వేగలేక చ స్తున్నాం..! | Collector over the manner employees Touchy | Sakshi
Sakshi News home page

వేగలేక చ స్తున్నాం..!

Published Mon, May 11 2015 4:11 AM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM

Collector over the manner employees Touchy

- కలెక్టర్ తీరుపై ఉద్యోగుల మండిపాటు
- బదిలీల కోసం ఉన్నతాధికారుల ప్రయత్నాలు
- బదిలీల జీవో కోసం ఎదురుచూపు
- కొరుకుడు పడక అల్లాడిపోతున్న తమ్ముళ్లు
- ప్రజలకు అందుబాటులో ఉండని వైనం
సాక్షి ప్రతినిధి, తిరుపతి:
కలెక్టర్ పని తీరుపై జిల్లాలో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఆయన తీరుతో జిల్లాలోని ఉన్నతాధికారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు వాపోతున్నారు. ఇక్కడ పనిచేయడం కత్తిమీద సాముగా మారడంతో వారు ఇక్కడ నుంచి బయట పడేందుకు ప్రయత్నాలను మమ్మురం చేశారు. ప్రభుత్వం బదిలీల జీవోను ఎప్పుడూ  విడుదల చేస్తుందోనని ఎదురు చూస్తున్నారు. కొంతమంది ప్రధాన శాఖల ఉన్నతాధికారులు పూర్తిగా విసిగి వేసారిపోయి ఇప్పటికే తట్టబుట్ట సర్దుకున్నట్లు ఉద్యోగ వర్గాల్లో చర్చ జోరుగా సాగుతోంది. దీంతో పాటు వినతిపత్రాలు ఇచ్చేందుకు వచ్చే ప్రజలు సైతం గంటల తరబడి నిరీక్షించి వెనుదిరిగిన సందర్భాలు సైతం అనేకం ఉన్నాయి.

తానే గవర్నమెంటు అంటూ...
ఆయా శాఖల సమీక్షలంటే అధికారులు హడలిపోతున్నారు. ఎప్పడు పడితే అప్పుడు సమీక్షలు సమయపాలన లేకపోవడంతో అధికారులు బెంబేలెత్తిపోతున్నా రు. ఉదయం 10 గంటలకు అయా శాఖలకు సంబంధించి సమీక్ష ఉందంటే అది ప్రారంభం అయ్యేసరికి సాయంత్రం అయిన సందర్భాలు కోకొల్లలు. అప్పడిదాక పడిగాపులు కాయాల్సిందే. దీనికి తోడు సమీక్షలు అర్ధరాత్రి వరకు జరిగిన సందర్భాలున్నాయి. గత నెలలో సీఎం కుప్పం పర్యటన సందర్భంగా జిల్లాలోని అధికారులందరిని కుప్పం రమ్మని అర్ధరాత్రి వరకు సమీక్ష పేరుతో ఇబ్బంది పెట్టినట్లు అధికార వర్గాల్లో చర్చ జరిగింది. దీనికితోడు తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా ఎన్నికల అధికారి వచ్చినా గంట అలస్యంగా రావడం గమనార్హం. ముఖ్యంగా ఏ పార్టీనేతలైనా కలెక్టర్ వద్దకు ఏదైనా పని విషయమై వస్తే వారిముందేమో చేయమని అధికారులకు చెప్పి వారు అటు వెళ్లగానే వద్దు అని హుకుం జారీచేస్తారని అధికార వర్గాల్లో వినికిడి.

తరువాత ఆ పని విషయమై పార్టీ నేతలు నిలదీస్తుంటే ఏమీ చేప్పలేక అధికారులు నలిగిపోతున్నారు. కొన్ని పనులను అధికారుల పరిధి దాటి చేయమని హుకుం జారీ, తీరా తన వద్దకు ఫైలు వచ్చేసరికి ఏదో కొర్రు రాసి వెనక్కు పంపుతున్నట్లు సమాచారం. దీంతో జిల్లాలో ప్రధానంగా అతి ముఖ్యమైన పనులు ఆగిపోతున్నట్లు సమాచారం. ఆయా శాఖల ఉన్నతాధికారులు హైదరాబాద్‌లో నిర్వహించే సమావేశాలకు సైతం వెళ్లొద్దని చెబుతుండడంతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. చివరకు సమావేశాలకు వెళ్లనందుకు షోకాజ్ నోటీసులు తీసుకోవాల్సి వస్తుందని కొంతమంది అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంత్రుల జరిపిన సమీక్ష సమావేశాలకుసైతం కలెక్టర్  పలుమార్లు ఆలస్యంగా వచ్చి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచిన సందర్భాలున్నాయి.

తెలుగు తమ్ముళ్లలో అసంతృప్తి
అభివృద్ధి పనులకు ఆటంకం ఎదురవుతుండడంతో తెలుగు తమ్ముళ్లు సైతం గుర్రుగా ఉన్నారు. ఎటువంటి అభివృద్ధి జరగడం లేదని, ప్రజల్లో పలచన అవుతున్నామని, ఈ కలెక్టరే ఉంటే మేం గ్రామాల్లోకి వెళ్లే పరిస్థితి లేదని ఓ ఎంపీ, ఎమ్మెల్యేలతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు సీఎం పేషీలోని అధికారులకు  ఫిర్యాదు చేసినట్టు సమాచారం. చిత్తూరు కలెక్టరంటే సీఎంకు వల్లమానిన ప్రేమ అనీ,  మేం ఏమీ చేయలేమని చెప్పడంతో వారు వెనుదిరిగినట్లు తెలుస్తోంది. సీఎం చెప్పిన పనులు తప్ప ఇతర నాయకులు చెప్పిన పనులను మాత్రం కలెక్టర్ పరిగణనలోకి తీసుకోనట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement