ఉద్యోగులు సమయపాలన పాటించాలి
కొండమల్లేపల్లి : ఉద్యోగులు సమయపాలన పాటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ అన్నారు. సోమవారం దేవరకొండ ఆర్డీఓ కార్యాలయంలో డివిజన్ స్థాయి అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారులు ఆయా కార్యాలయాల్లో తప్పనిసరిగా ఉండాలన్నారు. చందంపేట మండలంలో ఆడ పిల్లల అమ్మకం, బ్రూణ హత్యలు జరుగకుండా ఉండేందుకు గానూ సంబంధిత ఐసీడీఎస్, రెవెన్యూ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. ప్రభుత్వ పథకాల అమలు తీరుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ప్రజా సమస్యలు పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదన్నారు. అనంతరం ఆయన దృష్టికి వచ్చిన పలు సమస్యలను పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకున్నారు. చింతపల్లి మండలం అనాజిపురం వాగు నుంచిఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని ఆయనకు ఫిర్యాదు చేయడంతో సంబంధిత అధికారులను ఇసుక తరలింపుకు పాల్పడే వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దేవరకొండ పట్టణంలో డ్రెరుునేజీ వ్యవస్థను పట్టించుకోవడం లేదని కొందరు ఆయనకు ఫిర్యాదు చేయడంతో అక్కడే ఉన్న నగర పంచాయతీ మేనేజర్‌ను డ్రెరుునేజీ పనులు చేయించాలని ఆదేశించారు.
దేవరకొండ మండలం ఇద్దంపల్లి గ్రామానికి చెందిన మహిళ తనకు పింఛన్ అందడం లేదంటూ కలెక్టర్‌కు దరఖాస్తు ఇవ్వగా సంబంధిత ఎంపీడీఓను పింఛన్ అందేలా చూడాలన్నారు. అనంతరం పలు సమస్యలపై ఆయన స్పందించారు. ఈ సమావేశంలో ఆర్డీఓ గంగాధర్, వివిధ మండలాల తహసీల్దార్లు, ఆర్‌అండ్‌బీ డీఈ ఖాజన్‌గౌడ్, ఐబీ డీఈ నాగేశ్వర్‌రావు, ఆర్‌డబ్ల్యుఎస్ డీఈ గిరిధర్, పీఆర్ డీఈ ఉపేందర్‌రెడ్డి, ఏడీ వ్యవసాయశాఖ అశోక్‌రెడ్డి, ట్రాన్స్‌కో డీఈ బాల్‌రాజ్, ఏఎస్‌డబ్ల్యూఓ బాల్‌సింగ్, ఎంపీడీఓ విజయలక్ష్మి తదితరులున్నారు.
భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి
నల్లగొండ : డిండి, ఎలిమినేటి మాధవరెడ్డి నీటి పారుదల ప్రాజెక్టుల మిగిలిన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో భూసేకరణపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సర్వే సత్వరమే పూర్తి చేసేందుకు ప్రైవేటు లెసైన్స్ సర్వేయర్లను నియమించాలని ఆదేశించారు. సర్వే పూర్తి చేసిన తర్వాత సెగ్మార్కు, సబ్ డివిజన్ పూర్తయిన వెంటనే రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలన్నారు.
భూముల యాజమానులకు చెల్లించాల్సిన నిధులు సరిపడా లేని పక్షంలో ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపించాలన్నారు. మిగిలిన భూసేకరణ పూర్తి చేసేందుకు తేది నిర్ణయించి తనకు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లను ఆదేశించారు. ప్రాజెక్టుల సివిల్ పనులను నిర్దేశించిన కాల వ్యవధిలో పూర్తి చేయాలన్నారు. భూ సేకరణ పూర్తయిన తక్షణమే కావాల్సిన సివిల్ పనులను మొదలు పెట్టాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జేసీ నారాయణరెడ్డి, సీపీఓ భారతిదేవి, దేవరకొండ ఆర్డీఓ గంగాధర్, ప్రాజెక్ట్ ఎస్‌ఈ నరేందర్‌గౌడ్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు చంద్రశేఖర్‌రెడ్డి, ప్రభాకర్, శ్రీనివాస్, ఈఈలు తదితరులు పాల్గొన్నారు.