దీనావస్థలో భీమ్ వారసులు
వెలుగులోకి వచ్చిన భీమ్ మనుమరాళ్లు
కనీస సౌకర్యాలకు నోచుకోని కుటుంబాలు
కూలీ పని చేస్తే తప్ప పూట గడవని దుస్థితి
ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోలు
రాష్ట్ర చరిత్ర పుటల్లోకెక్కిన గిరిజన యోధుడు కొమురం భీమ్ ఏ ఆశయం కోసమైతే నిజాం సర్కారుతో పోరాటం సాగించాడో ఆ ఆశయం.. వాటి ఫలాలు.. ఆ అమరవీరుడి వారసులకే దక్కడం లేదు. దీంతో నేటికీ వారు దీనావస్థలో కాలం వెల్లదీస్తున్నారు. దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. భీమ్ వారసులకు ఉండడానికి సరైన ఇల్లు లేదు. చేయడానికి చేతిలో పనిలేదు.
ఉన్న కొంత సాగుభూమిలో పంట దిగుబడి రాలేదు. ఫలితంగా కూలే వారికి జీవనాధారమైంది. కూలీ చేస్తేనే వారి కడుపు నిండుతుంది. నిన్నటి వరకు కొమురం భీమ్‌కు మనుమడు కొమురం సోనేరావు, మనుమరాలు కొమురం సోంబాయిలే ఉన్నారని అందరికీ తెలుసు. మరో మనుమడు, ఇద్దరు మనుమరాళ్లు ఉన్నారనే విషయం ఇటీవల వెలుగులోకి వ చ్చింది. వారి జీవన స్థితిగతులపై కథనం.
జంగుబాయి ఇల్లు పునాదులకే పరిమితం
కెరమెరి మండలంలోని కొఠారి గ్రామంలో కొన్నేళ్లుగా కొమురం జంగుబాయి నివసిస్తోంది. వీరికి ఉండేందుకు పెంకుటిల్లె దిక్కవుతోంది. ఎనిమిదేళ్ల క్రితం ముంజూరైన ఇందిరమ్మ గృహం పునాదులకే పరిమితమైంది. ఇప్పటికీ ఎన్నో ప్రభుత్వాలు మారుతున్నా వీరి ఇంటిని పూర్తి చేసే నాథుడే కరువయ్యాడు. మరోసారి గృహం కోసం దరఖాస్తు పెట్టుకున్నా ప్రయోజనం లేకుండాపోయింది. మూడెకరాలు సాగు భూమి ఉంది. వర్షాధారంపై ఆధారపడి వేసిన పంట నట్టేట ముంచింది. పంటల్లో దిగుబడి రాలేదు. దీంతో కూలీ చేసి తన కుటుంబాన్ని పోషిస్తోంది. ఇంతవరకు ఆమెకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సహాయం అందలేదు. జంగుబాయికి భర్త జంగు, ఐదుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులున్నారు.
ప్రభుత్వం ఆదుకోవాలి
మమ్ములను ప్రభుత్వం ఆదుకోవాలి. తాత కొమురంభీమ్ పేరిట వేల రూపాయలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం మా కుటుంబాల గురించి పట్టించుకోవాలి. మమ్మల్ని కూడా గుర్తించి తగిన సహాయం అందించాలి. ఐటీడీఏ నుంచి ఆర్థిక సహాయం చేయాలి.
- ఆడ జంగుబాయి, కొఠారి
కాసుబాయికి కనిపించని ఆర్థిక ఆధారం
కెరమెరి మండలంలోని సాకడ గ్రామంలో నివసిస్తున్న కొమురం భీమ్ చిన్న మనుమరాలు కొమురం కాసుబాయి ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతోంది. గతంలో ఇల్లు మంజూరైనా బిల్లు మాత్రం అందకపోవడంతో అప్పులు చేసి రేకుల ఇల్లు నిర్మించింది. ఉన్న మూడెకరాల సాగు భూమిలో పంట దిగుబడి రాలేదు. దీంతో కుటుంబ పోషణ భారమైంది. ఇప్పటికి షావుకారుల వద్ద నుంచి చేసిన అప్పులు తీర్చేదెలాగని ఆమె ఆందోళన చెందుతోంది.
భీమ్ పేరు ఘనమైనా వారికి మాత్రం ఎలాంటి ప్రయోజనం కలగడంలేదు. భీమ్ వారసులన్నట్లు కూడా అధికారులకు తెలియదు. అసలు ఆ దిశగా ఇప్పటి వరకు ఎవరూ ప్రయత్నం సాగించలేదు. కాసుబాయికి భర్త కొమురం భీమ్, ఇద్దరు కొడుకులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
భూమి పంచివ్వాలి
మ తల్లి గారి భూమి దోబే గ్రామంలో ఉంది. ఒక్క మనుమడే లాభం తీసుకుంటున్నడు. అది అందరికీ దక్కేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ప్రతీ ఒక్కరికి 4 ఎకరాలు భూమిని పంచి ఇవ్వాలి. మా పరిస్థితులను బాగు చేయాలి.
- కొమురం కాసుబాయి, సాకడ
ఎల్లుది కూడా అదే దుస్థితి
కెరమెరి మండలంలోని కొఠారి గ్రామంలో ఉంటున్న భీ మ్ మనుమడు చహకటి ఎల్లు పరిస్థితి కూడా ఇంచుమిం చు అలాగే ఉంది. మూడెకరాల సాగు భూమి ఉన్నా రాళ్లురప్పలతో కూడుకుంది. ముప్పై వేలు వెచ్చించి వేసిన పత్తి పంటలో దిగుబడి రాలేదు. దీంతో ప్రస్తుతం ఆయన కూ లీ పని చేస్తూ తన కుటుంబాన్ని పోసిస్తున్నాడు. ఉదయం లేచిన దగ్గర్నుంచి సాయంకాలం వరకు ఎక్కడికో వెళ్లి కూలీ చేస్తేనే సాయంత్రం ఆయన కుటుంబానికి బువ్వ దొరుకుతుంది. పొలం పనులు చేసేందుకు ఎడ్లు కూడా లేకపోవడంతో వ్యవసాయ పనులకు ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. దీంతో బతుకు భారమవుతోంది. భార్య చిత్తుబాయి, కొడుకు వినోద్, సంజు ఉన్నారు.
ఎడ్ల జతలివ్వాలి
వ్యవసాయం చేసేందుకు కనీసం ఎడ్ల జతలన్న ఇవ్వాలి. ఎలాంటి సహకారం లేకపోవడంతో అష్టకష్టాల్లో ఉన్నాం. సాగుభూమి ప్రభుత్వ పరంగా అందించాలి. కొమురం సోనేరావుకు ఇచ్చిన ట్లే మాకూ ఆర్థిక సహాయం అందించాలి.
- చహకటి ఎల్లు, కొఠారి
వారసత్వంపై అలసత్వం
కొమురం భీమ్‌కు ఇద్దరు పిల్లలు. కొడుకు మాధవరావు, కూతురు రత్తుబాయి. కొడుకు మాధవరావుకు ముగ్గురు పిల్లలు. సోనేరావు, భీమ్రావు. వీరు సిర్పూర్(యు) మండలంలోని దోబే గ్రామంలో నివసిస్తున్నారు. కూతురు రాధాబాయిది ఆసిఫాబాద్ మండలం మోవాడ్. భీమ్ కొడుకు పిల్లల పరిస్థితి ఒకింత బాగానే ఉన్నా.. కూతురు చహకటి రత్తుబాయి నలుగురు పిల్లల్లో ముగ్గురి పరిస్థితి దయనీయంగా ఉంది. రత్తుబాయికి ముగ్గురు కూతుళ్లు ఒక కొడుకు. ఓ కూతరు కొమురం సోంబాయి జోడేఘాట్‌లో నివసిస్తోంది. ఈమె పరిస్థితి కాక మిగితా ముగ్గురు దీనస్థితిలో ఉన్నారు. అందులో ఆడ జంగుబాయి, చహకటి ఎల్లు కొఠారి గ్రామంలో ఉండగా.. చిన్న కూతురు కొమురం కాసుబాయి సాకడలో బతుకుతోంది.
తాత ఎంతో గొప్పవ్యక్తి. అనేక మంది ఆదివాసీలకు స్ఫూర్తిదాతగా నిలిచారు. తెలంగాణ ప్రభుత్వం కూడా ఆయన్ను గుర్తించింది. దాంతో జోడేఘాట్ కొత్త పుంతలు తొక్కనుంది. ఆయన చేసి త్యాగానికి సూచిగా రాష్ట్ర సర్కారు కూడా అడుగులేస్తోంది. కానీ ఆయన వారసుల జీవితాల్లో మాత్రం ఎలాంటి మార్పులేదు. ఇకనైనా తమ బతుకులు బాగుపడతాయనుకుంటే అధికారులు గుర్తించడం లేదంటూ భీమ్ మనమరాళ్లు ఆడ జంగుబాయి, కుంరం కాసుబాయి, చహకటి ఎల్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.