స్టేజీపై ఉన్న నాయకులతో వాగ్వాదానికి దిగిన మరో వర్గం నాయకులు
సాక్షి, వరంగల్: తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమాల్లో పనిచేశామని, టీఆర్‌ఎస్ నుంచి నిలబడిన వారి గెలుపు కోసం కృషి చేసిన తమను ఇప్పుడు గ్రూపుల పేరుతో పక్కన పెడుతున్నారని వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని టీఆర్‌ఎస్ పార్టీలోని ముఖ్యకార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న బూత్ కమిటీ సమావేశాలకు గతంలో కొండా దంపతులతో ఉన్న టీఆర్‌ఎస్ శ్రేణులను ఆహ్వానించకపోవడం, వారికి ఎలాంటి ప్రా«ధాన్యం ఇవ్వకపోవడంతో వారు పలువురు నాయకులతో వాగ్వాదానికి దిగారు. ఎల్‌బీనగర్‌లోని క్రిస్టల్ గార్డెన్స్, సిటీ ఫంక్షన్ ప్యాలెస్‌లో మంగళవారం బూత్ కమిటీల ఎంపిక కోసం నిర్వహించిన సమావేశాల్లో ఎమ్మెల్యే వర్గీయులుగా ముద్రపడిన వారిని స్టేజీ మీదకు ఆహ్వానించకపోవడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సమావేశాలకు ముఖ్య అతిథులుగా వచ్చిన ఎంపీలు బండా ప్రకాష్, పసునూరి దయాకర్ ముందు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో వారితో ఉన్నామని, ఇప్పుడు మేయర్ వర్గీయులు తమను కావాలనే దూరం పెడుతున్నారని ఎంపీల దృష్టికి తీసుకెళ్లారు. కొండా దంపతులు పార్టీ మారితే తాము పార్టీ వీడలేదని, టీఆర్‌ఎస్ నుంచి ఎవరికి టికెట్టు ఇచ్చినా వారి గెలుపు కోసం కృషి చే స్తామన్నారు. ఇదిలా ఉండగా కొండా దంపతులు టీఆర్‌ఎస్‌లో ఉన్నప్పుడు తూర్పు నియోజకవర్గంలో మేయర్ వర్గంగా చిత్రీకరించి అభివృద్ధి పనులతో పాటు ఇతరాత్ర విషయాల్లో వేధింపులకు తాము గురయ్యేందుకు కొంతమంది ముఖ్యపాత్ర పోషించినందున వారిని గుర్తించి తగిన ప్రాధాన్యం ఇవ్వొద్దని మరికొందరు నాయకులు నేతల దృష్టికి తీసుకుపోయారు. రెండువర్గాల వాదనలు విన్న ఎంపీలు ఈ విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి ఎవరికి ఇబ్బందులు లేకుండా చూస్తామని హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది.
Comments
Please login to add a commentAdd a comment