వేర్వేరు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి దుర్మరణం
Published Tue, Dec 31 2013 3:42 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
కొండమల్లేపల్లి, న్యూస్‌లైన్ : దేవరకొండ పట్టణ సమీపంలో భీమనపల్లి వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. అతివేగంగా బైక్‌ను నడపడం, మూల మలుపు కావడంతో అదుపుతప్పిన బైక్ కల్వర్టును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దేవరకొండ మండలం కొండభీమనపల్లి గ్రామానికి చెందిన లింగంపల్లి భాస్కర్ (28) సత్యనారాయణ, అంజయ్యలు దేవరకొండలోసెలూన్‌షాపులు నిర్వహిస్తున్నారు. ముగ్గురూ దగ్గరి బంధువులే. ఒకే బైక్‌పై దేవరకొండకు వచ్చిన వీరు తిరిగి కొండభీమనపల్లికి బయలుదేరారు. దేవరకొండ దాటాక కొండ భీమనపల్లి సమీపంలో ఉన్న మూలమలుపు వద్ద అతివేగంగా నడపడం, ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి బైక్ రాయిని ఢీకొట్టింది. ఈ క్రమంలో అదుపుతప్పి పక్కనే ఉన్న గుంతలో పడ్డారు. ఈ ప్రమాదంలో లింగంపల్లి భాస్కర్‌కు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సత్యనారాయణ, అంజయ్యల తలకు బలమైన గాయాలయ్యాయి. స్థానికులు గమనించి గాయపడిన వారిని దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్య్యులు పరిిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో హైదరాబాద్‌కు తీసుకెళ్లారు.
మృతుడి భార్య 3నెలల గర్భవతి
మృతుడు లింగంపల్లి భాస్కర్‌కు 6నెలల క్రితమే వెంకటంపేటకు చెందిన మమతతో వివాహమైంది. ప్రస్తుతం ఆమె 3 నెలల గర్భవతి. భాస్కర్ మరణంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. భాస్కర్ మృతదేహంపై పడి మమత రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. ఇదిలా ఉండగా మృతుడి అన్న కరుణాకర్ కొన్నేళ్ల క్రితం మత ఘర్షణలో హత్యకు గురయ్యాడు. గాయాలపాలైన లింగంపల్లి సత్యనారాయణ, అంజయ్యల పరిస్థితి విషమంగా ఉండడంతో ఆ కుటుం బంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆస్పత్రి, సంఘటనాస్థలంలో రోదనలు మిన్నంటాయి. పోలీసులు సంఘటనస్థలానికి చేరుకొని, కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
పొలం పనులు ముగించుకుని వస్తుండగా..
కోదాడరూరల్ : రోడ్డు ప్రమాదంలో ఓ రైతు దుర్మరణం పాలయ్యాడు. ఈ సంఘటన సోమవారం సాయంత్రం మండల పరిధిలోని దోరకుంట పెట్రోల్‌బంకు వద్ద చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దోరకుంట గ్రామానికి చెందిన బండ్ల వెంకటేశ్వరావు(45) వ్యవసాయ పనుల నిమిత్తం ద్విచక్ర వాహనంపై పొలం దగ్గరకు వెళ్లాడు. పనులు ముగించుకుని తిరిగి వస్తూ గ్రామ శివారులోని పెట్రోల్ బంకులో పెట్రోలు పోసుకుని రోడ్డుఎక్కుతుండగా విజయవాడ వైపు నుంచి హైదరాబాదు వెళుతున్న కారు వేగంగా ఢీకొట్టడంతో వెంకటేశ్వరావు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఒక కూతురు, కుమారుడు ఉన్నారు. ఈ సంఘటనపై మృతుడి తమ్ముడు జగన్‌మోహన్‌రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్టు రూరల్ ఎస్‌ఐ రాజశేఖర్ తెలిపారు.
మినీ బస్సు ఢీకొని..
బీబీనగర్ : మండలకేంద్రంలోని జాతీయ రహదారిపై సోమవారం మినీ బస్సు ఢీకొని ఓ మహిళ మృతిచెందింది. ఏఎస్‌ఐ అశోక్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పూర్ణిమ అలియాస్ మున్నీ 15సంవత్సరాల క్రితం ఎక్కడి నుంచో వచ్చి బీబీనగర్ పరిసర ప్రాంతంలో భిక్షాటన చేసుకుంటూ జీవనం సాగిస్తున్నది. సోమవారం ఉదయం రహదారిపై నుంచి నడుచుకుంటూ వెళ్తుండగా హైదరాబాద్ వైపు నుంచి యాదగరిగుట్టకు వెళ్తున్న తమిళనాడుకు చెందిన మినీ బస్సు ఆమెను ఢీకొట్టింది. ఈ సంఘటనలో తీవ్ర గాయాలైన మున్నీ అక్కడికక్కడే మృతిచెందింది. కేసు దర్యాప్తు జరుపుతున్నట్టు ఏఎస్‌ఐ తెలిపారు.
Advertisement