పోలీసులను ఉసిగొల్పిన కూటమి నేతలు
తెలంగాణ, ఆంధ్రలో 260 మందికి బీఎన్‌ఎస్ 179 నోటీసులు
వివరణ ఇచ్చేందుకు వచ్చిన సోషల్ మీడియా యాక్టివిస్టులతో విజయవాడ సైబర్ క్రైం స్టేషన్ కిటకిట
రైతులు, జర్నలిస్ట్‌లు, రోజువారీ కూలీలనూ వదలని సర్కారు
కొనసాగుతున్న అక్రమ కేసుల పరంపర, నిర్బంధాలు
సాక్షి ప్రతినిధి, విజయవాడ: విజయవాడ సైబర్ క్రైం పోలీస్‌స్టేషన్ అక్రమ కేసుల కర్మాగారంగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. భావ ప్రకటన స్వేచ్ఛను కాలరాస్తూ.. రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ కూటమి నాయకుల మెప్పు కోసం ఖాకీలు ప్రదర్శిస్తున్న అత్యుత్సాహం సోషల్ మీడియా యాక్టివిస్టులను విస్మయానికి గురిచేస్తోంది. టీడీపీ ప్రభుత్వం రాగానే గూండాగిరికి తెగబడుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ కేంద్రంగా ‘వైఎస్సార్ కుటుంబం’, ‘జయహో.. జగనన్న’, ‘ఆంధ్రా సింహం’, ‘వైఎస్సార్ సోషల్ మీడియా ఖమ్మం జిల్లా’ అనే నాలుగు వాట్సాప్ గ్రూపులున్నాయి. ఒక్కోదానిలో గరిష్టంగా 250 మందికి పైగా ఇరు రాష్ట్రాల్లోని వ్యక్తులున్నారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇటీవల కొంతకాలంగా సోషల్ మీడియా పోస్ట్‌లపై సైబర్ అస్త్రాన్ని ప్రయోగిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ మధ్య ఏపీలో వెలుగుచూసిన ఓ పోస్టును సాకుగా చేసుకుని కూటమి నాయకుడొకరు తన పార్టీ కార్యకర్తలతో ఈ నెల 2న అన్ని పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదులిప్పించాడు. అదే రోజు ఎన్టీఆర్ జిల్లాలోని అన్ని పోలీస్‌స్టేషన్లలోనూ 42 కేసులు నమోదు చేశారు. అక్కడితో ఆగకుండా సభ్యులుగా ఉన్న వారికి నోటీసులిచ్చారు. ఎన్టీఆర్ జిల్లాకంచికచర్ల మండలం పెండ్యాలలోని 172 మంది పేదలకూ నోటీసులిచ్చారు. ఈ నెల 8వ తేదీలోపు సమాధానం చెప్పాలని నోటీసుల సారాంశం.
ఇలా శుక్రవారం నాటికి 260 మందికి ఇచ్చారు. దీంతో విజయవాడ సైబర్ క్రైం స్టేషన్‌కు నోటీసులు అందుకున్న వారిలో 160 మంది తరలివచ్చారు. కూటమి సర్కారు వైఫల్యాలు, అక్రమాలపై ప్రశ్నిస్తే.. అమ్మాయిలపై తప్పుడు పోస్టు పెట్టారని అభాండాలు వేయడమేంటని వారు ప్రశ్నిస్తున్నారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల జోనల్ ఇన్‌చార్జి హుటాహుటిన స్టేషన్‌కు చేరుకుని బాధితులకు భరోసా ఇచ్చారు. పలువురు మీడియా ప్రతినిధులు సైతం స్టేషన్‌కు చేరుకోవడంతో పోలీసులు అప్రమత్తమై నోటీసుల సారాంశాన్ని బయటపెట్టారు.
ఇలా చేయడం దారుణం..
నేను వైఎస్సార్‌సీపీకి చెందిన ఓ వాట్సాప్ గ్రూప్‌తో పాటు మరికొన్ని పార్టీల వాట్సాప్ గ్రూప్‌ల్లోనూ ఉన్నా. ఇటీవల వైఎస్సార్‌సీపీ గ్రూప్‌లో వచ్చిన పోస్ట్‌ను చూసి.. వెంటనే మర్చిపోయాను. దీనికే నాకు సైబర్ పోలీసుల నుంచి నోటీసు వచ్చింది. స్టేషన్‌కు వచ్చి వివరణ ఇవ్వమన్నారు. – ఆకుల మురళి, గుంటూరు
బెదిరించి రప్పించారు..
నేను మా రాష్ట్రంలో ఓ రాజకీయ పార్టీ బీసీ సంఘం నేతగా ఉన్నా. ఆకస్మాత్తుగా విజయవాడ సైబర్ స్టేషన్ నుంచి నోటీసు వచ్చింది. రాకపోతే ఇంటికొచ్చి అరెస్టుచేస్తామని బెదిరించారు. నోటీసు సారాంశమేంటో తెలుసుకుందామని వచ్చా. – బి. సోమేశ్వరగౌడ్, భద్రాద్రి కొత్తగూడెం
ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు రామకృష్ణ. తెలంగాణ రాష్ట్రం ఖమ్మంకు చెందిన ఈయన ఓ జర్నలిస్ట్. ఖమ్మం కేంద్రంగా వైఎస్సార్ కుటుంబం అనే పేరుతో కొనసాగే ఓ వాట్సాప్ గ్రూపులో సభ్యుడు. ఆ గ్రూపు అడ్మిన్ ఇటీవల గ్రూపులో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక పోస్ట్ పెట్టాడు. దీనికిగాను రామకృష్ణకు విజయవాడ సైబర్ క్రైం పోలీసులు నోటీసులిచ్చారు. తన నంబర్ అన్నీ రాజకీయల పార్టీల, ప్రభుత్వ అధికారుల వాట్సాప్ గ్రూపుల్లో ఉంటుందని, దీనికి తానేదో తప్పుచేసినట్టు నోటీసిచ్చి విజయవాడకు రప్పించడమేంటని సైబర్ క్రైం పోలీసులను ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment