kova laxmi
-
వివాదం.. అగ్గిరాజేస్తున్న ఆధిపత్య పోరు
ఎమ్మెల్యే, జడ్పీ చైర్మన్ మధ్య పోరు అగ్గిరాజేస్తోంది.. ఆధిపత్యం కోసం రెండు వర్గాలు కత్తులు దూసుకుంటున్నాయి. వర్గాలు వీడిపోయి ఒకరి పై ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటున్నారు. జిల్లా పరిషత్ చైర్మన్, ఎమ్మెల్యే టార్గెట్ చేయడానికి కారణాలేంటి,? ఆసిఫాబాద్ నియోజకవర్గంలో గులాబీ పార్టీలో కుంపట్లపై సాక్షి టీవీ స్పేషల్ రిపోర్ట్. సాక్షి, ఆదిలాబాద్ : కుమ్రంభీమ్ జిల్లా ఆసిఫాబాద్ నియోజకవర్గంలో గూలాబీ పార్టీలో విభేదాలు తారస్థాయికి చేరాయి. ఎమ్మెల్యే అత్రం సక్కు, జడ్పీ చైర్మన్ కోవలక్ష్మి మధ్య విభేదాలు రోజు రోజుకు ముదురుతున్నాయి. ఎమ్మెల్యే అత్రంసక్కు కాంగ్రెస్ నుంచి పోటీ చేసి కోవ లక్ష్మిపై ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత సక్కు కాంగ్రెస్ నుంచి గులాబీ గూటికి చేరారు. కోవ లక్ష్మి ఎమ్మెల్యేగా ఓటమి పాలైనా తర్వాత జిల్లా పరిషత్ ఎన్నికలలో జైనూర్ నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా పరిషత్ చైర్మన్ పదవి గిరిజనులకు కేటాయించడంతో కోవలక్ష్మి జిల్లా పరిషత్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఇద్దరు ఒకే నియోజకవర్గం కావడంతో పార్టీలో పట్టుకోసం వర్గాలు విడిపోయారు. ఎమ్మెల్యే, జడ్పీ చైర్మన్ ఆధిపత్యం కోసం వర్గాలను పెంచిపోషిస్తున్నారు. అభివృద్ధి పనులైనా, పదవులైనా అనుచరులకు దక్కించుకోవడానికి పోటీపడుతున్నారు. ఒక వర్గానికి అధికారులు పనులు ఇస్తే. తనవర్గానికి పనులు ఇవ్వడం లేదని ఉన్నాతాధికారులకు ఫిర్యాదు చేసుకుంటున్నారు. దీంతో అధికారులకు అడకత్తేరలో పోకమాదిరిగా మారింది. ఒకే పార్టీలో ఉన్నా.. ఉప్పు నిప్పులా ఒక వర్గానికి పనులు ఇస్తే.. మరోక వర్గం అధికారులపై కస్సుబుస్సు మంటోది. అదే విధంగా ఎస్సైలు, సీఐలు, మండల పరిషత్ అధికారులు, ఎమ్మార్వోలు ఎమ్మెల్యే అనుకూలంగా ఉంటే, జడ్పీ చైర్మన్‌కు గిట్టడంలేదట. చైర్మన్‌కు అనుకూలంగా ఉంటే ఎమ్మెల్యే సక్కుకు గిట్టడం లేదట. ఇద్దరి ప్రజాప్రతినిధుల పెత్తనం వల్ల అధికారులు నలిగిపోతున్నారట. కొందరు అధికారులు ఈ పెత్తనం వేధింపులు తట్టుకోలేక బదిలీ దారులు వెతుకున్నారట. అధికారుల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గోయ్యిలా ఉంటే.. కార్యకర్తలది నాయకులది విచిత్రమైన పరిస్థితి. ప్రతి మండలంలో ఎమ్మెల్యే సక్కు వర్గం, జడ్పీ చైర్మన్ కోవలక్ష్మి వర్గాలుగా విడిపోయారు. చైర్మన్ కోవలక్ష్మి ఎమ్మెల్యేపై ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నిస్తున్నారని జోరుగా ప్రచారం ఉంది. సిర్పూర్ మండలం జడ్పీటీసీగా కోవలక్ష్మి కూతురు విజయం సాధించింది. కోవలక్ష్మి జడ్పీటీసీగా గెలుపొందిన జైనూర్, సిర్పూర్ మండలాల్లో చైర్మన్ అంత జనన కనుసన్నలో నడిపిస్తోందట. జిల్లా పరిషత్ నుంచి కేటాయించే నిధులు తనకు అనుకూలంగా కేటాయిస్తోందట. ఎమ్మెల్యే సక్కు తానేం తక్కువ కాదని ఎమ్మెల్యే కోటా నిధులు తనవర్గానికి కేటాయించి పట్టుపెంచుకున్నారట. చైర్మన్ వర్గాన్ని దూరం పెడుతున్నారని జోరుగా నియోజకవర్గంలో ప్రచారం సాగుతుందట. పైకి ఇద్దరు ఒకే పార్టీలో ఉన్నా.. ఉప్పు నిప్పులా ఉన్నారని కార్యకర్తల్లో చర్చసాగుతుందట. గులాబీ టికెట్‌పై అప్పుడే రచ్చ వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో గులాబీ టికెట్‌పై అప్పుడే రచ్చ మొదలైంది. ఓటమి పాలైన వారికి టిఅర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వదని.. తనకే టిక్కెట్ దక్కుతుందని సక్కు ప్రచారం చేసుకుంటున్నారట. ఎమ్మెల్యే టికెట్ దక్కని.. జడ్పీ చైర్మన్ వర్గంలో ఉండటం కన్నా రాజకీయ భవిష్యత్తు కోసం వర్గంలోకి రావాలని స్థానిక ప్రజాప్రతినిధులను కోరుతున్నారట. ఆ ప్రచారాన్ని నమ్మి కొందరు కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు చైర్మన్ వర్గం నుంచి ఎమ్మెల్యే వర్గంలోకి చేరిపోయారట. జిల్లా పరిషత్ చైర్మన్ కోవలక్ష్మి ఎమ్మెల్యే ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారట. ఇప్పటికే జైనూర్, సిర్పూర్ మండలాల్లో తన ఆధిపత్యంలో ఉందని.. మిగితా తిర్యాణి, వాంకిడి, నార్నూర్, గాదే గూడ మండలాల ప్రజా ప్రతినిధులు తనవైపు ఉన్నారని ప్రచారం చేసుకుంటున్నారట. అదే విధంగా పార్టీ పెద్దల అండ తనకు టిక్కెట్ దక్కుతుందని సన్నిహితులకు చెప్పకుంటున్నారట. ఒకే పార్టీ ప్రజాప్రతినిధులు ప్రత్యర్థి పార్టీ మాదిరిగా వ్యతిరేక ప్రచారం చేసుకోవడంపై కార్యకర్తలు అందోళన చెందుతున్నారట. ఇప్పుడే ఇలా గొడవలు ఉంటే.. మరి ఎన్నికల నాటికి టికెట్ గొడవలు ఎటువైపు ఎక్కడి వరకు పోతాయోనని కార్యకర్తలు అందోళన చెందుతున్నారట. ఈ ప్రజాప్రతినిధుల మధ్య సయోధ్య కుదుర్చాలని కార్యకర్తలు కోరుతున్నారట. పార్టీ పెద్దలు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి. -
జిల్లాను అగ్రస్థానంలో నిలుపుదాం
సాక్షి, ఆసిఫాబాద్: ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి పనిచేసి జిల్లాను అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలుపుదామని జెడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని జెడ్పీ సమావేశ మందిరంలో మంగళవారం ఏర్పాటు చేసిన పాలకవర్గ సమావేశంలో చైర్పర్సన్ మాట్లాడుతూ వెనకబడిన ఆదవాసీ జిల్లాకు ప్రత్యేక నిధులు తెచ్చేందుకు కృషి చేస్తానన్నారు. వచ్చే ఐదేళ్లలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేలా జిల్లాకు వచ్చిన నిధులు అన్ని మండలాలకు సమానంగా పంచుతామని తెలిపారు. ఆదివాసీల సమస్యలు జెడ్పీ స్టాండింగ్ కమిటీలో చర్చించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు సక్రమంగా అందేలా కొత్తగా గెలుపొందిన ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని సూచించారు. త్వరలోనే సీఎం అపాయింట్మెంట్ తీసుకుని జిల్లా సమస్యలు వివరిస్తామని తెలిపారు. వైస్‌చైర్మన్‌గా కృష్ణ ప్రమాణ స్వీకారం.. కాగజ్‌నగర్ జెడ్పీటీసీ కోనేరు కృష్ణ జిల్లా పరిషత్ వైస్‌చైర్మన్‌గా మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం కలెక్టర్, జెడ్పీ చైర్‌పర్సన్‌తో పాటు జెడ్పీ సీఈవో వైస్‌చైర్మన్ కృష్ణకు పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. అనంతరం ఆసిఫాబాద్, సిర్పూర్ ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, కోనేరు కోనప్పతో పాటు జిల్లాలోని అన్ని మండలాల జెడ్పీటీసీలు కృష్ణను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రమాణ స్వీకారం సందర్భంగా సిర్పూర్ నియోజకవర్గం నుంచి కృష్ణ అభిమానులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జెడ్పీ కార్యాలయం ఎదుట బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సమావేశంలో ఆసిఫాబాద్ జెడ్పీటీసీ అరిగెల నాగేశ్వర్రావు, సీఈవో వేణు, డిప్యూటీ సీఈవో సాయిగౌడ్, జెడ్పీటీసీలు తాళ్లపెల్లి రామారావు, అజ య్‌కుమార్, సంతోశ్, కోవ అరుణ, దృపదా బాయి, అన్ని మండలాల సభ్యులు, కో అప్షన్ సభ్యులు సిద్దిక్, అబుద్ అలీ పాల్గొన్నారు. -
భర్త సహకారం మరువలేనిది
‘రాజకీయ జీవితంలో నా భర్త సోనేరావు సహకారం మరువలేనిది. రాజకీయాల్లోకి అనుకోకుండా వచ్చిన నాకు ఎక్కడా కూడా అభ్యంతరం చెప్పకుండా పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ప్రజా క్షేత్రంలో ఉన్నప్పుడు ఏ పనిచేసినా ప్రజల్లో చిరకాలం గుర్తుండిపోవాలన్నది నా అభిలాష’ అని అంటున్నారు ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే, కుమురం భీం జిల్లా పరిషత్ చైర్పర్సన్ కోవ లక్ష్మి. పాలిటిక్స్‌లోకి వచ్చాక పర్సనల్ లైఫ్ మిస్సవుతున్నానని అంటున్న ఆమె తన కుటుంబం, ప్రస్థానం తదితర అంశాలపై పలు ఆసక్తికర వివరాలను వెల్లడించారు. ఆదివాసీ మహిళగా ఉన్నతస్థాయి పదవులు అలంకరించిన కోవలక్ష్మితో ‘సాక్షి’ ఈ వారం పర్సనల్ టైం.. సాక్షి ఆసిఫాబాద్: మా సొంతూరు వాంకిడి మండలం బంబార. నాన్న కోట్నాక భీంరావు, మాజీ మంత్రి. మా నాన్నకు ఇద్దరు భార్యలు. అమ్మ భీంబాయి, చిన్నమ్మ సొంబాయి. మా అమ్మకు ఐదుగురు, చిన్నమ్మకు ఐదుగురు మొత్తం పది మంది సంతానం. నలుగురం అక్కాచెల్లెళ్లం. ఆరుగురు అన్నదమ్ములు. మా పెద్దన్నయ్య సంజీవ్ కుమార్ చిన్న వయసులోనే అనారోగ్యంతో మరణించాడు. మేం స్కూల్‌కు వేళ్లే సమయంలో నాన్న ఉమ్మడి రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు. హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఉంటూ నేను, మా చెల్లి సరస్వతి ఇద్దరం సెక్రెటేరియేట్ సమీపంలో ఉన్న పబ్లిక్ స్కూల్లో ఐదోతరగతి వరకూ చదువుకున్నాం. మంత్రి పదవీ కాలం పూర్తయ్యాక సొంతూరు బంబార ఆశ్రమ పాఠశాలలో చేర్పించారు. అప్పటికీ నేను హైదరాబాద్‌లో ఇంగ్లిష్ మీడియంలో 5వ తరగతి పూర్తిచేశాను. ఇక్కడికి వచ్చాక బంబార ఆశ్రమ పాఠశాలలో తెలుగు మీడియంలో మళ్లీ రెండో తరగతిలో వేశారు. సరస్వతిని ఒకటో తరగతిలో వేశారు. దీంతో నా చదవు సవ్యంగా సాగలేదు. పాఠశాల స్థాయిలోనే చదువుకు ఫుల్స్టాప్ పెట్టాల్సి వచ్చింది. చిన్న వయస్సులోనే పెళ్లి.. అప్పట్లో చాలా చిన్న వయస్సులోనే పెళ్లిళ్లు అవుతుండే. 1986లో 17 సంవత్సరాలకే కోవ సోనేరావుతో నా వివాహం జరిగింది. మా అత్తగారిది తిర్యాణి మండలం బీంజిగూడ. పెళ్లైన మూడేళ్లకు మా ఆయనకు టీచర్ ఉద్యోగం వచ్చింది. ముగ్గురు పిల్లలు అయ్యాక 1995లో మా ఆయన వాళ్ల తాత పెందోరు నాగు పంగడి మాదర ఎంపీటీసీగా నా పేరు ఏకగ్రీవంగా ప్రతిపాదించారు. అప్పడు ఆయన పంగిడి మాదర సర్పంచ్‌గా ఉన్నారు. నాకు ఇష్టం లేకున్నా పెద్దాయన పట్టుబట్టడంతో తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసి ఎంపీటీసీగా విజయం సాధించా. అలా నా రాజకీయ ప్రస్థానం మొదలైంది. మొదట్లో కష్టంగా ఉండేది.. మొదటిసారి ఎంపీటీసీగా గెలుపొందినప్పుడు మా కొడుకు సాయినాథ్కు మూడేళ్లు. ఏదైనా స మావేశాలకు వెళ్లాలంటే ఇబ్బందిగా ఉండేది. అలాగే ఇద్దరు అమ్మాయిల చదువు. నేను రాజకీయాల్లో ఉండలేనని అందరితో చెప్పాను. ఆ తర్వాత పిల్లల చదువుల కోసం ఆసిఫాబాద్‌కి వచ్చాం. ఇక్కడ కంఠ కాలనీలో మాకో ఇల్లు ఉండే ది. అక్కడ ఉండేవాళ్లం. ఆ తర్వాత 2001లో మళ్లీ ఎంపీటీసీగా పోటీ చేయాలని స్థానిక నాయకులు తీవ్ర ఒత్తిడి తెచ్చారు. నాకు ఇష్టం లేదని, పిల్లల చదువులకు ఇబ్బంది అవుతుందని చెప్పా. కాని ఎవరూ వినలేదు. అయిష్టంగానే రెండోసారి ఎంపీటీసీగా గెలుపొందడంతో తిర్యాణి ఎంపీపీగా ఎన్నుకున్నారు. ఎంపీపీ అయినట్లు కూడా నాకు తెలియదు. ఎవరో ఇంటికి వచ్చి చెబితే తెలిసింది. మొదట అంత అయిష్టంగా ఉండే రాజకీయాలంటే. ఆ తర్వాత 2007లో ఆసిఫాబాద్ సర్పంచ్‌గా పోటీచేసి గెలుపొందాను. తెలంగాణ ఉద్యమం జోరుగా సాగుతున్న సమయంలో 2010లో టీడీపీని వీడి టీఆర్ఎస్లో చేరాను. మరోసారి 2013లో ఆసిఫాబాద్ సర్పంచ్‌గా పోటీ చేసి గెలిపొందాను. 2014లో సీఎం కేసీఆర్ సార్ నాకు టికెట్ ఇవ్వడంతో తొలిసారి ఆసిఫాబాద్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందాను. అంతేకాక కేబినెట్‌స్థాయి ర్యాంకుతో ఉన్న పార్లమెంటరీ సెక్రెటరీ పదవి ఇచ్చారు. మొదటి సారే నేను ఓ సహాయ మంత్రిగా పనిచేసే అవకాశం దక్కింది. ఆ తర్వాత 2018లో స్వల్ప ఓట్ల తేడా ఓడిపోయాను. కాని కేసీఆర్ గారు కుమురం భీం జిల్లా తొలి జెడ్పీచైర్‌పర్సన్‌గా అవకాశం కల్పించారు. జెడ్పీచైర్‌పర్సన్ అవకాశం రావడంతో రెండోసారి ఎమ్మెల్యేగా ఓడిపోయానన్న బాధను మరచిపోయాను. జిల్లా ఏర్పాటుతో సంతోషం.. సీఎం కేసీఆర్ కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తున్న సమయంలో మా గిరిజన ప్రాంతాన్ని కూడా జి ల్లాగా ఏర్పాటు చేయాలని కోరాను. దీంతో ఆయన వెంటనే కొత్త జిల్లాకు ఓకే చెప్పడం, కు మురం భీం పేరు మీదుగా కొత్త జిల్లా ఏర్పడడం ఎంతగానో సంతోషాన్నిచ్చింది. అనుకున్నట్లుగానే జిల్లా ఏర్పడడంతో అభివృద్ధికి ఆస్కారం ఏర్పడింది. రాజకీయాల్లోకి రావొద్దన్నాను.. మా పెద్దమ్మాయి అరుణ ఆసిఫాబాద్ గ్రామ పంచాయతీ ఉప ఎన్నికల్లో సర్పంచుగా పోటీ చేసినప్పుడు గాని ఇటీవల సిర్పూర్(యూ) నుంచి జెడ్పీటీసీగా పోటీ చేయడం గాని నాకు ఇష్టం లేదు. రాజకీయాల్లోకి వద్దన్నాను. సిర్పూర్(యూ)లో నేను, అరుణ చేరో సెట్ నామినేషన్ వేశాం. నేను జైనూర్‌లో పోటీలో నిలబడాలని నిశ్చయంతో సిర్పూర్(యూ)లో ఉపసంహరించుకున్నాను. అదే సమయంలో మా అమ్మాయిని కూడా విత్‌డ్రా చేసుకోవాలని చెప్పా. బీ ఫాం కూడా వేరే వాళ్లకు అనుకున్నాం. కాని జైనూర్ నుంచి పోటీలో ఉండడంతో కనీసం మీ కూతురు అయినా ఇక్కడి నుంచి పోటీ చేయాలని అక్కడి వారు కోరడంతో అలా ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందింది. చెల్లె, నేను ప్రత్యర్థులుగా తలపడ్డాం.. వేర్వేరు రాజకీయ పార్టీల్లో ఉన్నప్పుడు బంధుత్వాలు ఉండవు. మా చెల్లి సరస్వతి, నేను ఆసిఫాబాద్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచులుగా తలపడ్డాం. ఆ తర్వాత 2014లో నేను టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు చెల్లి టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసింది. అలా మేమిద్దరం అక్కాచెల్లెళ్లు అయినా వేర్వేరు పార్టీల్లో ఉండడంతో రాజకీయంగా ప్రత్యర్థులం అయినాం. నేర్చుకునేలా ప్రోత్సహించారు మా పెద్దమ్మాయి అరుణ డిగ్రీ పూర్తి చేసి పీజీ చేస్తూ ప్రస్తుతం సిర్పూర్(యూ) జెడ్పీటీసీగా కొనసాగుతోంది. రెండో అమ్మాయి మాన్విత ఎల్ఎల్ఎం పూర్తయింది. అబ్బాయి సాయినాథ్ బీబీఏ చదివాడు. నా రాజకీయ జీవితంలో మా ఆయన తోడ్పాడు ఎల్లప్పుడూ ఉంటుంది. నాకు స్వతహాగా తెలియని విషయాలను నాకు నేనే నేర్చుకునేలా ప్రోత్సహించారు. కుటుంబ సభ్యులందరి సహకారంతోనే ఈస్థాయిలో ఉన్నాను. ఉదయం నేను లేచే సరికే అనేక మంది ఇంటికి వస్తుంటారు. అలా ఉదయాన్నే ప్రజా దర్బార్ మొదలవుతుంది. వచ్చిన వారి సమస్యలు పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తా. రాజకీయాల్లో ఉన్నంత కాలం నా శక్తి మేర ప్రజాసేవ చేస్తా. -
కలవరం
సాక్షి, ఆసిఫాబాద్: ఉమ్మడి జిల్లాలో పది నియోజకవర్గాల్లో ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న ఆత్రం సక్కు పార్టీ మార్పు ఎపిసోడ్ జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో కొంతమంది టీఆర్ఎస్ నాయకులకు ఈ మార్పు మింగుడు పడడం లేదు. రెండురోజులు గా జిల్లాలో జరగుతున్న పరిణామాలు కాంగ్రెస్, టీఆర్ఎస్ల అభిమానులు, కార్యకర్తలతో పాటు సామాన్య ప్రజల్లోనూ ఆసక్తి రేపుతున్నా యి. ఈ నెల 2న కాంగ్రెస్ నుంచి ఆసిఫాబాద్, పినపాక నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, రేగా కాంతారావు టీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధం కావడం తెలిసిందే. ఆ మర్నాడు పార్టీ మారడంపై కాంగ్రెస్ నేతలు ఇద్దరు ఎమ్మెల్యేలపై తీవ్రంగా విమర్శలు చేయడం సక్కు కూడా ఆ పార్టీ నేతలకు సోమవారం ఘాటుగా సమాధానం ఇవ్వడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆసిఫాబాద్ నియోజకవర్గం లో టీఆర్ఎస్లోని ఓ వర్గం మాత్రం ఒకింత ఆం దోళన వ్యక్తం చేస్తోంది. ఇన్నాళ్లు టీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఉన్న వారితో కలిసి పని చేయడం ఎ లా అని తర్జనభర్జన పడుతున్నారు. మొన్న జరి గిన ఎన్నికల్లో ఒకరినొకరు విమర్శించుకోవడంతో పాటు, పోలీసు కేసులు కూడా పెట్టుకున్నారు. టీఆర్ఎస్ అధిష్టాన నిర్ణయమే శిరోధార్యంగా భా విస్తుండడంతో ఎవరూ కూడా ఈ పరిణామాలకు వ్యతిరేకంగా బహిరంగంగా నోరు మెదపడం లేదు. నాయకుల్లో కలవరం మొన్నటివరకు రాజకీయంగా ఆత్రం సక్కు, కోవ లక్ష్మీ వర్గాలు రాజకీయంగా శత్రువులుగా ఉన్నా యి. సక్కు పార్టీలో చేరికను ఆహ్వానిస్తున్నట్లు చె బుతున్నప్పటికీ భవిష్యత్‌లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయోనని పలువురు ఆం దోళన చెందుతున్నారు. తమ నాయకత్వానికి ఎ క్కడ ముప్పు వస్తుందోనని భయపడుతున్నారు. ఆసిఫాబాద్‌లో కోవ లక్ష్మీ డిసెంబర్లో జరిగిన శాసనసభ ముందస్తు ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమి పాలైనప్పటికీ పార్టీలో గుర్తింపును కాపాడుకుంటూ వస్తున్నారు. అధికారంలో ఉన్న పార్టీ నాయకురాలు కావడంతో స్థానిక అధికారులతో సాధారణ ప్రజానీకంలోనూ ఆమె స్థానం చెదిరిపోకుండా ఉంది. నియోజకవర్గంలో ఏ కార్యక్రమం జరిగినా ఆమెకు ఎమ్మెల్యేగా ఎటువంటి అధికారికంగా ప్రొటోకాల్ లేకున్నప్పటికీ అనధికారంగా ఆహ్వానాలు అందుతున్నాయి. ఆమె వర్గానికి కూ డా అంతే ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నారు. దీంతో పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఎమ్మెల్యే పదవి లేకున్నప్పటికీ అధికార యంత్రాంగంతో పనులు చేయించుకోవడంతోపాటు స్థానికంగా పలుకుబడి కాపాడుకుంటున్నారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సక్కు పార్టీ మారడంతో ప్రస్తుత టీఆర్ఎస్ కేడర్‌లో ఆందోళన మొదలైంది. ఇక నుంచి అధికారంలో ఉన్న పార్టీతోపాటు పదవిలో ఉన్న ఎమ్మెల్యేకే అంతా ప్రాధాన్యం ఇవ్వడం సహజం గా జరుగుతుంది. తమవర్గం భవిష్యత్ ఎలా ఉం డబోతుందనే ఆలోచనలో పడ్డారు. అలాకాకుండా ఇరువర్గాలు ఒకరిని ఒకరు కలుపుకుపోతే ఏ గొడవ రాకపోవచ్చు. కానీ ఇప్పటికే టీఆర్ఎస్లో అంతర్గతంగా గ్రూప్ రాజకీయాలు సాగుతున్నాయి. తాజాగా జరిగే ఈ గ్రూపు విభేదాలతో ఎవరికి అంతిమంగా లబ్ధి చేకూరనుందోనని కొంత మంది నాయకులు ఆందోళనలో పడుతున్నారు. భవిష్యత్‌లో పార్టీలో ఎమ్మెల్యే టికెట్ కోసం పోటీ ఉంటుందని విశ్లేషిస్తున్నారు. సిర్పూర్ పరిస్థితి ఎదురైతే? ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై రాజకీయ వర్గాలు జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గ పరిస్థితిని గుర్తు చేసుకుంటున్నాయి. అక్కడ ఇదే తరహాలో 2014లో కావేటి సమ్మయ్య టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి కోనేరు కోనప్ప చేతిలో స్వల్పతేడాతో ఓటమి పాలయ్యారు. అనంతరం జరిగిన పరిణామాలతో బీఎస్పీ నుంచి పోటీచేసి గెలుపొందిన కోనప్ప టీఆర్ఎస్లో చేరికతో కావేటి రాజకీయ భవిష్యత్ ఇబ్బందుల్లో పడింది. కాలక్రమేణా పార్టీలోనూ పూర్తిగా పట్టుకోల్పోయారు. చివరకు శాసనసభ ఎన్నికల ముందు టీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. ప్రస్తుతం ఆసిఫాబాద్‌లో కూడా అటువంటి పరిస్థితులే కనిపిస్తుండడంతో కార్యకర్తలు కలరపాటుకు గురవుతున్నారు. కొత్తగా చేరేవారి ఆధిపత్యం పార్టీలో మొదలైతే తమ పరిస్థితి ఏమిటనేది తలచుకుంటే భయంగా ఉందని పార్టీలో సీనియర్‌గా ఉన్న ఓ నాయకుడు చెప్పుకొచ్చాడు. అయితే కొందరు మాత్రం పార్టీలో ఎంత మంది చేరినప్పటికీ ఎవరి గుర్తింపు వారికి ఉంటుందని చెబుతున్నారు. ఇరువర్గాలు సమన్వయంతో ముందుకు వెళ్తామంటున్నారు. పార్టీ అధిష్టానం ఇరువురికి తగిన న్యాయం చేస్తుందని సిర్పూర్ తీరు ఇక్కడ ఉండబోదని ధీమాగా ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే కోవ లక్ష్మీ మాత్రం పార్టీలో ఎవరూ చేరిన తమకు రాజకీయంగా ఎలాంటి ఇబ్బంది ఉండబోదని అందరితో కలిసి పని చేస్తామని చెబుతున్నారు. అయితే వచ్చే పార్లమెంటు, పరిషత్ ఎన్నికల్లో ఇరువర్గాల నుంచి కింది స్థాయిలో కేడర్ ఏ మేరకు కలిసి పని చేస్తాయో వేచిచూడాలి. -
నెత్తుటి దారిపై శాంతియాత్ర
సాక్షి, ఆసిఫాబాద్: అడవిలో తుపాకీ పట్టి ఉద్యమిస్తున్న మావోయిస్టులను జన జీవన స్రవంతిలోకి ఆహ్వానిస్తూ వారిని శాంతి వైపు మళ్లిస్తూ ఉద్యమ ప్రభావంతో నష్టపోతున్న ఆదివాసీలకు అవగాహన కల్పించేందుకు గాంధేయవాదులు ఓ పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఈ నెల 2న మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా మావోయిస్టు కంచుకోట అయిన ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్పూర్కు కాలినడకన ‘సంవిదాన్ యాత్ర’ పేరిట అవగాహన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత చేపడుతున్న ఈ శాంతియుత పాదయాత్రలో ముఖ్యంగా ఆదివాసీ తెగల్లో అధికంగా నలిగిపోతున్న గోండు తెగ వారు ఇందులో అధికంగా భాగస్వాములు అవుతున్నారు. ఈ యాత్ర ఈ నెల 2న గాంధీ జయంతిని పురస్కరించుకుని ఆంధ్ర, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ మూడు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన తూర్పుగోదావరి జిల్లా చట్టి అనే ఆదివాసీ గ్రామం నుంచి ఈ పాదయాత్ర మొదలుకానుంది. ఈ యాత్రలో సెంట్రల్ గోండ్వానా నెట్ (సీజీ నెట్), రాజ్‌గోండ్ సేవా సమితి, మహాత్మాగాంధీ శబరి ఆశ్రమం, ప్రయోగ్ సమాజ్ సేవా సంస్థ తదితర సంస్థల ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర కొనసాగనుంది. ఇప్పటికే ఈ యాత్రకు సంబంధించి సన్నాహాక సభలు డిల్లీ, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణలో ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌లో జరిగాయి. తెలంగాణ నుంచి 100 మంది ఆదివాసీలు తెలంగాణ నుంచి 100 మంది వరకు గోండు, కోయ, కొలాం, మన్నేవార్ తదితర తెగల గిరిజనులు ఈ పాదయాత్రలో పాలుపంచుకొన్నారని నిర్వాహకులు చెబుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి దాదాపు 20 మంది పాల్గొననున్నారు. శనివారం కుమురంభీం జిల్లా కేంద్రం నుంచి బయలుదేరి భద్రాచలం చేరుకుని అక్కడ ఖమ్మం, కొత్తగూడెం తదితర ప్రాంతాల నుంచి ఆదివాసీలను కలుపుకుంటూ ఈ నెల 2 వరకు తూర్పుగోదావరి జిల్లా చట్టికి చేరుకుంటారు. అక్కడి గాంధీ ఆశ్రమంలో ఆదివాసీ సంప్రదాయాలైన కోయ కోయతూర్, డోల్ పేప్రె కాళి తుడుం వాయిద్యాలతో అదే రోజున యాత్ర ప్రారంభమవుతుంది. దాదాపు 200 కిలోమీటర్ల సాగనున్న ఈ పాదయాత్రలో మార్గమధ్యంలో పలు గిరిజన ఆవాసాల గుండా ప్రయాణిస్తూ ఆదివాసీలను భాగస్వామ్యం చేస్తూ ముందుకు సాగనున్నారు. 1980లో మావోయిస్టులు దండకారణ్యంలో ప్రవేశించిన దారిగుండానే ఈ పాదయాత్ర కొనసాగడం విశేషం. మొత్తం పది రోజుల పాటు సాగే ఈ పాదయాత్రలో రోజుకు 20 కిలోమీటర్ల చొప్పున ప్రయాణిస్తూ వచ్చే నెల 12న చత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లాలోని జగదల్పూర్కు చేరుకుంటుంది. అనంతరం జిల్లా కేంద్రం బస్తర్‌లో బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. మధ్య భారతంలో వామపక్ష భావజాలంతో అనేక మంది అమాయక గిరిజనులు అటు భద్రతా దళాలు, ఇటు మావోల ఉద్యమ ప్రభావంతో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని ఇరువర్గాల మధ్య నలిగిపోతున్న గిరిజనులను అవగాహన కల్పించేందుకు, మావోస్టులను జనజీవన స్రవంతిలోకి ఆహ్వానిస్తూ శాంతిబాట పట్టాలని కార్యక్రమం చేపట్టామని చెబుతున్నారు. ముఖ్యంగా ఛత్తీస్‌గఢ్‌లో పోలీసు సల్వార్జుడుం, మావోయిస్టులు జన్«థన్ సర్కారు పేరుతో ఇరు వర్గాల మధ్య గిరిజనులు నలిగిపోతున్నారని వారి గొంతుగా ఈ యాత్ర చేపట్టినట్లు పేర్కొంటున్నారు. అయితే ఇటీవల మావోయిస్టులు విశాఖపట్నం జిల్లా అరుకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను కాల్చిచంపిన ఘటనతోపాటు మరికొద్ది రోజుల్లో మావోయిస్టు వారోత్సవాలు కూడా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ శాంతియాత్ర ప్రాధాన్యం సంతరించుకుంది. ఏర్పాట్లు పూర్తి మావోయిస్తు ప్రభావిత ప్రాంతాల్లో శాంతి నెలకొల్పడానికి గాంధీ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లోని చట్టి నుంచి ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్పూర్ వరకు చేపట్టిన ఈ శాంతియాత్రకు అన్ని ఏర్పాట్లు చేశాం. ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లోని తిడ్లాలో ఓ సన్నాహాక సభ కూడా నిర్వహించాం. – సుభారాన్షు చౌదరి, బస్తర్, పాదయాత్ర కమిటీ సభ్యుడు శాంతి నెలకొల్పేందుకే... ఏళ్లుగా అటు భద్రతాదళాలు, ఇటు మావోయిస్టు దళాల మధ్య ఆదివాసీలు నలిగిపోతున్నారు. ఇరువర్గాల మధ్య ప్రాణాలు కోల్పోతున్నది గిరిజనులు. ఈ హింస ఇక నుంచి ఆగిపోవాలని, దండకారణ్యంలో శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకే ఈ పాదయాత్ర చేపట్టాం. దీనికి అందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాం. – సిడాం అర్జు, తెలంగాణ రాష్ట్ర కన్వీనర్, రాజ్‌గోండ్ సేవా సమితి -
రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా నిరంజన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పదవుల పందేరాన్ని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు వేగవంతం చేశారు. తాజాగా రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తికి చెందిన సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇక ఆరుగురు ఎమ్మెల్యేలను పార్లమెంటరీ సెక్రటరీలుగా నియమించాలని నిర్ణయించిన సీఎం ఇప్పటికే శ్రీనివాస్‌గౌడ్, జలగం వెంకట్రావును ప్రకటించగా... తాజాగా కోవ లక్ష్మి(ఆసిఫాబాద్), దాస్యం వినయ్‌భాస్కర్ (హన్మకొండ) పేర్లను ఖరారు చేశారు. మరో ఇద్దరి పేర్లను త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది.