డిపాజిట్ల నిగ్గుతేల్చేందుకు ఆడిటర్ల సాయం!
న్యూఢిల్లీ: నోట్ల రద్దు(డీమోనిటైజేషన్) తర్వాత బ్యాంకుల్లోకి వెల్లువలా వచ్చిన నగదు డిపాజిట్ల నిగ్గుతేల్చేందుకు ఆదాయపు పన్ను శాఖ సమాయత్తమవుతోంది. సంబంధిత డేటాను ఫోరెన్సిక్ ఆడిట్ చేయడం కోసం అంతర్జాతీయ ట్యాక్స్ కన్సల్టెంట్స్ ఎర్నెస్ట్ అండ్ యంగ్(ఈవై), కేపీఎంజీ, ప్రైస్‌వాటర్‌హౌస్ కూపర్స్(పీడబ్ల్యూసీ) వంటి దిగ్గజాల సాయం తీసుకోనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆయా సంస్థలతో దీనిపై ఐటీ శాఖ చర్చలు జరుపుతోందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. ప్రధానంగా డిపాజిట్ల ద్వారా వచ్చిన సొమ్ములో ఏదైనా మనీల్యాండరింగ్ చోటుచేసుకుందా అనేది తేల్చడం కోసం ఐటీ శాఖ ఈ చర్యలను తీసుకుంటోంది. రద్దయిన నోట్లలో దాదాపు 95 శాతంపైగా(రూ.15 లక్షల కోట్లు) ఇప్పటికే బ్యాంకుల్లోకి వెనక్కివచ్చేసినట్లు తాజాగా అంచనాలు వెలువడిన సంగతి తెలిసిందే.
కాగా, నోట్ల రద్దు తర్వాత 60 లక్షల మంది వ్యక్తులు, సంస్థలు భారీస్థాయిలో పాత రూ.500, రూ.1,000 నోట్లను డిపాజిట్ చేసినట్లు అంచనా. వీటి విలువ రూ. 7 లక్షల కోట్లు ఉండొచ్చని భావిస్తున్నారు. రూ.4 లక్షల కోట్ల విలువైన వ్యక్తిగత డిపాజిట్లపై ఐటీ శాఖ కొన్ని లొసుగులను గుర్తించినట్లు సమాచారం. మరోవైపు అనుమానాస్పద లావాదేవీలకు సంబంధించి ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్(ఎఫ్ఐయూ) నుంచి ఐటీ శాఖ ఇప్పటికే సమాచారం సేకరించింది. నిద్రాణంగా ఉన్న, జన్‌ధన్ ఖాతాలతోపాటు అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకుల్లో ఎంతమేరకు డిపాజిట్లు వచ్చాయన్న వివరాలన్నీ ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది.