konda couple
-
వరంగల్: చెప్పులతో కొట్టుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు!
సాక్షి, వరంగల్: వరంగల్ కాంగ్రెస్‌లో వర్గ విబేధాలు భగ్గుమన్నాయి. కొండా దంపతుల అనుచరులు, ఎర్రబెల్లి స్వర్ణ అనుచరులు బుధవారం కెమెరాల సాక్షిగా బాహాబాహీకి దిగారు. డీసీసీ అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ ప్రమాణం స్వీకార కార్యక్రమంలోనే ఈ రసాభాసా జరగడం గమనార్హం. డీసీపీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ నేతృత్వంలో తొలిసారి కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కొండా దంపతులు హాజరు కాలేదు. అయితే.. ఒకవైపు కార్యక్రమం జరుగుతున్న సమయంలోనే అక్కడ గందరగోళం నెలకొంది. రెండు వర్గాలుగా విడిపోయిన కార్యకర్తలు తన్నులాటకు దిగారు కార్యకర్తలు. కొండా వర్గానికి చెందిన జిల్లా ఎస్సీ సెల్ నాయకులు సంతోష్ పై దాడి చేసిన ఎర్రబెల్లి వర్గం. ఎర్రబెల్లి వర్గానికి కట్ట స్వామి నేతృత్వంలో ఈ దాడి జరిగినట్లు ఆరోపణలొస్తున్నాయి. ఒకానొక టైంకి చొక్కాలు చించుకుని.. చెప్పులతో కొట్టుకునే దాకా వెళ్లింది పరిస్థితి. దీంతో రసాభాసా నెలకొంది. గొడవకు దిగిన కార్యకర్తల అంతుచూస్తానంటూ ఎర్రబెల్లి స్వర్ణ భర్త వార్నింగ్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే కాసేపటికి పరిస్థితి సర్దుమణిగింది. ఇది గ్రూప్ వార్ కాదని, కులం పేరుతో ఓ వ్యక్తి దూషించినందుకు నెలకొన్న వివాదం మాత్రమేనని కాంగ్రెస్ ప్రతినిధులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. ఎర్రబెల్లి స్వర్ణకు డీసీపీ అధ్యక్ష బాధ్యతలు అప్పజెప్పడంపై కొండా వర్గం అసంతృప్తితో రగిలిపోతోంది. -
‘కొండా’ ముద్రతో మమల్ని పక్కన పెట్టొద్దు
సాక్షి, వరంగల్: తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమాల్లో పనిచేశామని, టీఆర్ఎస్ నుంచి నిలబడిన వారి గెలుపు కోసం కృషి చేసిన తమను ఇప్పుడు గ్రూపుల పేరుతో పక్కన పెడుతున్నారని వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని టీఆర్ఎస్ పార్టీలోని ముఖ్యకార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న బూత్ కమిటీ సమావేశాలకు గతంలో కొండా దంపతులతో ఉన్న టీఆర్ఎస్ శ్రేణులను ఆహ్వానించకపోవడం, వారికి ఎలాంటి ప్రా«ధాన్యం ఇవ్వకపోవడంతో వారు పలువురు నాయకులతో వాగ్వాదానికి దిగారు. ఎల్బీనగర్లోని క్రిస్టల్ గార్డెన్స్, సిటీ ఫంక్షన్ ప్యాలెస్‌లో మంగళవారం బూత్ కమిటీల ఎంపిక కోసం నిర్వహించిన సమావేశాల్లో ఎమ్మెల్యే వర్గీయులుగా ముద్రపడిన వారిని స్టేజీ మీదకు ఆహ్వానించకపోవడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశాలకు ముఖ్య అతిథులుగా వచ్చిన ఎంపీలు బండా ప్రకాష్, పసునూరి దయాకర్ ముందు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో వారితో ఉన్నామని, ఇప్పుడు మేయర్ వర్గీయులు తమను కావాలనే దూరం పెడుతున్నారని ఎంపీల దృష్టికి తీసుకెళ్లారు. కొండా దంపతులు పార్టీ మారితే తాము పార్టీ వీడలేదని, టీఆర్ఎస్ నుంచి ఎవరికి టికెట్టు ఇచ్చినా వారి గెలుపు కోసం కృషి చే స్తామన్నారు. ఇదిలా ఉండగా కొండా దంపతులు టీఆర్ఎస్లో ఉన్నప్పుడు తూర్పు నియోజకవర్గంలో మేయర్ వర్గంగా చిత్రీకరించి అభివృద్ధి పనులతో పాటు ఇతరాత్ర విషయాల్లో వేధింపులకు తాము గురయ్యేందుకు కొంతమంది ముఖ్యపాత్ర పోషించినందున వారిని గుర్తించి తగిన ప్రాధాన్యం ఇవ్వొద్దని మరికొందరు నాయకులు నేతల దృష్టికి తీసుకుపోయారు. రెండువర్గాల వాదనలు విన్న ఎంపీలు ఈ విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి ఎవరికి ఇబ్బందులు లేకుండా చూస్తామని హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది. -
మీది నీచరాజకీయ చరిత్ర
హన్మకొండ చౌరస్తా: కొండా దంపతులది నీచ రాజకీయ చరిత్ర అని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ తాజా మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ విమర్శించారు. తమకు రాజకీయ జన్మనిచ్చింది దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి అయితే.. రాజకీయ పునర్జన్మను ప్రసాదించింది కేసీఆర్ అని గతంలో అనేక సార్లు చెప్పిన కొండా దంపతులు నేడు విమర్శించడమే వారి దివాళాకోరుతనానికి నిదర్శనమన్నారు. మంగళవారం హన్మకొండలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కేసీఆర్ ఇచ్చిన పదవులను అనుభవించి నేడు అదే కుటుంబంపై అర్థరహితమైన వ్యాఖ్యలు చేయడంపై మండిపడ్డారు. లక్ష డాల ర్ల ఉద్యోగాన్ని వదిలేసి ఉద్యమంలో తాను సైతం అంటూ పాల్గొన్న కేటీఆర్‌ను, రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి తెలిపేందుకు తన సొంత ఖర్చులతో సమైక్య పాలనలో వెలుగెత్తి చాటిన కవితను విమర్శించే స్థాయి కొండా దంపతులకు లేదన్నారు. ఆయన వెంట ఎంపీ పసునూరి దయాకర్, ‘కుడా’ చైర్మన్ మర్రి యాదవరెడ్డి తదితరులు ఉన్నారు. -
కొండా మురళికి టీఆర్ఎస్ ఎమ్మెల్యే సవాల్
సాక్షి, వరంగల్ అర్బన్ : కేసీఆర్ సర్వేలో అనుకూల ఫలితాలు రానందునే టీఆర్ఎస్ పార్టీ కొండా సురేఖకి టికెట్ నిరాకరించిందని వరంగల్ పశ్చిమ తాజా మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. రాజకీయంగా బీభత్సమైన పలుకుబడి ఉందని చెప్పుకుంటున్న కొండా మురళి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి మళ్లీ గెలవాలని సవాల్ విసిరారు. మురళి ఏకగ్రీవంగా ఎన్నికైతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు. పార్టీ కార్యాలయంలో ఎంపీ పసునూరి దయాకర్‌తో కలిసి మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. భూ కబ్జాలు, బెదిరింపులకు పాల్పడిన కొండా దంపతులు ప్రజలు, కార్యకర్తలు, మైనారిటీలను దూరం చేసుకున్నారని విమర్శలు గుప్పించారు. వారి భూ కబ్జాలకు హన్మకొండలోని రామ్‌నగర్‌లో ఉన్న భవనమే సాక్షి అని విజయ్‌భాస్కర్ ఆరోపించారు. ప్రజల్లో ఏ మాత్రం పలుకుబడి లేదు కనుకనే రాష్ట్రంలో లేని పార్టీలు పిలిచాయని చెప్పుకుంటున్నారని అన్నారు. ఉద్యమకారులకు కేసీఆర్ అత్యన్నత పదవులు కట్టబెట్టారని గుర్తుచేశారు. అవినీతి చరిత్ర కలిగిన కొండా దంపతులు ఉద్యమకారుల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. మీవెంట ఒక్క కార్పొరేటర్ అయినా ఉన్నాడా..! అధికారం ఉన్నంతకాలం పార్టీని వాడుకుని ఇవాళ కేసీఆర్, కేటీఆర్ పట్ల కొండా దంపతులు అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరమని ఎంపీ పసునూరి దయాకర్ వ్యాఖ్యానించారు. నియోజకవర్గంలోని ఏ ఒక్క కార్పొరేటర్ కూడా కొండా దంపతులకు తోడుగా లేరంటేనే వారి నైజం కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్‌పై కూడా వారు విమర్శలు చేయడం దారుణమన్నారు. తమ సమస్యలు తీర్చాలని ఇంటికొచ్చిన ప్రజలతో కాళ్లు మొక్కించుకునే నియంతృత్వం కొండా దంపతులదని దయాకర్ నిప్పులు చెరిగారు. కాగా.. అసెంబ్లీ రద్దు అనంతరం 105 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా ప్రకటించిన కేసీఆర్.. వరంగల్ తూర్పు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కొండా సురేఖకు టికెట్ నిరాకరించిన సంగతి తెలిసిందే. -
కొండా దంపతుల రాకతో రగడ
వరంగల్ : టీఆర్ఎస్లో కొండా సురేఖ దంపతుల రాక వరంగల్ జిల్లాలో చిచ్చు రేపింది. కొండా దంపతుల చేరికను ఆపార్టీ కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌ను కొండా దంపతులు మంగళవారం కలిసినట్లు వార్తలు రావటంతో... దాన్ని వ్యతిరేకిస్తూ ప్రేమ్ అనే టీఆర్ఎస్ కార్యకర్త ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. దాంతో అతడి ఇతర కార్యకర్తలు అడ్డుకున్నారు. గతంలో తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచినట్లు మాట్లాడిన కొండా దంపతులు ఇప్పుడు...పదవుల కోసమే టీఆర్ఎస్ను ఆశ్రయించారని ఆరోపించారు. పార్టీలో కష్టపడి పనిచేసేవారిని గుర్తించాలని టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పేర్కొన్నారు. కాగా కొండా సురేఖకు వరంగల్ తూర్పు నియోజకవర్గ టిక్కెట్‌తో పాటు, ఆమె భర్త కొండా మురళికి ఎమ్మెల్సీ టికెట్ ఇస్తామని...కేసీఆర్ హామీ ఇచ్చినట్లు సమాచారం.