kotha cheruvu
-
‘మమ్మల్నే అడిగే దానివయ్యావా...నిన్ను రేప్ చేస్తా’
కొత్తచెరువు : ‘‘ఐదేళ్లుగా మా గురించి పట్టించుకోలేదు.. ఎన్నికల వేళ మళ్లీ మాకే ఓటేయండంటూ అడుగుతున్నారు.. అసలు మీకు ఎందుకు ఓటెయ్యాలి’’ అని టీడీపీ నేతలను ఓ మహిళ నిలదీసింది. దీన్ని అవమానంగా భావించిన వారు ఆమెను అసభ్యపదజాలంతో దూషించడమే కాకుండా బెదరింపులకు దిగారు. దీంతో సదరు మహిళ వారిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే...అనంతపురం జిల్లా కొత్త చెరువు మండల కేంద్రంలోని బీసీ కాలనీలో నంజమ్మ నివసిస్తోంది. ఎన్నికల వేళ స్థానిక టీడీపీ నాయకుడు ఈ నెల ఒకటోతేదీన ఆమె ఇంటి వద్దకు వెళ్లి సైకిల్ గుర్తుకు ఓటెయ్యాలని కోరాడు. దీంతో ఆమె ‘‘ఐదేళ్లుగా మా కుటుంబానికి ఏం సాయం చేశారో చెప్పండి..అప్పుడు ఓటేస్తా’’ అని టీడీపీ నేతలను నిలదీసింది. దీన్ని అవమానంగా భావించిన స్థానిక టీడీపీ నాయకుడు ప్రసాద్ ఆమెను అసభ్యపదజాలంతో దూషించాడు. ‘‘మమ్నల్నే అడిగే దానివయ్యావా...నిన్ను రేప్ చేస్తా’’ అంటూ దూషించాడు. స్థానికులు సర్ది చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. మంగళవారం, బుధవారం ఉదయమే నంజమ్మ ఇంటివద్దకు వస్తున్న టీడీపీ నేతలు.. కావాలనే ఆమెతో ఘర్షణకు దిగుతున్నారు. నంజమ్మ కులానికి చెందిన వారిని ఆమెపై ఉసిగొలుపుతున్నారు. బాధితురాలు బుధవారం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి టీడీపీ నేతలపై ఫిర్యాదు చేసింది. దీంతో టీడీపీ నేతలు కూడా ఆమెపై తమను దూషించిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు విచారణ జరిపి చర్యలు తీసుకోనున్నట్లు ఎస్సై తెలిపారు. -
వైభవంగా సామూహిక వివాహాలు
– ఒక్కటైన 55 జంటలు –తరలివచ్చిన అశేష జనవాహిని కొత్తచెరువు : వైఎస్సార్సీపీ నేత, కొత్తచెరువు సర్పంచ్ మాణిక్యబాబా బుధవారం స్థానిక ఫాంహౌస్‌లో 55 జంటలకు సామూహికంగా వివాహాలు జరిపించారు. వధూవరులకు తాళిబొట్టు, తలంబ్రాలను సర్పంచ్ మాణిక్యం బాబా అందించగా, ఉదయం 10–30 గంటలకు పండితులు ప్రతి జంట వద్దకు వెళ్లి పెళ్లితంతును జరిపించారు. వధూవరులను ఆశీర్వదించటానికివచ్చిన వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు శంకరనారయణ, పుట్టపర్తి నియోజకవర్గ వైస్సార్పార్టీ సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ, పార్టీలో క్రియాశీలక నాయకుడిగా రాణిస్తూ పేద ప్రజలకోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న సర్పంచ్ మాణిక్యంబాబా పార్టీకి ఆణిముత్యంలాంటి వాడని కొనియాడారు. వివాహ వేడుకలో వైస్సార్సీపీ సీజీసీ సభ్యుడు గిర్రాజు నాగరాజు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు డీఎస్ కేశవరెడ్డి, ముస్తాక్ అహమ్మద్, మండల కన్వీనర్ నారేపల్లి జగన్మోహన్రెడ్డి, పరిశీలకులు అవుటాల రమణరెడ్డి, నూతన వధూవరులను ఆశీర్వదించారు. అదేవిధంగా కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షుడు కోటాసత్యం, పుట్టపర్తి మునిసిపల్ చైర్మన్ పీసీ గంగన్న, కాపు సంగం జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ సూరి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా వధూవరుల బంధువులు, ఇతర ప్రాంతాల ప్రజలు దాదాపు 30 వేలకు పైగా తరలి వచ్చారు.14 రకాలతో కూడిన విందుభోజనాలను సర్పంచ్ బాబా ఏర్పాటు చేశారు. -
ఇద్దరు డాక్టర్లకు షోకాజ్ నోటీసులు
కొత్తచెరువు (అనంతపురం) : విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు ప్రభుత్వ డాక్టర్లకు కలెక్టర్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అనంతపురం జిల్లా కొత్తచెరువు మండల కేంద్రంలోని పది పడకల ఆస్పత్రిలో డాక్టర్లుగా పనిచేస్తున్న అజయ్‌కుమార్ రెడ్డి, లచ్చిరాంనాయక్ విధులను సక్రమంగా నిర్వర్తించడంలేదనే ఫిర్యాదుతో విచారణ చేపట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వులలో ప్రకటించారు. డాక్టర్లకు షోకాజ్‌లు ఇవ్వడంతో పాటు స్టాఫ్ నర్స్‌ను సస్పెండ్ చేశారు.