kommineni vankateswarlu
-
డ్రగ్ ఫ్యాక్టరీలు నిర్మిస్తే తీవ్రనష్టం
తల్లాడ, న్యూస్‌లైన్: మండలంలోని అన్నారుగూడెం ఇండస్ట్రీయల్ పార్క్‌లో విషతుల్యమైన డ్రగ్ ఫ్యాక్టరీలు నిర్మిస్తే నాలుగు గ్రామాల ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లుతుం దని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి పోటు రంగరావు అన్నారు. డ్రగ్ ఫ్యాక్టరీలు నిర్మించవద్దని తల్లాడ రింగ్ సెంటర్లో అఖిలపక్ష రైతు సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలను శనివారం ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ వరుణ్ ల్యాబరేటరీస్, ఎస్ఆర్ లైఫ్ సైన్స్ ఆధ్వర్యంలో రెండు డ్రగ్ ఫ్యాక్టరీల నిర్మాణానికి గత నెలలో ప్రజాభిప్రాయ సేకరణ సభ ఏర్పాటు చేస్తే నాలుగు గ్రామాల ప్రజలు ముక్తకంఠంతో వ్యతిరేకించారని, అయినా ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోం దని అన్నారు. డ్రగ్ ప్యాక్టరీలు నిర్మాణం వల్ల పదికిలో మీటర్ల దూరం వరకు కాలుష్య ప్రబలి నీరు కలుషితమౌతుందన్నా రు. పర్యావరణ, ఆరోగ్య శాఖ అధికారులు కల్పించుకొని ఫ్యాక్టరీ అనుమతులు రద్దు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు కొమ్మినేని వెంకటేశ్వర్లు, గోపిశెట్టి వెంకటేశ్వర్లు, తాళ్ల జోసఫ్, మారెల్లి మల్లిఖార్జున్‌రావు, సీపీఎం నాయకులు దొడ్డా శ్రీను, పులి వెంకటనరసయ్య, గోవింద్ శ్రీను, కోసూరి వెంకటేశ్వరరావు, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు ఆవుల వెంకటేశ్వర్లు, జి.రామయ్య, డి.శ్రీనివాసరావు, ఉంగరాల వెంకటేశ్వర్లు, గుంటుల్లి వెంకటయ్య పాల్గొన్నారు. -
డ్రగ్ ఫ్యాక్టరీ నిర్మించొద్దు
తల్లాడ, న్యూస్‌లైన్: మండలంలోని అన్నారుగూడెం ఏపీఐఐసీ స్థలంలో డ్రగ్ ఫ్యాక్టరీ నిర్మించవద్దని నాలుగు గ్రామాల ప్రజలు ముక్తకంఠంతో విజ్ఞప్తి చేశారు. ఎల్ఆర్ లైఫ్ సెన్సైస్, వరుణ్ కంపెనీల ఆధ్వర్యంలో అన్నారుగూడెంలో బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం బుధవారం పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ సభ నిర్వహించారు. అడిషనల్ జాయింట్ కలెక్టర్ బాబురావు సమక్షంలో ప్రజాభిప్రాయ సేకరణ ప్రారంభించగా అన్నారుగూడెం, గోపాలపేట, నరసింహారావుపేట, బాలప్పేట గ్రామాల ప్రజలు మూకుమ్మడిగా వచ్చి అడ్డుకున్నారు. ఇక్కడ ఫ్యాక్టరీ నిర్మిస్తే కాలుష్య ప్రభావం వల్ల ప్రజలు అనారోగ్యాలకు గురవుతారని అన్నారు. గో బ్యాక్ డ్రగ్ ఫ్యాక్టరీ అంటూ నినాదాలు చేస్తూ సభావేదిక వద్దకు వచ్చారు. తొలుత సభలోని స్థానికేతరులను బయటకు పంపించాలని పట్టుబట్టారు. ఫ్యాక్టరీ బాధిత ప్రజలకే మాట్లాడే ప్రాధాన్యం కల్పించాలని డిమాండ్ చేశారు. అందుకు అధికారులు అంగీకరించడంతో వైఎస్సార్సీపీ నాయకులు కొమ్మినేని వెంకటేశ్వర్లు మాట్లాడారు. అన్నారుగూడెంలో డ్రగ్ ఫ్యాక్టరీ నిర్మిస్తే ఆ కాలుష్యం పది కిలోమీటర్ల పరిధిలో ప్రజలకు నష్టం కలిగిస్తుందని అన్నారు. ముఖ్యంగా నాలుగు గ్రామాల ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతాయని అన్నారు. ఈ ప్రాంతంలో కాటన్ పార్క్ పేరుతో భూములు సేకరించి డ్రగ్ ఫ్యాక్టరీ ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులు గోవింద్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ ప్రాంతంలోని రైతులకు అవసరమైన జిన్నింగ్ మిల్ నిర్మిస్తామని చెప్పి రైతుల నుంచి 48 ఎకరాలు సేకరిస్తే చివరకు అది రైతులకు నష్టం కలిగించేదిగా తయారైందని అన్నారు. భూములిచ్చిన రైతులను ప్రభుత్వం ఆదుకోక పోవటంతో దివాళా తీశారన్నారు. సీపీఎం డివిజన్ కమిటీ సభ్యులు దొడ్డా శ్రీనువాసరావు మాట్లాడుతూ అన్నారుగూడెంలో డ్రగ్ ఫ్యాక్టరీ నిర్మిస్తే క్యాన్సర్, ఊపిరితిత్తుల వ్యాధులు, కాళ్లవాపు సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయనే భయంలో ప్రజలు ఉన్నారని అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రైతులకు ఉపయోగపడే మిల్లుని నిర్మించాలని డిమాండ్ చేశారు. ప్రజల నిరసనల మధ్య ప్రజాభిప్రాయసేకరణ కార్యక్రమం అసంపూర్తిగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల కేంద్రం మేనేజర్ శ్రీనివాసనాయక్, కాలుష్య నియంత్రణ ఈఈ ఎం.నారాయణ, తహశీల్దార్ టి.సుదర్శన్‌రావు, ఈఓఆర్డీ కృష్ణమూర్తి పాల్గొన్నారు.