గాన్ని అవమానించానంటూ తనవైపు వేలెత్తి చూపుతున్నారని విమర్శించారు. -
డేంజర్ జోన్లో 6 జిల్లాలు
బనశంకరి: రాష్ట్రంలో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టకపోవడంతో ప్రభుత్వం లాక్డౌన్ విధించినప్పటికీ పెద్ద ప్రయోజనం కనబడడం లేదు. దేశంలోని 52 జిల్లాలు డేంజర్‌జోన్‌లో ఉండగా అక్కడ 100 శాతానికి పైగా కేసుల వృద్ధి నమోదవుతోంది. వాటిలో కర్ణాటకలోని 6 జిల్లాలున్నాయి. ఏప్రిల్ 14 నుంచి ఇప్పటివరకు 52 జిల్లాల్లో విచ్చలవిడిగా కరోనా కేసులు పెరుగుతున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ గుర్తించింది. అందులో దేశంలోని మహానగరాలను వెనక్కినెట్టి రాష్ట్రంలోని 6 జిల్లాలు ముందువరుసలో నిలిచాయి. కొడగుకు దేశంలోనే 3వ స్థానం.. దేశంలో అత్యధిక కరోనా కేసుల వృద్ధి ఉన్న జిల్లాల్లో 3వ స్థానంలో రాష్ట్రంలోని కాఫీనాడు కొడగు జిల్లా ఉంది. కొడగు 184 శాతం కేసుల వృద్ధిరేటు కలిగి ఉంది. తుమకూరు 146 శాతం, కోలారు 136 శాతం, మండ్య 118 శాతం, రామనగర 102 శాతం, చామరాజనగర 143 శాతం వృద్ధి రేటు కలిగి ఉన్నాయి. ఇక్కడ ఫుల్ లాక్డౌన్ శివాజీనగర: ప్రధాని నరేంద్ర మోదీ సీఎంలతో, కలెక్టర్లతో తాజా సమావేశం తరువాత రాష్ట్రంలో పలు జిల్లాల్లో గురువారం నుంచి సంపూర్ణ లాక్డౌన్ మొదలైంది. కరోనా ప్రభంజనాన్ని అడ్డుకోవడానికి ఇప్పటికే మే 24 వరకు సడలింపులతో లాక్డౌన్ జారీలో ఉంది. కేసులు తీవ్రం కావడంతో ఉమ్మడి బళ్లారి జిల్లా, హాసన్, కల్బుర్గి, కొప్పళ, శివమొగ్గ, చిక్కబళ్లాపుర జిల్లాల్లో 4 రోజుల పాటు కఠిన లాక్డౌన్ అమలు కాబోతోంది. ఈ సమయంలో కిరాణా షాపులు కూడా తెరవనివ్వరు. -
చితి పేర్చుకుని ఇంజినీరు ఆత్మాహుతి
లంచం కేసులో అరెస్టయ్యానని ఆవేదనతో ఘాతుకం సాక్షి, చింతామణి : లంచం తీసుకోవడం.. అతని జీవితాన్ని అగ్నికి ఆహుతి చేసింది. లంచం తీసుకుంటూ లోకాయుక్తకు చిక్కి జైలుకు వెళ్లిన ఓ ఇంజినీర్ కట్టెలతో చితి ఏర్పాటు చేసుకొని సజీవదహనమయ్యాడు. ఈ ఘటన బుధవారం కర్ణాటకలో కోలారు జిల్లా చింతామణి తాలూకాలోని వంగామాల గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన శ్రీనాథ్‌రెడ్డి (27) బాగేపల్లి తాలూకాలో ఉపాధి హామీ పథకంలో సహాయక ఇంజినీర్‌గా పని చేస్తుండేవాడు. ఏడాది కిందటే ఉద్యోగంలో చేరాడు. ఆరునెలల క్రితం ఒక రైతు నుంచి లంచం తీసుకుంటూ లోకాయుక్తకు పట్టుబడి జైలు పాలయ్యాడు. కొద్దిరోజుల అనంతరం బెయిల్‌పై బయటకు వచ్చిన శ్రీనాథ్ ఎవరితోనూ కలవకుండా మథనపడుతూ ఉండేవాడు. తాను చేయని తప్పునకు బలయ్యానని ఆవేదన చెందేవాడు. జైలుకు వెళ్లడాన్ని జీర్ణించుకులేకపోయిన శ్రీనాథ్ మంగళవారం అర్ధరాత్రి అందరూ పడుకున్నాక, ఇంటి సమీపంలో కట్టెలకుప్ప పేర్చి దానిపై పడుకొని ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పటించుకొని సజీవ దహనమయ్యాడు. రాత్రి తల్లితో వాగ్వాదం జరిగినట్లు ఇరుగుపొరుగు తెలిపారు. ఉదయం అందరూ చితిని చూడగానే కలకలం రేగింది. భట్లపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. వీరిది సాధారణ రైతు కుటుంబం. తండ్రి వెంకటరెడ్డి గతంలో మరణించగా, తల్లి సరోజమ్మ ఉన్నారు. కుమారుని మరణంతో తల్లి, బంధువుల రోదనలు మిన్నంటాయి. -
కోలారు కీర్తి కిరీటం కేఆర్ నందిని
► సివిల్స్ ప్రథమ ర్యాంకర్ నందినికి ఘన సన్మానం కోలారు: యూపీఎస్సీలో ప్రతిభ చాటి దేశ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన కోలారువాసి కేఆర్ నందిని ప్రతిభాపాటవాలు జిల్లాకే గర్వకారణమని వక్తలు కొనియాడారు. నగరంలోని టి.చన్నయ్య రంగమందిరంలో జిల్లా ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో శనివారం నందినిని ఘనంగా సన్మానించారు. సంఘం అధ్యక్షుడు మంజునాథ్ మాట్లాడుతూ కృషి, పట్టుదలతో లక్ష్యాన్ని చేరుకున్న నందిని యువతకు ఆదర్శమని ప్రశంసించారు. తన ప్రతిభాపాటవాలతో నందిని రాష్ట్రానికే కీర్తి తెచ్చారని అభినందించారు. అనంతరం మైసూరు పేటతో సత్కరించి ఘనంగా సన్మానించారు. నందిని మాట్లాడుతూ.. కష్టపడి సాధన చేసి లక్ష్యాన్ని చేరుకున్నానన్నారు. తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. సంఘం కార్యదర్శి కేబీ అశోక్, కోశాధికారి ఎస్.చౌడప్ప, దైహిక శిక్షకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసగౌడ, కన్నడ సాహిత్య పరిషత్ జిల్లా అధ్యక్షుడు నాగానంద కెంపరాజ్, నందిని తల్లిదండ్రులు రమేష్, విమల ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
జాతరలో అర్ధనగ్న నృత్యాలు
బెంగళూరు(కోలారు) : భక్తిభావం ఉప్పొంగాల్సిన జాతరలో అశ్లీల నృత్యాలు హోరెత్తాయి. వీటిని అడ్డుకోవాల్సిన పోలీసులు చోద్యం చూశారు. ఈఘటన తాలూకాలోని వానరాశి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామంలో వీరళప్ప స్వామి జాతర నిర్వహించారు. ఈ సందర్భంగా తుమకూరు సంజయ్ ఆర్కెస్ట్రా ఆధ్వర్యంలో సంగీత కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇదే తరుణంలో కొందరు మహిళా డ్యాన్సర్లు ఒంటిపై దుస్తులు తీసేసి అర్ధనగ్నంగా మారి తెలుగు, హిందీపాటలకు నృత్యాలు చేశారు. భక్తితో జాతరకు వస్తే ఇలాంటి దృశ్యాలు చూడాల్సి వచ్చిందని పలువురు భక్తులు వాపోయారు. పోలీసులు బందోబస్తులో ఉన్నా అశ్లీల నృత్యాలపై ఉదాసీనంగా వ్యవహరించరని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా ఈ దృశ్యాలను పలువురు సెల్ఫోన్లలో రికార్డ్ చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు.