సాక్షి ప్రతినిధి విజయవాడ: తరచూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న రౌడీషీటర్ల పని పట్టేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో రౌడీషీటర్ల ఆగడాలు పెచ్చుమీరకుండా పోలీస్ అధికారులు యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేశారు. ఇటీవల జరిగిన ఆకాశ్ హత్యతో పాటు నున్న, పాయకాపురంలో జరిగిన వరుస హత్యల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. నగర బహిష్కరణకు గురైన రౌడీషీటర్లు కొత్త పంథాలో సోషల్ మీడియా వేదికగా చేసుకొని, యువతను రెచ్చగొడుతూ తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నట్లు గుర్తించారు.
డేటా సేకరణ..
నగరంలో ఉన్న రౌడీషీటర్లను స్టేషన్‌లకు పిలిచి వారి డేటా క్రోడీకరించారు. గత ఐదేళ్లుగా నేర చరిత్ర హత్యలు, లైంగిక దాడులు, దోపిడీలు, అఘాయిత్యాలు, భూకబ్జాలు, సెటిల్ మెంట్‌లు, ఈవ్‌టీజింగ్‌లు వంటి నేరాలకు పాల్పడిన వారి వివరాలను స్టేషన్‌ల వారీగా సేకరించారు. తాజాగా నగర పరిధిలో మూడు అంత కంటే ఎక్కువ కేసులతోపాటు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ యాక్టివ్‌గా ఉన్న 80 మందిపై రౌడీషీట్లు తెరిచారు. పోలీస్‌లు కౌన్సెలింగ్ చేస్తున్నప్పటికీ పద్ధతి మార్చుకోని మరో 25 మందిపై నగర బహిష్కరణ వేటు వేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. రౌడీషీటర్లు, ఆకతాయిలు, ఈవ్‌టీజర్‌లను గుర్తించి 150 మందికిపైగా ఇప్పటికే బైండోవర్ చేశారు.
పక్కా నిఘా..
నగర బహిష్కరణకు గురై సోషల్ మీడియా వేదికగా చేసుకొని తమ కార్యకలాపాలను సాగిస్తున్న వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. టాస్క్‌ఫోర్స్ ప్రత్యేక బృందాలు తెలంగాణ, ఒడిశా ప్రాంతాల్లో తలదాచుకొంటున్న 25 మందికిపైగా రౌడీషీటర్లను అదుపులోకి తీసుకున్నారు. వీరితో కాంటాక్ట్‌లో ఉన్న యువతను స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. పద్ధతి మార్చుకోవాలని సూచిస్తున్నారు.
శివారుపై నజర్..
విజయవాడ శివారు ప్రాంతాలైన అజిత్‌సింగ్‌నగర్, పాయకాపురం, కృష్ణలంకలోని రాణిగారితోట, రణదీప్‌నగర్ కట్ట, గుణదల, మాచవరం, భవానీపురం, ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాల్లో గస్తీ తీవ్రతరం చేశారు. రౌడీషీటర్ల కదలికపై నిఘా పెట్టారు. సోషల్ మీడియాలో పెడుతున్న పోస్ట్‌లపైనా కన్నేశారు. జనసాంధ్రత కలిగిన బస్టాండ్లు, రైల్వేస్టేషన్, కాలేజీలు తదితర ప్రాంతాల్లో మఫ్టీలో పోలీసులను ఉంచి బాడిఓన్ కెమెరాలతో రౌడీలు, ఆకతాయిలు, మందుబాబులు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలను గుర్తిస్తున్నారు. నేరాలు చేసే అవకాశం ఉన్నవారిపై, విశ్వసనీయ సమాచారం మేరకు బైండోవర్ కేసులు పెడుతున్నారు. అలాగే గత ఐదేళ్లుగా ఎటువంటి కేసులు లేకుండా సత్ ప్రవర్తనతో మెలుగుతున్న వ్యక్తుల కోసం జాబ్ మేళాలు పెట్టి ఉపాధి కల్పిస్తున్నారు. రౌడీషీట్‌లు ఎత్తి వేస్తున్నారు.
ఉపేక్షించేది లేదు..
కమిషనరేట్ పరిధిలో రౌడీషీటర్ల ఆగడాలకు అడ్డుకట్ట వేస్తున్నాం. ఇందులో భాగంగా వారి కదిలికపై నిఘా ఏర్పాటు చేసి నిశితంగా పరిశీలిస్తున్నాం. స్టేషన్ వారీగా పిలిపించి కౌన్సెలింగ్ ఇస్తున్నాం. ఇటీవల కాలంలో నమోదైన వివిధ కేసులతో సంబంధం ఉన్నవారి వివరాలను సేకరించి, మూడు అంతకంటే ఎక్కువ కేసులు నమోదైన వారిని గుర్తించి, వారి ప్రవర్తను ఆధారంగా తాజా రౌడీషీట్లు తెరుస్తున్నాం. కౌన్సెలింగ్ తర్వాత కూడా పద్ధతి మార్చుకోని రౌడీషీటర్లను నగర బహిష్కరణ చేస్తున్నాం. రౌడీషీటర్ల సమాచారాన్ని అప్‌డేట్ చేశాం. నగర బహిష్కరణకు గురై బయటి ప్రాంతాల్లో ఉండేవారిపై గట్టి నిఘా ఉంచాం. రౌడీషీటర్లలో గణనీయమైన మార్పు దిశగా కృషి చేస్తున్నాం.
– టి.కె. రాణా, పోలీస్ కమిషనర్, విజయవాడ
Comments
Please login to add a commentAdd a comment