వైభవంగా సామూహిక వివాహాలు
– ఒక్కటైన 55 జంటలు
–తరలివచ్చిన అశేష జనవాహిని
కొత్తచెరువు : వైఎస్సార్‌సీపీ నేత, కొత్తచెరువు సర్పంచ్ మాణిక్యబాబా బుధవారం స్థానిక ఫాంహౌస్‌లో 55 జంటలకు సామూహికంగా వివాహాలు జరిపించారు. వధూవరులకు తాళిబొట్టు, తలంబ్రాలను సర్పంచ్ మాణిక్యం బాబా అందించగా, ఉదయం 10–30 గంటలకు పండితులు ప్రతి జంట వద్దకు వెళ్లి పెళ్లితంతును జరిపించారు.
వధూవరులను ఆశీర్వదించటానికివచ్చిన వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు శంకరనారయణ, పుట్టపర్తి నియోజకవర్గ వైస్సార్‌పార్టీ సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ, పార్టీలో క్రియాశీలక నాయకుడిగా రాణిస్తూ పేద ప్రజలకోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న సర్పంచ్ మాణిక్యంబాబా పార్టీకి ఆణిముత్యంలాంటి వాడని కొనియాడారు.
వివాహ వేడుకలో వైస్సార్‌సీపీ సీజీసీ సభ్యుడు గిర్రాజు నాగరాజు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు డీఎస్ కేశవరెడ్డి, ముస్తాక్ అహమ్మద్, మండల కన్వీనర్ నారేపల్లి జగన్‌మోహన్‌రెడ్డి, పరిశీలకులు అవుటాల రమణరెడ్డి, నూతన వధూవరులను ఆశీర్వదించారు. అదేవిధంగా కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షుడు కోటాసత్యం, పుట్టపర్తి మునిసిపల్ చైర్మన్ పీసీ గంగన్న, కాపు సంగం జిల్లా ఉపాధ్యక్షుడు దాల్‌మిల్ సూరి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా వధూవరుల బంధువులు, ఇతర ప్రాంతాల ప్రజలు దాదాపు 30 వేలకు పైగా తరలి వచ్చారు.14 రకాలతో కూడిన విందుభోజనాలను సర్పంచ్ బాబా ఏర్పాటు చేశారు.