భర్త సహకారం మరువలేనిది | Sakshi Interview With TRS Leader Kova Laxmi | Sakshi
Sakshi News home page

భర్త సహకారం మరువలేనిది

Published Sun, Jul 14 2019 10:58 AM | Last Updated on Sun, Jul 14 2019 11:00 AM

Sakshi Interview With TRS  Leader Kova Laxmi

భర్త సోనేరావు, కూతుళ్లు అరుణ, మాన్విత, కుమారుడు సాయినాథ్‌తో కోవ లక్ష్మి

‘రాజకీయ జీవితంలో నా భర్త సోనేరావు సహకారం మరువలేనిది. రాజకీయాల్లోకి అనుకోకుండా వచ్చిన నాకు ఎక్కడా కూడా అభ్యంతరం చెప్పకుండా పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ప్రజా క్షేత్రంలో ఉన్నప్పుడు ఏ పనిచేసినా ప్రజల్లో చిరకాలం గుర్తుండిపోవాలన్నది నా అభిలాష’ అని అంటున్నారు ఆసిఫాబాద్‌ మాజీ ఎమ్మెల్యే, కుమురం భీం జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ కోవ లక్ష్మి. పాలిటిక్స్‌లోకి వచ్చాక పర్సనల్‌ లైఫ్‌ మిస్సవుతున్నానని అంటున్న ఆమె తన కుటుంబం, ప్రస్థానం తదితర అంశాలపై పలు ఆసక్తికర వివరాలను వెల్లడించారు. ఆదివాసీ మహిళగా ఉన్నతస్థాయి పదవులు అలంకరించిన కోవలక్ష్మితో ‘సాక్షి’ ఈ వారం పర్సనల్‌ టైం.. 

సాక్షి ఆసిఫాబాద్‌: మా సొంతూరు వాంకిడి మండలం బంబార. నాన్న కోట్నాక భీంరావు, మాజీ మంత్రి. మా నాన్నకు ఇద్దరు భార్యలు. అమ్మ భీంబాయి, చిన్నమ్మ సొంబాయి. మా అమ్మకు ఐదుగురు, చిన్నమ్మకు ఐదుగురు మొత్తం పది మంది సంతానం. నలుగురం అక్కాచెల్లెళ్లం. ఆరుగురు అన్నదమ్ములు. మా పెద్దన్నయ్య సంజీవ్‌ కుమార్‌ చిన్న వయసులోనే అనారోగ్యంతో మరణించాడు. మేం స్కూల్‌కు వేళ్లే సమయంలో నాన్న ఉమ్మడి రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు. హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఉంటూ నేను, మా చెల్లి సరస్వతి ఇద్దరం సెక్రెటేరియేట్‌ సమీపంలో ఉన్న పబ్లిక్‌ స్కూల్‌లో ఐదోతరగతి వరకూ చదువుకున్నాం. మంత్రి పదవీ కాలం పూర్తయ్యాక సొంతూరు బంబార ఆశ్రమ పాఠశాలలో చేర్పించారు. అప్పటికీ నేను హైదరాబాద్‌లో ఇంగ్లిష్‌ మీడియంలో 5వ తరగతి పూర్తిచేశాను. ఇక్కడికి వచ్చాక బంబార ఆశ్రమ పాఠశాలలో తెలుగు మీడియంలో మళ్లీ రెండో తరగతిలో వేశారు. సరస్వతిని ఒకటో తరగతిలో వేశారు. దీంతో నా చదవు సవ్యంగా సాగలేదు. పాఠశాల స్థాయిలోనే చదువుకు ఫుల్‌స్టాప్‌ పెట్టాల్సి వచ్చింది. 

చిన్న వయస్సులోనే పెళ్లి..
అప్పట్లో చాలా చిన్న వయస్సులోనే పెళ్లిళ్లు అవుతుండే. 1986లో 17 సంవత్సరాలకే కోవ సోనేరావుతో నా వివాహం జరిగింది. మా అత్తగారిది తిర్యాణి మండలం బీంజిగూడ. పెళ్లైన మూడేళ్లకు మా ఆయనకు టీచర్‌ ఉద్యోగం వచ్చింది. ముగ్గురు పిల్లలు అయ్యాక 1995లో మా ఆయన వాళ్ల తాత పెందోరు నాగు పంగడి మాదర ఎంపీటీసీగా నా పేరు ఏకగ్రీవంగా ప్రతిపాదించారు. అప్పడు ఆయన పంగిడి మాదర సర్పంచ్‌గా ఉన్నారు. నాకు ఇష్టం లేకున్నా పెద్దాయన పట్టుబట్టడంతో తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసి ఎంపీటీసీగా విజయం సాధించా. అలా నా రాజకీయ ప్రస్థానం మొదలైంది. 

మొదట్లో కష్టంగా ఉండేది.. 
మొదటిసారి ఎంపీటీసీగా గెలుపొందినప్పుడు మా కొడుకు సాయినాథ్‌కు మూడేళ్లు. ఏదైనా స మావేశాలకు వెళ్లాలంటే ఇబ్బందిగా ఉండేది. అలాగే ఇద్దరు అమ్మాయిల చదువు. నేను రాజకీయాల్లో ఉండలేనని అందరితో చెప్పాను. ఆ తర్వాత పిల్లల చదువుల కోసం ఆసిఫాబాద్‌కి వచ్చాం. ఇక్కడ కంఠ కాలనీలో మాకో ఇల్లు ఉండే ది. అక్కడ ఉండేవాళ్లం. ఆ తర్వాత 2001లో మళ్లీ ఎంపీటీసీగా పోటీ చేయాలని స్థానిక నాయకులు తీవ్ర ఒత్తిడి తెచ్చారు. నాకు ఇష్టం లేదని, పిల్లల చదువులకు ఇబ్బంది అవుతుందని చెప్పా. కాని ఎవరూ వినలేదు. అయిష్టంగానే రెండోసారి ఎంపీటీసీగా గెలుపొందడంతో తిర్యాణి ఎంపీపీగా ఎన్నుకున్నారు. ఎంపీపీ అయినట్లు కూడా నాకు తెలియదు. ఎవరో ఇంటికి వచ్చి చెబితే తెలిసింది.

మొదట అంత అయిష్టంగా ఉండే రాజకీయాలంటే. ఆ తర్వాత 2007లో ఆసిఫాబాద్‌ సర్పంచ్‌గా పోటీచేసి గెలుపొందాను. తెలంగాణ ఉద్యమం జోరుగా సాగుతున్న సమయంలో 2010లో టీడీపీని వీడి టీఆర్‌ఎస్‌లో చేరాను. మరోసారి 2013లో ఆసిఫాబాద్‌ సర్పంచ్‌గా పోటీ చేసి గెలిపొందాను. 2014లో సీఎం కేసీఆర్‌ సార్‌ నాకు టికెట్‌ ఇవ్వడంతో తొలిసారి ఆసిఫాబాద్‌ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందాను. అంతేకాక కేబినెట్‌స్థాయి ర్యాంకుతో ఉన్న పార్లమెంటరీ సెక్రెటరీ పదవి ఇచ్చారు. మొదటి సారే నేను ఓ సహాయ మంత్రిగా పనిచేసే అవకాశం దక్కింది. ఆ తర్వాత 2018లో స్వల్ప ఓట్ల తేడా ఓడిపోయాను. కాని కేసీఆర్‌ గారు కుమురం భీం జిల్లా తొలి జెడ్పీచైర్‌పర్సన్‌గా అవకాశం కల్పించారు. జెడ్పీచైర్‌పర్సన్‌ అవకాశం రావడంతో రెండోసారి ఎమ్మెల్యేగా ఓడిపోయానన్న బాధను మరచిపోయాను. 

జిల్లా ఏర్పాటుతో సంతోషం..
సీఎం కేసీఆర్‌ కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తున్న సమయంలో మా గిరిజన ప్రాంతాన్ని కూడా జి ల్లాగా ఏర్పాటు చేయాలని కోరాను. దీంతో ఆయన వెంటనే కొత్త జిల్లాకు ఓకే చెప్పడం, కు మురం భీం పేరు మీదుగా కొత్త జిల్లా ఏర్పడడం ఎంతగానో సంతోషాన్నిచ్చింది. అనుకున్నట్లుగానే జిల్లా ఏర్పడడంతో అభివృద్ధికి ఆస్కారం ఏర్పడింది.

రాజకీయాల్లోకి రావొద్దన్నాను..
మా పెద్దమ్మాయి అరుణ ఆసిఫాబాద్‌ గ్రామ పంచాయతీ ఉప ఎన్నికల్లో సర్పంచుగా పోటీ చేసినప్పుడు గాని ఇటీవల సిర్పూర్‌(యూ) నుంచి జెడ్పీటీసీగా పోటీ చేయడం గాని నాకు ఇష్టం లేదు. రాజకీయాల్లోకి వద్దన్నాను. సిర్పూర్‌(యూ)లో నేను, అరుణ చేరో సెట్‌ నామినేషన్‌ వేశాం. నేను జైనూర్‌లో పోటీలో నిలబడాలని నిశ్చయంతో సిర్పూర్‌(యూ)లో ఉపసంహరించుకున్నాను. అదే సమయంలో మా అమ్మాయిని కూడా విత్‌డ్రా చేసుకోవాలని చెప్పా. బీ ఫాం కూడా వేరే వాళ్లకు అనుకున్నాం. కాని జైనూర్‌ నుంచి పోటీలో ఉండడంతో కనీసం మీ కూతురు అయినా ఇక్కడి నుంచి పోటీ చేయాలని అక్కడి వారు కోరడంతో అలా ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందింది. 

చెల్లె, నేను ప్రత్యర్థులుగా తలపడ్డాం..
వేర్వేరు రాజకీయ పార్టీల్లో ఉన్నప్పుడు బంధుత్వాలు ఉండవు. మా చెల్లి సరస్వతి, నేను ఆసిఫాబాద్‌ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచులుగా తలపడ్డాం. ఆ తర్వాత 2014లో నేను టీఆర్‌ఎస్‌ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు చెల్లి టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసింది. అలా మేమిద్దరం అక్కాచెల్లెళ్లు అయినా వేర్వేరు పార్టీల్లో ఉండడంతో రాజకీయంగా ప్రత్యర్థులం అయినాం.

నేర్చుకునేలా ప్రోత్సహించారు
మా పెద్దమ్మాయి అరుణ డిగ్రీ పూర్తి చేసి పీజీ చేస్తూ ప్రస్తుతం సిర్పూర్‌(యూ) జెడ్పీటీసీగా కొనసాగుతోంది. రెండో అమ్మాయి మాన్విత ఎల్‌ఎల్‌ఎం పూర్తయింది. అబ్బాయి సాయినాథ్‌ బీబీఏ చదివాడు. నా రాజకీయ జీవితంలో మా ఆయన తోడ్పాడు ఎల్లప్పుడూ ఉంటుంది. నాకు స్వతహాగా తెలియని విషయాలను నాకు నేనే నేర్చుకునేలా ప్రోత్సహించారు. కుటుంబ సభ్యులందరి సహకారంతోనే ఈస్థాయిలో ఉన్నాను. ఉదయం నేను లేచే సరికే అనేక మంది ఇంటికి వస్తుంటారు. అలా ఉదయాన్నే ప్రజా దర్బార్‌ మొదలవుతుంది. వచ్చిన వారి సమస్యలు పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తా. రాజకీయాల్లో ఉన్నంత కాలం నా శక్తి మేర ప్రజాసేవ చేస్తా.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement