krishna kirthan
-
రెండో రోజు కృష్ణ కీర్తన్ ను విచారించిన ఏసీబీ
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో టీడీపీ నాయకుడు వేం నరేందర్ రెడ్డి కుమారుడు కృష్ణ కీర్తన్‌ను ఏసీబీ అధికారులు వరుసగా రెండో రోజూ విచారిస్తున్నారు. గురువారం ఆయన ఏసీబీ అధికారుల ఎదుట హాజరయ్యారు. ఏసీబీ అధికారులు ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5:30 కృష్ణను సుదీర్ఘంగా విచారించారు. కృష్ణకీర్తన్‌తో పాటు సెబాస్టియన్, ఉదయ సింహాలను కలిపి ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. బుధవారం కూడా ఏసీబీ అధికారులు కృష్ణను విచారించిన సంగతి తెలిసిందే. దాదాపు 7 గంటల పాటు ఆయనను ప్రశ్నించారు. ఓటుకు కోట్లు కేసులో డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయనే విషయంపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ కేసులో రేవంత్ రెడ్డి, స్టీఫెన్ సన్, ఉదయసింహ, సెబాస్టియన్, సండ్ర వెంకట వీరయ్య, వేం నరేందర్ రెడ్డిలను ఏసీబీ ప్రశ్నించింది. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేం నరేందర్ రెడ్డి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. -
'టీడీపీ నేతలతో వ్యక్తిగత పరిచయాలు లేవు'
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో టీడీపీ నాయకుడు వేం నరేందర్ రెడ్డి కుమారుడు కృష్ణ కీర్తన్‌ను ఏసీబీ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. బుధవారం ఉదయం 10 గంటలకు ఏసీబీ కార్యాలయానికి వచ్చిన కృష్ణను దాదాపు 8 గంటల పాటు ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. సాయంత్రం 7 గంటల ప్రాంతంలో విడిచిపెట్టారు. ఓటుకు కోట్లు కేసుకు సంబంధించి ఏసీబీ అధికారులు కృష్ణ కీర్తనను కీలక ప్రశ్నలు అడిగినట్టు సమాచారం. ఈ కేసులో డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని ఏసీబీ అధికారులు ప్రశ్నించినట్టు తెలుస్తోంది. కృష్ణ కీర్తన్ పేరు మీదున్న ఒక సిమ్ కార్డుకు నిందితుల నుంచి ఫోన్‌కాల్స్ వచ్చిన అంశంపై ఏసీబీ ఆరా తీసినట్టు సమాచారం. కాగా రాజకీయాలు, ఆర్థిక అంశాలను తండ్రి తనతో పంచుకోరని కృష్ణ ఏసీబీ అధికారులకు చెప్పినట్టు తెలుస్తోంది. టీడీపీ నాయకులతో వ్యక్తిగత పరిచయాలు లేవని, తమ ఇంటికి వచ్చినపుడు కొందరు నాయకులను చూడటం తప్ప ప్రత్యేకించి వారితో మాట్లాడలేదని ఆయన ఏసీబీ విచారణలో వెల్లడించినట్టు సమాచారం. విచారణాంతరం కృష్ణ కీర్తన్ ఇంటికి వెళ్లారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేం నరేందర్ రెడ్డి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన సంగతి తెలిసిందే. వేం నరేందర్ రెడ్డి గెలుపుకోసం నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు ముడుపులు ఇస్తూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.