బాపు, శాస్త్రిలకు జాతి ఘన నివాళి
న్యూఢిల్లీ: జాతిపిత మహాత్మా గాంధీ, దేశ రెండో ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు రాజకీయ నాయకులు సోమవారం వారిరువురి సమాధుల వద్ద నివాళులర్పించారు. గాంధీ సిద్ధాంతాలైన సత్యం, అహింసలను ప్రజలంతా అనుసరించాలని వారు పిలుపునిచ్చారు. గాంధీ సమాధి రాజ్‌ఘాట్, శాస్త్రి సమాధి విజయ్ ఘాట్ వద్ద కోవింద్, మోదీ శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ట్వీటర్‌లోనూ వారు నివాళుర్పించారు.
జయంతి సందర్భంగా రాజ్‌ఘాట్ వద్ద 1.8 మీటర్ల ఎత్తైన గాంధీ విగ్రహాన్ని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆవిష్కరించా రు. రామరాజ్యం సాధించాలనేది గాంధీ కల అనీ, దానిని నెరవేర్చేందుకు ప్రజలు కృషి చేయాలని వెంకయ్య పిలుపునిచ్చారు. గాంధీ, శాస్త్రిలకు నివాళులర్పించిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, మహాత్ముడి సిద్ధాంతాలను చివరి శ్వాస వరకు పాటిస్తామని ప్రజలంతా ప్రతిజ్ఞ చేయాలన్నారు. పార్లమెంటు సెంట్రల్ హాల్లోనూ స్పీకర్ సుమిత్రా మహాజన్, మోదీ గాంధీ, శాస్త్రిలకు నివాళులు అర్పించారు.
చైనా, నెదర్లాండ్స్‌లోనూ గాంధీ జయంతి
గాంధీ జయంతిని చైనా బీజింగ్‌లోని చవోయాంగ్ పార్క్‌లో ఘనంగా నిర్వహించారు. నెదర్లాండ్స్‌లోని ది హేగ్‌లో వివిధ దేశాలకు చెందిన 800 మంది గాంధీ మార్చ్ నిర్వహిం చారు. యూకేలోని వేల్స్లో 6 అడుగుల ఎత్తు, 300 కిలోల బరువైన గాంధీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. కార్డిఫ్‌లోని లాయ్డ్ జార్జ్‌లో దీనిని ప్రతిష్టించారు.