kondamallepally
-
మార్కెట్‌యార్డులో యువరైతు ఆత్మహత్యాయత్నం
సాక్షి, నల్గొండ : అధికారుల నిర్లక్ష్య వైఖరికి మనస్తాపం చెందిన ఓ యువరైతు పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన కొండమల్లేపల్లి మార్కెట్ యార్డులో గురువారం జరిగింది. హకుల్ అనే రైతు పదిహేను రోజుల క్రితం వరిధాన్యాన్ని మార్కెట్‌కు తీసుకొచ్చాడు. కానీ, తేమ ఉందని చెప్పిన అధికారులు అతని ధాన్యాన్ని కొనుగోలు చేయలేదు. దళారీలు తెచ్చిన ధాన్యాన్ని మాత్రం ఏ అభ్యంతరం లేకుండా కొనుగోలు చేయడం గమనించిన హకుల్ వారితో గొడవకు దిగాడు. నీ దిక్కున్న చోట చెప్పుకో అని అధికారులు సమాధానమివ్వడంతో మనస్తాపం చెందిన ఆ రైతన్న మార్కెట్లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అక్కడున్న వారు స్పందించి అతన్ని ఆస్పత్రికి తరలించారు. బాధితుని ఆరోగ్య పరిస్థితి తెలియాల్సి ఉంది. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : నల్గొండలో యువరైతు ఆత్మహత్యాయత్నం -
నల్గొండలో యువరైతు ఆత్మహత్యాయత్నం
-
మృత్యు మలుపులు..!
సాక్షి, కొండమల్లేపల్లి : నాగార్జునసాగర్–హైదరాబాద్ రాష్ట్ర రహదారిపై పలుచోట్ల ఉన్న మూలమలుపులు మృత్యు పిలుపుగా మారాయి. ఆయా మూలమలుపుల వద్ద ఎప్పుడు ఏ ప్రమాదం చోటు చేసుకుంటుందోనని వాహనదారులు, ప్రయాణికులు భయాందోళన చెందుతున్నారు. నిత్యం రద్దీగా ఉండే రహదారిపై ఉన్న మలుపులు ప్రమాదాలకు నెలవులు అవుతున్నాయి. కొండమల్లేపల్లి మండల పరిధిలో ప్రధాన రహదారిపై ఉన్న మూలమలుపుల వద్ద ఇప్పటికే పలుమార్లు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో కొంతమంది మృత్యువాత పడగా మరికొంత మంది క్షతగాత్రులయ్యారు. కొండమల్లేపల్లి మండల పరిధిలోని కేశ్యతండా, జోగ్యతండా, చెన్నారం వద్ద ఉన్న మలుపులు ప్రమాదకరంగా మారడంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారని పలు వురు పేర్కొంటున్నారు. ఆయా మూలమలుపుల వద్ద హెచ్చరిక, సూచిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో ఈ దారిగుండా రాకపోకలు సాగించే వాహనదారులు మూలమలుపుల వద్ద అవగాహ న లేక ప్రమాదాల బారిన పడుతున్నారు. కొండమల్లేపల్లి మండల పరిధిలోని చెన్నారం మూలమలుపు వద్ద ఈనెల 6న ఆర్టీసీ బస్సు, టాటా ఏస్ వాహనం ఢీకొన్న ఘటనలో ఎనిమిది మంది మృత్యువాతపడగా మరికొందరికి గాయాలయ్యాయి. గతేడాది డిసెంబర్లో జోగ్యతండా వద్ద బాలుడిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో మృత్యువాతపడ్డాడు. ఆయా మూలమలుపుల వద్ద రోడ్డుకు ఇరువైపుల ఫెన్సింగ్ ఏర్పాటు చేయడంతో పాటు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని తండావాసులు కోరుతున్నారు. చర్యలు చేపడుతున్నాం నాగార్జుసాగర్–హైదరాబాద్ ప్రధాన రహదారిపై ప్రమాదాల నివారణకు చర్యలు చేపడుతున్నాం. ఆయా మూలమలుపుల వద్ద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయడంతో పాటు బారీకేడ్లను సైతం ఏర్పాటు చేస్తాం. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలి. ఇప్పటికే పలుమార్లు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వాహనదారులకు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించాం. – శ్రీనివాస్‌నాయక్, ఎస్ఐ, కొండమల్లేపల్లి -
కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలి
కొండమల్లేపల్లి : కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించి వారిని వెంటనే రెగ్యులరైజ్ చేయాలని జిల్లాపరిషత్ చైర్మన్ నేనావత్ బాలునాయక్ డిమాండ్ చేశారు. తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని కోరుతూ కొండమల్లేపల్లి డీఈ కార్యాలయం ఎదుట విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు నిర్వహిస్తున్న సమ్మెకు ఆదివారం జెడ్పీ చైర్మన్ బాలునాయక్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగు రోజులుగా కాంట్రాక్ట్ కార్మికులు సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని కోరారు. రాష్ట్రంలో కరెంటు కోతలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని దీంతో ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడిందని, కరెంట్ కొరతను తీర్చాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ముత్తయ్య, జిల్లా అధ్యక్షుడు సురేష్, దేవరకొండ ఎంపీపీ మేకల శ్రీనివాస్‌యాదవ్, జెడ్పీటీసీ ఆలంపల్లి నర్సింహ్మ, వైస్ ఎంపీపీ వేణుధర్‌రెడ్డి, సిరాజ్‌ఖాన్, వెంకటేష్, దేవేందర్, లింగయ్య, ఎంపీటీసీలు కైలాసం, వస్కుల తిరుపతమ్మ కాశయ్య, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.