అన్నీ అంతంతే !
ప్రపంచకప్‌లో తలపడుతున్న ఎనిమిది గ్రూప్‌లలో అంతగా అంచనాలు లేనిది గ్రూప్ ‘హెచ్’. ఇందులోని నాలుగు దేశాలు బెల్జియం, రష్యా, కొరియా రిపబ్లిక్, అల్జీరియాలకు ఇప్పటిదాకా ప్రపంచకప్ సాధించిన చరిత్ర లేదు. అయితే బెల్జియం, కొరియాలు ఇంతకుముందు చెరోసారి సెమీఫైనల్ దాకా వెళ్లగలిగాయి. మహా అయితే ఈ రెండు జట్లు మరోసారి నాకౌట్‌కు చేరే అవకాశం ఉంది. ఈ గ్రూప్ నుంచి ఏ జట్టయినా సెమీస్‌కు చేరితే అది అద్భుతమే అనుకోవాలి.
కొరియా రిపబ్లిక్
ఆసియా నుంచి ఎక్కువ సార్లు ప్రపంచకప్‌కు అర్హత సాధించిన జట్లలో కొరియా రిపబ్లిక్ ఒకటి. వరుసగా ఎనిమిదో సారి, మొత్తంగా తొమ్మిదోసారి ప్రపంచకప్ ఆడుతున్న ఈ దక్షిణ కొరియా జట్టు 2002 ప్రపంచకప్‌లో నాలుగో స్థానంలో నిలిచి తమ అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. 1954లో తొలిసారి ప్రపంచకప్‌కు క్వాలిఫై అయ్యాక మళ్లీ 1986 దాకా అర్హత సాధించలేకపోయింది. అయితే ఆ తరువాత నుంచి వరుసగా ప్రపంచకప్‌లో ఆడుతూ వస్తోంది.
ప్రపంచకప్‌లో ప్రదర్శన: తొలుత 1954లో, ఆ తరువాత 1986 నుంచి 1998 దాకా వరుసగా నాలుగు ప్రపంచకప్‌లలో గ్రూప్ దశకే పరిమితమైంది. 2002లో నాలుగో స్థానంలో నిలి చింది. 2006లో మరోసారి గ్రూప్ దశలోనే వెనుదిరిగింది. అయితే 2010లో దక్షిణాప్రికాలో ప్రిక్వార్టర్స్‌కు చేరి 15వ స్థానం పొందింది.
కీలక ఆటగాళ్లు: సీనియర్ ఆటగాడు పార్క్ చు-యంగ్, సన్ హ్యుంగ్‌మిన్, కిమ్ షిన్వూక్లు గోల్స్ అందించగల ఆటగాళ్లు. వీరికితోడు మిడ్‌ఫీల్డర్లు కూ జాచియోల్, లీ చుంగ్యాంగ్లు కీలకం కానున్నారు. కోచ్: హాంగ్ మ్యుంగ్బో; అంచనా: బెల్జియంపై గెలిస్తే ప్రిక్వార్టర్స్‌కు చేరవచ్చు.
రష్యా
సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమయ్యాక రష్యా జట్టు తొలిసారిగా 1994లో ప్రపంచకప్‌కు అర్హత సాధించింది. కానీ, గ్రూప్ దశలోనే ఇంటిబాట పట్టింది. మళ్లీ 2002లో క్వాలిఫై అయినా.. నాకౌట్‌కు చేరలేకపోయింది. గత రెండు ప్రపంచకప్‌లకు అర్హతనూ పొందలేకపోయింది. దీంతో ఈసారి పెద్దగా అంచనాలు లేకుండానే క్వాలిఫయర్స్‌లో బరిలోకి దిగింది. కానీ, యూరోప్ నుంచి గ్రూప్ ‘ఎఫ్’ విజేతగా నిలిచి బ్రెజిల్‌కు దూసుకొచ్చింది.
ప్రపంచకప్‌లో ప్రదర్శన: సోవియట్ యూనియన్ జట్టుగా 1958లో తొలిసారి ప్రపంచకప్‌కు అర్హత పొంది క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. 1962, 1970లలోనూ క్వార్టర్స్‌కు చేరింది. 1966లో సెమీస్‌కు చేరి నాలుగో స్థానంలో నిలిచింది. రష్యా జట్టుగా 1994, 2002 ప్రపంచకప్‌లకు అర్హత సాధించింది. కానీ, గ్రూప్ దశను దాటలేకపోయింది. ఇక 2006, 2010 ప్రపంచకప్‌లకు క్వాలిఫై కూడా కాలేకపోయింది.
కీలక ఆటగాళ్లు: ఈ జట్టులో ఫార్వర్డ్ ఆటగాడు అలెగ్టాండర్ కెర్జకోవ్, డిఫెండర్ సెర్గీ ఇగ్నషెవిచ్ కీలక ఆటగాళ్లు. మిడ్‌ఫీల్డర్ రోమన్ షిరోకోవ్ గాయపడటం ప్రతికూలం.
కోచ్: ఫాబియో కాపెలో; అంచనా: నాకౌట్ దశకు చేరుకోవచ్చు.
బెల్జియం
ఫిఫా వ్యవస్థాపక సభ్యదేశాల్లో ఒకటైన బెల్జియం.. ప్రపంచకప్ వేటలో మాత్రం వెనకబడే ఉంది. 1982 నుంచి 2002 దాకా వరుసగా ఆరుసార్లు ఫైనల్స్‌కు అర్హత సాధించిన రికార్డు ఈ జట్టుది. కానీ, ఒక్కసారి కూడా టైటిల్ పోరుకు చేరుకోలేకపోగా.. మళ్లీ క్వాలిఫై అయ్యేందుకే ఇన్నేళ్లు పట్టింది. అయితే క్వాలిఫయింగ్స్‌లో ఈ యూరోప్ జట్టు తమ గ్రూప్‌లో నంబర్‌వన్‌గా నిలిచి ప్రపంచకప్‌కు బెర్తు దక్కించుకుంది. ప్రపంచకప్‌లో ప్రదర్శన: ఇప్పటికి 11 సార్లు ప్రపంచకప్ ఫైనల్స్‌కు అర్హత సాధించింది. కానీ, 1986లో సెమీఫైనల్స్‌కు చేరడమే ఈ జట్టు అత్యుత్తమ ప్రదర్శన. 1990, 1994, 2002 ప్రపంచకప్‌లలో ప్రిక్వార్టర్స్‌కు చేరగలిగింది.
కీలక ఆటగాళ్లు: క్వాలిఫయింగ్స్‌లో అదరగొట్టిన నాసర్ చడ్లీ, ఈడెన్ హజార్డ్లు మరోసారి కీలకం కానున్నారు. వీరికి కెప్టెన్ విన్సెంట్ కంపనీ, థామస్ వెర్మాలెన్, రొమేలు లుకాకు, కెవిన్ డి బ్రూనే వంటి సీనియర్ల అనుభవం తోడు కానుంది.
కోచ్: మార్క్ విల్మట్స్
అంచనా: కొరియాను ఓడించగలిగితే నాకౌట్‌కు చేరొచ్చు.
అల్జీరియా
గ్రూప్‌లో ఏమాత్రం అంచనాలు లేని జట్టు అల్జీరియా. 1964లోనే ఫిఫా సభ్యదేశంగా మారినా.. ప్రపంచకప్ బరిలో అడుగు పెట్టేందుకు మాత్రం 1982 దాకా పోరాడాల్సివచ్చింది. మొత్తంగా మూడుసార్లు అర్హత సాధించినా ఒక్కసారి కూడా గ్రూప్ దశను దాటలేకపోయింది. అయితే ఈసారి క్వాలిఫయింగ్స్‌లో ఆఫ్రికా నుంచి అర్హత పొందిన ఐదు జట్లలో టాప్‌గా నిలిచింది. తమ కన్నా మెరుగైన బెల్జియం, రష్యా, కొరియా జట్లను దాటుకొని ఏ మేరకు ముందుకు వెళ్తుందన్నది సందేహమే.
ప్రపంచకప్‌లో ప్రదర్శన: 1982లో స్పెయిన్‌లో జరిగిన ప్రపంచకప్‌లో తొలిసారిగా పాల్గొంది. తరువాత 1986లో బ్రెజిల్, స్పెయిన్ వంటి జట్లున్న గ్రూప్‌లో ఆడి అట్టడుగు స్థానంతో వెనుదిరిగింది. 2010లో దక్షిణాఫ్రికాలోనూ అల్జీరియాకు నిరాశే ఎదురైంది. గ్రూప్‌లో ఒక్క గోల్ కూడా చేయకుండానే నిష్ర్కమించింది.
కీలక ఆటగాళ్లు: డిఫెండర్ మాడ్జిడ్ బౌగెర్రా కెప్టెన్‌గా ప్రధాన బాధ్యతలు మోయనున్నాడు. సోఫియేన్ ఫెగౌలి, మేధి లాసెన్, ఇస్లాం స్లిమానీలు ఈ జట్టులో ఇతర ప్రధాన ఆటగాళ్లు.
కోచ్: వాహిద్ హాలిహోడ్జిక్
అంచనా: గ్రూప్ దశ దాటడం కష్టమే