చెన్నారం వద్ద ఉన్న ప్రమాదకర మూలమలుపు, దేవత్‌పల్లి ఎక్స్‌రోడ్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నుజ్జునుజ్జయిన టాటా ఏస్ వాహనం (ఫైల్)
సాక్షి, కొండమల్లేపల్లి : నాగార్జునసాగర్–హైదరాబాద్ రాష్ట్ర రహదారిపై పలుచోట్ల ఉన్న మూలమలుపులు మృత్యు పిలుపుగా మారాయి. ఆయా మూలమలుపుల వద్ద ఎప్పుడు ఏ ప్రమాదం చోటు చేసుకుంటుందోనని వాహనదారులు, ప్రయాణికులు భయాందోళన చెందుతున్నారు. నిత్యం రద్దీగా ఉండే రహదారిపై ఉన్న మలుపులు ప్రమాదాలకు నెలవులు అవుతున్నాయి. కొండమల్లేపల్లి మండల పరిధిలో ప్రధాన రహదారిపై ఉన్న మూలమలుపుల వద్ద ఇప్పటికే పలుమార్లు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో కొంతమంది మృత్యువాత పడగా మరికొంత మంది క్షతగాత్రులయ్యారు. కొండమల్లేపల్లి మండల పరిధిలోని కేశ్యతండా, జోగ్యతండా, చెన్నారం వద్ద ఉన్న మలుపులు ప్రమాదకరంగా మారడంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారని పలు వురు పేర్కొంటున్నారు.
ఆయా మూలమలుపుల వద్ద హెచ్చరిక, సూచిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో ఈ దారిగుండా రాకపోకలు సాగించే వాహనదారులు మూలమలుపుల వద్ద అవగాహ న లేక ప్రమాదాల బారిన పడుతున్నారు. కొండమల్లేపల్లి మండల పరిధిలోని చెన్నారం మూలమలుపు వద్ద ఈనెల 6న ఆర్టీసీ బస్సు, టాటా ఏస్ వాహనం ఢీకొన్న ఘటనలో ఎనిమిది మంది మృత్యువాతపడగా మరికొందరికి గాయాలయ్యాయి. గతేడాది డిసెంబర్‌లో జోగ్యతండా వద్ద బాలుడిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో మృత్యువాతపడ్డాడు. ఆయా మూలమలుపుల వద్ద రోడ్డుకు ఇరువైపుల ఫెన్సింగ్ ఏర్పాటు చేయడంతో పాటు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని తండావాసులు కోరుతున్నారు.
చర్యలు చేపడుతున్నాం
నాగార్జుసాగర్–హైదరాబాద్ ప్రధాన రహదారిపై ప్రమాదాల నివారణకు చర్యలు చేపడుతున్నాం. ఆయా మూలమలుపుల వద్ద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయడంతో పాటు బారీకేడ్లను సైతం ఏర్పాటు చేస్తాం. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలి. ఇప్పటికే పలుమార్లు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వాహనదారులకు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించాం. – శ్రీనివాస్‌నాయక్, ఎస్‌ఐ, కొండమల్లేపల్లి
Comments
Please login to add a commentAdd a comment