అమ్మకోసం..ప్రధానికి లేఖ
పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో దేశ ప్రజలందరూ అత్యంత దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. కనీస అవసరాలకే కాక, ఇటు వైద్య ఖర్చులకు నగదు పుట్టడం లేదు. దీంతో ఆవేదన చెందిన కోల్‌కత్తాకు చెందిన ఓ అమ్మాయి డైరెక్ట్‌గా ప్రధాని నరేంద్రమోదీకే లేఖరాసింది. ఆసుపత్రిలో ఉన్న తన అమ్మను రక్షించాలంటూ ప్రధానిని అభ్యర్థించింది. ప్రస్తుతం అమ్మ ఐసీయూలో ఉందని, వెంటనే కాలేయ మార్పిడి చేయాల్సినవసరం ఉందని లేఖలో పేర్కొంది. నిర్మలా గుప్తా అనే మహిళ కాలేయ దెబ్బతిని గతకొన్ని రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె చికిత్స కోసం రూ.30 లక్షలు అవసరం కాగ, తమ దుకాణాన్ని అమ్మాలని ఆ కుటుంబసభ్యులు నిర్ణయించుకున్నారు. కానీ నోట్ల రద్దుతో ఎవరూ దుకాణాన్ని కొనడానికి ముందుకురావడం లేదు. దీంతో ఆ కుటుంబసభ్యులు నిర్మలాగుప్తా చికిత్సకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఇక ఎలాంటి దారి కనిపించకపోవడంతో ఆమె కూతురు పూజా గుప్తా, నగదు సహాయం చేయాలని కోరుతూ ప్రధాని మోదీకి లేఖరాసింది. ‘‘ప్రధాన్ మంత్రిజీ, మా అమ్మ ఐసీయూలో ఉంది. వెంటనే కాలేయ మార్పిడి చేయాల్సినవసరం ఉంది. మాకు ఎంత తిరిగినా నగదు దొరకడం లేదు. ఇప్పటివరకు మేము దాచిపెట్టిన సొమ్మూ అమ్మ చికిత్సకు సరిపోవడం లేదు. బ్యాంకులో కూడా నగదు కోసం మేము అప్లయ్ చేసుకున్నాం. కానీ నగదు జారీకావడానికి 20 నుంచి 30 రోజులు సమయం పడుతుందని బ్యాంకు వారు చెప్పారు. మాకున్న ఒక్కానొక్క దుకాణాన్ని అమ్మకానికి పెట్టాం. కానీ నోట్ల రద్దు ఎఫెక్ట్‌తో ఎవరూ ఆ షాపును కొనడానికి ముందుకురావడం లేదు. మాకున్న అన్ని దారులు మూసుకుపోయాయి. దయచేసి మా అమ్మ ఆపరేషన్‌కు సహాయం చేయగలరు’’ అని పేర్కొంటూ ఆ అమ్మాయి ప్రధానికి లేఖ రాసింది.