
సాక్షి, దేవరకొండ : కొండమల్లేపల్లి మండల పరిధిలోని దేవరోని తండాలో ఇస్లావత్ అఖిల్(5) అనే యూకేజీ విద్యార్థి బస్సు కింద పడి మృతిచెందాడు. మంగళవారం ఉదయం ఈ ఘటన జరిగింది. వివరాలు..తండాలో నివసిస్తున్న ఇస్లావత్ కూమార్, శాంతి దంపతుల కుమారుడు అఖిల్‌ను కొండమల్లేపల్లిలోని శ్రీకృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో యూకేజీ చదివిస్తున్నారు. రోజూ స్కూల్ బస్సులో వెళ్లి వస్తుండే అఖిల్,రోజులాగే మంగళవారం కూడా బస్సు ఎక్కే ప్రయత్నం చేయగా, డ్రైవరు చూసుకోకుండా బస్సు కదిలించడంతో వెనుక టైరు కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో డ్రైవరు పరారయ్యాడు. ఈ ప్రమాదాన్ని జీర్ణించుకోలేని తండావాసులు ఆందోళన నిర్వహించారు. విషయం తెలుసుకున్న పోలీసులు తండాకు చేరుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా చర్యలు తీసుకున్నారు.