కొత్తచెరువు : ‘‘ఐదేళ్లుగా మా గురించి పట్టించుకోలేదు.. ఎన్నికల వేళ మళ్లీ మాకే ఓటేయండంటూ అడుగుతున్నారు.. అసలు మీకు ఎందుకు ఓటెయ్యాలి’’ అని టీడీపీ నేతలను ఓ మహిళ నిలదీసింది. దీన్ని అవమానంగా భావించిన వారు ఆమెను అసభ్యపదజాలంతో దూషించడమే కాకుండా బెదరింపులకు దిగారు. దీంతో సదరు మహిళ వారిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే...అనంతపురం జిల్లా కొత్త చెరువు మండల కేంద్రంలోని బీసీ కాలనీలో నంజమ్మ నివసిస్తోంది. ఎన్నికల వేళ స్థానిక టీడీపీ నాయకుడు ఈ నెల ఒకటోతేదీన ఆమె ఇంటి వద్దకు వెళ్లి సైకిల్ గుర్తుకు ఓటెయ్యాలని కోరాడు.
దీంతో ఆమె ‘‘ఐదేళ్లుగా మా కుటుంబానికి ఏం సాయం చేశారో చెప్పండి..అప్పుడు ఓటేస్తా’’ అని టీడీపీ నేతలను నిలదీసింది. దీన్ని అవమానంగా భావించిన స్థానిక టీడీపీ నాయకుడు ప్రసాద్ ఆమెను అసభ్యపదజాలంతో దూషించాడు. ‘‘మమ్నల్నే అడిగే దానివయ్యావా...నిన్ను రేప్ చేస్తా’’ అంటూ దూషించాడు. స్థానికులు సర్ది చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. మంగళవారం, బుధవారం ఉదయమే నంజమ్మ ఇంటివద్దకు వస్తున్న టీడీపీ నేతలు.. కావాలనే ఆమెతో ఘర్షణకు దిగుతున్నారు. నంజమ్మ కులానికి చెందిన వారిని ఆమెపై ఉసిగొలుపుతున్నారు. బాధితురాలు బుధవారం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి టీడీపీ నేతలపై ఫిర్యాదు చేసింది. దీంతో టీడీపీ నేతలు కూడా ఆమెపై తమను దూషించిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు విచారణ జరిపి చర్యలు తీసుకోనున్నట్లు ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment