కొత్తగూడెం, న్యూస్‌లైన్: కొత్తగూడెం మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ చైర్‌పర్సన్ అభ్యర్థి విషయంలో ఆ పార్టీ పన్నిన వ్యూహం బెడిసికొట్టేలా ఉంది. చైర్‌పర్సన్ పదవి కోసం ఈ సారి ఎక్కువ మంది పోటీ పడ్డారు. ఏం చేయాలో పాలుపోని నేతలు కాస్తా తర్వాత దీనికి టెండ‘రింగ్’ పెట్టేందుకు ముందుగా వారిని వార్డుల్లో పోటీకి దింపారు. ప్రధానంగా ముగ్గురు ఆశావహులు బరిలో ఉండటంతో ఇప్పుడు ఆ పార్టీ వ్యూహం కాస్త రివర్స్ అయ్యేలా ఉంది. చైర్‌పర్సన్‌గా బరిలోకి దిగిన అభ్యర్థినులు ఎత్తుకు పైఎత్తు వేస్తూ తమ పదవికి అడ్డువచ్చే సొంతపార్టీ అభ్యర్థినులను ఓడించేందుకు సిద్ధమయ్యారని ప్రచారం.
కొత్తగూడెం మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ తరఫున చైర్‌పర్సన్ అభ్యర్థినిగా ముగ్గురు పోటీలో ఉన్నారు. తాజా మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ కాసుల ఉమారాణి 31వ వార్డు నుంచి బరిలో నిలిచారు. పట్టణానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పులి మోహన్‌రావు కోడలు పులి గీత తొమ్మిదో వార్డు నుంచి, మరో యువ నాయకురాలు, తాజా మాజీ కౌన్సిలర్ తోట దేవీప్రసన్న 15వ వార్డు నుంచి బరిలో నిలిచారు. అభ్యర్థుల ఎంపిక సమయంలో వీరి మధ్య పోటీ పెరగడం, బేరసారాలకు సైతం దిగడంతో వ్యూహాత్మకంగా అడుగులు వేసిన కాంగ్రెస్ నియోజకవర్గ పెద్దలు అందరూ పోటీకి దిగండని సలహా ఇచ్చారు. అది కాస్తా ఇప్పుడు నేతలకు తలనొప్పిగా మారింది.
ఒకరిపై మరొక్కరి వ్యూహాలు..
ముగ్గురు అభ్యర్థినులు ఆర్థికంగా నిలదొక్కుకున్నవారు కావడంతో సొంతపార్టీలో తమకు చైర్‌పర్సన్ పదవి దక్కకుండా అడ్డువచ్చే అభ్యర్థినులను ఓడించాలనే పట్టుదలతో ఉన్నారు. శత్రుశేషం ఉండకూడదనే భావనతో వ్యూహాలు రూపొందిస్తున్నారని ప్రచారం. ఇందుకు భారీ గానే ఖర్చుచేస్తున్నారని సమాచారం. ఒకేపార్టీకి చెందినా అనూహ్యంగా ప్రత్యర్థులుగా మారా రు. ఈ ముగ్గురు అభ్యర్థినుల మధ్య ఆధిపత్య పోరులో ముగ్గురూ ఓటమి చవిచూస్తే పరిస్థితి ఏంటని స్థానికులు చర్చించుకుంటున్నారు.
కుర్చీపోరు
Published Mon, Mar 24 2014 2:25 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement