Koti ENT Doctors
-
Black Fungus: కోఠి ఆస్పత్రికి ఒక్కరోజే 284 మంది!
సాక్షి, సుల్తాన్‌బజార్: ‘బ్లాక్ ఫంగస్’ నోడల్ కేంద్రమైన హైదరాబాద్‌లోని కోఠి ఈఎన్టీ ఆస్పత్రికి వస్తున్న బాధితుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గురువారం ఒక్కరోజే 284 మంది బ్లాక్ ఫంగస్ అనుమానితులు ఆస్పత్రికి రాగా.. అందులో మొత్తం 39 మందిని ఇన్పేషెంట్లుగా అడ్మిట్ చేసుకున్నారు. మిగతావారిలోనూ చాలా మందికి బ్లాక్ ఫంగస్ లక్షణాలు ఉన్నా.. కొందరు పాజిటివ్ రోగులు కావడం, మరికొందరికి కోవిడ్ వచ్చి తగ్గినా ఆర్టీపీసీఆర్ నెగెటివ్ సర్టిఫికెట్ లేకపోవడంతో చేర్చుకోలేదని సమాచారం. చాలా తక్కువగా లక్షణాలు ఉన్నవారికి మందులు రాసి పంపించినట్టు తెలిసింది. తాజాగా అడ్మిట్ అయినవారితో కలిపి ప్రస్తుతం ఈఎన్టీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ‘బ్లాక్ ఫంగస్’ బాధితుల సంఖ్య 90కి చేరింది. వీరిలో ఏడుగురికి గురువారం శస్త్రచికిత్సలు నిర్వహించారు. బెడ్ల సంఖ్య పెంచుతూ.. ఈఎన్టీ ఆస్పత్రికి వస్తున్న బ్లాక్ ఫంగస్ బాధితుల సంఖ్య పెరుగుతుండటంతో బెడ్ల సంఖ్యను పెంచుకుంటూ వెళ్తున్నారు. మొదట 50 బెడ్లను కేటాయించగా.. ప్రస్తుతం 200 వరకు బెడ్లను సిద్ధం చేస్తున్నట్టు ఆస్పత్రి వర్గాలు చెప్తున్నాయి. ఇందుకోసం ప్రత్యేకంగా వార్డుల్లో, ఆవరణలో బెడ్లను ఏర్పాటు చేస్తున్నారు. పరీక్షలు, రిపోర్టుల కోసం వెనక్కి.. గురువారం ఒక్కసారిగా 284 మంది ‘బ్లాక్ ఫంగస్’ అనుమానితులు ఈఎన్టీ ఆస్పత్రికి రావడంతో ఆవరణ అంతా కిక్కిరిసిపోయింది. వీరిలో కొందరు కోవిడ్ పాజిటివ్ వారు ఉండటం, మరికొందరికి కోవిడ్ తగ్గినా ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్ట్ లేకపోవడంతో వారిని ఆస్పత్రిలో చేర్చుకోకుండా తిప్పిపంపారు. మరికొందరిని పలు టెస్టుల కోసం ఉస్మానియా ఆస్పత్రికి వెళ్లాలని ఈఎన్టీ ఆస్పత్రి వైద్యులు సూచించినట్టు రోగులు తెలిపారు. ఉస్మానియాకు, ఇతర ల్యాబ్‌లకు టెస్టుల కోసం పరుగెత్తడం, ఇందుకు రోజంతా సమయం పట్టడంతో ఆస్పత్రిలో అడ్మిషన్ ఆలస్యం అవుతోందని రోగుల బంధువులు వాపోయారు. ఉదయం ముందుగా వస్తున్న రోగులకు పరీక్షలు చేస్తున్నామని, పెద్ద సంఖ్యలో వస్తుండటంతో అందరికీ పరీక్షలు చేయలేని పరిస్థితి ఉందని ఆస్పత్రి వర్గాలు చెప్తున్నాయి. దీంతో అడ్మిషన్ల కోసం వచ్చిన రోగులు ఆస్పత్రి ఆవరణలో వేచి ఉండటం కనిపించింది. ఆస్పత్రిని పరిశీలించిన సీఎంవో ఓఎస్డీ బ్లాక్ ఫంగస్ చికిత్సలకు సంబంధించి కోఠి ఈఎన్టీ ఆస్పత్రిని సీఎంవో ఓఎస్డీ గంగాధర్ గురువారం పరిశీలించారు. ఆస్పత్రిలో ఉన్న బెడ్లు, పేషెంట్ల సంఖ్య, చికిత్సలపై ఆరా తీశారు. అంతకుముందు ఆస్పత్రి డాక్టర్లు, సిబ్బందితో సమావేశమయ్యారు. ఆస్పత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు పనులు చురుగ్గా సాగుతున్నాయని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్ తెలిపారు. బ్లాక్ ఫంగస్ సోకిన వారికి చికిత్సలో ఆక్సిజన్ అవసరం ఎక్కువగా ఉండదని ఆయన పేర్కొన్నారు. జిల్లాల్లో బ్లాక్ ఫంగస్ కలకలం సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ కేసులు పెరిగిపోతున్నాయి. గురువారం కూడా పెద్దసంఖ్యలో నమోదయ్యాయి. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (ఎస్) మండల పరిధిలోని కందగట్లకు చెందిన టీఆర్ఎస్ నాయకుడు.. కరోనా నుంచి కోలుకున్నాక బ్లాక్ ఫంగస్ బారినపడ్డారు. ఆయన కోఠి ఈఎన్టీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలం పోల్కంపల్లికి చెందిన 25 ఏళ్ల యువకుడు, రంగాపూర్‌కు చెందిన మరో వ్యక్తి బ్లాక్ ఫంగస్ బారినపడ్డారు. ఈ ఇద్దరికి కళ్లకు ఇన్ఫెక్షన్ సోకగా.. హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రుల్లో శస్త్రచికిత్సలు నిర్వహించారు. వీరిలో 25 ఏళ్ల యువకుడికి ఒక కన్ను తొలగించినట్టు బాధితుడి బంధువులు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం అర్లి(టి)కి చెందిన 46 ఏళ్ల వ్యక్తి బ్లాక్ ఫంగస్‌తో ఈఎన్టీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. -
Koti ENT Hospital: బ్లాక్ ఫంగస్‌కు మెరుగైన చికిత్స
సుల్తాన్‌బజార్: బ్లాక్ ఫంగస్ బాధితులకు కోఠిలోని ఈఎన్టీ ఆసుపత్రిలో మెరుగైన చికిత్సలు అందిస్తున్నామని, రోగుల నిష్పత్తికి అనుగుణంగా పడకల సంఖ్య పెంచుతామని, బ్లాక్ ఫంగస్ నోడల్ అధికారి, కోఠి ఈఎన్టీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ టి.శంకర్ తెలిపారు. బ్లాక్ ఫంగస్‌ను ఎదుర్కోవడానికి తాము సన్నద్ధంగా ఉన్నామని ‘సాక్షి’ తో తెలిపారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. బ్లాక్ ఫంగస్ లక్షాణాలు కన్ను పైభాగంలో వాపు ఏర్పడుతుంది. ముక్కు లోపల వాపు ఉంటుంది. తలనొప్పి, చీది నప్పుడు బ్లాక్ స్పాట్ లాంటివి కనిపిస్తాయి. అలాంటి వారు అలస్యం చేయకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. బ్లాక్ ఫంగస్ ఎవరిలో వస్తుందంటే.. కోవిడ్ నుంచి కోలుకున్న వారిలో రోగ నిరోధక శక్తి తక్కువ ఉంటే ఈ ఫంగస్ వచ్చే ఆస్కారం ఎక్కువ. కోవిడ్ చికిత్సల్లో స్టెరాయిడ్స్ ఎక్కువగా వినియోగిస్తుండడం వల్ల కోలుకున్న వారిలో బ్లాక్ ఫంగస్ లక్షణాలు వస్తున్నాయి. ఓపీలో పేర్లు నమోదు చేసుకుంటే చికిత్స అందిస్తాం చికిత్స కోసం కోఠి ఈఎన్టీ ఆసుపత్రికి వచ్చే వారు ఎలాంటి రిపోర్ట్లు తీసుకురావాల్సిన అవసరం లేదు. నేరుగా ఓపిలో తమ పేర్లు నమోదు చేసుకుంటే చికిత్స ప్రారంభిస్తాం. బ్లాక్ ఫంగస్ సోకిన వారికి కోవిడ్ పాజిటివ్ ఉంటే ఇతర రోగులకు అంటుకునే ప్రమాదం ఉంది. అలాంటి వారు గాంధీ ఆసుపత్రిలో చికిత్సలు తీసుకోవాలి. బ్లాక్ ఫంగస్ సోకిన వారిలో కోవిడ్ నెగిటివ్ ఉంటేనే ఇక్కడ చికిత్సలు అందిస్తున్నాం. అందుబాటులో 50 బెడ్స్ ప్రస్తుతం ఆస్పత్రిలో 30 నుంచి 50 బెడ్లను అందుబాటులోకి తీసుకువచ్చాం. కేసులు పెరిగితే 200 బెడ్స్ వరకు సమకూర్చే అవకాశం ఉంది. ప్రస్తుతం 51 మంది ఇన్పెషెంట్లు ఉన్నారు వారికి సరిపడా మందులు, యాంపోటెరిసిన్–బి ఇన్జెక్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఏడు రోజుల పాటు చికిత్సలు అందజేస్తున్నాం.ఇప్పటి వరకు కొన్ని కారాణాల వల్ల ఒకరు మృతి చెందారు. యాంపోటెరిసిన్–బి ఇన్జెక్షన్ల కోసం ప్రభుత్వం అన్లైన్ ద్వారా అప్లైయ్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. అన్లైన్ ద్వారా అప్లైయ్ చేసుకున్న వారికి ఇన్జెక్షన్ ఇచ్చే సౌకర్యం ప్రభుత్వం కల్పిస్తోంది. త్వరలోనే వెబ్సైట్ వివరాలు తెలియజేస్తాం. చదవండి: కరోనా వ్యాక్సిన్: కోటి డోసులు కావాలి -
విజిల్ బయటకొచ్చింది కానీ...
- బాలుడి గొంతులోనే విజిల్ లోపలి భాగం - శస్త్రచికిత్స చేసి బయటకు తీసిన కోఠి ఈఎన్టీ వైద్యులు హైదరాబాద్: ఆటలాడుతూ ఓ బాలుడు విజిల్ మింగాడు. హైదరాబాద్ కోఠి ఈఎన్టీ వైద్యులు బుధవారం శస్త్రచికిత్స చేసి ఆ బాలుడిని కాపాడారు. సిద్దిపేట జిల్లా సీతారామ్పల్లికి చెందిన బాబు కుమారుడు రిశ్వంత్(6) 15 రోజుల క్రితం ఆటాడుకుంటూ విజిల్‌ను మింగాడు. బాలుడు దగ్గుతుండడం.. శ్వాసకు ఇబ్బంది పడడం గమనించిన తల్లిదండ్రులు సిద్దిపేటలోని ప్రైౖవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు స్కానింగ్ చేసి గొంతులో విజిల్ ఉన్నట్లు గుర్తించారు. కోఠి ఈఎన్టీకి రిఫర్ చేయడంతో హుటాహుటిన ఆసుపత్రికి తీసుకువచ్చారు. అక్కడ రిశ్వంత్‌కు వాంతులు కావడంతో విజిల్ బయటకు వచ్చింది. దీంతో వైద్యులు ఇంటికి పంపివేశారు. రెండు రోజులుగా బాలుడు దగ్గుతుండడంతో బుధవారం మరలా కోఠి ఈఎన్టీ ఆసుపత్రి తీసుకొచ్చారు. హమీద్, రంగనాథ్, శ్వేతల ఈఎన్టీ వైద్య బృందం రిశ్వంత్‌కు శస్త్ర చికిత్స నిర్వహించారు. విజిల్లో ఉండే లోపల భాగం గొంతులోనే ఉండిపోవడంతో దానిని వెలికితీశారు. విజయవంతంగా చికిత్స పూర్తి చేసిన వైద్య బృందాన్ని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్ అభినందించారు.