kranti rana
-
నగర బహిష్కరణకు గురైన షీటర్ల కొత్త పంథా
సాక్షి ప్రతినిధి విజయవాడ: తరచూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న రౌడీషీటర్ల పని పట్టేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో రౌడీషీటర్ల ఆగడాలు పెచ్చుమీరకుండా పోలీస్ అధికారులు యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేశారు. ఇటీవల జరిగిన ఆకాశ్ హత్యతో పాటు నున్న, పాయకాపురంలో జరిగిన వరుస హత్యల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. నగర బహిష్కరణకు గురైన రౌడీషీటర్లు కొత్త పంథాలో సోషల్ మీడియా వేదికగా చేసుకొని, యువతను రెచ్చగొడుతూ తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నట్లు గుర్తించారు. డేటా సేకరణ.. నగరంలో ఉన్న రౌడీషీటర్లను స్టేషన్లకు పిలిచి వారి డేటా క్రోడీకరించారు. గత ఐదేళ్లుగా నేర చరిత్ర హత్యలు, లైంగిక దాడులు, దోపిడీలు, అఘాయిత్యాలు, భూకబ్జాలు, సెటిల్ మెంట్లు, ఈవ్‌టీజింగ్‌లు వంటి నేరాలకు పాల్పడిన వారి వివరాలను స్టేషన్ల వారీగా సేకరించారు. తాజాగా నగర పరిధిలో మూడు అంత కంటే ఎక్కువ కేసులతోపాటు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ యాక్టివ్‌గా ఉన్న 80 మందిపై రౌడీషీట్లు తెరిచారు. పోలీస్‌లు కౌన్సెలింగ్ చేస్తున్నప్పటికీ పద్ధతి మార్చుకోని మరో 25 మందిపై నగర బహిష్కరణ వేటు వేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. రౌడీషీటర్లు, ఆకతాయిలు, ఈవ్‌టీజర్లను గుర్తించి 150 మందికిపైగా ఇప్పటికే బైండోవర్ చేశారు. పక్కా నిఘా.. నగర బహిష్కరణకు గురై సోషల్ మీడియా వేదికగా చేసుకొని తమ కార్యకలాపాలను సాగిస్తున్న వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. టాస్క్‌ఫోర్స్ ప్రత్యేక బృందాలు తెలంగాణ, ఒడిశా ప్రాంతాల్లో తలదాచుకొంటున్న 25 మందికిపైగా రౌడీషీటర్లను అదుపులోకి తీసుకున్నారు. వీరితో కాంటాక్ట్‌లో ఉన్న యువతను స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. పద్ధతి మార్చుకోవాలని సూచిస్తున్నారు. శివారుపై నజర్.. విజయవాడ శివారు ప్రాంతాలైన అజిత్‌సింగ్‌నగర్, పాయకాపురం, కృష్ణలంకలోని రాణిగారితోట, రణదీప్నగర్ కట్ట, గుణదల, మాచవరం, భవానీపురం, ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాల్లో గస్తీ తీవ్రతరం చేశారు. రౌడీషీటర్ల కదలికపై నిఘా పెట్టారు. సోషల్ మీడియాలో పెడుతున్న పోస్ట్‌లపైనా కన్నేశారు. జనసాంధ్రత కలిగిన బస్టాండ్లు, రైల్వేస్టేషన్, కాలేజీలు తదితర ప్రాంతాల్లో మఫ్టీలో పోలీసులను ఉంచి బాడిఓన్ కెమెరాలతో రౌడీలు, ఆకతాయిలు, మందుబాబులు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలను గుర్తిస్తున్నారు. నేరాలు చేసే అవకాశం ఉన్నవారిపై, విశ్వసనీయ సమాచారం మేరకు బైండోవర్ కేసులు పెడుతున్నారు. అలాగే గత ఐదేళ్లుగా ఎటువంటి కేసులు లేకుండా సత్ ప్రవర్తనతో మెలుగుతున్న వ్యక్తుల కోసం జాబ్ మేళాలు పెట్టి ఉపాధి కల్పిస్తున్నారు. రౌడీషీట్లు ఎత్తి వేస్తున్నారు. ఉపేక్షించేది లేదు.. కమిషనరేట్ పరిధిలో రౌడీషీటర్ల ఆగడాలకు అడ్డుకట్ట వేస్తున్నాం. ఇందులో భాగంగా వారి కదిలికపై నిఘా ఏర్పాటు చేసి నిశితంగా పరిశీలిస్తున్నాం. స్టేషన్ వారీగా పిలిపించి కౌన్సెలింగ్ ఇస్తున్నాం. ఇటీవల కాలంలో నమోదైన వివిధ కేసులతో సంబంధం ఉన్నవారి వివరాలను సేకరించి, మూడు అంతకంటే ఎక్కువ కేసులు నమోదైన వారిని గుర్తించి, వారి ప్రవర్తను ఆధారంగా తాజా రౌడీషీట్లు తెరుస్తున్నాం. కౌన్సెలింగ్ తర్వాత కూడా పద్ధతి మార్చుకోని రౌడీషీటర్లను నగర బహిష్కరణ చేస్తున్నాం. రౌడీషీటర్ల సమాచారాన్ని అప్డేట్ చేశాం. నగర బహిష్కరణకు గురై బయటి ప్రాంతాల్లో ఉండేవారిపై గట్టి నిఘా ఉంచాం. రౌడీషీటర్లలో గణనీయమైన మార్పు దిశగా కృషి చేస్తున్నాం. – టి.కె. రాణా, పోలీస్ కమిషనర్, విజయవాడ -
ఆపరేషన్ ట్రాఫిక్
విజయవాడలో భారీగా పెరిగిన వాహనాల రాకపోకలు సమస్య పరిష్కారానికి ఉపక్రమించిన ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక బస్ బేలు, సలహా మండలి ఏర్పాటుకు నిర్ణయం రోజురోజుకూ విజయవాడ నగరంలో తీవ్రరూపం దాలుస్తున్న ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ట్రాఫిక్ పోలీసు అధికారులు చర్యలు చేపట్టారు. గతంలో కంటే నగరం మీదుగా ప్రయాణించే వాహనాల సంఖ్య పెరిగినా రోడ్లు విస్తరణకు నోచుకోకపోవడంతో ప్రత్యామ్నాయ చర్యలపై దృష్టిసారించారు. ట్రాఫిక్ సలహా మండలి ఏర్పాటు, ప్రత్యేక బస్‌బేలు, ప్రత్యామ్నాయ మార్గాలకు వాహనాల మళ్లింపు వంటి చర్యలకు ఉపక్రమించారు. అమరావతి: విజయవాడ నగర రోడ్లపై 2014కు ముందు వరకు బస్సులు, లారీలు, కార్లు కలిపి రోజుకు 12 వేల వరకు ప్రయాణించేవి. ప్రస్తుతం వీటి సంఖ్య 20 వేలకుపైగా చేరింది. వాటిలో 8 వేల వాహనాల వరకు ఇతర ప్రాంతాల నుంచి విజయవాడకు వస్తున్నవే. 2014కు ముందు నగరంలో ద్విచక్ర వాహనాలు రోజుకు 15 వేలవరకు ప్రయాణించేవి. ప్రస్తుతం ఆ సంఖ్య 30 వేలు దాటింది. వాటిలో దాదాపు 25 వేల వాహనాలు కృష్ణా జిల్లాకు చెందినవే. రోడ్లను విస్తరించకపోవడంతో ప్రయాణమంటేనే నరకప్రాయంగా మారుతోంది. ఈ ఏడాది ఆగస్టునాటికి నగరంలో జరిగిన 1,083 రోడ్డు ప్రమాదాల్లో 254 మంది దుర్మరణం చెందగా 1,118 మంది గాయపడ్డారు. 2015లో 1,644 రోడ్డు ప్రమాదాల్లో 379 మంది మృత్యువాత పడ్డారు. 1,548మంది గాయపడ్డారు. ట్రాఫిక్ పోలీసుల కార్యాచరణ ట్రాఫిక్ సమస్య పరిష్కారం దిశగా పోలీసులు కార్యాచరణకు ఉపక్రమిం చారు. ప్రత్యమ్నాయ మార్గాలు, ప్రత్యేక ‘బే’లు ఏర్పాటు దిశగా కసరత్తు చేపట్టారు. ట్రాఫిక్ సలహామండలిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. హైదరాబాద్ వెళ్లే బస్సులు, భారీ వాహనాలు ప్రస్తుతం వైవీరావు ఎస్టేట్, సీవీఆర్ ఫై ్లఓవర్, సితార జంక్షన్, గొల్లపూడి మీదుగా వెళ్తున్నాయి. ప్రత్యమ్నాయంగా జి.కొండూరు, కొండపల్లి మీదుగా హైదరాబాద్‌కు మళ్లించాలని భావిస్తున్నారు. దశలవారీగా వాహనాలను అ మార్గంలోకి మళ్లించాలని యోచిస్తున్నారు. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్లాల్సిన భారీ వాహనాలు విజయవాడలోకి ప్రవేశించకుండా ప్రత్యామ్నాయ మార్గంపై కసరత్తు చేస్తున్నారు. ఇటీవల గొల్లపూడి నుంచి ఇన్నర్‌రింగ్ రోడ్డు మీదుగా రామవరప్పాడు జంక్షన్‌కు వాహనాలు ప్రయాణిస్తున్నాయి. దీంతో రామవరప్పాడు, ప్రసాదంపాడు, గన్నవరం మార్గంలో ట్రాఫిక్ సమస్య తీవ్రమైంది. అందుకే వాహనాలను ఇబ్రహీంపట్నం, ముస్తాబాద, కేసరపల్లి మీదుగా మళ్లించాలని భావిస్తున్నారు. మరో ప్రత్యామ్నాయ మార్గంపై కూడా కసరత్తు చేస్తున్నారు. ఇబ్రహీంపట్నం, కొండపల్లి, మైలవరం మీదుగా హనుమాన్ జంక్షన్‌కు వాహనాలను మళ్లించాలని ప్రతిపాదించారు. ప్రస్తుతం ప్రతిపాదించిన ప్రత్యామ్నాయ రోడ్లకు అధిక వాహనాల ట్రాఫిక్‌ను తట్టుకునేంత సామర్థ్యం లేదు. రోడ్ల విస్తరణతోపాటు, కొత్తవి నిర్మించాలని ప్రభుత్వానికి ట్రాఫిక్ పోలీసులు ప్రతిపాదించారు. అంతవరకు దశలవారీగా వాహనాలను ఆ మార్గాల్లో మళ్లించాలని భావిస్తున్నారు. లారీ యజమానులతో సమావేశం నిర్వహించి వారి సూచనలను కూడా తీసుకోనున్నారు. ‘బస్ బే - ఆటో బే’ల ఏర్పాటు విజయవాడలో సిటీ బస్సుల నిలుపుదల కోసం ప్రత్యేకంగా ‘బస్ బే’లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆర్టీసీ అధికారులు సర్వే నిర్వహించి నగరంలో 10 ప్రాంతాలను గుర్తించారు. ఆటోలు నిలిపేందుకు ప్రత్యేకంగా ఆటో బేలు ఏర్పాటు చేయనున్నారు. వన్‌టౌన్ కాళేశ్వరరావు మార్కెట్ వద్ద ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న ఈ విధానాన్ని నగరమంతా విస్తరి స్తారు. నిబంధనల ఉల్లంఘనలపై ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలకు ఉపక్రమించారు. రాత్రి వేళల్లో తనిఖీలు ముమ్మరం చేసి 252 డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ప్రాధాన్యం ‘రాజధాని స్థాయికి తగ్గట్లుగా విజయవాడ ట్రాఫిక్ నియంత్రణకు అత్యున్నత ప్రమాణాలు అమలు చేయాలని నిర్ణయించాం. ఎస్పీఏ మార్గదర్శకాలకు అనుగుణంగా శాస్త్రీయంగా చర్యలు చేపడతాం. ప్రజలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో విజయవాడను ట్రాఫిక్ సమస్యలు లేని నగరంగా తీర్చిదిద్దడమే మా లక్ష్యం’ - టి. క్రాంతిరాణా, డీసీపీ (ట్రాఫిక్) ట్రాఫిక్ సలహామండలి మెట్రోపాలిటన్ నగరాల మాదిరిగా విజయవాడ కోసం ట్రాఫిక్ సలహా మండలిని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఢిల్లీలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్ట్(ఎస్పీఏ) ప్రణాళిక ప్రకారం ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఎప్పటికప్పుడు శాస్త్రీయ విధానాలను రూపొందిస్తారు. ఈ సల హామండలిలో ఎస్పీఏ ప్రతినిధులతోపాటు ట్రాఫిక్ పోలీసు,సీఆర్డీఏ, కార్పొరేషన్ అధికారులు సభ్యులుగా ఉంటారు. ఈ మండలిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన అనంతరం ఎస్పీఏ సర్వే నిర్వహించి ప్రణాళికను రూపొందిస్తుంది.