Konda Mallepally
-
మల్లేపల్లి : స్కూల్ బస్సు కింద పడి విద్యార్థి మృతి
సాక్షి, దేవరకొండ : కొండమల్లేపల్లి మండల పరిధిలోని దేవరోని తండాలో ఇస్లావత్ అఖిల్(5) అనే యూకేజీ విద్యార్థి బస్సు కింద పడి మృతిచెందాడు. మంగళవారం ఉదయం ఈ ఘటన జరిగింది. వివరాలు..తండాలో నివసిస్తున్న ఇస్లావత్ కూమార్, శాంతి దంపతుల కుమారుడు అఖిల్‌ను కొండమల్లేపల్లిలోని శ్రీకృష్ణవేణి టాలెంట్ స్కూల్లో యూకేజీ చదివిస్తున్నారు. రోజూ స్కూల్ బస్సులో వెళ్లి వస్తుండే అఖిల్,రోజులాగే మంగళవారం కూడా బస్సు ఎక్కే ప్రయత్నం చేయగా, డ్రైవరు చూసుకోకుండా బస్సు కదిలించడంతో వెనుక టైరు కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో డ్రైవరు పరారయ్యాడు. ఈ ప్రమాదాన్ని జీర్ణించుకోలేని తండావాసులు ఆందోళన నిర్వహించారు. విషయం తెలుసుకున్న పోలీసులు తండాకు చేరుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా చర్యలు తీసుకున్నారు. -
ఉద్యోగులు సమయపాలన పాటించాలి
కొండమల్లేపల్లి : ఉద్యోగులు సమయపాలన పాటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ అన్నారు. సోమవారం దేవరకొండ ఆర్డీఓ కార్యాలయంలో డివిజన్ స్థాయి అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారులు ఆయా కార్యాలయాల్లో తప్పనిసరిగా ఉండాలన్నారు. చందంపేట మండలంలో ఆడ పిల్లల అమ్మకం, బ్రూణ హత్యలు జరుగకుండా ఉండేందుకు గానూ సంబంధిత ఐసీడీఎస్, రెవెన్యూ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. ప్రభుత్వ పథకాల అమలు తీరుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదన్నారు. అనంతరం ఆయన దృష్టికి వచ్చిన పలు సమస్యలను పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకున్నారు. చింతపల్లి మండలం అనాజిపురం వాగు నుంచిఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని ఆయనకు ఫిర్యాదు చేయడంతో సంబంధిత అధికారులను ఇసుక తరలింపుకు పాల్పడే వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దేవరకొండ పట్టణంలో డ్రెరుునేజీ వ్యవస్థను పట్టించుకోవడం లేదని కొందరు ఆయనకు ఫిర్యాదు చేయడంతో అక్కడే ఉన్న నగర పంచాయతీ మేనేజర్‌ను డ్రెరుునేజీ పనులు చేయించాలని ఆదేశించారు. దేవరకొండ మండలం ఇద్దంపల్లి గ్రామానికి చెందిన మహిళ తనకు పింఛన్ అందడం లేదంటూ కలెక్టర్‌కు దరఖాస్తు ఇవ్వగా సంబంధిత ఎంపీడీఓను పింఛన్ అందేలా చూడాలన్నారు. అనంతరం పలు సమస్యలపై ఆయన స్పందించారు. ఈ సమావేశంలో ఆర్డీఓ గంగాధర్, వివిధ మండలాల తహసీల్దార్లు, ఆర్అండ్బీ డీఈ ఖాజన్గౌడ్, ఐబీ డీఈ నాగేశ్వర్రావు, ఆర్‌డబ్ల్యుఎస్ డీఈ గిరిధర్, పీఆర్ డీఈ ఉపేందర్‌రెడ్డి, ఏడీ వ్యవసాయశాఖ అశోక్‌రెడ్డి, ట్రాన్స్‌కో డీఈ బాల్‌రాజ్, ఏఎస్డబ్ల్యూఓ బాల్సింగ్, ఎంపీడీఓ విజయలక్ష్మి తదితరులున్నారు. భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి నల్లగొండ : డిండి, ఎలిమినేటి మాధవరెడ్డి నీటి పారుదల ప్రాజెక్టుల మిగిలిన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో భూసేకరణపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సర్వే సత్వరమే పూర్తి చేసేందుకు ప్రైవేటు లెసైన్స్ సర్వేయర్లను నియమించాలని ఆదేశించారు. సర్వే పూర్తి చేసిన తర్వాత సెగ్మార్కు, సబ్ డివిజన్ పూర్తయిన వెంటనే రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలన్నారు. భూముల యాజమానులకు చెల్లించాల్సిన నిధులు సరిపడా లేని పక్షంలో ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపించాలన్నారు. మిగిలిన భూసేకరణ పూర్తి చేసేందుకు తేది నిర్ణయించి తనకు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లను ఆదేశించారు. ప్రాజెక్టుల సివిల్ పనులను నిర్దేశించిన కాల వ్యవధిలో పూర్తి చేయాలన్నారు. భూ సేకరణ పూర్తయిన తక్షణమే కావాల్సిన సివిల్ పనులను మొదలు పెట్టాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జేసీ నారాయణరెడ్డి, సీపీఓ భారతిదేవి, దేవరకొండ ఆర్డీఓ గంగాధర్, ప్రాజెక్ట్ ఎస్ఈ నరేందర్‌గౌడ్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు చంద్రశేఖర్‌రెడ్డి, ప్రభాకర్, శ్రీనివాస్, ఈఈలు తదితరులు పాల్గొన్నారు. -
వేర్వేరు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి దుర్మరణం
కొండమల్లేపల్లి, న్యూస్‌లైన్ : దేవరకొండ పట్టణ సమీపంలో భీమనపల్లి వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. అతివేగంగా బైక్‌ను నడపడం, మూల మలుపు కావడంతో అదుపుతప్పిన బైక్ కల్వర్టును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దేవరకొండ మండలం కొండభీమనపల్లి గ్రామానికి చెందిన లింగంపల్లి భాస్కర్ (28) సత్యనారాయణ, అంజయ్యలు దేవరకొండలోసెలూన్షాపులు నిర్వహిస్తున్నారు. ముగ్గురూ దగ్గరి బంధువులే. ఒకే బైక్‌పై దేవరకొండకు వచ్చిన వీరు తిరిగి కొండభీమనపల్లికి బయలుదేరారు. దేవరకొండ దాటాక కొండ భీమనపల్లి సమీపంలో ఉన్న మూలమలుపు వద్ద అతివేగంగా నడపడం, ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి బైక్ రాయిని ఢీకొట్టింది. ఈ క్రమంలో అదుపుతప్పి పక్కనే ఉన్న గుంతలో పడ్డారు. ఈ ప్రమాదంలో లింగంపల్లి భాస్కర్‌కు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సత్యనారాయణ, అంజయ్యల తలకు బలమైన గాయాలయ్యాయి. స్థానికులు గమనించి గాయపడిన వారిని దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్య్యులు పరిిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. మృతుడి భార్య 3నెలల గర్భవతి మృతుడు లింగంపల్లి భాస్కర్‌కు 6నెలల క్రితమే వెంకటంపేటకు చెందిన మమతతో వివాహమైంది. ప్రస్తుతం ఆమె 3 నెలల గర్భవతి. భాస్కర్ మరణంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. భాస్కర్ మృతదేహంపై పడి మమత రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. ఇదిలా ఉండగా మృతుడి అన్న కరుణాకర్ కొన్నేళ్ల క్రితం మత ఘర్షణలో హత్యకు గురయ్యాడు. గాయాలపాలైన లింగంపల్లి సత్యనారాయణ, అంజయ్యల పరిస్థితి విషమంగా ఉండడంతో ఆ కుటుం బంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆస్పత్రి, సంఘటనాస్థలంలో రోదనలు మిన్నంటాయి. పోలీసులు సంఘటనస్థలానికి చేరుకొని, కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. పొలం పనులు ముగించుకుని వస్తుండగా.. కోదాడరూరల్ : రోడ్డు ప్రమాదంలో ఓ రైతు దుర్మరణం పాలయ్యాడు. ఈ సంఘటన సోమవారం సాయంత్రం మండల పరిధిలోని దోరకుంట పెట్రోల్‌బంకు వద్ద చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దోరకుంట గ్రామానికి చెందిన బండ్ల వెంకటేశ్వరావు(45) వ్యవసాయ పనుల నిమిత్తం ద్విచక్ర వాహనంపై పొలం దగ్గరకు వెళ్లాడు. పనులు ముగించుకుని తిరిగి వస్తూ గ్రామ శివారులోని పెట్రోల్ బంకులో పెట్రోలు పోసుకుని రోడ్డుఎక్కుతుండగా విజయవాడ వైపు నుంచి హైదరాబాదు వెళుతున్న కారు వేగంగా ఢీకొట్టడంతో వెంకటేశ్వరావు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఒక కూతురు, కుమారుడు ఉన్నారు. ఈ సంఘటనపై మృతుడి తమ్ముడు జగన్మోహన్రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్టు రూరల్ ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు. మినీ బస్సు ఢీకొని.. బీబీనగర్ : మండలకేంద్రంలోని జాతీయ రహదారిపై సోమవారం మినీ బస్సు ఢీకొని ఓ మహిళ మృతిచెందింది. ఏఎస్ఐ అశోక్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పూర్ణిమ అలియాస్ మున్నీ 15సంవత్సరాల క్రితం ఎక్కడి నుంచో వచ్చి బీబీనగర్ పరిసర ప్రాంతంలో భిక్షాటన చేసుకుంటూ జీవనం సాగిస్తున్నది. సోమవారం ఉదయం రహదారిపై నుంచి నడుచుకుంటూ వెళ్తుండగా హైదరాబాద్ వైపు నుంచి యాదగరిగుట్టకు వెళ్తున్న తమిళనాడుకు చెందిన మినీ బస్సు ఆమెను ఢీకొట్టింది. ఈ సంఘటనలో తీవ్ర గాయాలైన మున్నీ అక్కడికక్కడే మృతిచెందింది. కేసు దర్యాప్తు జరుపుతున్నట్టు ఏఎస్ఐ తెలిపారు.