అ‘పరిష్కృతే’ !
పాల్వంచ: ప్రభుత్వం అక్రమ లే అవుట్లను క్రమబద్ధీకరించేందుకు ప్రవేశపెట్టిన లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్ఆర్ఎస్)దరఖాస్తులు అపరిష్కృతంగానే మిగిలిపోతున్నాయి. అక్రమ లేఅవుట్లను క్రమబద్ధీకరించడం ద్వారా మున్సిపాలిటీల ఆదాయం గణనీయంగా పెంచుకునేందుకు ఈ స్కీం ఉపయోగ పడుతుంది. జిల్లాలోని మణుగూరు, ఇల్లెందు మున్సిపాలిటీలకు ఇది వర్తించకపోగా, కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీల్లో అనేక మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ పథకంపై ప్రజలకు అవగాహన కల్పించడంలో అధికారులు విఫలమయ్యారనే ఆరోపణలు వస్తున్నాయి.
వెల్లువలా దరఖాస్తులు..
ఎల్ఆర్ఎస్ స్కీం ద్వారా పాల్వంచ, కొత్తగూడెం మున్సిపాలిటీల్లో దరఖాస్తులు వెల్లువలా వచ్చాయి. 2015లో ప్రవేశపెట్టిన ఈ స్కీం గడువు తేదీని ప్రభుత్వం పలుమార్లు పొడిగించింది. చివరిసారిగా గత అక్టోబర్ 30 వరకు కొనసాగించారు. పాల్వంచ మున్సిపాలిటీలో 2700 దరఖాస్తులు రాగా, 1700 దరఖాస్తులు మాత్రమే పరిష్కారం అయ్యాయి. మరో 1000 అప్లికేషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. సర్వే నంబర్ 817లో గత రెండున్నర సంవత్సరాలుగా రిజిస్ట్రేషన్లు నిలిపి వేయడంతో 500 దరఖాస్తులు పెండింగ్‌లో పడ్డాయి. మరికొన్ని సకాలంలో డబ్బు చెల్లించక పరిష్కారం కాలేదని తెలుస్తోంది. కొత్తగూడెం సింగరేణి పరిధిలో ఉన్నప్పటికీ కొంత వరకు ప్రైవేట్ భూములు ఉండడంతో 120 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. అయితే ఇందులో 89 పరిష్కారం అయ్యాయి. 13 దరఖాస్తులు వివిధ కారణాలతో తిరస్కరించగా, మిగతా 18 పెండింగ్‌లో ఉన్నాయి.
ఇల్లెందు. మణుగూరులో నిల్..
మణుగూరు మున్సిపాలిటీ 1 /70 యాక్ట్‌లో ఉండటంతో అక్కడ దరఖాస్తులు స్వీకరించలేదు. ఇల్లెందు మున్సిపాలిటీ సింగరేణి కాలరీస్ సంస్థకు చెందిన భూముల పరిధిలో ఉండడంతో అక్కడ కూడా దరఖాస్తుల స్వీకరణకు అనర్హం. దీంతో ఈ రెండు
మున్సిపాలిటీల్లో దరఖాస్తులు లేకపోవడంతో ఆదాయం లభించలేదు. పాల్వంచ మున్సిపాలిటీలో ఎల్ఆర్ స్కీం ద్వారా సుమారు రూ.12 కోట్ల వరకు ఆదాయం లభించి ప్రథమ స్థానంలో ఉండగా, కొత్తగూడెంలో రూ.70 లక్షల ఆదాయం వచ్చింది. అయితే ఈ మున్సిపాలిటీల్లో పెండింగ్‌లో ఉన్న వాటిని పరిష్కరించాలని లబ్ధిదారులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా «సకాలంలో చేయడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు.
త్వరలోనే పరిష్కరిస్తాం
పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు కూడా త్వరలోనే పరిష్కరిస్తాం. ఎన్నికల పనుల్లో నిమగ్నం కావడంతో కొంత ఆలస్యం అవుతున్నాయి. పాల్వంచకు సుమారు రూ.12కోట్ల వరకు ఆదాయం లభించి ప్రథమ స్థానంలో ఉంది. ఇల్లెందు సింగరేణి, మణుగూరు 1 /70 యాక్ట్‌ల వల్ల అక్కడ దరఖాస్తులు స్వీకరించే అవకాశం లేదు.--శ్రీనివాస్, టీపీఓ