చితి పేర్చుకుని ఇంజినీరు ఆత్మాహుతి
లంచం కేసులో అరెస్టయ్యానని ఆవేదనతో ఘాతుకం
సాక్షి, చింతామణి : లంచం తీసుకోవడం.. అతని జీవితాన్ని అగ్నికి ఆహుతి చేసింది. లంచం తీసుకుంటూ లోకాయుక్తకు చిక్కి జైలుకు వెళ్లిన ఓ ఇంజినీర్ కట్టెలతో చితి ఏర్పాటు చేసుకొని సజీవదహనమయ్యాడు. ఈ ఘటన బుధవారం కర్ణాటకలో కోలారు జిల్లా చింతామణి తాలూకాలోని వంగామాల గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన శ్రీనాథ్‌రెడ్డి (27) బాగేపల్లి తాలూకాలో ఉపాధి హామీ పథకంలో సహాయక ఇంజినీర్‌గా పని చేస్తుండేవాడు. ఏడాది కిందటే ఉద్యోగంలో చేరాడు.
ఆరునెలల క్రితం ఒక రైతు నుంచి లంచం తీసుకుంటూ లోకాయుక్తకు పట్టుబడి జైలు పాలయ్యాడు. కొద్దిరోజుల అనంతరం బెయిల్‌పై బయటకు వచ్చిన శ్రీనాథ్ ఎవరితోనూ కలవకుండా మథనపడుతూ ఉండేవాడు. తాను చేయని తప్పునకు బలయ్యానని ఆవేదన చెందేవాడు. జైలుకు వెళ్లడాన్ని జీర్ణించుకులేకపోయిన శ్రీనాథ్ మంగళవారం అర్ధరాత్రి అందరూ పడుకున్నాక, ఇంటి సమీపంలో కట్టెలకుప్ప పేర్చి దానిపై పడుకొని ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పటించుకొని సజీవ దహనమయ్యాడు.
రాత్రి తల్లితో వాగ్వాదం జరిగినట్లు ఇరుగుపొరుగు తెలిపారు. ఉదయం అందరూ చితిని చూడగానే కలకలం రేగింది. భట్లపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. వీరిది సాధారణ రైతు కుటుంబం. తండ్రి వెంకటరెడ్డి గతంలో మరణించగా, తల్లి సరోజమ్మ ఉన్నారు. కుమారుని మరణంతో తల్లి, బంధువుల రోదనలు మిన్నంటాయి.