ఆపరేషన్ ట్రాఫిక్ | operation traffic in vijayawada | Sakshi
Sakshi News home page

ఆపరేషన్ ట్రాఫిక్

Published Sun, Sep 25 2016 8:40 AM | Last Updated on Mon, Sep 4 2017 2:58 PM

ఆపరేషన్ ట్రాఫిక్

ఆపరేషన్ ట్రాఫిక్

విజయవాడలో భారీగా పెరిగిన వాహనాల రాకపోకలు
సమస్య పరిష్కారానికి ఉపక్రమించిన ట్రాఫిక్ పోలీసులు
ప్రత్యేక బస్ బేలు, సలహా మండలి ఏర్పాటుకు నిర్ణయం

 
 
రోజురోజుకూ విజయవాడ నగరంలో తీవ్రరూపం దాలుస్తున్న ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ట్రాఫిక్ పోలీసు అధికారులు చర్యలు చేపట్టారు. గతంలో కంటే నగరం మీదుగా ప్రయాణించే వాహనాల సంఖ్య పెరిగినా రోడ్లు విస్తరణకు నోచుకోకపోవడంతో ప్రత్యామ్నాయ చర్యలపై దృష్టిసారించారు. ట్రాఫిక్ సలహా మండలి ఏర్పాటు, ప్రత్యేక బస్‌బేలు, ప్రత్యామ్నాయ మార్గాలకు వాహనాల మళ్లింపు వంటి చర్యలకు ఉపక్రమించారు.
 
అమరావతి: విజయవాడ నగర రోడ్లపై 2014కు ముందు వరకు బస్సులు, లారీలు, కార్లు కలిపి రోజుకు 12 వేల వరకు ప్రయాణించేవి. ప్రస్తుతం వీటి సంఖ్య 20 వేలకుపైగా చేరింది. వాటిలో 8 వేల వాహనాల వరకు ఇతర ప్రాంతాల నుంచి విజయవాడకు వస్తున్నవే. 2014కు ముందు నగరంలో ద్విచక్ర వాహనాలు రోజుకు 15 వేలవరకు ప్రయాణించేవి. ప్రస్తుతం ఆ సంఖ్య 30 వేలు దాటింది.
 
 వాటిలో దాదాపు 25 వేల వాహనాలు కృష్ణా జిల్లాకు చెందినవే. రోడ్లను విస్తరించకపోవడంతో ప్రయాణమంటేనే నరకప్రాయంగా మారుతోంది. ఈ ఏడాది ఆగస్టునాటికి నగరంలో జరిగిన 1,083 రోడ్డు ప్రమాదాల్లో 254 మంది దుర్మరణం చెందగా 1,118 మంది గాయపడ్డారు. 2015లో 1,644 రోడ్డు ప్రమాదాల్లో 379 మంది మృత్యువాత పడ్డారు. 1,548మంది గాయపడ్డారు.
 
 ట్రాఫిక్ పోలీసుల కార్యాచరణ
 ట్రాఫిక్ సమస్య పరిష్కారం దిశగా పోలీసులు కార్యాచరణకు ఉపక్రమిం చారు. ప్రత్యమ్నాయ మార్గాలు, ప్రత్యేక ‘బే’లు ఏర్పాటు దిశగా కసరత్తు చేపట్టారు. ట్రాఫిక్ సలహామండలిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
 
 హైదరాబాద్ వెళ్లే బస్సులు, భారీ వాహనాలు ప్రస్తుతం వైవీరావు ఎస్టేట్, సీవీఆర్ ఫై ్లఓవర్, సితార జంక్షన్, గొల్లపూడి మీదుగా వెళ్తున్నాయి. ప్రత్యమ్నాయంగా జి.కొండూరు, కొండపల్లి మీదుగా హైదరాబాద్‌కు మళ్లించాలని భావిస్తున్నారు. దశలవారీగా వాహనాలను అ మార్గంలోకి మళ్లించాలని యోచిస్తున్నారు.
 
 హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్లాల్సిన భారీ వాహనాలు విజయవాడలోకి ప్రవేశించకుండా ప్రత్యామ్నాయ మార్గంపై కసరత్తు చేస్తున్నారు. ఇటీవల గొల్లపూడి నుంచి ఇన్నర్‌రింగ్ రోడ్డు మీదుగా రామవరప్పాడు జంక్షన్‌కు వాహనాలు ప్రయాణిస్తున్నాయి. దీంతో రామవరప్పాడు, ప్రసాదంపాడు, గన్నవరం మార్గంలో ట్రాఫిక్ సమస్య తీవ్రమైంది. అందుకే వాహనాలను ఇబ్రహీంపట్నం, ముస్తాబాద, కేసరపల్లి మీదుగా మళ్లించాలని భావిస్తున్నారు. మరో ప్రత్యామ్నాయ మార్గంపై కూడా కసరత్తు చేస్తున్నారు. ఇబ్రహీంపట్నం, కొండపల్లి, మైలవరం మీదుగా హనుమాన్ జంక్షన్‌కు వాహనాలను మళ్లించాలని ప్రతిపాదించారు.
 
 ప్రస్తుతం ప్రతిపాదించిన ప్రత్యామ్నాయ రోడ్లకు అధిక వాహనాల ట్రాఫిక్‌ను తట్టుకునేంత సామర్థ్యం లేదు. రోడ్ల విస్తరణతోపాటు, కొత్తవి నిర్మించాలని ప్రభుత్వానికి ట్రాఫిక్ పోలీసులు ప్రతిపాదించారు. అంతవరకు దశలవారీగా వాహనాలను ఆ మార్గాల్లో మళ్లించాలని భావిస్తున్నారు. లారీ యజమానులతో సమావేశం నిర్వహించి వారి సూచనలను కూడా తీసుకోనున్నారు.
 
 ‘బస్ బే - ఆటో బే’ల ఏర్పాటు
 విజయవాడలో సిటీ బస్సుల నిలుపుదల కోసం ప్రత్యేకంగా ‘బస్ బే’లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆర్టీసీ అధికారులు సర్వే నిర్వహించి నగరంలో 10 ప్రాంతాలను గుర్తించారు. ఆటోలు నిలిపేందుకు ప్రత్యేకంగా ఆటో బేలు ఏర్పాటు చేయనున్నారు. వన్‌టౌన్ కాళేశ్వరరావు మార్కెట్ వద్ద ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న ఈ విధానాన్ని నగరమంతా విస్తరి స్తారు. నిబంధనల ఉల్లంఘనలపై ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలకు ఉపక్రమించారు. రాత్రి వేళల్లో తనిఖీలు ముమ్మరం చేసి 252 డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు.
 
 ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ప్రాధాన్యం
 ‘రాజధాని స్థాయికి తగ్గట్లుగా విజయవాడ ట్రాఫిక్ నియంత్రణకు అత్యున్నత ప్రమాణాలు అమలు చేయాలని నిర్ణయించాం. ఎస్‌పీఏ మార్గదర్శకాలకు అనుగుణంగా శాస్త్రీయంగా చర్యలు చేపడతాం. ప్రజలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో విజయవాడను ట్రాఫిక్ సమస్యలు లేని నగరంగా తీర్చిదిద్దడమే మా లక్ష్యం’     
 - టి. క్రాంతిరాణా, డీసీపీ (ట్రాఫిక్)
 
 ట్రాఫిక్ సలహామండలి
 మెట్రోపాలిటన్ నగరాల మాదిరిగా విజయవాడ కోసం ట్రాఫిక్ సలహా మండలిని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఢిల్లీలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్ట్(ఎస్‌పీఏ) ప్రణాళిక ప్రకారం ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఎప్పటికప్పుడు శాస్త్రీయ విధానాలను రూపొందిస్తారు. ఈ సల హామండలిలో ఎస్‌పీఏ ప్రతినిధులతోపాటు ట్రాఫిక్ పోలీసు,సీఆర్‌డీఏ, కార్పొరేషన్ అధికారులు సభ్యులుగా ఉంటారు. ఈ మండలిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన అనంతరం ఎస్‌పీఏ సర్వే నిర్వహించి ప్రణాళికను రూపొందిస్తుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement