krishna tirath
-
పార్టీ మారినా ఫలితం దక్కేనా?
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ మాజీ దిగ్గజం కృష్ణతీరథ్ ప్రస్తుత విధానసభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఆమెకు బీజేపీ పటేల్‌నగర్ రిజర్వ్డ్ టికెట్ ఇచ్చింది. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి రాజేష్ లిలోటియా, ఆప్ అభ్యర్థి హజారీలాల్ చౌహాన్‌ల నుంచి గట్టి పోటీ ఎదుర్కొటున్నారు. 2013 ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి ఆప్ అభ్యర్థి వీణాఆనంద్ గెలిచారు. కాంగ్రెస్ నేతగా కృష్ణతీరథ్కు ఈ నియోజకవర్గంలో బలమైన పునాదులు ఉన్నాయి. ఆమె మామ సోహన్‌లాల్ స్థానిక కాంగ్రెస్ దిగ్గజాల్లో ఒకరు. లాల్ రెండుసార్లు ఎంపీగా పనిచేశారు. ఆదాయపన్ను శాఖలో అధికారిణిగా బాధ్యతలు నిర్వహించే తీరథ్ మామ రాజకీయ వారసత్వాన్ని అందుకుని కాంగ్రెస్ దళిత నేతగా ఎదిగారు. మున్సిపల్ కౌన్సిలర్‌గా, ఎమ్మెల్యేగా, ఎంపీగా ఎన్నికయ్యారు. షీలాదీక్షిత్ సర్కారులో మంత్రిగా, డిప్యూటీ స్పీకర్‌గా పనిచేశారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో పరాజయంతో తీరథ్ తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఈ నేపథ్యంలో తన రాజకీయ భవితవ్యాన్ని పదిలం చేసుకోవడానికి బీజేపీలో చేరారు. అదేరోజు ఆ పార్టీ ఆమెను పటేల్ నగర్ అభ్యర్థిగా ప్రకటించింది. తీరథ్కున్న దళిత నేత ముద్ర తమకు లాభిస్తుందని బీజేపీ ఆశిస్తుండగా, ప్రధాని నరేంద్ర మోదీ పేరుబలం తన విజయానికి తోడ్పడుతుందని తీరథ్ భావిస్తున్నారు. అయితే స్థానిక బీజేపీ కార్యకర్తలు ఆమె నాయకత్వాన్ని అంగీకరించడానికి సుముఖంగా లేకపోవడంతో ఈ ఎన్నికలు అగ్నిపరీక్షగా మారాయి. -
ఎంపీ పోయింది ఎమ్మెల్యే దక్కేనా?
న్యూఢిల్లీ: రాజధాని నగరంలో మొన్నటి లోక్‌సభ, అంతకుముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభావాన్ని మూటగట్టుకున్న కాంగ్రెస్ పార్టీ అనుకోకుండా లభించిన ఈ తరుణంలోనైనా తన ప్రతిష్టను నిలబెట్టుకోవాలని భావిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ సీట్ల సంఖ్యను పెంచుకోవాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ అవసరమైతే అసెంబ్లీ బరిలో మాజీ ఎంపీలను దించాలని యోచిస్తోంది. మాజీ కేంద్ర మంత్రి కృష్ణ తీరథ్ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పటేల్‌నగర్ నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయని ఓ నాయకుడు చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో వాయవ్య ఢిల్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయిన తీరథ్ ‘‘పార్టీ ఆదేశిస్తే అసెంబ్లీకి పోటీ చేయడానికి సిద్ధం’’ అని ప్రకటించారు. తన పూర్వ స్థానమైన పటేల్‌నగర్ నుంచే పోటీ చేయాలన్నది తన అభీష్టమని పేర్కొన్నారు. కాగా మరికొంత మంది మాజీ ఎంపీలు అసెంబ్లీ ఎన్నికల పట్ల విముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. కానీ, కొందరు మాజీ ఎంపీలను అసెంబ్లీ బరిలోకి దించే అవకాశాలు లేకపోలేదని డీపీసీసీ అధ్యక్షుడు అర్విందర్ సింగ్ లవ్లీ అన్నారు. ఈ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల జాబితాలో అనుభవం, యువతకు ప్రాధాన్యతనిస్తామని ఆయన చెప్పారు. మొదటి జాబితాలోనే మాజీ ఎంపీల పేర్లు చోటు చేసుకోవచ్చని ఆయన సూత్రప్రాయంగా వెల్లడించారు. ప్రాథమిక చర్చల సందర్భంగా, మాజీ ఎంపీలు అజయ్ మాకెన్, కపిల్‌సిబల్, సందీప్ దీక్షిత్‌లు అసెంబ్లీకి పోటీ చేయడంపై ఆసక్తి చూపలేదని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అయితే పూర్వాంచల్ నాయకుడు, పశ్చిమ ఢిల్లీ మాజీ ఎంపీ మహాబాల్ మిశ్రా మాత్రం పాలం నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలని ఆసక్తితో ఉన్నట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. మాజీ ఎంపీల కరిష్మా ఆసరాగా మరికొన్ని అసెంబ్లీ స్థానాలను దక్కించుకోవచ్చని కాంగ్రెస్ సీనియర్ నేతలు ఎత్తుగడలు వేస్తున్నట్లు తెలిసింది. కాంగ్రెస్ ఢిల్లీ వ్యవహారాల ఇన్చార్జిగా ప్రస్తుతమున్న షకీల్ అహ్మద్ స్థానంలో పీసీ చాకో బాధ్యతలు స్వీకరించగానే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మొదటి జాబితా విడుదల కావచ్చని పార్టీ వర్గాలు తెలిపాయి. మాజీ ముఖ్యమంత్రి, కేరళ మాజీ గవర్నర్ షీలాదీక్షిత్‌ను కూడా ఈ ఎన్నికల్లో భాగస్వామిని చేయాలని కాంగ్రెస్ ఢిల్లీ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు. షీలాదీక్షిత్ సైతం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలను కొట్టిపారేయలేదు. శాసనసభకు పోటీ చేసే 70 మంది పార్టీ అభ్యర్థుల్లో మూడో వంతు కొత్తవారే ఉండవచ్చని డీపీసీసీ నాయకుడొకరు తెలిపారు. ప్రముఖుల కుమార్తెల అరంగేట్రం ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ కుమార్తె లతికా సయ్యద్, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె, కథక్ నర్తకి షర్మిష్టలు కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అరంగేట్రం చేయవచ్చని ఆ నాయకుడు చెప్పారు. తన తల్లి పోటీ చేసిన న్యూఢిల్లీ నియోజకవర్గంలోనే లతికా సయ్యద్ బరిలోకి దిగవచ్చని తెలుస్తోంది. గ్రేటర్ కైలాష్ నివాసి అయిన షర్మిష్ట తన స్వస్థలం నుంచే పోటీ చేయాలని ఆశిస్తున్నట్లు తెలిసింది. విద్యుత్ కోతలకు వ్యతిరేకంగా పార్టీ ఇక్కడ నిర్వహించిన అనేక ఆందోళనలలో ఆమె చురుకుగా పాల్గొన్నారు. ఈ పోరాటం తనకు ఎన్నికల్లో లబ్ధి చేకూర్చవచ్చని షర్మిష్ట ఆశిస్తున్నారు. 2008 అసెంబ్లీ ఎన్నికల్లో 41 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ గత ఏడాది ఎనిమిది స్థానాలకు పడిపోయి పరువు పోగొట్టుకుంది. తిరిగి తన పూర్వప్రతిష్టను నిలబెట్టుకోవాలని భావిస్తున్న కాంగ్రెస్ నేతలు అనేక ఎత్తుగడలను రూపొందిస్తున్నారు. -
వాయవ్య ఢిల్లీ ఎన్నికల చిత్రం
దళితులు, జాట్ల ఓట్లే కీలకం సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఏడు నియోజకవర్గాల్లో వాయవ్య ఢిల్లీ అన్నింటికన్నా పెద్ద నియోజకవర్గం. ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్.. సిట్టింగ్ ఎంపీ, కేంద్ర మంత్రి కృష్ణా తీరథ్‌కు, బీజేపీ.. దళిత నేత ఉదిత్‌రాజ్‌కు టికెట్ ఇచ్చాయి. ఆమ్ ఆద్మీ పార్టీ.. ముందుగా ప్రకటించిన అభ్యర్థి మహేంద్ర సింగ్ టికెట్ వాపస్ చేయడంతో మాజీ మంత్రి రాఖీ బిర్లాను బరిలోకి దింపింది. కృష్ణాతీరథ్ పదేళ్లుగా వాయవ్య ఢిల్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో ఆమె బీజేపీకి చెందిన మీరా కన్వరియాను 1.8 లక్షల ఓట్ల తేడాతో ఓడించారు. అయితే ప్రస్తు తం గట్టిగా వీస్తోన్న కాంగ్రెస్ వ్యతిరేకపవనాల దృష్ట్యా కృష్ణాతీరథ్ విజయం సాధించడం కష్టమని విశ్లేషకులు చెబుతున్నారు. మహేంద్రసింగ్‌ను ఎన్నికల బరిలోనుంచి తప్పించి, ఢిల్లీ కాంగ్రెస్ నేతలలో దిగ్గజంగా గుర్తింపు పొందిన రాజ్‌కుమార్ చౌహాన్‌ను భారీ మెజారిటీతో ఓడించిన రాఖీ బిర్లాను లోక్‌సభ ఎన్నికల బరిలోకి దింపడం వల్ల ఆప్ విజయావకాశాలు మెరుగయ్యాయని అంటున్నారు. వాల్మీకీ సమాజం అండ ఆమెకు లాభిస్తుందని ఆశిస్తున్నారు. అయితే రాఖీ అభ్యర్థిత్వాన్ని మహేంద్రసింగ్ వ్యతిరేకించారు . ప్రచారం చేయడం కోసం రాఖీ తనను డబ్బు అడిగారని కూడా ఆయన ఆరోపించారు. రాఖీకి తాను మద్దతు ఇవ్వబోనని ప్రకటించారు. మహేంద్ర సింగ్‌కు టికెట్ ఇవ్వడానికి ముందు కూడా రాఖీ అభ్యర్థిత్వాన్ని కొందరు స్థానిక నేతలు కూడా వ్యతిరేకించారు. ఈ వ్యతిరేకతతోపాటు ఆమ్ ఆద్మీ పార్టీ పట్ల ప్రజలకు తగ్గిన మోజువల్ల రాఖీని కూడా విజయలక్ష్మి అంత సులువుగా వరించే సూచనలు కనిపించడం లేదంటున్నారు. బీజేపీ అభ్యర్థి ఉదిత్‌రాజ్ కూడా వాల్మీకీ సమాజం ఓట్లపై ఆశలు పెట్టుకున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాలలో అడుగుపెట్టిన ఉదిత్‌రాజ్ నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఎస్సీ , ఎస్టీలకు అధినేత. అయన గత నెలలోనే బీజేపీలో చేరారు. పార్టీ కోసం శ్రమిస్తున్నవారికి టికెట్ ఇవ్వకుండా కొత్తగా వచ్చిన ఉదిత్ రాజ్‌కు టికెట్ ఇవ్వడాన్ని బీజేపీ కార్యకర్తలు వ్యతిరేకించారు. అయితే ఉదిత్‌రాజ్ మాత్రం తాను 34 సంవత్సరాలుగా ఢిల్లీవాసినని, జాతీయస్థాయి నేతనని అంటున్నారు. ఈ రిజర్వుడు నియోజకవర్గంపై బీఎస్పీ కూడా ఆశలు పెట్టుకుంది. బీఎస్పీ ఇక్కడి నుంచి బసంత్ పవార్‌ను నిలబెట్టింది. ఔటర్ ఢిల్లీ నియోకవర్గం నుంచి విడదీసిన ప్రాంతాలతో 2008లో ఆవిర్భవించిన వాయవ్య ఢిల్లీ నియోజకవర్గంలోని 17 లక్షలకు పైగా ఓటర్ల లో 21 శాతం మంది దళిత ఓటర్లున్నారు. జాట్ ఓటర్ల సంఖ్య కూడా ఇక్కడ ఎక్కువే. ఓటర్లలో 16 శాతం మంది జాట్లున్నారు. బ్రాహ్మణులు 12 శాతం, వైశ్యులు 10 నుంచి 11 శాతం, ముస్లింలు 5 నుంచి 8 శాతం ఉన్నారు. హర్యానాను ఆనుకొని ఉన్న ఈ నియోజకవర్గం పరిధిలో 100కి పైగా గ్రామాలున్నాయి. 20 జేజే కాలనీలు, పలు అనధికార కాలనీలు ఉన్నాయి. అనధికార కాలనీలు కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉండేవి. కానీ ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్ల తీరు మారిపోయింది. ఓటర్లు కాంగ్రెస్ కన్నా ఢిల్లీ రాజకీయాల్లో కొత్తగా ప్రవేశించిన ఆమ్ ఆద్మీ పార్టీ వైపు మొగ్గుచూపారు. -
ఎటూ తేల్చుకోలేని కాంగ్రెస్
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలోని ఏడు లోక్‌సభ స్థానాల్లోని ఐదింటిలో సిట్టింగ్ ఎంపీలనే అభ్యర్థులుగా ప్రకటించిన కాంగ్రెస్ మిగిలిన రెండు స్థానాల నుంచి ఎవరిని నిలబెట్టాలనేదానిపై నిర్ణయానికి రాలేకపోతోంది. న్యూఢిల్లీ, ఈస్ట్ ఢిల్లీ, చాందినీ చౌక్, నార్త్ వెస్ట్ ఢిల్లీ, నార్త్ ఈస్ట్ ఢిల్లీ లోక్‌సభ స్థానాల్లో పోటీ కోసం అభ్యర్థుల పేర్లను ఇది వరకే ప్రకటించింది. కాంగ్రెస్ సౌత్ ఢిల్లీ, వెస్ట్ ఢిల్లీ నుంచి పోటీ చేసే అభ్యర్థుల పేర్లను గురువారం సాయంత్రం వరకు ప్రకటించలేదు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ అభ్యర్థుల పేర్లను ప్రకటించడంలో పార్టీ చేస్తున్న జాప్యం కార్యకర్తల్లో అయోమయం సృష్టిస్తోంది. అసలే అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరపరాజయంతో ఢీలాపడ్డ కార్యకర్తలు తమ నియోజకవర్గాల్లో ఎవరి తరపున ప్రచారం చేయాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ దెబ్బతో కుదేలయిన కాంగ్రెస్ లోక్‌సభ ఎన్నికల్లో బలమైన అభ్యర్థులను బరిలోకి దింపాలనుకుంటోంది. నార్త్ వెస్ట్ ఢిల్లీలో కూడా మంత్రి కృష్ణాతీరథ్‌కు టికెట్ ఇవ్వకుండా, సౌత్ ఢిల్లీ నుంచి గానీ వెస్ట్ ఢిల్లీ నుంచి మహిళా అభ్యర్థిని నిలబెట్టాలని కాంగ్రెస్ మొదట భావించినట్టు సమాచారం. ఈ వ్యూహం ఆచరణ సాధ్యం కాదని తేలడంతో కృష్ణాతీరథ్కే టికెట్ ఇచ్చింది. సౌత్ ఢిల్లీ లేదా వెస్ట్ ఢిల్లీ నుంచి తమ పార్టీ తరపున పోటీచేయాలని కాంగ్రెస్ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్‌ను కూడా కోరినట్టు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనకు ఆయన ఒప్పుకోలేదని అంటున్నారు. జాట్ ఓటర్లను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ సౌత్ ఢిల్లీలో సెహ్వాగ్‌కు టికెట్ ఇవ్వాలనుకున్నట్టు సమాచారం. ఈ సీటు నుంచి పోటీ కోసం విద్యార్థినేత రోహిత్ చౌదరి పేరు ప్రస్తుతం పరిశీలనలో ఉందని అంటున్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో వెస్ట్ ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే పది అసెంబ్లీ సీట్లలో కాంగ్రెస్ ఓడిపోయింది. ఎంపీ మహాబల్ మిశ్రా తనయుడు కూడా ఈ ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆయనకు టికెట్ ఇవ్వకూడదని పార్టీ భావించిందని సమాచారం. వెస్ట్ ఢిల్ల్లీ నుంచి పూర్వాంచలీ అభ్యర్థికి టికెట్ ఇవ్వాలన్న ఉద్దేశంతో పార్టీ బాలీవుడ్ నటులు మనోజ్ బాజ్‌పాయ్, శేఖర్ సుమన్, భోజ్‌పురి నటుడు కునాల్ సింగ్ తదితర పేర్లను కూడా పరిశీలించిందని చెబుతున్నారు. నార్త్ ఈస్ట్ ఢిల్లీలో బీజేపీ పూర్వాంచలీ ఓటర్లను మెప్పించేందుకు భోజ్‌పురి నటుడు మనోజ్ తివారీకి టికెట్ ఇచ్చింది. తివారీకి దీటుగా మరో పూర్వాంచలీ ప్రముఖుడిని బరిలోకి దింపాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈసారి ఢిల్లీలో పార్టీకి గడ్డుకాలమేనని, ఇక్కడ బాగా బలహీనపడినట్టు వార్తలు రావడంతో ఈ రెండు స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ ఆచితూచి వ్యవహరిస్తోంది. ప్రచారంలో ఏ విధంగానూ వెనుకబడకూడదనే ఉద్దేశంతో ఆన్లైన్ మార్గాన్ని కూడా ఎంచుకుంది. 15 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో దేశ రాజధానిలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు సోషల్ మీడియా ఫేస్బుక్, ట్విట్టర్ ద్వారా వివరించేందుకు సిద్ధమయింది. పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేయనున్న ఐటీ సెంటర్ వచ్చే వారం నుంచి ప్రారంభంకానుంది. దూకుడుగా ప్రత్యర్థి పార్టీల ప్రచారం భారతీయ జనతా పార్టీ సైతం ప్రచారంలో దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించడం వల్ల కలిగిన ఆత్మవిశ్వాసంతో పాటు దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ అనుకూల పవనాలు ఉండడం ఆ పార్టీలో ఉత్సాహాన్ని నింపుతోంది. నమో టీ పార్టీ, నమో చౌపాల్, ఏక్ నోట్ కమల్ పర్ ఓట్, మోడీ ఫర్ పీఎం, ఓట్ ఫర్ మోడీ వంటి కార్యక్రమాలతోపాటు ఇంటింటికీ ప్రచారం, చిన్న చిన్న సమావేశాలతో బీజేపీ ప్రచారం సాగిస్తోంది. అభ్యర్థుల ఎంపికలో అందరికంటే ముందున్న ఆప్ ప్రచారాన్ని తీవ్రతరం చేసింది. ‘ఆప్’ సర్కారు 49 రోజుల పాలనలో కరెంటు చార్జీలను సగానికి తగ్గించడం, ఉచిత నీటి సరఫరా వంటి అనేక ప్రజారంజక నిర్ణయాలు తీసుకుంది. అయితే జన్‌లోక్‌పాల్ బిల్లుపై హఠాత్తుగా రాజీనామా చేసిన తీరుపై కొంత అసంతృప్తి వ్యక్తమవుతోంది. అసెంబ్లీ ఎన్నికల నాటితో పోలిస్తే పేదలకు ఆప్‌పై పేదలకు ఆసక్తి పెద్దగా తగ్గనప్పటికీ మధ్యతరగతి ఓటర్లకు మాత్రం మోజు తగ్గింది. దీనిని గుర్తించిన ఆప్ ఢిల్లీ విభాగం ఇంటింటికీ ప్రచారంతో ప్రజల సందేహాలను తీర్చే కార్యక్రమాన్ని చేపట్టింది.